
చింతమనేని ఎవరిని పడితే వారిని దూషించడం, సంస్కారరహితంగా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని..
తాడేపల్లిగూడెం: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను చింతమనేని బండబూతులు తిడుతూ దూషించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేట ఏరియా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో దూసనపూడి విలేకరులతో మాట్లాడారు. చింతమనేని ఎవరిని పడితే వారిని దూషించడం, సంస్కారహీనంగా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన్ని కంట్రోల్ చేసే విధానం ప్రభుత్వానికి కనిపిస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అంటే శాసనాలు చేసి ప్రజల్ని పరిరక్షించాలి కానీ ఇలా జనాలపై దాడులు చేస్తూ, బాధ్యతా రాహిత్యంగా ఉన్న వ్యక్తికి శాసనసభకు వెళ్లే అర్హత లేదని స్పష్టం చేశారు. చింతమనేని వ్యవహారంలో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులను దూషించడం, వారిపై దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రాంతాలకతీతంగా జర్నలిస్టులంతా నిరసనలు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.