ఆరిన సాహిత్య కాపలా దీపం | Rentala venkatesvara rao opinion on somasundar | Sakshi
Sakshi News home page

ఆరిన సాహిత్య కాపలా దీపం

Published Sat, Aug 13 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఆరిన సాహిత్య కాపలా దీపం

ఆరిన సాహిత్య కాపలా దీపం

సందర్భం

‘కాలానికి కవిత్వం కాపలా దీపం’ అని నమ్మిన సోమసుందర్... తన రచనల ద్వారానే కాక వ్యక్తిత్వం ద్వారా కూడా మనకు ఎంతో ఇచ్చిపోయిన సాహిత్యకారుడు. ఒక మంచి వ్యాసం కంటబడితే ఒక మంచి కవిత కనిపిస్తే ఒక ఉత్తరం రాసి భుజం తట్టడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని.
 
సోమసుందర్‌గారి నిష్ర్కమణతో ఒక మనిషి కాదు ఒక తరం చరిత్ర పుటల్లోకి తరలి పోయింది. అభ్యుదయ కవిత్వ యుగపు ఆఖరి ప్రతినిధి వెళ్లిపోయారు. తొమ్మిది పదుల జీవి తంలో ఏడున్నర పదులు సాహిత్య ప్రస్థానం సామాన్యమైన విషయం కాదు. విశ్రమించని కలం ఆయనది. కవితలు, విమర్శలు, కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు... నూట పాతిక పైగా రచనలు.

ఆయన దత్త పుత్రుడు. కాళూరి వారి కుటుంబం నుంచి అవంత్స వారి సంపన్న కుటుంబానికి పెంపకానికి వెళ్లినవాడు. ఏ ఉద్యోగమూ చెయ్యకుండా జీవితం గడిచిపోయేటంత ఆస్తి ఆయనను సోమరిగా, వ్యస నపరుడిగా చెయ్యక పోవడం ఆయన వ్యక్తిత్వ విశిష్టతను చాటి చెబు తుంది. సోమసుందర్ ఒక వ్యక్తి కాదు. కొందరు వ్యక్తులుగా అగుపించరు. కొన్ని గుణాలకు ప్రతీక లుగా కనిపిస్తారు. సోమసుందర్ నిర్భీతికి, స్వీయాభిప్రాయాలపట్ల ఉన్న అపారమైన నమ్మ కానికి, నిరంతర చైతన్య శీలతకు ప్రతీకగా తోచారు తప్ప ఎప్పుడూ కేవలం ఒక మనిషిగా అనిపించలేదు.

 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, అజ్ఞాతవాసానికి వెళ్లిపోవడం, జైలు జీవితాన్ని అనుభవించడం, ఆయన నిర్భీతి అభిప్రాయ దృఢత్వం ఒక్క సాహిత్యానికి మాత్రమే సంబం ధించినవి కావని స్పష్టం చేస్తాయి.

ఆయన కవిత్వం పేరు చెబితే వజ్రాయుధం అంటారందరూ. తెలంగాణ సాయుధ పోరా టానికి ఆయనకు ఎంత దూరం. ఏమి సంబంధం? అక్షరానికి ఉన్న శక్తి ఎంతో తెలిపే సందర్భాలలో వజ్రాయుధ రచన ఒకటి. ఒక పుస్తకం నిషేధానికి గురి కావాలంటే ఎంత శక్తివంతమైనదై ఉండాలి? ఆయన దానితో ఆగిపోలేదు. పుంఖాను పుంఖాలుగా రాస్తూనే వచ్చారు. ఆ రోజున తెలంగాణ పోరాటానికి స్పందించినట్టే ఆ మధ్య బాబ్రీ మసీదు విధ్వంస ప్రకంపనలకూ స్పందించారు. మధ్యలో గోదావరి జల ప్రళయానికి కవితా రూపం ఇచ్చారు. వివిధ సామాజిక అంశాల నుంచి రక్షణకు ‘రక్షరేఖ’ కట్టడం నుంచి ‘జీవన లిపి’కి తాత్విక వ్యాఖ్యానం చెప్పడం వరకూ విస్తరించింది ఆయన కవిత్వం. తొలినాళ్లలో ఛందో బద్ధంగా వెలువడిన ఆ కవిత్వం గేయంగా, పాటగా, వచన కవితగా ప్రవహిస్తూనే వచ్చింది. ఆయన రాసినన్ని దీర్ఘ కవితలు తెలుగు కవుల్లో మరెవ్వరూ రాయలేదు. ముప్ఫై ఐదుకు పైగా ఉన్నాయవి.

సోమసుందర్ గారిని కవిగానే ఎక్కువ గుర్తు పెట్టుకోవడం వల్ల విమర్శకుడిగా ఆయన నిర్వహించిన చరిత్రాత్మకమైన పాత్ర పైన తగినంత వెలుగు పడలేదు. శ్రీరంగం నారాయణ బాబుకు సాహిత్యంలో దక్క వలసిన స్థానం అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ఆయన చాలా బాధ్యతగా ‘రుధిర జ్యోతిద్దర్శనం’ అనే విమర్శ వెలువరించారు. యుగ కవిగా ప్రసిద్ధుడైన శ్రీశ్రీకి ఆ కారణం చేత దూరం కావడానికి ఆయన వెనుకాడ లేదు. తిలక్ కవిత్వం మీద ఆయన రాసిన అమృత వర్షిణి విమర్శ వ్యాస సంపుటి తిలక్ కవిత్వం అంతా ‘అమృతం కురిసిన రాత్రి’గా వెలువడక ముందే వచ్చిందనీ, తిలక్ సోమసుందర్‌కు సమకాలికుడనీ గమనిస్తే విమర్శకుడిగా ఆయన ఎలాంటి పాత్ర పోషించారో అర్థమౌతుంది. ఆయన విమర్శ అత్యధిక భాగం ఎవరెవరికి దక్కాల్సిన స్థానాలు వాళ్లకు దక్కడం కోసం వెలువరించినదే.

