Jeevana Kalam
-
శరదశ్శతమ్
కొన్ని రోజుల్లో చచ్చి పోతున్నావని డాక్టర్లు తేల్చారు. నిన్ను చూడా లని ఉందిరా అని సమా చారం పంపాడు కాళీ, దాసుకి. దాసుది సామర్ల కోటలో సగ్గుబియ్యం హోల్‌సేల్ వ్యాపారం. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తండ్రి వ్యాపారం దాసు వారసత్వంగా పుచ్చుకున్నాడు. పై చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం సంపా దించుకున్నాడు. ఇద్దరూ కలిసి దశాబ్దాలు గడి చింది. అందుకే ఈ సమాచారం దాసుకి ఆశ్చ ర్యాన్ని కలిగించింది. అయినా కానీ పనికట్టుకుని చిన్ననాటి స్నేహితుడిని చూడటానికి బయలు దేరాడు దాసు. కాళీ 77, దాసు 75. కాళీకి ఇన్నేళ్లలో ఉన్న జుత్తు ఊడిపోయింది. దాసుకి వారసత్వంగా తల్లిదండ్రుల పొట్ట వచ్చింది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని కావలించుకుని, గెంతులేసి పొంగిపోయారు. విచిత్రం, స్నేహితుడిని బాధిస్తానని దాసు కాళీ జబ్బు గురించి అడగలేదు. రాకరాక వచ్చిన స్నేహితుడిని ఇబ్బంది పెడతానని కాళీ చెప్పలేదు. బయటికి ఇద్దరూ ఆనందంగా, డాబుగా, అన్నిటినీ మించి తృప్తిగా ఉన్నారు. ఆమాటా, ఈమాటా మాట్లాడుతూ చిన్నతనంలో తమ అక్కలు ఆడే ‘ఆడ ఆటలు’ ఆడారు. చెమ్మాచెక్కా ఆడినందుకే పగలబడి నవ్వుకున్నారు. చింతపిక్కలతో ఆడవాళ్లు ఆడే తొక్కుడుబిళ్ల ఆట ఆడారు. వెనక వరండాలో 75 సంవత్సరాల బొజ్జ దాసు, కాళీ 77 సంవత్సరాల జబ్బు శరీరం గెంతు లాట చూసి ఇంటిల్లిపాదీ ముక్కుమీద వేలేసు కున్నారు. ఆ రాత్రి డాక్టరు కాళీకి రెండు మాత్రలు తక్కువ చేశాడు. రానురానూ మిత్రులిద్దరూ పసిపిల్లలయి పోయారు. కాళీ చిన్నతనంలో బొమ్మలు వేసే వాడు. ఒకరోజు రెండు అట్టలమీద పులి ముఖాలు వేశాడు. ఇది మిత్రులు ఇద్దరూ శ్రీరామనవమి సంబరాల్లో రోజూ ఆడే ఆట. ఎప్పుడు? 25 సంవత్సరాల కిందట. అయినా ఇద్దరూ బొమ్మలు పెట్టుకుని పులిగెంతులు గెంతారు. ఇదే ఆట. ఇంటిల్లిపాదీ నిర్ఘాంత పోయారు. ఆ రోజుల్లో దాసు బొజ్జకి డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇద్దరూ ఇంటర్మీడియట్ చేసే రోజుల్లో కాకినాడలో అద్దెకి ఉండేవారు. ఇద్దరూ భయం కరమైన గొంతు కలవారు. ‘పాతాళభైరవి’ చూసి వచ్చి– పాటల పుస్తకం కొని పాటలన్నీ భయం కరంగా పాడారు. ఇంటివారు మొత్తుకుంటే మరింత విజృంభించారు. ఇప్పుడా ఇల్లు లేదు. ఇంటాయన లేడు. 65 సంవత్సరాల కిందటిమాట. 75 సంవత్సరాల దాసు విజృంభించాడు. 77 సంవత్సరాల కాళీ అందుకున్నాడు. ఇప్పుడు తమ ఇంట్లో కాదనే వారెవరు? వాళ్ల గొంతుల్ని, అల్లరిని బాలక్రిష్ట త్వాన్ని భరించారు. భరిస్తున్నారని తెలిసి ఇద్దరు మిత్రులూ రెచ్చిపోయారు. దాసు వెళ్తానంటే కాళీ, దాసు బొజ్జమీద దరువువేశాడు. చిన్నతనం ఆటలు, ఆ చవకబారు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. స్కూలుకి వస్తే, రైలు పట్టాలు దాటుతున్న చంటిబాబు చావు తలుచు కుని ఇద్దరూ ఏడ్చారు. అతని ‘మాజిక్’ విన్యా సాలు ఒక రోజంతా చెప్పుకున్నారు. ఏతావాతా 15 రోజుల్లో ఉద్యోగి కాళీ, వ్యాపారి దాసూ మారిపోయారు. 65 సంవ త్సరాలు వెనక్కిపోయారు. మనస్సుల ముసు గులు మళ్లీ అతుక్కున్నాయి. వాస్తవం అటకెక్కింది. ‘ఏమిటి తాత ధోరణి’ కాళీ మనుమడు డాక్టరు దగ్గర ఆశ్చర్యపడ్డాడు. డాక్టరు కంగారు పడటానికి బదులు నవ్వాడు. ‘ఎప్పుడు వస్తారు’ అని సామర్లకోట నించి ఫోన్ చేసిన దాసు మేనల్లుడికి– దాసు చేతుల్లో ఫోన్ లాక్కుని సమాధానం చెప్పాడు కాళీ ‘ మీ మామ ఇప్పుడు రాడురా’ అని. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.18 రోజులు గడిచిపోయాయి. ఇద్దరు మిత్రులూ వర్తమానాన్ని మర్చిపోయారు. జీవితాన్ని తిరగేసి మళ్లీ గడపటం ప్రారంభిం చారు. 25 రోజులు అయింది. దాసు లేచేసరికి కాళీ సూర్యో దయం చూస్తూ కనిపించాడు. ‘ఏంట్రా ఆలోచిస్తున్నావు?’ అన్నాడు దాసు. కాళీ ధైర్యంగా ఇటుతిరిగి ‘నేను చావనురా– నువ్వు సామర్లకోట పో’ అన్నాడు కాళీ. జ్ఞాపకాలు బంగారు తాకిడీలు, ఆలోచనలు ఆత్మబంధువులు. (నన్ను మళ్లీ ‘జీవనకాలమ్’ రాయమని పోరి రాయించిన మా తమ్ముడు శివకి అంకితం) గొల్లపూడి మారుతీరావు -
నాలుగు నమూనాలు
నేను దాదాపు రోజూ టీ. నగర్‌లోని అగస్త్య గుడికి వెళ్లి కూర్చుని వస్తూం టాను. అక్కడ పనిచేసే ఓ ముసలాయన ఉన్నాడు. దాదాపు ఒకే కాషాయ రంగు ధోవతిని కట్టుకుంటాడు. అది మాసిపోయి ఉంటుంది. రోజూ వదల కుండా అదే ఎలా కట్టుకుంటాడు? రాత్రి వేళల్లో ఏదయినా గోచీ కట్టుకుని ఈ ధోవతిని ఉతుక్కుని ఆరవేసుకుంటాడేమో? అది ఏనాడూ తెల్లగా ఉండదు. కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. తెల్లని జుత్తు. హడావుడిగా నడుస్తూంటాడు. అతను చేసేవి– నాకు తెలిసి– రెండే పనులు. స్వామికి దీపం వెలిగించడానికి గుడ్డ వొత్తిని సిద్ధం చేస్తూ ఉంటాడు. పెద్ద నల్లటి గుడ్డని చిన్న ముక్కలుగా స్వామి ముందు వెలిగించడానికి పీలికలుగా కత్తిరిస్తాడు. ఆ పనివాడితనం చూసి తీరవలసిందే. మరొక పని? సరిగ్గా 11 గంటలకి గుడి రెండు తలుపులూ మూస్తాడు. చేతికి వాచీ లేదు. కానీ అతను తాళం చెవులు పట్టుకు తలుపులు మూయడానికి వెళ్తే– 11 గంటలయిందని అర్థం. మరొకాయన ఉన్నాడు. అందగాడు. వయస్సు 48. పేరు నీరవ్ మోదీ. వజ్రాలు, రత్నాలు అంతర్జాతీయంగా అమ్ముతాడు. గత పదేళ్లలో బ్యాంకుల దగ్గర దొంగ లెక్కలతో 13 వేల కోట్లు అప్పు చేశాడు. ఇందుకు అతని మేనమామ మద్ధతు. చివరికి తన ఆట కట్టుబడే సమయం వచ్చిందని కాస్త ముందు గ్రహించి దేశం ఎల్లలు దాటిపోయాడు. బ్యాంకుల్లో 28 నకిలీ అకౌంట్లు ఉన్నవాడు. బెల్జియంలో పౌరసత్వం ఉన్నవాడు. చట్టం నుండి తప్పించుకోవడానికి– యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాలు తిరిగినవాడు. గత్యంతరం లేక ఇంగ్లండులో చట్టానికి దొరికిపోయి లండన్ జైలులో ఉన్నవాడు. ఇప్పుడు అతని గతి ఏమిటి? మరో వారం రోజుల్లో ఇంగ్లండు చట్టం నిర్ణయిస్తుంది. మరొకాయన ఉన్నాడు. ఆయన జిమ్మీ కార్టర్. 42 సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో అతి ధనవంతమయిన, శక్తివంతమయిన దేశాన్ని– అమెరి కాని పాలించాడు. పదవిలోకి వచ్చిన మరునాడే– అలనాడు వియత్నాం యుద్ధానికి వెళ్లని వీరులకి క్షమాభిక్ష పెట్టాడు. దేశంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం బతికిన హెర్బర్టు హూవర్ కన్నా ఒక అడుగు ముందు నిలిచాడు. ఉరిశిక్షను వ్యతిరేకించాడు. నోబెల్ బహుమ తిని పుచ్చుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఎల్విస్ ప్రెస్లీ పాటలు వింటూ, పెన్సిల్వేనియాలో 1961లో తాను కట్టుకున్న అతి మామూలు ఇంట్లో మనశ్శాం తితో హాయిగా జీవిస్తున్నాడు. ఆయనకిప్పుడు ఎన్ని సంవత్సరాలు? 