‘మల్లెపూదండ’ | gollapudi maruti rao article on Sankarambadi Sundaraachari | Sakshi
Sakshi News home page

‘మల్లెపూదండ’

Published Thu, Nov 10 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

‘మల్లెపూదండ’

‘మల్లెపూదండ’

జీవన కాలమ్
‘దీనబంధు’ అనే సినీమా కోసం రాసింది ఈ తెలుగుతల్లి పాట. తీరా ఆ సినీమాలో దర్శకుడు ఆ పాటని ఉంచలేదు. ఆశ్చర్యం లేదు. ఇంత గొప్ప పాటకి ఆ చిన్న వేదిక చాలదు. జాతికి జాతీయ గీతం కావలసిన పాట.
 
ఐదు, ఆరు తారీఖుల్లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు చాలా కారణాలకి చిరస్మరణీయం. ప్రారంభమే నన్ను పుల కింపచేసింది. 12 దేశాల తెలు గువారు సమావేశమయిన విదేశంలో పట్టుచీరెలు కట్టు కున్న ఎనిమిది మంది మహిళలు- దాదాపు 16 సంవత్సరాల కిందట తెలుగు దేశాన్ని విడిచి వచ్చినవారు- వేదిక మీదకి వచ్చి, ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’’ పాడారు. నాకు కళ్లు చెమ్మగిల్లాయి, ‘‘మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీ పాటలే పాడుతా’’ అని గొంతెత్తి అంటూంటే - దేశభక్తితో కాదు- 55 సంవత్సరాల కిందటి నా జ్ఞాపకాల్ని కదిపినందుకు. అంతకు మించి శంకరంబాడి సుందరాచారి కలం ఇంతగా జీవం పోసుకుని 12 దేశాల తెలుగు వారిని - విదే శాల్లో పలకరిస్తున్నందుకు.
 
శంకరంబాడి సుందరాచారి నాకు అత్యంత ఆత్మీయుడు. జీవితంలో పెద్ద తిరుగుబాటుదారుడు. ఆత్మా భిమానాన్ని ఎన్నడూ పణంగా పెట్టకుండా పేదరికాన్ని అలవోకగా ఆహ్వానించి-రైల్వేస్టేషన్‌లో కళాసీగా సామాన్లు మోసి, హోటల్లో వెయిటర్‌గా చేసినవాడు. హృదయం అమృతం. నేను చిత్తూరులో పనిచేసే రోజుల్లో పరిచయం. నాకప్పుడు 22 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. మా అమ్మ, తమ్ముళ్లు వచ్చినప్పుడు కంచి వెళ్తే -విష్ణు కంచి తిప్పి ‘ఉళహళంద పెరుమాల్’ (భూమిని కొలిచిన దేవుడు) దర్శనం చేయించి మాకు స్వయంగా వంటచేసి వడ్డించినవాడు. పెళ్లయి నా భార్య చిత్తూరికి కాపురానికి వస్తే ఇద్దరం బట్టలు పెట్టి నమ స్కారం చేశాం. మా ఇంట్లో గోడకి గొంతికిలా కూర్చుని మా ఇద్దరినీ ఆశీర్వాద పద్యంతో దీవించాడు.
 
సకల సౌభాగ్య సంపత్తి, సరస మైత్రి/ ఆయురారోగ్య ఘనకీర్తి, ఆత్మతృప్తి/యోగఫల శక్తి, సుఖ సుప్తి కలిగి/ మారుతీ శివకాములు మనగ వలయు.
 తిరుపతిలో నా ‘వందేమాతరం’ ప్రదర్శనకి ఇప్పటికీ స్టేషన్ ఎదురుగా ఉన్న సత్రంలో మేకప్ అవు తుండగా సుందరాచారి దూసుకువచ్చాడు. ‘‘మారుతీ రావు. చెప్పు నన్నేంచెయ్యమంటావు?’ అంటూ. ‘‘మీరు కవులు. మీరు చెయ్యగలిగిన పని ఒక్కటే. మా కళావనికి ప్రార్ధన గీతం రాసిపెట్టండి’’ అన్నాను. అప్పటికప్పుడు కాగితం తీసుకుని, కలం పట్టుకుని గీతం కాదు, తేటగీత రాశాడు.
 