సోమసుందర్ విమర్శలో విశిష్టత ఏమంటే చాలా సమకాలికంగా ఉండడం. శేషేంద్ర కవిత్వం మీద నారాయణ రెడ్డి కవిత్వం మీద రాయడం విశేషం. సమకాలిక కవుల కవిత్వం మీద ఒక కవి రాయడం అరుదు. అసూయ, దురభిమానం అడ్డుపడి కలం సాగదు. ఒక కవి తన తర్వాత తరపు కవుల మీద రాయడం మరీ ఆశ్చర్యం. మువ్వా శ్రీనివాసరావుగారి కవిత్వం మీద ఒక పుస్తకం వెలువరించడం వెనక ఎంత నిరహంకారం, మమకారం ఉండాలి. కృష్ణశాస్త్రి గారు తన కవిత్వంమీద విమర్శ వ్యాసాలు రాయమని అడిగి రాయించుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణం.

వ్యాఖ్యాన మార్గంలో సాగే విలక్షణమైన విమర్శ సోమసుందర్‌ది. ఒక్కొక్క కవితను తీసుకుని దాని సామాజిక చారిత్రక నేపథ్యాన్ని, కవి తాత్విక నేపథ్యాన్ని వివరిస్తూ సాగుతుంది. కష్టమైన పదాలకు వివరణ ఉంటుంది. ప్రాచీన కావ్య ప్రబంధాలకు వచ్చిన వ్యాఖ్యలకు ఇది ఆధునిక రూపం. అసూయా రాహిత్యం, ధర్మాగ్రహం, సాహిత్య బాధ్యత, విస్తృత పఠన శీలత వంటి లక్షణాలెన్నో ఉంటే తప్ప ఆ విమర్శ పుట్టదు.
 అభ్యుదయ కవితా ప్రస్థానంలో ఆయన పాత్ర విశిష్టమైనది. వజ్రాయుధం కావ్యాన్ని వెలు వరించడం సరే. ఆరుద్ర రాసిన త్వమేవాహం పుస్తకాన్ని ఆయనే ప్రచురించారు. పురిపండా అప్పలస్వామి గారి పులిపంజా మీద విమర్శ గ్రంథం రాశారు. అనిసెట్టి సుబ్బారావుగారి కవిత్వం మీద ‘అగ్నివీణ ఆలపించిన అణు సంగీతం’ రాశారు. ఆ యుగపు కవులెందరికో వ్యాఖ్యాతగా ముందుకువచ్చారు.

సోమసుందర్ పఠనకు, రచనకు భాషాపర మైన ఎల్లలు లేవు. సుబ్రహ్మణ్య భారతిమీద, హెన్రిక్ హెయినే జీవితం మీద, కాళిదాసు రామకథమీద, లియోనార్డొ డావిన్సీ జీవితం మీద ఉర్దూ సాహిత్యంలో ఉన్నత శిఖరాల మీద పుస్తకాలు రాశారు. అతి జటిలమైన భావంతో, భాషతో వచ్చిన క్రిస్టోఫర్ కాడ్వెల్ ఇల్యూజన్ అండ్ రియాలిటీని తెలుగు చేశారు.

ఆయన కళాకేళి ప్రచురణల ద్వారా చేసిన సేవ చాలా విశిష్టమైనది. ఆయన అభిరుచులు అనేకం. అందులో సంగీతం ఒకటి. కర్ణాటక, హిందు స్తానీ సంగీతాల పట్ల ఉన్న గౌరవం, అవగాహన ఆయన ‘హంసధ్వని’ పుస్తకంలో కనిపిస్తాయి. ప్రముఖ సంగీతకారుల జీవితాలకు విద్వత్తులకు గీసిన రేఖాచిత్రాల సంపుటి అది.

యువతరాన్ని ప్రోత్సహించడం కోసం పురస్కారాలను ఏర్పాటు చెయ్యడం, ప్రతిభావంతుల్ని ఏరి పట్టుకోవడం ఆయన విధిగా నిర్వ హిస్తున్న విషయాలు. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ వంటి ప్రతిభా     వంతుడి సాహిత్య వ్యవసాయం సాగిపోవడం వెనుక సోమసుందర్ గారి ప్రోత్సాహం విస్మరించలేనిది. ఒక మంచి వ్యాసం కంటబడితే ఒక మంచి కవిత కనిపిస్తే ఒక ఉత్తరం రాసి భుజం తట్టడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని.
 ‘కాలానికి కవిత్వం కాపలా దీపం’ అని నమ్మిన సోమసుందర్‌గారు తన జీవితమంతా సాహిత్యానికి కాపలా దీపంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. తన రచనల ద్వారానే కాక వ్యక్తిత్వం ద్వారా కూడా మనకు ఎంతో ఇచ్చిపోయిన సాహిత్యకారుడాయన.


( వ్యాసకర్త: డాక్టర్ రెంటాల వెంకటేశ్వర రావు, కవి, రచయిత)
 ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, కొత్తపేట
 మొబైల్ : 77991 11456

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement