సినిమా కొన్ని వర్గాలకు అందుకే దూరమైంది - గొల్లపూడి
సినిమా కొన్ని వర్గాలకు అందుకే దూరమైంది - గొల్లపూడి
Published Mon, Oct 7 2013 2:12 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘సినిమా వ్యాపారాత్మక కళ. ఆనాటి కాలంలో లక్షల లాభం కోసం సినిమాలు తీసేవారు. నేడు కోట్ల కోసం తీస్తున్నారు. అయితే లాభం కోసం ఏ హద్దులు పాటించాలి అన్నదే ఇక్కడ ముఖ్యం. మితిమీరి తీస్తే ఏ రసమయినా బోర్ కొడుతుంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ 26వ వార్షిక సాంస్కృతి , వందేళ్ల సినిమా అవార్డుల ప్రదానం-2013 ఆదివారం ఢిల్లీలో జరిగింది.
ఈ కార్యక్రమంలో చలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని పై విధంగా స్పందించారు. వందేళ్ల సినిమా ఉత్సవం అనే నెపంతో తెలుగువారందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉందని చలమేశ్వర్ పేర్కొన్నారు. మారుతున్న సాంస్కృతిక ప్రపంచంలో ఇంకో వందేళ్ల తర్వాత సినిమా కనుమరగవచ్చన్నారు. గతంలో నాటకాలు, ఇతర కళారూపాలు... పండగలు, వేడుకలకు పరిమితమైనట్టే సినిమా సైతం కొత్త రూపు సంతరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ... ‘‘వందేళ్ల భారత సినిమా చరిత్రతో నాది 50 ఏళ్ల అనుబంధం.
నటుడిగా, రచయితగా మూడు తరాల వారితో పనిచేశాను. ప్రస్తుతం వస్తున్న సినిమాలు పూర్తిగా వ్యాపార ధోరణిలో ఉంటున్నాయి. దీంతో కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు దూరమవుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డు అందుకోవడం, ఢిల్లీలోని తెలుగువారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇంకా మాధవపెద్ది సురేష్, చంద్రబోస్, శివాజీరాజా , విజయలక్ష్మి, గోపికాపూర్ణమ, మల్లికార్జున, కష్ణ కౌశిక్ తదితరులను సత్కరించారు.
Advertisement
Advertisement