గొల్లపూడి మారుతీరావు
జీవన కాలమ్
‘ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’ అని ఎ. రాజా నెలల తరబడి గొంతుచించు కున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్నవారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి.
రాజకీయ రంగంలో పదవికీ, అధికారానికీ మధ్య చిన్న దు ర్మార్గం ఉంది. పదవిలో పని చేస్తే డబ్బు వర్షం కురుస్తుంది. విచిత్రం, ఏమీ చెయ్యకపోవ డం వల్ల కూడా డబ్బు వర్షం కురుస్తుంది. రెండో పని తన చుట్టూ జరుగుతూంటే కళ్లు మూసుకుని తన నిజాయితీని మాత్రం కాపాడుకున్న ట్రాజిక్ హీరో మన్మోహన్‌సింగ్.
భారత చరిత్రలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు దారి తప్పి రాజకీయ రంగంలోకి వచ్చారు- సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం, మన్మోహన్‌సింగ్. ఆయన దగ్గర పనిచేసి, ఆయన మీద పుస్తకం రాసిన సంజయ్ బారూ; బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన వినోద్ రాయ్ ఆక్స్‌ఫర్డ్‌లో సింగుగారి దగ్గర చదువుకున్నారు. మొదటి ముగ్గురు నాయకులూ అవినీతితో ప్రమేయం లేకుండా జీవించారు. మన్మోహన్ సింగు గారు తన చుట్టూ అవినీతిని పెరగనిచ్చి- తను మాత్రం కళ్లు మూసుకుని చరిత్రహీనులయ్యారు.
మన్మోహన్‌సింగుగారు మొక్కవోని నిజాయితీ పరు డనే, నిప్పులాంటివాడనే అపప్రథ దేశంలో ఉంది. ఇది ‘అపప్రథ’ అనడానికి కారణం తనచుట్టూ విస్తరించే అవి నీతిని తెలిసి-తాను అందులో భాగస్వామి కాని ఒక్క కారణానికే సంతృప్తి చెందిన ఆత్మవంచన సింగు గారిది. జస్వంత్‌సింగ్ పుస్తకం, సంజయ్‌బారూ (ది ఆక్సిడెంటల్ ప్రైమినిస్టర్) పుస్తకం, జయంతి నటరాజన్ అక్కసుతో చేసిన ప్రకటనలూ ఈ విషయాన్ని చెప్పక చెప్తాయి.
‘‘ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’’ అని ఏ. రాజా నెలల తరబడి గొంతుచించుకున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్న వారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి.
ఎదిరి పక్షం పదవిలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని తవ్వి బయటికి తీస్తూంటే ఈ రొంపిలోంచి తను బయ టపడడానికి బీజేపీ నాయకులను సింగుగారు ప్రతిదినం సంప్రదిస్తున్నట్టు వార్త. ఆయన్ని కోర్టుకు హాజరు కావా లని సమన్సు పంపితే- చచ్చి గింజుకున్నా ఇంటర్వ్యూ ఇవ్వని సోనియా గాంధీగారు మొదటిసారిగా తమ నాయకమ్మన్యుల బృందంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని ఇంటికి నాలుగు వందల గజాలు నడిచి వెళ్లడం సుందర దృశ్యం.
ఇదే సోనియాగారు అలనాడు ప్రధాని పీవీ నరసిం హారావుగారిపై లఖూబాయ్ కేసు, సెంట్ కీట్స్ కేసు, జేఎంఎం కేసు, లెబర్హాన్ కమిషన్ విచారణ జరిగిన ప్పుడు ఒక్కసారి కూడా ఆయనను పలకరించలేదు. జేఎంఎం కేసులో ఆయన నిందితుడని కోర్టు తీర్పు ఇచ్చి నప్పుడు - ఇంకా రాజకీయాలు తలకెక్కని మన్మోహన్ సింగు ఒక్కరే పీవీని పరామర్శించడానికి వచ్చారు. నిన్న ఢిల్లీలో ఊరేగిన నాయకమ్మన్యులు ఒక్కరూ రాలేదు. పీవీ కన్నుమూసినప్పుడు వారి భౌతికదేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోకి రానివ్వలేదు. భారతదేశ చరిత్రలో రాజధానిలో కాక వేరే చోట అంత్యక్రియలు జరిగిన ఒకే ఒక్క ప్రధాని పీవీ.
మరెందుకు ఇప్పుడు మన్మోహన్‌సింగుగారి మీద ప్రత్యేక అభిమానం? యూపీఏ గోత్రాలన్నీ ఆయనకి తెలుసు కనుక. ఏనాడయినా వాటిని ఆయన విప్పద లిస్తే అంతకన్న సాధికారకమైన రుజువులు మరెక్కడా దొరకవు కనుక. ఏమాటకామాటే చెప్పుకోవాలి- అలాంటి మనస్తత్వమే మన్మోహన్‌సింగుగారికి ఉంటే - దేశ చరిత్రలో పీవీగారి హయాంలో లిబర లైజేషన్‌కు చరి త్రను సృష్టించిన ఒక మేధావి- కేవలం ‘మడి’ కట్టుకుని అపకీర్తిని మూటకట్టుకోడు (సంజయ్ బారూ పుస్తకమే ఇందుకు సాక్ష్యం).
హత్యానేరానికి జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయ టకు వచ్చిన శిబూ సోరెన్ జైలు నుంచి సరాసరి బొగ్గు మంత్రిగా ఢిల్లీ చేరడం ప్రధాని గారికి తెలియకుండానే జరిగిందా? ఒక రాజా, ఒక కనిమొళి, ఒక సురేశ్ కల్మా డీ, ఒక షీలా దీక్షిత్, ఒక దయానిధి మారన్, ఒక జగ ద్రక్షకన్, ఒక నవీన్ జిందాల్, ఒక శ్రీప్రకాశ్ జైస్వాల్ కథ లని సింగుగారు వినలేదా?
సింగుగారు అమెరికాలో ఉండగా అవినీతి నిరోధక ఆర్డినెన్స్ ‘నాన్సెన్స్’ అని పత్రికా సమావేశంలో కాగి తాన్ని ముక్కలు చేసిన రాహుల్ కుర్రచేష్టల్ని పెద్ద వయ స్సుతో భరించి- అపకీర్తిని నిశ్శబ్దంగా మూటకట్టుకుని చరిత్రలో ట్రాజిక్ హీరోగా మిగిలిపోయిన మేధావి, ఇం టలెక్చువల్, పెద్దమనిషి మన్మోహన్‌సింగు. ఆ కార ణానికే వెన్నెముక లేని ప్రవర్తనకి యూపీఏ అవినీతికి పరోక్షమైన వాటాదారుడు.
‘రాబోయే కాలంలో చరిత్ర నన్ను సానుభూతితో అర్థం చేసుకుంటుంది’ అని వాపోయిన పెద్దమనిషి- తన మంచితనాన్ని, స్వామిభక్తిని, నిర్వేదాన్ని చివరం టా వాడుకొని - ఇప్పటికీ ముఖం తుడుపుకి- రోడ్ల మీద ఊరేగింపు జరిపిన అవినీతిపరుల విన్యాసాలకు బలి అయిన అపర ‘కర్ణుడు’ మన్మోహన్‌సింగ్.
ఈ మధ్య ఓ మిత్రుడు వేరే సందర్భంలో ఈ వాక్యాల్ని ఉటంకించారు: Silence in the face of evil is evil in itself. Not to speak is to speak. And not to act is to act.