‘మా‘కళావని’ ఓంకార మర్మరాగ/ మాధురల నొంది, భావ సంపదను బడసి/ పల్కు గజ్జెలు కదల, విశ్వమును వశ్య/ పరుచుగావుత నటరాజ వందన ములు’
 సుందరాచారి పేదవాడు. కానీ అక్షరం మీద ఘన మైన ప్రభుత్వాన్ని సాధించిన శ్రీమంతుడు. ఎంతో మందిని సమకూర్చుకుని- చిత్తూరు నడిబొడ్డులో గాయకశిరోమణి చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లెకి స్వయంగా గండపెండేరం తొడిగి, కాళ్లు పట్టుకుని సభలో వందనం చేశాడు. అప్పుడు ‘ఆంధ్రప్రభ’ న్యూస్ ఎడిటరు జి. కృష్ణ గారు. మరునాటి దినపత్రికలో సుబ్రహ్మణ్య పిళ్లెకి జరి గిన సత్కారం పతాక శీర్షిక. బహుశా చరిత్రలో ఎవరూ ఆ పని చేసి ఉండరేమో! ఒక గాయకు డిని ఒక కవి ఇంత ఘనంగా, మనస్ఫూర్తిగా సన్మానం చేయడం.
 
అప్పట్లో ఆయన నాకిచ్చిన ‘నా స్వామి’ అనే శతకం నా దగ్గర- ఒక్క నా దగ్గరే ఉంది. ఎవరయినా ప్రింటు చేస్తే 100 కాపీలు లంచం పుచ్చుకుంటానన్నాను చాలాకాలం కిందట ఒక కాలమ్ రాస్తూ. ఒకాయన 200 కాపీలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కోరగా వారికిచ్చాను. 5000 కాపీలు ప్రచురించారు. ఆయన అభిమానులు - ఇద్దరి పేర్లే చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ. శతకం చదివి,

 ‘స్వామి వచ్చి మీ గుండెల్లో కూర్చున్నట్లున్నది. వేసం గిలో కుండలో చల్లని నీళ్లలో వట్టివేళ్లు వేసి పానీ యమం దించినట్లున్నది’’ అన్నారు. మరొకాయన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు. ‘కవి హృదంతర మున గలుగు నిర్వేదంబు/ విలువ నీవే యొరుగ గలవు..’’ అన్నారు.
 
1942లో ‘దీనబంధు’ అనే సినీమా కోసం రాసింది ఈ తెలుగుతల్లి పాట. తీరా ఆ సినీమాలో దర్శకుడు ఆ పాటని ఉంచలేదు. ఆశ్చర్యం లేదు. ఇంత గొప్ప పాటకి ఆ చిన్న వేదిక చాలదు. జాతికి జాతీయ గీతం కావలసిన పాట. అయింది. చాలామంది జీవితంలో ఎన్నో రచనలు చేస్తారు. కానీ కాలం కర్క శంగా వడబోసి ఒకటి రెండింటినే మిగులుస్తుంది. సుందరాచారి చాలా రచనలు చేశాడు. కానీ తెలుగుతల్లి పాట మిగిలింది. అభేరి రాగంలో తప్ప మరే రాగంలో పాడినా దీని రుచి ఇంతగా అందదు.
 సుందరాచారి జీవితం, ముగింపూ క ళ్లనీళ్లు తెప్పి స్తాయి. కానీ తన్మయత్వంతో, దేశభక్తితో, పులకరింతతో అనునిత్యం-తెలుగు సభల్లో జాతిని పులకింపచేసే దేశ భక్తుడు, పుణ్యాత్ముడు, పునీతుడినీ తలుచుకున్నా కళ్ల నీళ్లు వస్తాయి. మల్లెపూదండ మా సుందరాచారి.
 
 గొల్లపూడి మారుతీరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement