పిఠాపురం టౌన్, న్యూస్‌లైన్ :వజ్రాయుధ కవి, విమర్శకుడు ఆవంత్స సోమసుందర్ నవయుగ సాహిత్యరంగానికి మార్గదర్శి అని నటుడు, ప్రయోక్త చాట్ల శ్రీరాములు అన్నారు. పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం చెలికాని భావనరావు సభాసదన్‌లో అభ్యుదయ కవి డాక్టర్ ఆవంత్స సోమసుందర్ 90వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ సాహిత్య రంగంలో ప్రతీ ఒక్కరూ సోమసుందర్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. జీవిస్తే సోమసుందర్‌లాగ జీవించాలన్నారు. నాటకరంగం క్షీణించిపోయిందని ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నానన్నారు. తెలుగులో మంచి నాటకాలు రావాలన్నారు.
అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పి.చిరంజీవినీకుమారి మాట్లాడుతూ సాహిత్య రంగంలో సోమసుందర్ ఎవర్‌గ్రీన్ హీరో అన్నారు. హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ అభ్యుదయానికి మారుపేరు, కాలంతో ప్రవహించే వ్యక్తి సోమసుందర్ అని కొనియాడారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ వందకు పైగా రచనలు చేసిన సోమసుందర్ శతవసంతాలు దాటి జీవించాలన్నారు. కవి చందు సుబ్బారావు, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నిత్య అభ్యుదయ కవి సోమసుందర్ అని ప్రశంసించారు. కాకినాడ ఆర్డీవో జవహర్‌లాల్‌నెహ్రూ, పలువురు ప్రముఖులు సోమసుందర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ సోమసుందర్ రచించిన పలు గ్రంథాలను పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు.
సాయంత్రం జరిగిన సోమసుందర్ లిటరరీ ట్రస్టు 13వ సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ శిఖామణికి సోమసుందర్ సాహిత్య పురస్కారం, డాక్టర్ సి.మృణాళినికు రాంషా స్మారక విమర్శక పురస్కారం, డాక్టర్ రాధేయకు రాజహంస కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, మిధునం శ్రీరమణకు గురజాడ కథా ప్రబాస పురస్కారాలను సోమసుందర్ అందజేసి వారిని సత్కరించారు. లిటరరీ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ కె .వెంకట్రావు, డాక్టర్ జి.సీతారామస్వామి, డాక్టర్ జీవీఎల్ అనూరాధ, మేకా మన్మధరావు, శశికాంత్ శాతకర్ణి, బాలాంత్రపు హేమసుందర్, డాక్టర్ నాగసూరి వేణుగోపాలరావు, ఎం.రంగయ్య, పీఎస్ భట్టు, హెచ్‌వీకే రంగారావు, విజయశేషేంద్ర శాతకర్ణి, రామానాయుడు, కొత్తెం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సోమసుందర్ జన్మదినం
Published Tue, Nov 19 2013 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement