శంకరంబాడి సుందరాచారి
తెలుగు వారి గొప్పతనాన్ని వర్ణించిన గీతాలలో ‘మా తెలుగు తల్లి’ గీతం ఒకటి. దీన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఆయన 1914 ఆగస్ట్ 10న జన్మించారు. 1942లో ‘దీనబంధు’ సినిమాకి తెలుగుతల్లి గీతాన్ని రాశారు. చిత్ర దర్శకుడు ఎం.ఎల్. టాండన్ సుందరాచారి రాసిన గీతాన్ని మెచ్చుకుంటూనే, తెలుగుతల్లి గీతం యుగళ గీతంగా ఉపయోగపడదని తెలిపారు.
హెచ్.ఎం.వి. కంపెనీ సుందరాచారికి 116 రూపాయిలు ఇచ్చి ఈ పాటని కొని, టంగుటూరి సూర్య కుమారి చేత గానం చేయించింది. తొలుత ఈ పాటని కొన్ని పుస్తకాలలో దేవులపల్లి రాశారని ముద్రించారు. తరువాత తప్పు తెలుసుకొని శంకరంబాడి సుందరాచారి పేరు ముద్రించారు. ఇప్పటికీ ఈ పాట ప్రజల్లోకి వెళ్లినంతగా ఆయన పేరు వెళ్ళలేదు. 1975లో మా తెలుగుతల్లి పాటని అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు.
ఆయన తెలుగుతల్లికి సమర్పించిన మల్లెపూలు ఎప్పటికీ వాడి పోనివి. ఆయన జీవిత చరిత్రను ఆయన స్నేహితుడు వై.కె.వి.ఎన్. ఆచార్య రచించారు. 2020లో వి.జి ఎస్. ప్రచురణ సంస్థ పిల్లల కోసం సుందరాచారిపై మరో పుస్తకాన్ని వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత తెలుగుతల్లి గీతం నవ్యాంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం అయింది. తెలుగు వారి వైభవాన్ని వర్ణించిన గీతమిది. ఈ గీత స్పూర్తితో తెలుగు వారు తమ ఉనికిని మరోసారి గట్టిగా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుందరాచారి తనకంటూ ఏమీ దాచుకోలేదు. ఆయన సన్నిహితులే ఆయనను మోసగించారు. 1977 ఏప్రిల్ 8న ఆయన తుదిశ్వాస విడిచారు.
– ఎం. రాం ప్రదీప్, తిరువూరు
(‘మా తెలుగు తల్లి’ గీతానికి 80 ఏళ్ళు)
Comments
Please login to add a commentAdd a comment