94. మరొక్క నమూనా. ఆవిడ పుట్టడమే రాచరికపు పుట్టుక. 93 సంవత్సరాల కిందట పుట్టింది. ఎనిమిదవ ఎడ్వర్డ్ రాజు ఇంగ్లండుని పాలిస్తే ఆమె మామూలు జీవితాన్ని గడిపేది. కానీ 1936లో ఆయన సింప్సన్ అనే ఓ మామూలు వ్యక్తి ప్రేమలో పడి కిరీటాన్ని, సింహాసనాన్నీ వదులుకున్నాడు. తన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరిగిన ఎన్నో రాజకీయ, సామాజిక పరిణామాలకి ఆమె ప్రత్యక్ష సాక్షి. సంప్రదాయాన్నీ, రాచరికాన్నీ ప్రేమించి, గౌరవించే వ్యవస్థలో ఆమె సింహాసనం, హోదా యథాతథంగా నిలిచాయి. ఎన్నో ప్రపంచ యుద్ధాలూ, దేశీయ పరిణామాలలో వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ తన హోదానీ, అర్హతనీ నిలదొక్కుకుంటూ– ప్రస్తుతం ‘బ్రెక్సిట్’ పరిణామాన్ని ఎదుర్కోబోతున్న ఏకైక రాజకీయ ప్రతీక ఎలిజబెత్ మహారాణీ. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని. ఒక్కసారి ఆ వ్యవస్థలో ‘సోషలిస్టు’ భావజాలం తొంగిచూస్తే. అయితే ‘పరిణామం’ కంటే ‘చరిత్ర’ ఉన్నతమయినదని వారూ భావిస్తే? ఇంతకూ ఆమె స్థిరత్వానికి కారణం– ఇంగ్లిష్‌లోనే చెప్పాలి– వ్యవస్థ dignity, జాతి సంప్రదాయ నిబద్ధత. ఒక వ్యక్తి జీవనంలో ఆనందం, ఆరోగ్యం, అభిరుచి, అభిజాత్యం– ఇన్నిటి పాత్ర ఉంది. వీటన్నిటినీ జయించే మరొక ముఖ్యమైన లక్షణం మరొకటి ఉంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి మూలస్తంభం. స్వామి ముందు వెలిగించే దీపపు ఒత్తుల్ని సిద్ధం చేస్తూ సమాజంలో తన ఉనికికే అర్థం కాంక్షించని ఓ మూగ జీవనానికీ, తన ఉనికిని, అస్తిత్వాన్నీ మార్చుకుని తనదికాని కోట్ల ధనాన్ని అవినీతితో అనుభవించాలన్న లక్ష్యానికీ, ఈ ప్రపంచాన్ని శాసించగల అధికారాన్ని చేతి వేటు దూరంలో నిలిపి– ఇప్పటికీ ‘మనశ్శాంతి’కి పట్టం కట్టిన ఓ సంస్కారికీ, తన పుట్టుకకీ, తన జీవనానికీ గంభీరమయిన వంతెనను నిర్మించుకుని– ఆ జాతికి గర్వకారణంగా జీవించే– ‘వ్యవస్థ’ ప్రాతినిధ్యానికీ ఎంత దూరం. అయితే వ్యక్తి జీవనంలో– వ్యక్తిత్వ నిర్ధారణలో వీటన్నిటి వెనుకా ఓ సామాన్య లక్షణం ఉంది. దాని పేరు– తృప్తి. అది కూడా కాదు. తృప్తితో జీవిస్తున్న గర్వం. అది కూడా కాదు. గర్వం పట్ల అవగాహన. అది కూడా కాదు. అవగాహనను స్వభావం చేసుకున్న అలవాటు. గొల్లపూడి మారుతీరావు -
పేరు జబ్బు
తెలుగునాట తరచుగా విని పించే మాట ఒకటుంది: ‘ఆ పనిని నేను సాధించలేక పోతే నా పేరు మార్చు కుంటాను’ అని. ఇది నిజంగా పేరున్నవాడికి చెల్లే మాట. పేరు మార్చుకో వడం నామోషీ, చిన్నతనం. ఓటమి. పరువు తక్కువ– అని నానుడి. మరొక్కరే ‘పేరు’తో కసరత్తు చేయగలరు– రాజకీయ నాయకులు. ‘మమ్మల్ని పదవిలో నిల పండి. పేరు మార్చకపోతే...’ ఇది రాజకీయం. వాళ్ల పేర్లు ఎలాగూ వచ్చే ఎన్నికలదాకా నిలవవు కనుక. ఇప్పుడు పదవిలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఒకాయన ఎడాపెడా పేర్లు మార్చే స్తున్నారు. ఆయన చెప్పే కారణం– అలనాడు మొగ లాయీ పాలకులు, ముస్లిం పాలకులు వాళ్లకి లాయకీ అయిన పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం మనకి ఇష్టమయిన పేర్లు పెట్టుకుంటున్నాం– అని. మొదట గురుగాం మీద పడ్డారు. అది ‘గురుగ్రామం’ అయింది. ఇంతకీ ఈ గురువు ఎవరు? ద్రోణాచా ర్యులట! 62 సంవత్సరాల కిందట ‘వారణాశి’ అయినా ఇంకా ‘బెనారస్’ అనేవారూ, ‘కాశీ’ అనే వారూ ఉన్నారు. అలనాడు మేడమ్ మాయావతిగారు వారి హయాంలో కాన్షీరామ్ నగర్. మహామాయా నగర్ వెలిశాయి. మొగల్సరాయ్ని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ చేశారు. ఇప్పుడు వరసపెట్టి ఆగ్రాని ‘ఆగ్రా వన్’గా, ముజాఫర్ నగర్‌ని ‘లక్ష్మీనగర్’గా, సిమ్లాని ‘శ్యామల’గా, అహమ్మదాబాద్‌ని ‘కర్ణావతి’గా, ఔరం గాబాద్ని ‘శంభాజీ నగర్’గా మార్చేస్తున్నారు. ఈ లెక్కన ఫైజాబాద్ ‘అయోధ్య’ అవుతుందట. బిజ్నోర్ మహాత్మా విదుర్ నగర్ అవుతుందట. ఈ మధ్య పేపర్లలో ఈ పేర్ల మార్పు గురించి కోకొల్లలుగా వ్యాసాలు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఈ దేశం మీద ‘హిందూమతం’ పులమడమేనని చాలామంది వాపోయారు. దానికి వారందరూ వారి వారి కార ణాలు చెప్పారు. వారి మతాతీత దృక్పథానికి జోహార్లు. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. గత 60 సంవత్సరాల పైచిలుకు– మన అభిమాన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉండగా కేవలం 450 సంస్థలకు మాత్రమే మన ‘అభిమాన’ కుటుంబం– నెహ్రూ కుటుంబం– వారి పేర్లను పెట్టారు. ఇందులో 12 కేంద్ర, రాష్ట్ర పథకాలు, 28 క్రీడా టోర్నమెంట్లు, 19 స్టేడియంలూ, 5 ఎయిర్‌పోర్టులూ, పోర్టులూ, 98 విద్యా సంస్థలు, 51 అవార్డులూ, 15 ఫెలోషిప్‌లూ, 15 జంతు పరిరక్షణ శాలలూ, 39 ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ, పరిశోధనా సంస్థలూ, 37 ఇతర రకాల సంస్థలూ, విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలూ, ఉత్సవాలూ, 74 రోడ్లూ, భవంతులూ ఉన్నాయి. మన అదృష్టం బాగుండి కొద్దిలో తప్పిపోయిం దిగానీ అచిర కాలంలో మనకి ‘మౌరీన్ నగర్’ ‘మౌరీన్ శిశు సంక్షేమ కేంద్రం’ వెలిసేది. ఏమంటారు? మౌరీన్ ఎవరా? తమరికి కారాగార శిక్ష విధించాలి. మేడమ్ మౌరీన్ సోనియా గాంధీగారికి స్వయానా వియ్యపు రాలు. రాబర్ట్ వాద్రాకి జన్మ నిచ్చిన తల్లి. ప్రియతమ ప్రియాంకా గాంధీ అత్తగారు. మరి నాటి నుంచి మేధావులు, రాజకీయ విశ్లేష కులూ నోరెత్తలేదేం? నెహ్రూ కుటుంబం మీద భక్తా Perhaps they have the sycophancy of giv- ing in to the vageries of one family to the collective ethos of one political thinking. ఈ దేశంలో చెలరేగిన విమర్శల్లో పాక్షికమైన ‘అస హిష్ణుత’ ‘ఆత్మవంచన’ 'Intellectual hypocra- cy' స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ‘తైతక్కలు’ ఇంకా హాస్యా స్పదం. బోగ్ రోడ్‌కి పద్మభూషణ్ బి.ఎన్.రెడ్డిగారి పేరు పెట్టారు. భేష్! ఆ మధ్య రోడ్ల పేర్లలో కులాల ప్రసక్తి రాకూడదని ఓ ద్రవిడ నాయకుడు భావిం చినట్టుంది. కనుక ‘డాక్టర్ బి.ఎన్.రెడ్డి వీధి’ కేవలం ‘డాక్టర్ బీఎన్ వీధి’ అయింది. ఈ కత్తిరింపులో తలలేదని ఎవరో ముక్కుమీద వేలేసుకుని ఉంటారు. కనుక ‘బీఎన్ వీధి’ ఏకంగా ‘నరసింహన్ వీధి’ అయింది. ఎవరీ నరసింహన్. ఇది ఎవరిని గౌరవిం చడానికి. ఈ లెక్కన ‘మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ’ పేరు కేవలం ‘కరమ్‌చంద్’ అయి కూచుం టుంది కదా? మరి ఇప్పుడే అన్నాశాలై పక్కనే ‘ముత్తు రామలింగ తేవర్ నగర్’ ఉన్నదే. ‘తేవర్’ వర్గం నోరు పెద్దదా? టీనగర్లో వ్యాసారావు స్ట్రీట్ ఉండేది. అది న్యాయంగా ‘వ్యాసా స్ట్రీట్’ కావాలి కదా? కానీ ‘వ్యాసార్ స్ట్రీట్’ అయింది. ‘వ్యాసార్’ ఎవరు? అజ్ఞానానికి పరాకాష్ట. బోర్డుమీద ‘వియా సార్ స్ట్రీట్’ అని రాశారు. మరో టర్మ్ ఉంటే రాయ పేట ‘ఎడ్డిపాడి పేట’ అయితే ఆశ్చర్యం లేదు... ఏమి ఈ సంకరం? మహానుభావుల స్మరణకి కావలసింది ఊరి పేర్లుకావు. నిశ్శబ్దంగా వెలుగునిచ్చే ఆల్వా ఎడిసన్, లూయీ పాశ్చర్, భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరులు, కరుణకి శాశ్వతత్వాన్ని కల్పిం చిన జీసస్ వీరి పేర వీధులు, సందులూ, గొందులూ అక్కరలేదు. మహానుభావుల చిరంజీవత్వానికి లౌకి కమయిన గుర్తులు ఆయా పార్టీల ‘ప్రాథమిక’ స్థాయిని తెలుపుతాయి. మహానుభావుడు జీవించేది సైనుబోర్డుల్లో కాదు. జాతి జీవన సరళిని ఉద్బుద్ధం చేయడంలో. -గొల్లపూడి మారుతీరావు -
ఆమెకు ఎవరు సమాధానం చెబుతారు?
బయట వర్షం పడుతోంది. ఓ 80 ఏళ్ల ముసలాయన కార్పొరేషన్ ఆఫీసుకి పన్ను చెల్లించడానికి వచ్చాడు. వరసలో వచ్చిన ఆయన దగ్గర గుమాస్తా పైకం తీసుకుని రసీదు అతని ముఖం మీద పారేశాడు. అంతవరకూ గుమాస్తా రైటే. కాని బయట వర్షం, వచ్చినాయన వృద్ధాప్యం ఎరిగి ఆ రసీదును మడతపెట్టి ఆ ముసలాయన సంచీలో పెట్టాడనుకోండి. అది బాధ్యత కాదు. పది కాలాల పాటు మిగిలే మాన వత్వం. మన దేశంలో బాధ్యత ముసుగులో డబ్బు చేసుకునే కింది తరగతి ఉద్యోగుల హవా సాగుతోంది. మొహం మీద పారేసే రసీదుకీ, మడత పెట్టిన రసీదుకీ ఓ జీవితకాలం ‘సంస్కారం’ ప్రమేయం ఉంది. 41 సంవత్సరాల క్రితం 37 ఏళ్ల గంగా దేవి ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో తన ఆస్తి విషయంలో కోర్టుకి వెళ్లింది. మేజిస్ట్రేటు తీర్పు సుముఖంగా తెచ్చుకుంది. ఇందుకు కోర్టు ఖర్చు 312 రూపా యలు కట్టింది. గుమాస్తా డబ్బు కట్టించుకుని రసీదు ఇవ్వడం మరిచిపోయాడు. కోర్టు కాగితాల ప్రకారం డబ్బు చెల్లించని ఆమె ఆస్తి కేసుల్లో పడింది. ఎన్నాళ్లు? 41 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ‘డబ్బు కట్టాను బాబోయ్!’ అంటూ కోర్టుల వెంట తిరిగింది. 11 మంది న్యాయమూర్తులు ఆమె నిజాయితీని శంకిస్తూ ఆమె వినతిని తోసిపుచ్చారు. ఇప్పుడావిడకి 81 ఏళ్లు. ఈ మధ్య లవ్లీ జైస్వాల్ అనే ఓ జడ్జీగారు ఆమె మాటకి విలువనిచ్చి కాగితాలు వెదికించారు. ఆమె డబ్బు కట్టిన రుజువులు దొరికాయి. ఇప్పుడా గుమాస్తా ఏమయ్యాడు? 41 ఏళ్ల ఆమె గుంజాటనకి ఎవరు సమాధానం చెబుతారు? ఓ గుమాస్తా అలసత్వానికి మూల్యం 41 సంవత్సరాల నరకయాతన. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన రేడియోకి సంబంధించి ఒకటుంది. 1931 ప్రాంతంలో అంటే నేను పుట్టక ముందు ఒకాయన ఏటుకూరి బలరామమూర్తిగారి ప్రెస్సులో పనిచేసేవాడు. ఆయన ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు ఉమామహేశ్వర రావుగారు. రేడియోలో ఆఫీసరు ఆచంట జానకీరాం గారు ఓ రోజు బలరామయ్యగారి దగ్గరకు వెళ్లినప్పుడు ‘‘చక్కగా తెలుగు రాసే మనిషిని చూసిపెట్ట వయ్యా’’ అని అడిగారట. తన దగ్గర ఉన్న ఉమామహేశ్వరరావుగారిని చూపించారు. అయితే ఆయన్ని పంపిస్తే తన పని? అందుకని ఒక పూట తన దగ్గర , మరోపూట రేడియోలో పనిచేసే ఒప్పందాన్ని ఇద్దరూ కుదుర్చుకున్నారు. ఆ విధంగా ఉమామహేశ్వరరావుగారు రేడియోలో చేరిన దరిమిలా అనౌన్సరయ్యారు. అనౌన్సరన్న మాటేగాని మద్రాసు రేడియో చరిత్రలో ఆయన తలలో నాలిక అయ్యారు. (ఆ రోజుల్లో తమిళ కార్యక్రమాలు లేవు) నేను పుట్టి, పెరిగి, రేడియోలో ఉద్యోగాన్ని సంపాదించుకుని మద్రాసు రేడియోకి, ఆయనకి ఆఫీసరుగా వచ్చాను. అప్పటికే ఉమామహేశ్వరరావుగారికి కళ్లు మసకలు కమ్మి చూపుపోయింది. ‘చేతిలో డబ్బుల్లేక కళ్లు పోగొట్టుకున్నాను మారుతీ రావుగారూ’ అనే వారాయన. అప్పటికి ఆయన రిటైరయ్యే రోజు వచ్చింది. ఆ రోజు ఆయన బేల అయిపోయారు. దాదాపు 40 ఏళ్ల రేడియో జీవితం ముగియబోతోంది. పిచ్చివాడిలాగ ఆఫీసంతా తిరిగారు. ఆ రోజు ఆఫీసుకి వస్తూ బజారులో పంచెల చాపు కొన్నాను. నాలుగున్నరకి కాంటీన్లో ఆయనతో టీ తాగాను. ఎన్ని జ్ఞాపకాలు? ఎందరు ప్రముఖులతో ఎన్ని గొప్ప కార్యక్రమాలకు పౌరోహిత్యం? కదిపితే భోరుమనేట్టు ఉన్నారు. ఐదు గంటలకి నా స్కూటరు ఎక్కించుకుని దివాన్ బహదూర్ రామయ్యంగార్ రోడ్డు (పూనమల్లి)లోని ఆయనింటికి తీసుకొచ్చాను. అక్కడ బట్టలు చేతికిచ్చాను. అక్కడ ఆయన దుఃఖం కట్టుతెగింది. ‘నన్ను మారుతీరావుగారు ఇంటికి తెచ్చి బట్టలు పెట్టారే’ అంటూ భార్యతో భోరుమన్నారు. ‘‘ఇవాళ దాకా మీరు అనౌన్సరు. రేపట్నించి కాజువల్ ఆర్టిస్టు. మీరు ఆఫీసుకు రావాలి. కాంట్రాక్టు ఇస్తున్నాను. ఇటీజెనార్డర్’’ అని స్కూటరెక్కాను. అలా ఎన్నాళ్లు? మరో 40 ఏళ్లు జీవించి నూరేళ్ల జీవిగా నిష్క్రమించారు. నా జీవితంలో పచ్చని జ్ఞాపకాలలో ఇదొకటి. తర్వాత మిత్రులు మల్లాది సచ్చిదానందమూర్తిగారితో చెప్పి వారికి సత్కారం ఏర్పాటు చేశాను. మూర్తిగారు వదాన్యులు. అప్పటి నుంచి ఆయన పోయేదాకా నెలకి వెయ్యి రూపాయలు పంపారు. ఓ గుమాస్తా గంగాదేవికి రసీదు ఇవ్వడం మరిచిపోయిన కారణంగా ఆమె 41 సంవత్సరాలు, 11 కోర్టులు పట్టుకు తిరగడం భయంకరమైన నేరం. ఉద్యోగి బాధ్యతకు కప్పదాటు. ఉద్యోగాన్ని తు.చ. తప్పకుండా చేస్తే ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’ అని బతకొచ్చు. ఓ చిన్న Gesture ఏ రూలు బుక్కులో ఉండదు. కాని మనిషిని ఎత్తున నిలుపుతుంది. ఆస్తి రసీదు బాధ్యత. దాని మడత మాన వత్వం. - గొల్లపూడి మారుతీరావు -
భజరంగీ భాయీజాన్ చూసి కంటతడి పెట్టుకున్నా..
జీవన కాలమ్ మహా పురుషుల పాద రేణువులతో పవిత్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– సల్మాన్‌ఖాన్ వంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టు లతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవిత్రత’ను కోల్పోదు. ఈ దేశం అట్టు ఉడికినట్టు ఉడికిపోయింది. కొందరు గుండెలు బాదుకున్నారు. గుండె ధైర్యం చాలని కొందరు చచ్చిపోయారు. ప్రతీ ఊరులోనూ హాహా కారాలు చేశారు. కొన్ని వేల మంది ఆయన ఇంటి చుట్టూ, మరి కొన్ని వేలమంది జోద్ పూర్ జైలు గోడల్ని పట్టుకుని రోదిస్తూ ఆ మహానటుడి దీన వదనాన్ని దర్శించడానికి గుంజాటన పడ్డారు. కారణం– సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక రాత్రి జైల్లో గడపాలి– 20 సంవత్సరాల కిందట నల్లజింకని చంపి నందుకు.. నన్ను క్షమించాలి. నేనెప్పుడూ నా అంతట నేనుగా సల్మాన్ ఖాన్ చిత్రాన్ని చూడలేదు– ఒకసారి మా అబ్బాయి ఒత్తిడి మీద ‘భజరంగీ భాయీజాన్’ చిత్రాన్ని చూసి కంటతడి పెట్టుకున్నాను. అయితే ఆయన కంట తడిని పెట్టించే నటుడు కాదని తర్వాత తెలిసింది. జోద్పూర్ జైలు ఆవరణలోకి ఈ నటుడు నడిచి రావడాన్ని మా అబ్బాయి చూపించాడు– టీవీలో, సల్మాన్ ఖాన్ గారి నడకను తమరు ఈ పాటికే గ్రహించి ఉండాలి. పెదాలు బిగించి, రెండు భుజ బాహువుల్లోంచీ రెండు ఈత చెట్లను నిలిపేంత ఠీవిగా నడిచి వచ్చారు. తెల్లారితే రాహుల్, మోదీ లతో మొహం మొత్తే పత్రికలు, చానల్స్ జో«ద్‌పూర్ జైలు ఆవరణ ఆఫీసు గదిలో వారు కాళ్లు దాదాపు జైలర్ మీదికి జాపి కూర్చున్న ఫొటోని ప్రచురిస్తూ– ‘ఈ ఫొటో మొదటిసారి వేస్తున్నది మేమే’ అని గర్వంగా చెప్పుకున్నారు. మరి 20 ఏళ్ల క్రితం ఈ సుంద రాంగుడు నలుగురు అందమైన అమ్మాయిల్ని తోడు తీసుకుని అడవికి వెళ్లి, అరుదైన అడవి జంతువు నల్ల జింకను చంపిన వైనం ఈ దేశం మరచిపోయింది. న్యాయస్థానాలు వెనక్కి నెట్టాయి. మరి ఇంత చిన్న నేరానికి శిక్ష విధించడానికి 20 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఏ పత్రికా తమ పత్రికల్లో రాయలేదు. ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. డబ్బు, పరపతి, న్యాయ స్థానాలకి సినిమా రంగం మీద ఉన్న భయం (ప్రియం కాదు– గమనించాలి). మన దేశంలో జైలుకెళ్లిన మహానుభావుల్ని ఒకసారి స్మరించుకుని తరిద్దాం. లాలూప్రసాద్ యాదవ్ (వెంటనే వీరినే ఎందుకు స్మరించాలి?). ఒక రిపోర్టు ప్రకారం, వీరి హయాంలో ఒక్క 8 సంవత్సరాలలో మాత్రమే 32 వేల మందిని ఎత్తుకు పోయి, వారిలో చాలామంది డబ్బు చెల్లించాక హత్యలు జరిపించారట. వీరు కాక ఈ మహానుభావుల జాబితాల్లో ఆసా రామ్ బాపూ, గురు మీత్ సింగ్ రామ్ రహీం ఉన్నారు, వారి ఉంపుడుకత్తె హనీ ప్రీత్ కౌర్ ఉంది. మధుకోడా ఉన్నారు. శిబూ సొరేన్, పండిత్ సుఖ్రామ్ ఉన్నారు, ఓం ప్రకాశ్ చౌతాలా, ఎ. రాజా, కనిమొళి ఉంది. వీళ్ల జైలు జీవితం మాటేమోకానీ, ఈ రాత్రి సల్మాన్ ఖాన్ సుఖంగా ఉండటానికి నాలుగు బొంత లిస్తారట. జైలరుగారి అనుంగు పుత్రుడు అవసరమ యితే వాళ్ల నాన్న తల పగులగొట్టి రెండు పరుపులు, నాలుగు దుప్పట్లూ సల్మాన్ గదికి తరలించి, రాత్రంతా ఆయనకి సేవ చేసి, తను చచ్చిపోయేదాకా ఆ అనుభూ తిని పెళ్లాం పిల్లలతో చెప్పుకుని గర్వపడతాడని నా నమ్మకం. మన దేశంలో బొత్తిగా పనికిరాని, అరెస్టైన కొందరు నేరస్థులను కూడా తలచుకోవడం న్యాయం. జయ ప్రకాశ్ నారాయణ్, క్లుప్తత కోసం కొన్ని పేర్లు– సర్దార్ వల్లభాయి పటేల్, రాజాజీ, పట్టాభి సీతా రామయ్య, మౌలానా అజాద్, లాల్ బహదూర్ శాస్త్రి. వీరందరూ అజరామరమైన కీర్తి శేషులు. మరో మాట లేదు. కావా లనే నెహ్రూ గురించి వ్రాయడం లేదు. కారణం ఆయన ఆ వైభవాన్నీ అనుభవించారు. అంత గొప్పగానూ నిష్క్రమించారు. మరో మూడు పేర్లే రాసి ఈ కాలమ్ ముగిస్తాను. మహాత్మా గాంధీ 2,500 సంవత్సరాల దక్షిణాయతన పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ మహా స్వామి, వినోభా భావే. మహాత్ముడు సగం జీవి తాన్ని జైళ్లో గడిపాడు. తుండు గుడ్డ, పంచె ఆయన ఆభర ణాలు. జయేంద్ర సరస్వతి మహాస్వామి 61 రోజులు జైల్లో ఉన్నారు. శిరస్సుపైన ఉన్న దివ్య వస్త్రమే (‘శాటి’) వారు ఉప యోగించుకున్నవి. మరొక మహా పురుషుడు వినోభా భావే. మహాత్ముడు నిరాహార దీక్షలలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య మూలాలను పెకలించి, ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టి మార్టిన్ లూథర్ కింగ్, బాద్షా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారికి గురువై– ఎన్నో దేశాల స్వాతంత్య్రానికి కారణమ య్యాడు. మరొక మహాస్వామి ఈ జాతి ఆధ్యాత్మిక సంప దను సుసంపన్నం చేశారు. మరొకాయన వినోభా భావే. ఆయన శరీరంలో భాగాలు మందులకు ఎదురు తిరిగితే– ‘ఈ శరీరం ఇక చాలునంటోంది’ అని స్వచ్ఛం దంగా మృత్యువుని ఆశ్రయించిన అపర బీష్ములు. ఇలాంటి మహా పురుషుల పాద రేణువులతో పవి త్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– ఇలాంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టులతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవి త్రత’ను కోల్పోదు. గొల్లపూడి మారుతీరావు -
‘ఇచ్చాపురపు’ జ్ఞాపకాలు
జీవన కాలమ్ ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపా యలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావుగారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. ఒక వయసు దాటాక మనిషి చిరాయువుగా ఉండటానికి కారణం శరీర ఆరోగ్యం కాదు. మానసిక ఆరోగ్యం. దానిని పుష్కలంగా పెంచుకుని జీవి తాన్ని కళగా జీవించిన అరు దైన మిత్రులు ఇచ్చాపురపు జగన్నాథరావు. కొందరు ఉన్న చోట ఉత్తుంగ తరంగంలాగ లేచి పడుతూంటారు. మరికొందరు ప్రశాంతమైన సరో వరంలాగ హాయిగా, గర్వంగా, తృప్తిగా, హుందాగా జీవిస్తారు. అలా ఆఖరి క్షణం వరకూ జీవించిన గొప్ప కళాత్మకమైన దృష్టి, దృక్పథమూ కలవారు జగన్నాథ రావు. ఆయన నోటి వెంట ఏనాడూ ‘నెగటివ్’ ఆలోచన రావడం ఎరుగను. జీవించడంలో నిర్దిష్టమైన స్పష్టత, ఆలోచనలో అతి నిలకడైన దృక్పథమూ కల ఆఫీసరు రావుగారు. ‘ఆఫీసరు’ని ముందు నిలపడానికి కారణం శషబిషలు లేని ఆలోచనా సరళి. ఒకసారి నాతో అన్నారు: ‘‘మారుతీరావుగారూ! మనం పోయాక మన పిల్లలు పది రోజులు బాధపడతారు. మన మీద ప్రేమ ఉంటే పది నెలలు బాధపడతారు. ఎల్లకాలం బాధ పడాలని మనం కోరుకోకూడదు. అది వారికే మంచిది కాదు. జీవితం సాగాలి. అలా సాగుతూనే ఉండాలి’’. నాకు అతి తరచుగా జోకులు, అందమైన, ఆలోచ నాత్మకమైన కథలు కంప్యూటర్లో పంపే వ్యక్తి రావు గారు. ఎప్పుడూ ‘హాస్యం’ వాటి ప్రధాన అంశం. సరిగ్గా ఆయన వెళ్లిపోవడానికి మూడు రోజుల కిందట జోక్ పంపారు. మొదటి వాక్యం చెప్పాలి: ‘‘నువ్వు రోజూ వ్యాయామం చెయ్యడంవల్ల లాభం– ఆరోగ్యంగా వెళ్లి పోవడానికి దగ్గర తోవ’’. తెల్లబట్టలు వేసుకుని, సూర్యోదయాన్ని చూస్తూ, వేడి కాఫీ తాగుతున్నంత హాయిగా ఉంటాయి ఆయన రచనలు. దేశ అభ్యుదయం, విప్లవం, తిరుగుబాటు– ఇలాంటి మాటలు తెలుగులో ఉన్నాయని కూడా ఆయ నకి తెలీదేమో. దాదాపు 28 సంవత్సరాల కిందట ఆయన చెన్నైలో కస్టమ్స్ కలెక్టరు. ఆయన చేత చాలా నాటికలు రాయించిన తృప్తి నాది. ఓసారి కథ రాయమని ఫోన్ చేశాను. ‘ఈ ఉద్యోగ రద్దీలో ఇతివృత్తం మనసులో లేదండీ’ అన్నారు. ‘మీ ముందు టేబిలు మీద ఏమేం ఉన్నాయి?’ అని అడిగాను. ఫైళ్లు, టెలిఫోన్, పిన్ కుషన్– ఇలా చెప్పారు. ‘గుండుసూది’ మీద కథ రాయ మన్నాను. ఆ కథ చాలా గొప్పది. ఏళ్ల తర్వాత విహారి ఆ కథని మెచ్చుకున్నారట. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈమెయిల్ పంపారు. ఆఖరి వాక్యాలివి. I recall your inspiration which resulted in a story which was bigger than me. If someone raves about a story a quarter of a century later, there must be something in it. Ego? No. I feel humbled.కృతజ్ఞత చాలా అరుదైన లక్షణం. స్వామిభక్తి, కృతజ్ఞతని– సగం మనిషి, సగం జంతువు ద్వారా మనకి నేర్పాడు వాల్మీకి– రామాయణంలో. (క్షమించాలి. నేను హనుమంతుడనే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. పురాణాన్ని కించపరచడం లేదు. తీరా నా పేరూ అదే!) ఒక్క సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచు రించిన ‘సురభి’ మాస పత్రికలో నా ఒత్తిడి మేరకి ‘తగిన మందు’ అనే కథ రాశారు. తర్వాత ఏదైనా రాశారేమో నాకు తెలీదు. నా అభిమాన రచన వారి నవలిక ‘గులా బిముళ్లు’. దాన్ని ‘చేదు నిజం’ అనే పేరిట గంట నాట కంగా రేడియోలో ప్రసారం చేశాను. ఏదైనా సభల్లో మాట్లాడే విషయం కుదరనప్పుడు ఆ కథని అనర్గళంగా చెప్పి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి, కొసమెరుపుగా ‘ఇది ఇచ్చాపురపు జగన్నాథరావుగారి రచన’ అని చెప్పడం రివాజు. ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపాయలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావు గారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. రావుగారు ఆయన షరతుల మీదే హాయిగా జీవిం చారు. ఆయన షరతులమీదే రచనలు చేశారు. 13వ తేదీ సాయంకాలం ఏడున్నరకి ఓ మంచి జోక్‌ని మా అంద రికీ పంపడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నారు. 7.45కి తల వెనక్కు వేలాడిపోయింది. గుండెపోటు. తన షరతుల మీదే నిష్క్రమించారు. రావుగారు నిగర్వి. కానీ జీవించడంలో తన పరిధుల్ని ఎరిగి, ఆ చట్రం మధ్య అందమైన ముగ్గులాగ జీవితాన్ని పరుచుకుని ప్రశాం తంగా జీవించిన వ్యక్తి. ఆగస్టు 8న ఆ దంపతులని చూడటానికి వెళ్లాను. వృద్ధాప్యం ముసురుకున్న జీవితాల్ని డిగ్నిఫైడ్‌గా అలం కరించుకోవడం చూశాను. బయలుదేరుతూంటే దంప తులు గుమ్మందాకా వచ్చారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి నట్టు– ‘మీ ఇద్దరి ఫొటో తీసుకుంటాను’ అన్నాను. ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు. ‘ఈమాటు వచ్చిన ప్పుడు తీసుకుందాం’ అని. మరో అవకాశం లేదని ఆనాడు తెలియదు. ఆనాడు తీసుకోని ఫొటో ఒక జీవితకాలం ఆలశ్యం అయి పోయింది. వ్యాసకర్త ప్రముఖ సినీ రచయత గొల్లపూడి మారుతీరావు -
తెలివి మీరిన నేరాలు
జీవన కాలమ్ చదువు మాత్రమే మనిషిని మార్చదు. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం. మొన్న విశాఖపట్నం బీచి దగ్గర మా కారు ఆగింది– రోజూలాగే. పార్కింగులో పది మోటారు సైకిళ్లు ఉన్నాయి. రామకృష్ణా బీచిలో రోడ్డుకి ఎడమపక్క కార్లు, కుడిపక్క మోటారు సైకిళ్లు ఆపాలని రూలు. కాని కొన్ని డజన్ల మోటారు సైకిళ్లు ఎడమపక్కనే ఆపుతారు. కారణం – పక్కనే కూర్చునే వసతి. మా డ్రైవరు ఒకాయన్ని మోటారు సైకిలు కాస్త వెనక్కి పెట్టమన్నాడు. ఆ మోటారు సైకిలు ఓనరు ఇతని మీద విరుచుకుపడ్డాడు. ‘నా బండి తీయమనడానికి నువ్వెవడివి? ఇక్కడ కార్లే ఆపాలని రాసి ఉందా? ఇది నీ బాబు గాడి సొమ్మా? నా బండీ పెడితే ఆపేవాడెవడు? ఇక్కడే పెడతాను. నీ దిక్కున్నవాడితో చెప్పుకో–పో. నేను తియ్యను‘ ఇలా అరుపులతో సాగింది. ఇంతలో ఎవరో ఆ కేకలు వేసే మనిషికి పలానా కారు గొల్లపూడిదని చెప్పారు. అతని తడబాటు వర్ణనాతీతం. ఇతణ్ని ఆపే శక్తి పోలీసు వ్యవస్థకి లేదు. కారణాలు మన దేశంలో చెప్పనక్కరలేదు. లేదన్న అవగాహన ఇతను బోర విరుచుకోవడానికి దన్ను. ఈ కాలమ్ కొందరయినా పోలీసు అధికారులు చదువుతారని ఆశి స్తాను. ఇది చదువుకున్న నేలబారు మనిషి – తన ఆ క్రమశిక్షణకు తాను సమకూర్చుకున్న లాజిక్. అతను చదువు రానివాడు కాదు. స్పష్టంగా తెలుస్తోంది. కాని చదువువల్ల రావలసిన సంస్కారం రానివాడు. ఇలాంటి చదువుల వెర్రితలలు మనదేశంలో కోకొల్లలుగా ప్రస్తు తం చూస్తున్నాం. ఈ చదువుకున్న మూర్ఖుడి మూర్ఖత్వానికి రెండు చికిత్సలు. దమ్మున్న అధికారం. చదువుకు సరైన తోవని మప్పే వ్యవస్థ. నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశీలనకు జువెనైల్ జస్టిస్ బోర్డు (పరిపక్వతకు రాని వయసున్న నేరస్థుల నేరాలను పరిశీలించే సంస్థ) తరఫు న్యాయవాది అబ్దుల్ రఖీబ్ అనే ఆయన ప్రొఫెసర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో.. విశాఖపట్నంలో చట్టానికి అడ్డం పడే ఈ జువెనైల్ నేరస్థుల కథనాలను– 100 నమూనాలను రెండేళ్లు పరిశీలించి పరిశోధన చేశారు. తేలిన నిజాలు విచిత్రం. ఇక్కడ జరిగే నేరాలు– చదువులేక, రోడ్డుమీద పడిన అలగా జనం చేసేవి కావు! నేరస్థులలో 40 శాతం ఇంటర్మీడియెట్ చదువుకున్నవారు. పదిశాతం పట్టభద్రులు! ఇంకా 67 శాతం కింది మధ్యతరగతినుంచి వచ్చినవారు. వీరిలో మళ్లీ గంజాయి రవాణా, అమ్మాయిల వేట, మానభంగాలు, గొలుసుల దొంగతనాలు, మా బీచి మిత్రుడిలాగ చట్టాన్ని ఎదిరించి రొమ్ము విరుచుకునే కేసులు– 58 శాతం. వీరిలో వెనుకబడిన కుటుంబాల నుంచి 56 శాతం, జూనియర్ కాలేజీల్లో చదువుకునేవారు– 30 శాతం ఉన్నారు. ఇది చాలా విచిత్రమైన నిజాలను ఆవిష్కరించే పరిశోధన. ఇదేమిటి? చదువు వీరిని మార్చలేదేం? బాబూ, చదువు మాత్రమే మనిషిని మార్చదు. గమనించాలి. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చిల్లర దొంగతనాలు చేసి బతికే తండ్రి కొడుకు– అదృష్టవశాత్తూ చదువుకోగలిగితే– ఆ దొంగతనాల్ని మరింత పకడ్బందీగా, దొరక్కుండా, మెరుగైన స్థాయిలో ఎలా చేయాలో– ఆ వృత్తికి మెరుగుపెడతాడు. వెనుకబడినవాడు– తన వెనుకబడినతనానికి తరతరాలు కారణమైన వాడిమీద కత్తికడతాడు. ఆ కత్తిని పదునుపెట్టడం చదువు నేర్పుతుంది. చదువు దానికి మన్నికయిన కారణాన్ని జత చేస్తుంది. వ్యవస్థ తప్పిదం వ్యక్తిది కాదన్న అవగాహన చదువుది కాదు. సంస్కారానిది. సంస్కారం పుష్పం. పురుగులు పట్టిన, కుళ్లిన గెత్తంలోంచే కళ్లు విప్పి, విత్తనమనే ప్రత్యేక అస్థిత్వాన్ని ఒడిసి పట్టుకుని– వికసించి పుష్పమవుతుంది. చదువు– ఏతావాతా– ప్రజ్ఞనిస్తుంది. ఉపజ్ఞని ఇవ్వదు. చట్టాన్ని ఎలా ఎదిరించాలో నేర్పగలదు. ఎందుకు ఎదిరిం చాలో ఒప్పించగలదు. మప్పగలదు. దానికి ఒరిపిడి– సంస్కారం. నిజానికి దీనికీ, చదువుకీ– న్యాయంగా సంబంధం ఉండనక్కరలేదు. కానీ ఉంటుంది. చదువుతో వచ్చే ‘వికసనం’ ఆ వాతావరణం ఇస్తుంది. సాంగత్యం ఇస్తుంది. ఆదిశంకరులు సజ్జన సాంగత్యానికి– జీవన్ముక్తిదాకా మజిలీలు ఉన్నాయని సూచించడంలో అర్థం ఇదే. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం. తెల్లవారిలేస్తే– మన డబ్బుని తినేసే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇంట్లో 50 కోట్ల ఆస్తి బట్టబయలు, కొల్లగొట్టిన డబ్బుతో పట్టుబడిన ఎమ్మార్వోల కథనాలు, రిజిస్ట్రార్ ఆఫీసులో లక్షల లంచాలు, చట్టాన్ని ఎదిరించి చెల్లుబడి చేసుకున్న డబ్బున్న నాయకుడి విర్రవీగుడు– ఇవన్నీ పైన చెప్పిన 62 శాతం చదువుకున్న కుర్రాడి మెదడులో పెట్టుబడులు. కుళ్లు చూపే వ్యవస్థలో తన ఒక్కడి సత్ప్రవర్తన జవాబుదారీ కాదన్న ‘నిరసన’ని అతని చదువు నేర్పుతోంది. ఇదీ చదువుకున్న 90 శాతం కుర్ర నేరస్థుల కథ. గొల్లపూడి మారుతీరావు -
పేరులోననే యున్నది
జీవన కాలమ్ ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించుకోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే. ఈ మధ్య రైల్వే మంత్రి సురేష్ ప్రభుగారికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. మన దేశంలో రైల్వే ప్రజ లందరికీ మత ప్రమేయం లేకుండా వినియోగపడే ప్రయాణ సాధనం కనుక, విభిన్నమైన సాంస్కృతిక చైతన్యాలను ప్రతిఫలించే దిగా ఉంటే బాగుంటుందని భావించారు. అందు వల్ల ఏం చేయాలి? ఆయా రైళ్లకి వివిధ భాషలలో ప్రముఖ రచయితల రచనల పేర్లను పెడితే– ఆ రైళ్లను తల్చుకున్నప్పుడల్లా ఆయా సంస్కృతుల వైభవం మనసులో కదులుతుందని వారు అభిప్రా యపడ్డారు. ఈ మధ్య రోజుకో రైలు ప్రమాదం జరిగాక– వారు రైల్వే శాఖను వదులుకోవాలని నిర్ణ యించుకున్నాక ఈ ఆలోచన వచ్చిందో లేక ముందే వచ్చిందో మనకు తెలీదు. ఏమైనా సురేష్ ప్రభు గారికి ఆయా భాషల రచనల అవగాహన తక్కువని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మొన్నటి దురంతో ఎక్స్‌ప్రెస్‌కి ప్రముఖ రచన ‘స్మశానవా టిక’ పేరు ఉంచి– ‘స్మశాన వాటిక ఎక్స్‌ప్రెస్’ అన్నారను కోండి– ఆ పేరు సార్థకమయి పోయినట్టే లెక్క. అలాగే తెలుగు వారంతా గర్వించే ‘చివరకు మిగిలేది’ నవల పేరు అటు మొన్న యాక్సి డెంటైన కాలిఫియాత్ ఎక్స్ ప్రెస్‌కు– ‘చివరకు మిగిలేది ఎక్స్‌ప్రెస్’ అని ఉంచితే సార్థ కమయ్యేది. మన తెలుగు వారు గర్వించే మరో గొప్ప రచన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’. అటు మొన్నటి ఉత్కల్ ఎక్స్ప్రె స్ని ‘మహాప్రస్థానం ఎక్స్‌ప్రెస్’ అని ఉంటే? గత 5 ఏళ్లలో 586 రైలు యాక్సిడెంట్లు జరిగాయ న్నారు. ఎన్ని రైళ్లకు ఏయే కళాఖండాల పేర్లు పెట్టి మనం సమర్థించగలం? పలానా ఎక్స్‌ప్రెస్‌ని ‘అరి కాళ్లకింద మంటల ఎక్స్‌ప్రెస్’ అందామా? ‘కర్రా చెప్పులు ఎక్స్‌ప్రెస్’ అందామా? గోదావరి ఎక్స్ ప్రెస్‌ని ‘అయ్యో పాపం ఎక్స్‌ప్రెస్’ అందామా? కళాఖండాల పేర్లు ముట్టుకుంటే గొడవల్లో పడ తామని నాకనిపిస్తుంది. ఏమైనా ఇన్నాళ్లకి ఇలాంటి ఆలోచన చేసే మంత్రిగారు రావడం మన అదృష్టం. ఈ దేశంలో జంతు ప్రదర్శన శాలలకు, విమానా శ్రయాలకి, ట్రస్టులకి, అడ్డమైన పథకాలకీ ఇంది రాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీని ఎవడు అడిగాడు? మన రోజులు బాగుండి కాంగ్రెస్ పదవిలో లేదు కనుక మనం బతికి పోయాం కానీ ఈ పాటికి ‘రాహుల్ గాంధీ’ సంస్థలు పాతికా, ప్రియాంకా గాంధీ సంస్థలు మరో 30 వెలిసి ఉండేవి. మళ్లీ మాట్లాడితే ‘మౌరీన్ వాద్రా’ పేరుతో మనకు డజను సంస్థలు వచ్చేవి. ఎవరీ మౌరీన్? మన ప్రియాంకాగారి అత్తగారు. మన దేశంలో స్వామి భక్తి పట్టిన, మేధావులు 70 సంవ త్సరాలుగా మన నెత్తిన పెట్టిన దరిద్రమిది. ఇప్పుడు కొన్ని వైభవాలు చూద్దాం. మన హైద రాబాద్ విమానాశ్రయం– రాజీవ్‌గాంధీ విమానా శ్రయం. చెన్నై విమానాశ్రయం– కామరాజ్ విమానా శ్రయం. కానీ ఇటలీలో ఒక విమానాశ్రయం పేరు గెలీలియో విమానాశ్రయం. గెలీలియో అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుని పేరుని అజరామరం చేసుకున్న చిన్న దేశమది. మరొక విమానాశ్రయం ‘మైకెలాం జిలో విమానాశ్రయం’. మైకెలాంజిలో గొప్ప శిల్పకా రుడని గుర్తు చెయ్యనక్కరలేదు. మరొకటి ‘లియో నార్డో డివించీ ఎయిర్పోర్ట్. తను సృష్టించిన పాత్రను చిరంజీవిని చేసిన ఓ మహా రచయిత ఆర్ధర్ కోనన్ డాయిల్. ఆయన సృష్టించిన పాత్ర షెర్లాక్ హోమ్స్. లండన్ బేకర్ స్ట్రీట్‌లో ఇల్లు ఆ పాత్రది. ఇప్పటికీ బేకర్ స్ట్రీట్‌లో రైలు ఆగగానే గోడనిండా గొప్పగా షెర్లాక్ హోమ్స్ బొమ్మ కనిపిస్తుంది. విజ య నగరం స్టేషన్లో 125 సంవ త్సరాల చరిత్ర ఉన్న మహా కళాఖండాన్ని సృష్టించిన గుర జాడ ‘గిరీశం’ కనిపిస్తాడా? మన రాజకీయ నాయకుల్ని అడగండి. ‘ఎవరు బాబూ ఈ గిరీశం?’ అంటారు. ఏతావాతా, నేను సురే ష్‌ప్రభు గారిని అభినందిస్తు న్నాను. మన నెత్తిన ‘రాబర్ట్ వాద్రా విశ్వవిద్యాలయం’, ‘మిరయా విశ్వవిద్యాలయం’ (అన్నట్టు మీకీ పేరు తెలియదు కదూ? గత మూడేళ్లు ‘10 జనపథ్’ మేడమ్ ఈ దేశాన్ని పాలించి ఉంటే ఈపాటికి తమరు ఈ పేరుని గాయత్రిలాగా జపం చేసేవారు. ఇది ప్రియాంకా కూతురు పేరు) అనే ఆలోచనా పరిధి నుంచి బయటికి వచ్చి ఆలో చించే మంత్రులు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ నాదొక విన్నపం. ఆయా మహా రచయి తల రచనలు కాక– వారి పేర్లనే చిరస్మరణీయం చేయండి. చక్కగా దురంతో ఎక్స్‌ప్రెస్‌ని ‘శ్రీశ్రీ ఎక్స్ ప్రెస్’ అనండి లేదా ‘గోపీచంద్ ఎక్స్‌ప్రెస్’ అనండి. పాలక కుటుంబాల అడుగులకు మడుగులొత్తే సంస్కృతి నుంచి బయటపడాలన్న ఆలోచన ఈ దేశానికి మంచి శకునం. ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించు కోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే. గొల్లపూడి మారుతీరావు -
ఓ ‘‘చౌకీదారు’’ కథ
జీవన కాలమ్ నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. కొంతకాలం కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం. కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్ లేలాండ్ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య. ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు. ఇక నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్ భాయ్–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్నగర్లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్ నగర్లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు. మోదీ అన్నయ్య–సోంభాయ్ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు. మోదీ అన్నయ్య అమృతాభాయ్(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్ గీతామందిర్ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్.ఎస్.ఎస్. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్‌కీ, రాబర్ట్ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి. నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. మోదీకి జోహార్! (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు ) -
దమ్ము–సొమ్ము
జీవన కాలమ్ ‘నగదు’ అంటే అర్థం తెలీని కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్’ అన్నాడో మహాకవి. ప్రధానికి ఇది ఉవాచగా కాక, హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పవలసిన క్షణాలు వచ్చేశాయి. ఎవరో నాకు వాట్సప్‌లో ఈ సమీక్షను పంపారు. ‘దమ్మున్నవాడికి పదవి లేదు. పదవి ఉన్నవాడికి దమ్ము లేదు. పదవి ఉండి దమ్మున్నవాడికి సపోర్ట్ లేదు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు గనుక మోదీని సపోర్ట్ చెయ్యకపోతే, ఈ దేశాన్ని మార్చడం మన తరం కాదుగదా, మన తర్వాతి తరం కూడా కాదు’. నవంబర్ 8 తర్వాత చాలామంది చాలాకాలం పాటు ఈమాటే అనుకున్నారు. క్రమంగా ఈ మాట బలహీనపడి–ఇలా వాట్సప్‌లో వాపోవాల్సిన అగత్యం ఏర్పడింది. కారణం–ఈ దేశంలో కనీసం 60 శాతం మందికి నల్లడబ్బు, పరాయి దేశపు దొంగనోట్లు వంటివి తెలీ దు–తెలియవలసిన దశలో వారు జీవించడం లేదు కనుక. తెల్లవారి లేస్తే–కందిపప్పు, బియ్యం, నూనె, కూరలు, అనారోగ్యానికి మందులు–ఇలాంటి దైనందిన అవసరాలు తీర్చుకోవడమే వారికి తెలుసు కనుక. ఇప్పుడిప్పుడు ఎవరో తమని ఎక్కడినుంచో దోచుకుంటున్నారనీ–ఇలా నోట్లని అదుపులో పెట్టడంవల్ల తమకి మేలు జరుగుతుందనీ వారు విన్నారు. నమ్మారు. లంబసిం గిలో ఎర్రప్పడికి, మర్రివలసలో చినపడాలకీ ఇంతకంటే ఏమీ తెలీదు. వెనకటికి.. గిరీశం బండివాడికి రాజకీయాలమీద రెండు గంటలు లెక్చరిస్తే–అంతా విని ‘అయితే బాబూ– మావూరి హెడ్ కానిస్టేబుల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు’ అని అడిగాడట. ఎర్రప్పుడు, చినపడాల ఆ కోవకి చెంది నవారే. నవంబర్ 8 తర్వాత వీళ్లకి ఎవరో చెప్పి ఉంటారు. ‘ఒరేయ్, మోదీగారు చేసిన పనివల్ల మీకు లాభం కలుగుతుందిరా’ అని. ‘పోనీ బాబూ–అంతే శాన’ అనుకుని బ్యాంకుల ముందు వారు బారులు తీరారు. వారాలు గడచిపోయాక ‘ఎప్పుడొత్తాది బాబూ ఈ నాభం? ఇప్పుడెక్కడిదాకా వచ్చినాది?’ అని అడిగారు. క్రమంగా పేదవాడి విశ్వాసానికి నెరియలు పడే స్థితి వచ్చింది. ఇది ఒక పార్శ్వం. ఆలోచన ప్రకారమే రిజర్వ్‌బ్యాంక్ కొత్త నోట్లను విడుదల చేస్తుండగా–ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి–రాత్రికి రాత్రే 30 లక్షల కొత్త నోట్లను రిజర్వ్ బ్యాంక్ నుంచే సరాసరి తన గల్లాపెట్టెకి రవాణా చేయగా, అతని కొడుకు 5 కిలోల బంగారాన్ని, మరికొన్ని లక్ష ల కొత్త నోట్లని దోచుకోగా, వెంకటేశ్వర స్వామి సేవకు కంకణం కట్టుకున్న టీటీడీ బోర్డు సభ్యులు–దైవ భక్తుల్ని తలదన్నినట్టు పెద్ద నామా లు, జరీ ఉత్తరీయం ధరించి–ప్రజ లకు ఉపయోగపడాల్సిన కోట్ల సొమ్ముని (24 కోట్ల కొత్త నోట్లు, 50 కిలోల బంగారం) దోచుకుంటుం డగా, ఎక్సైజ్ కమీషనర్లు, హవాలా వ్యాపారులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్లు గడ్డి కరుస్తుండగా–మాయమైన కోట్ల సొమ్ము క్యూలలో నిలబడిన పెద గదిలి కూలీకి ఎలా అందుతుంది? ఇంతకాలం నేలబారు మనిషికి చేరాల్సిన ప్రయోజనం–ఎన్నిరకాల, ఎంత పెద్ద పదవుల్లో ఉన్న గుంటనక్కల పాలవుతుందో క్రమంగా తెలియ వస్తోంది. అయితే అవినీతి, అక్రమ చర్యలు కారణంగా– ఈ దేశపు వాయుసేన శాఖ అధిపతి త్యాగీ, టీటీడీ బోర్డు సభ్యులు, ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, బ్యాంకు సీనియర్ ఆఫీసర్లు బారులు తీర్చి జైలుకి వెళ్తున్నారు. ఇది 70 ఏళ్ల భారతీయ చరిత్రలో–గుండెలు తీసిన దొంగల్ని గుండెబలం గల ఒక వ్యవస్థ వీధిన పెట్టడం అనూహ్యమైన పరిణామం. అయితే ఏ విధంగా ఇది మామూలు మనిషికి ఉపయోగిస్తుంది? ఏనాడూ రోడ్డుమీది మనిషిని పట్టించుకోకుండా 22 రకాల కుంభకోణాలలో శాస్త్రయుక్తంగా దేశాన్ని దోచుకున్న ఒకప్పటి రాజకీయ పార్టీ, మిగతా పార్టీలు హఠాత్తుగా నేలబారు మనిషి కష్టాలను నెత్తికెత్తుకుని 22 రోజులపాటు పార్లమెంటు సభల్ని మంటగలిపారు. ఓ చీఫ్ సెక్రటరీ, కొడుకూ సాక్ష్యాలతో ççపట్టుబడగా–ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి–మమతా బెనర్జీ ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అంటున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ–కనీ వినీ ఎరుగని రీతిలో–ఇంతకుముందు ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యని విజయవంతంగా సాధించలేక పోయిందని తెలిసి కూడా–అతి శక్తిమంతమైన, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న దోపిడీదారులను తట్టుకుని–రొంకిలి గుండు ముత్తడు, బూసాయవలస చెల్లమ్మలకు ఈ మేలు చేరడానికి 46 రోజులు సరిపోతాయా? ఏమైనా 46 రోజుల తర్వాత వాట్సప్‌లో ఇలాంటి గొంతు విని పించడం విశేషం. కానీ రోజులు గడిచేకొద్దీ వేళ మించిపోతోంది. మన దేశంలో 2016లోనూ, 1889 నాటి కన్యాశుల్కం బండీవాళ్లు చాలామంది ఉన్నారు. వారికి ఉర్జిత్ పటేల్ కుప్పిగెంతులు తెలీదు. మోదీగారి ‘దమ్ము’ తెలీదు. తెల్లారితే ఉల్లిపాయ కొనుక్కునే ‘సొమ్ము’ మాత్రమే తెలుసు. నగదు రహిత లావాదేవీలు చదువుకున్న నాలాంటివాడికే చికాకు పరిచే సౌకర్యాలు. ‘నగదు’ అంటే అర్థం తెలీని కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్నారు. ‘దేశమంటే మట్టికాదోయ్’ అన్నాడో మహాకవి. ప్రధానికి ఇది ఉవాచగా కాక, హెచ్చరికగా తెలుగు మంత్రులు చెప్పవలసిన క్షణాలు వచ్చేశాయి. (రచయిత : గొల్లపూడి మారుతీరావు ) -
‘‘నందిగ్రామ రాజ్యము’’
జీవన కాలమ్ ఇటీవల ప్రభుత్వం పెద్ద నోట్ల విశృంఖల వినిమయాన్ని నియంత్రించింది. ఈ నోట్లు 2017 మార్చి వరకూ చెల్లుతాయి. అయితే వలలో పడాల్సిన పెద్ద చేపలకు ముందుగానే ఉప్పు అందిందన్న వార్తలు వస్తున్నాయి. కవి కాలం కంటే ముందు చూసేవాడు. ద్రష్ట. విశ్వనాథ సత్యనారాయణగారు వెళ్లిపోయిన సంవత్సరంలో – అంటే జూలై 1976లో ఆయన ఆఖరి నవల రాశారు. అది అముద్రితం. 40 సంవత్సరాల కిందటే ఇప్పటి పరిస్థితులను వివరించే వ్యంగ్య నవల అది. 54 పేజీలు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు నందిగ్రామం వచ్చాడు. సాకేత రాజ్యంలో కొందరు – భరతుడు నందిగ్రామం నుంచి పరిపాలన సాగిస్తున్న కారణాన – తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించి తమ పాలనను సాగిస్తున్నారు. వర్తమాన వ్యవస్థలో ఉన్న దుర్లక్షణాలన్నీ ఆ పాలనలో ఉన్నాయి. రాముడితోపాటు అనేకమంది రాక్షసులూ, కోతులూ వచ్చారు. వీరి దర్శనానికి ప్రజలూ విరగబడ్డారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. రాముడి పట్టా భిషేకం వ్యవహారాలూ, ఖర్చులూ అన్నీ చూసుకోడానికి సుగ్రీవుడిని ఆ శాఖ మంత్రిని చేశారు. సుగ్రీ వుడు తన వానర ప్రతినిధు లతో కలసి – ఈ రాజులవద్ద కోటి బంగారు నాణాలు వసూలు చెయ్యడం కార్యక్రమం. పాలకులూ, ఉద్యోగులూ ఈ కార్యక్రమానికి తలా గుమ్మడికాయంత బంగారం ఇవ్వాలన్నారు. గుమ్మ డికాయ మీద స్థూల రూపంతో హనుమంతుడు కూర్చున్నాడట. వసూళ్లు పెరిగాయి. అక్రమార్జన అంతా ఖజానాకు చేరింది. పట్టాభిషేకం జరిగి పోయింది. అదీ నవల. మరచిపోవద్దు. ఈ అరా చకం రామరాజ్యంలో కాదు. ఆయన పరిపాలనకి ముందు. ఇది వ్యంగ్య నవల. (విమర్శిని, పేజీ 269) ఇటీవల ప్రభుత్వం 500, 1000 రూపాయి నోట్ల విశృంఖల వినిమయాన్ని నియంత్రించింది. ఇందులో గమనించాల్సిన విషయం – ఈ నోట్లు 2017 మార్చి వరకూ చెల్లుతాయి – సందేహం లేదు. అయితే 8వ తేదీ రాత్రి నుంచి – చెల్లే ప్రతీ నోటూ లెక్కల్లోకి రావాలి. అంతే నియమం. అయితే ఇందులో పెద్ద తిరకాసు ఉంది. వలలో పడాల్సిన పెద్ద చేపలకు ముందుగానే ఉప్పు అందిందన్న వార్తలు వస్తున్నాయి. కిలో 250 రూపాయలకి కందిపప్పు కొనుక్కోవలసిన రోజుల్లో కనీసం 500 జేబులో ఉంచుకోని నేలబారు మనిషి ఎవరుంటారు? మొక్కజొన్న కండెలు కాల్చే మనిషి ఎంతలేదన్నా సాయంకాలానికి 500 సంపాదిస్తుంది. ముందు రోజు సంపాదనని ఇంట్లో పిడతలో దాచుకుని ఉంటుంది. ఆ నోటు వెంటనే అక్కరకు రాదనీ, దాన్ని బ్యాంకులో కట్టి సొమ్ము చేసుకోవాలనీ వారికి తెలీదు. తెలిసినా చేసుకోవడం తెలీదు. వినియోగించుకోలేని నేలబారు మనిషికి నోటు తాత్కాలికంగానైనా చిత్తుకాగితమే. ఇది ఈ సమస్యకి ఒక పార్శ్వం. రెండు సరదా కథలు. ఢిల్లీ చత్తర్‌పూర్‌లో కోటీ శ్వరుడు. బుధవారం ఉదయం లేచేసరికి తనదగ్గరున్న డబ్బు చిత్తు కాగితాలని తేలింది. బెంగళూరులో ఒక ఫ్యాక్టరీని శుక్రవారంలోగా రిపేర్లు చేయించి ఒక కంపెనీకి అప్పగించాలి. 90 వేలు ఖర్చు. బ్యాంకుల్లో కోట్లు ఉన్నాయి. కానీ చేతిలో చెల్లని నోట్లున్నాయి. బిజినెస్ క్లాసులో బెంగళూరు వచ్చాడు. ట్యాక్సీ వాడు కరెన్సీ పుచ్చుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి 10 కిలో మీటర్లు నడిచి వెళ్లాడు. చిల్లర డబ్బు కావాలి. ఎలా? తన మిత్రులు జోక్‌గా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. బిచ్చగాళ్లు ఈ సమయంలో కోటీశ్వరులు. ఒక పోలీసు అధికారి ద్వారా బిచ్చగాళ్ల ముఠా అడ్రసు పట్టుకున్నాడు. బెంగళూరు రైల్వేస్టేషను, మెజెస్టిక్ బస్టాండ్ సమీపంలో ఒక కుళ్లు గూడానికి వచ్చాడు. భరించలేని కంపు. బిచ్చగాళ్ల రాజుగారు చిరునవ్వు నవ్వారు. ఈ కోటీశ్వరుడు బేరం చెయ్యగా రెండున్నర లక్షలకి 90 వేలు కంపు కొట్టే నోట్లు మారకం చేసుకున్నాడు. మరో సరదా కథ – కాదు సరదాల కథ. మమతా బెనర్జీ సామ్రాజ్యంలో లక్షమంది రిజిస్టరయిన సెక్స్ వర్కర్లున్నారట. వారు నిరభ్యంతరంగా పెద్ద నోట్లు తీసుకుంటున్నారని, తీసుకుంటారని దర్బార్ మహిళా సమాఖ్య కమిటీ మెంబరు భారతి వాక్రుచ్చారు. సోనాగచీలో ఉషా మల్టీపర్పస్ కోపరేటివ్ బ్యాంకులో మొదటి రెండు రోజుల్లో కేవలం 55 లక్షలు నమోదయింది. ఏతావాతా – మొదటి రెండు రోజుల్లో కనీసం 4 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నమోదయిందని తెలిసింది. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడిన చిన్న చిల్లర కావాల్సిన మనుషులు బేషరతుగా ప్రభుత్వ చర్యని హర్షిస్తూ, తమ పాట్లకు ఎవరినీ నిందించలేదు. ప్రభాకర్ ముంద్కూర్ అనే ఆర్థిక నిపుణుడు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఆఖరి వాక్యాలు: ‘.... I know that I am speaking on behalf of millions of honest Indians. I am proud of you. గొల్లపూడి మారుతీరావు -
రొట్టెకొద్దీ పిండి
జీవన కాలమ్ దీపా కర్మాకర్‌కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూకరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. మొన్నటి రియో ఒలిం పిక్స్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసిన కళాకారిణి దీపా కర్మాకర్. మృత్యువుని కూడా లెక్క చేయని ప్రొడు నోవా విన్యాసం ఒక విస్ఫో టనం. కొద్ది సెకన్లలో బహు మతిని కర్మాకర్ నష్ట పోయినా, దేశ ప్రజల మన్న నలను నష్టపోలేదు. ఎక్కడో అగర్తలాలో అతి మామూలు కుటుంబంలో పుట్టిన ఈ 23 ఏళ్ల పిల్ల– తన లక్ష్యంలో నిప్పునీ, సాధనలో మృత్యువునీ జయిం చి– ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆమె విజయానికి మెచ్చి సచిన్ తెందూల్కర్ అనే భారతరత్న ఆమెకు ఒక బీఎం డబ్ల్యూ కారుని బహూకరించాడు. దీని ఖరీదు– కనీసం కోటి రూపా యలు. నా ఉద్దేశం ఇలాంటివి భారతదేశంలో vulgar display of affluence అని. దీపా కర్మాకర్‌కి ఇది కొత్త సమస్య. పాపం, వాళ్ల ఊర్లో ఇంత పెద్ద, గొప్ప కారు తిరగడానికి రోడ్లు లేవు. కనుక త్రిపుర ప్రభుత్వం నిస్సహాయంగా ఆ ఊర్లో ఫలానా కారు తిరిగే రోడ్లను వేసే కార్యక్రమాన్ని చేప ట్టింది. అయితే పాపం, దీపా ఈ బహు మతిని అందుకున్నప్పుడే ఆమె తండ్రి ఓ మాట చెప్పారు. ‘‘బాబూ! ఈ కారుని నడపడానికి, తట్టుకో వడానికి మాకు శక్తి చాలదు. ఆ కారుకి అయిన డబ్బు ఇవ్వండి. మాకు ఉపయోగపడుతుంది’’ అని. బీఎండబ్ల్యూ సచిన్ వితరణని, స్థాయిని చెప్తోంది కాని– దీపా కర్మాకర్ స్థాయిని అర్థం చేసుకోని ‘లోపాన్ని’ కూడా చెప్తోంది. ఆ కారు తాళం చెవుల్ని అందుకుంటూ– ఈ దిక్కుమాలిన ‘మొగ్గ’ వేసి గొప్ప ఇబ్బందిని తెచ్చి పెట్టుకున్నానే! అని దీప ఒక్క సారయినా మనసులో అనుకుని ఉంటుందని నాకని పిస్తుంది. ఆ బాధ నాకు తెలుసు. నా జీవితంలో దాదాపు 17వ యేట నుంచీ ఏవో బహుమతులూ, చిన్న చిన్న జ్ఞాపికలూ, షీల్డులూ అందుతూనే ఉన్నాయి. రాను రాను వాటి ఉధృతం పెరిగి– ప్రతీ సభలో ఏ కొత్త ఉధృతం మీద పడుతుందోనన్న భయం ఎక్కువవు తోంది. సీనా రేకు, ప్లైవుడ్ చెక్కలతో అందంగా బొమ్మ లంటించిన వందలాది షీల్డులను నా జీవితంలో పుచ్చుకున్నాను. పుచ్చుకుంటూనే ఉన్నాను. వాటినేం చెయ్యాలి? ఎక్కడ ఉంచాలి? ఇచ్చేవారి మర్యాద, ఔదార్యం గొప్పవే. కానీ ఉంచుకోవాల్సిన నా ఇల్లు చిన్నది. ఇది 62 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్పాతం. మా ఇంట్లో షెల్ఫులన్నీ, కిటికీలన్నీ, గోడ లన్నీ, ఖాళీ స్థలమంతా వీటికి చాలవు. నాకప్పుడ ప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యకర్తలు– దూర దృష్టితో ఉపయోగపడే వస్తువులేమన్నా ఇవ్వరాదా? అని. కానీ అందరూ తెందూల్కర్లే. పెద్ద మనసు కలవారే. ఈ మధ్య టోపీలు వచ్చాయి. ఇక శాలువాలు కొల్లలు. ఒకసారి ఒక సంస్థవారు చక్కటి బ్రీఫ్ కేసు ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని వాడతాను. మరొకరు గొడుగు ఇచ్చారు. వర్షం ఛాయలు కనిపించగానే, ‘ఫ్రెండ్స్ క్లబ్బు గొడుగు కారులో పెట్టారా?’ అని గుర్తు చేసుకుంటాను. శాలువాకి బదులు– చక్కగా పార్సిలు చేసి పది నాప్కిన్స్ ఇవ్వరాదా అనుకుంటాను. రోజూ చెయ్యి తుడుచుకుంటూ ఆ సంస్థని జ్ఞాపకం చేసు కోవచ్చు. చక్కటి షేవింగ్ కిట్ ఇవ్వరాదా? రోజూ గెడ్డం చేసుకుంటూ వారిని తలుచుకుంటాం. నాలుగు తువాళ్లివ్వండి. ఒక పడక కుర్చీ ఇవ్వండి. రెండు బెడ్ షీట్లు ఇవ్వండి. రెండు తలగడాలివ్వండి. పది పాకెట్ల సబ్బులివ్వండి. ఆడవాళ్లకి పైట పిన్నులు ఇవ్వండి. జడ కుచ్చులివ్వండి. పోనీ ఇప్పుడు జడలు వేసు కోవడం మానేశారు కనుక– పది నైటీలు ఇవ్వండి. మగాళ్లకు డజను లుంగీలివ్వండి. కందిపప్పు ధరలు మండిపోతు న్నాయి. పది కిలోల కందిపప్పు ఇవ్వండి. 5 కిలోల మినప గుళ్లి వ్వండి. సైకిలు మార్కు ఇంగువ డబ్బాలను ఇవ్వండి. భార్యలు సన్మానం ఎప్పుడా అని ఎదురుచూడకపోతే నన్న డగండి. ఇది నవ్వుతూ అన్నా, నవ్వులాటకి అన్నమాట కాదు. ఎవరినీ చిన్న బుచ్చడం ఎంతమాత్రం కాదు. ఆ మధ్య కువాయిత్‌లో ఒక సీడీ ప్లేయర్ ఇచ్చారు. ఒక సెల్‌ఫోన్ ఇవ్వండి. ఐపాడ్ ఇవ్వండి. సంగీతం కాసెట్లు ఇవ్వండి. పోనీ, కొత్త సినీమా టికెట్లు ఇవ్వండి. దీపా కర్మాకర్‌కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూ కరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. దీపకి ఒక సంవ త్సరానికి సరిపోయే బంగాళాదుంపల్ని సరఫరా చెయ్యమనండి. ఒక లారీతో గోధుమ పిండిని బహూ కరించమనండి. అయ్యా, రొట్టె కొద్దీ పిండిని ఎంపిక చేయాలి. భరించలేనివారికి అక్కరలేని సత్కారం– ఇబ్బంది పెట్టే ఇరకాటం అవుతుంది. ఇది ఇచ్చేవారి పెద్ద మన సుని శంకించడం ఎంతమాత్రం కాదు. పుచ్చుకునే అర్హత ఇచ్చుకునే వితరణకు ఉదాత్తతని ఇస్తుంది. అందుకే బలి చక్రవర్తి వితరణ చరిత్ర అయింది. పురాణమయింది–పుచ్చుకున్నవాడు సాక్షాత్తు దేవుడు కనుక. అది అర్హతకి పట్టాభిషేకం. వితరణకు నివాళి. గొల్లపూడి మారుతీరావు -
వీర దేశభక్తులు
జీవన కాలమ్ ఈ మధ్య దేశభక్తుల జాబితా బొత్తిగా క్రిక్కిరిసి పోయింది. రోజుకో దేశ భక్తుడు బయటపడుతున్నాడు మన దేశంలో. దశా బ్దాలుగా దౌర్జన్యకారులను మన దేశంలోకి పంపుతున్న పాకిస్తాన్ దౌర్జన్యకారుల స్థావరాల మీద ఎట్టకేలకు భారతదేశం పంజా విప్పింది. సర్జికల్ దాడి అన్నారు. అంటే ఎక్కడ నొప్పెడుతుందో అక్కడ దెబ్బ కొట్టడం. పోలీసోడి దెబ్బలాగ. పాకిస్తాన్ ‘కుంయ్యి’మనలేదు. కారణం.. దాడి జరిగిందంటే దౌర్జన్యకారుల స్థావ రాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు. లేదంటే - దాడి దెబ్బ ఏమయినట్టు! లారీలతో శవాలను తీసుకెళ్లడం తెలిసిందని గూఢచారి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా - మన దేశంలో చాలామంది వీర దేశభక్తులు తలలెత్తారు. పాకిస్తాన్ దాడులు జరగ లేదంటోంది. భారతదేశం జరిపాం అంటోంది. నిజంగా దాడులు జరిగాయా? జరిగితే రుజువులు ఏవి? పాకిస్తాన్ మాటా అదే. కానీ నిన్నటిదాకా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న చిదంబరం అనే దేశ భక్తుడు - భారతదేశం జరిపిన దాడుల రుజువుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ప్రకటించినప్పుడు- సగం చచ్చి, మరో గత్యంతరం లేక, ప్రజలు ముఖంమీద పేడ జల్లుతారనే భయంతో - కేవలం నిస్సహాయంగానే ప్రభుత్వ చర్యకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. తమ ఇంట్లో పిల్లి పరిగెత్తితే - మోడీ పంపిన గూఢ చారిగా గొంతు చించుకునే మరో భారతరత్న కేజ్రీ వాల్ అంతే నిస్సహాయంగా ప్రభుత్వాన్ని సమర్థిం చారు. ఇప్పుడు కేజ్రీవాల్‌గారు ‘జూలియస్ సీజర్’లో ఆంటోనీ ఉపన్యాసాన్ని తలపించే ప్రసంగాన్ని పత్రికా సమావేశంలో చేశారు. ‘మేం బేషరతుగా మోదీగారిని సమర్థిస్తున్నాం. వారికి నా జోహార్. కానీ పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పడానికయినా, ఆ దాడుల సాక్ష్యాలను బయ టపెట్టండి. నా కోసం కాదు. ఈ దేశం గొప్పతనాన్ని నిరూపించడానికి. మరొక్కసారి మోదీకి నా జోహార్’. పాపం, సంజయ్ నిరుపమ్ అనే దేశ భక్తుడికి ఇవన్నీ తెలియవు. ఆయన నిన్నకాక మొన్న బొడ్డూడని వీర దేశభక్తుడు. వారు ‘ఈ దాడులు ఉత్త హుళక్కి’ అన్నారు. యువరాజు ఈ ప్రభుత్వం సైనికుల రక్తంతో వ్యాపారం చేస్తున్నదన్నారు. ఏదయినా చిన్న సాకు దొరికితే తమ అక్కసు ప్రకటించాలనుకున్న పార్టీలు గళాలు విప్పాయి. సీతారాం ఏచూరి నోరిప్పారు. శరద్ పవార్ నోరిప్పారు. యుద్ధం మాట దేవుడెరుగు- ఇందుమూలంగా రాబోయే ఎన్నికల్లో పాలకవర్గానికి కిరీటం దక్కితే! ప్రపంచ దేశాలన్నీ ఏకమయి భారతదేశానికి మద్దతు పలుకుతుండగా, ఏ ఒక్క దేశమూ - ‘రుజు వులు చూపండి’ అని అడగకపోగా, సార్క్ దేశాల పెద్దలు బేషరతుగా దేశానికి దీటుగా నిలబడగా - వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ గొప్ప పార్టీ నాయకులు - వారం తిరక్కుండానే వీధిన పడటం - వారి ‘అసలు రంగు’కి నిదర్శనం. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాలు ఎదు ర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాజ్‌పేయీ - సైన్యానికి పచ్చజెండా ఊపుతూ ఒకేమాట చెప్పారట. ‘ఏం చేసినా దేశ సరిహద్దు రేఖని దాటవద్ద’ని. మొన్న భారత సైన్యాలు ఒకప్పటి భారత భూభాగం - ఇప్పటికీ వివాదంలో ఉన్న ‘భారత’ భూభాగంలోకే జొరబడి - కేవలం దౌర్జన్యకారుల స్థావరాలను దెబ్బ తీసి వచ్చాయి. ఇది దౌత్యపరంగా అతి కుశాగ్ర బుద్ధితో, అతి సునిశితమైన ఆలోచనా సరళితో తీసు కున్న నిర్ణయమని మనం గర్వపడాలి. ఈ మధ్య నేను నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ రాసిన నా కాలమ్ చదివి ‘ఇంకాస్త ముందుకు పోయి మీరు మోదీని రాముడు, శ్రీకృష్ణుడు అంటారేమో!’ అని ఈమెయిల్ పంపారు. ‘అయ్యా, నాకంత అభి రుచి దారిద్య్రం లేదు. కాని నేను మోదీ అభిమానిని. అయితే నేను బీజేపీ కార్యకర్తను కాను. తమ హయాంలో 5 లక్షల 57వేల కోట్లు దోచుకున్న (నా లెక్కలు తప్పయితే క్షమించండి) దేశంలో కనీసం 200 పైచి లుకు సంస్థలకు గత 70 సంవత్సరాలలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు పెట్టి మనల్ని తరింపజేసిన, ఇంకా కొన్నాళ్లుంటే - రాహుల్ గాంధీ, ప్రియాంక, వాద్రా సంస్థలతో మన జన్మల్ని తరింప జేయగలిగిన ఇటలీ భక్తుల (ఉదా: ఖత్రోచీ, ఎంబ్రి యార్ కుంభకోణాలు) అభిమానిని కాను. మరొక్క మాట. పాకిస్తాన్‌ని రెండుసార్లు ఎదిరించి బుద్ధి చెప్పింది బీజేపీ హయాంలోనే అని మరచి పోకూడదు. పాపం, కాంగ్రెసుకి అంత టైమెక్కడిది - తమ ఇల్లు చక్కపెట్టుకునే వ్యవధే చాలకపోయె! దేశభద్రత.. పత్రికల్లో ప్రకటించే కరపత్రం కాదు! కాదు! కాదు! దేశభక్తి ఫేస్‌పౌడరు కాదు-అవసరం తీరగానే చెరిపేసుకోడానికి. ‘చలికోటు’ కాదు- యుద్ధాలు వచ్చినప్పుడు తొడుక్కుని ఆపై విప్పి పారే యడానికి. పసివాడు ముఖంమీద పెట్టుకునే ‘పులి బొమ్మ’ కాదు. ఆటల్లో చిరిగిపోయేదాకా కలసి రావడానికి. గొల్లపూడి మారుతీరావు -
మార్గదర్శి-మణిపూస
జీవన కాలమ్ సరిగ్గా 19 సంవత్సరాల కిం దట దత్తా సోదరులు-అంటే పెద్దాయన శివ శక్తిదత్తా, విజ యేంద్ర ప్రసాద్ దర్శకత్వం వ హించిన చిత్రం ‘అర్థాంగి’లో మంచి పాత్రలో నటించాను. ఆ చిత్రానికి కో డెరైక్టర్ రాజ మౌళి. వారిద్దరి మధ్య ఆయన కాశీవిశ్వేశ్వరరావు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. చివరి రోజుల్లో ఒక రోజంతా మా ఇంట్లో ఉండినా ‘సాయంకాలమైంది’ నవల చదివారు. శివశక్తిదత్తా గొప్ప కవి. విజయేంద్ర ప్రసాద్ మంచి కథా రచయిత. ఇది నేపథ్యం. ఇప్పటి ‘భజరంగీ భాయిజాన్’ చిత్రం ఒక మణి పూస- ఏ విధంగా చూసినా. హీరోని ధీరోదాత్తుడిగా, సర్వ శక్తిసంపన్నుడిగా చూసి చూసి విసిగిపోయిన ప్రేక్ష కులకి - ఎక్కువ చేతకాని, చాలా విషయాలు తెలియని, అబద్ధం చెప్పకూడదని నేర్చుకున్న ఓ నేలబారు పాత్ర గొప్ప రిలీఫ్. అతను ఆంజనేయభక్తుడు. రామభక్తుడు కావచ్చు కదా! సాయిభక్తుడు కావచ్చు కదా! ముందు సీనుల్లో తాలింఖానాలో కుస్తీలు చూసి మురిసిపోయే (పాల్గొనే కాదు) హీరోని పరిచయం చేశారు. ఓ మూగ పిల్ల కనబడింది. విచిత్రంగా అతనికి ముడిపడింది. వదిలించుకోవాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. ఆమెను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి. ఎలాగో తెలియని అమాయకుడు. కానీ రాజీలేని నిజాయితీపరుడు. ఆ పిల్ల తల్లిదండ్రులు పాకిస్తాన్లో ఉన్నారని తెలిసింది. పాకి స్తాన్ ఎలా వెళ్లాలో తెలీదు. డబ్బు పుచ్చుకున్న ఏజెంటు ఆ పిల్లని వ్యభిచార గృహానికి అమ్మి చేతులు కడుక్కో వాలనుకున్నాడు. ఒక్కసారి- ఒకే ఒక్కసారి (కనీసం మొదటిభాగంలో) హీరో చెయ్యి చేసుకున్నాడు. తాలిం ఖానా అనుభవాన్ని, ఆంజనేయభక్తుడిని ఇక్కడ వాడా రు రచయిత. తన శక్తి చూపడానికి కాదు. కేవలం తన కోపాన్ని ప్రదర్శించడానికి. హీరో మాటలు రాని పసి పిల్లని పక్క దేశానికి తీసుకువెళ్లడానికి ప్రేక్షకులంతా ఒకటై నిలిస్తే అతని అశక్తతలోంచి క్షణక్షణం బయటపడు తున్న కొద్దీ ఆనందంతో తన్మయులయ్యారు. ఒక గొప్ప ఆదర్శం అసమర్థతని జయించడం ప్రేక్షకులకి ఆకర్షణ, ఈ చిత్రం విజయ రహస్యం. క్లైమాక్స్‌లో హీరో గారు ధీరోదాత్తులై దుర్మార్గుల్ని చావగొట్టడం ఫార్ములా. కాని ఇక్కడ పోలీసుల చేతుల్లో హీరో చిత్తుగా దెబ్బలు తిన్నా డు. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన తృప్తి అత నిది. అంటే ప్రేక్షకులది. పాత్రీకరణా, నటుడూ ఏకమై లక్ష్యాన్ని సాధించిన పాత్ర. మూగపిల్ల నిస్సహాయత, అతి పవిత్రంగా, వికసించిన పువ్వులాగా మెరిసిన హర్షా లీ మల్హోత్రా హీరోకి దీటుగా కథని అలంకరించింది. పొరుగు దేశానికి అన్ని రంగాలలోను చుక్కెదురవు తున్నా- పాక్ నాయకులు పదవిలోకి వచ్చాక ప్రజల్ని మెప్పించే నినాదం, పోరాటం - కశ్మీర్. ఇది అక్కడి రాజ కీయ నాయకుల వైఫల్యాలను కప్పిపుచ్చే మలామా. కాని ప్రజల స్థాయిలో, వారి మనస్సులలో, వారి జీవన విధానంలో - మానవీయ విలువల పతనం లేదని నిరూ పించిన చక్కటి కథ ఇది. ఈ కారణానికే ఈ కథ రెండు దేశాలనూ ఆకర్షించింది. దౌత్యవర్గాలు, రాజకీయ నాయకులు, తుపాకులు, హింసాకాండ, మతం సాధించలేని అతి పెద్ద సమస్యని కేవలం మానవత్వం జయించగలదని, జయించి చూపించిన చిత్రం ‘భజరంగీ భాయిజాన్’. హ్యాట్సాఫ్ టు విజయేంద్రప్రసాద్. స్క్రీన్‌ప్లే, దర్శకుడు కబీర్ ఖాన్. మతాలకు అతీతంగా మానవత్వ విలువలకు అద్దం పట్టే ఈ చిత్రంలో మరిచిపోవాలన్నా మరిచి పోలేని గొప్ప ఆకర్షణ - హనుమంతుడి భక్తుడిగా చేసిన హీరో ముస్లిం. ముస్లిం అమ్మాయిగా చేసిన నటి- హిందువు. ఖీజిజీట జీట ్చ జట్ఛ్చ్ట ట్ట్చ్ట్ఛఝ్ఛ్ట. ఈ కథకి కొసమెరుపు- ఇలాంటి పరిస్థితులలోనే 15 సంవత్సరాల కిందట పాకిస్తాన్లో ఉండి పోయిన మరో మూగ, చెవిటి పిల్ల కథ బయటికి రావడం. ఆ అమ్మాయి రెండు దశాబ్దాలుగా మాతృదేశాన్ని గురించి కలలు కంటూ మరో భజరంగీ కోసం ఎదురుచూడడం. అయితే ఈసారి భజరంగీ అక్కరలేదు. ప్రభుత్వమే మేలుకుంది. విదేశాంగ మంత్రి స్పందించారు. మంచి సినీమా మార్గదర్శి, సూచన. ఇందులో వినో దం ఉంది. హాస్యం ఉంది. తగు మాత్రపు రొమాన్స్ ఉం ది. ఫైట్స్ ఉన్నాయి. గేలరీస్ని లొంగదీసుకోవాలన్న ప్రలోభం లేదు. అన్నిటికన్నా ముఖ్యం- ఒక గొప్ప దృశ్య ప్రక్రియ చేయవలసిన, చేయగలిగిన గొప్ప సామా జిక స్పృహ ఉంది. సినీమా సుమతీ శతకం కానక్కర లేదు. కేవలం ఊసుపోయే వినోదమూ కానక్కరలేదు. ప్రయోజనం ప్రక్రియకి రేంజ్నిస్తుంది. పెద్దరికాన్ని ఇ స్తుంది. బాధ్యతని ఇస్తుంది. జాతికి ఉపకారం చేస్తుంది. ఇంత గొప్ప ప్రయోజనాన్ని సినీమా మరిచిపోయి ఎన్నాళ్లయింది!! - గొల్లపూడి మారుతీరావు -
ఇద్దరు దేవకన్యలు
జీవన కాలమ్ దేవకన్యలు ఎలా ఉంటారు? తెల్లటి చీరల్లో- ‘జగదేకవీరు డు-అతిలోకసుందరి’లో శ్రీదే విలాగ తెల్లని రెక్కలు టపటప లాడించుకుంటూ ఆకాశంలో ఎగురుతారా? కాదు బాబూ, కాదు. ఆలోచనలు ఆకాశంలో విహరిస్తుండగా - శరీరం హె చ్చరికలని బేఖాతరు చేస్తూ- కలలని నిజం చేసే అరుదైన అద్భుతాలుగా దర్శనమి స్తారు. ఈ కాలమ్‌లో ఇద్దరిని వారి ఫొటోలతో సహా పరి చయం చేస్తాను. మొదట ఒక నమూనా దేవకన్య. ఆమె రెండో ఏట టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. నాలుగో ఏట టెన్నిస్ ఆడిం ది. వాళ్ల నాన్నకి సరైన డబ్బు లేక భార్యని రష్యాలో వది లేసి, కేవలం ఏడేళ్ల అమ్మాయిని తీసుకుని అమెరికా వచ్చాడు. 11 ఏళ్ల తరువాత ఆమె ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచి ప్రపంచాన్ని తన విజయంతో, తన అం దంతో మిరిమిట్లు గొలిపింది. ఆ అమ్మాయి పేరు మారి యా షరపోవా. ఇది నమూనా మాత్రం. మరొక అమ్మాయి జెక్ దేశస్తురాలు- మార్టినా హిం గిస్. ఈ అమ్మాయి రెండేళ్లప్పుడే టెన్నిస్ రాకెట్‌ని పట్టు కుంది. నాలుగేళ్లప్పుడు టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొం ది. 1994లో 12 సంవత్సరాల హింగిస్ ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ చాంపియన్‌గా చరిత్రను సృష్టించింది. విశేష మేమిటంటే ఈమె రికార్డు సృష్టించాలని తల్లి కల. అం దుకనే ఆనాటి గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్ర తిలోవా పేరు కూతురికి పెట్టుకుంది. కొందరి చరిత్రలు తల్లి కడుపులోంచే ప్రారంభమవుతాయి. ఇది మరో నమూనా. 1996. లండన్‌లో ఒలింపిక్ క్రీడలు. జమ్నాస్టిక్స్ విన్యాసాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఆ బహు మతిని దక్కించుకునే జర్మనీ, రుమేనియాలు ఆనాడు వెనుకబడ్డాయి. అమెరికా క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్వాల్ట్స్ మీంచి దూకింది. కాలి మణవ దగ్గర బెణికింది. 32 వేల మంది ప్రేక్షకులకీ, ప్రపంచానికీ అర్థమవుతోంది. కోచ్ కెరోల్యీ కూడా గుర్తు పట్టాడు. ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి. మరో రౌండుకు ఆమె కాలి ఎముక టప్పున విరిగింది. 32 వేల మంది గుర్తించారు. విరిగిన కాలితో మరో రౌండ్ చేయగలిగితే ఆమెదే స్వర్ణ పతకం. కెరో ల్యీకి గుండె గొంతులో కదిలింది. కెర్రీ నొప్పిని బిగబట్టి బనీనుతో కంట తడిని తుడుచుకుంది. ఆఖరి విన్యాసం అయ్యాక ఒక్క క్షణం నిలవాలి. ఈసారి గాలిలోకి లేచి దూకింది. మరిన్ని ఎముకలు విరిగాయి. నిలబడగల దా? ప్రపంచమంతా లేచి నిలబడింది. ఒక్క క్షణం నిలి చి కుప్పలా కూలిపోయింది. చప్పట్లు మిన్నుముట్టాయి. కెరోల్యీ వచ్చి ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ‘‘నేను బహుమతిని అందుకోవచ్చా?’’ అంది. ‘‘ప్రపంచమం తా ఎదురయి నిలిచినా నేను నిన్ను తీసుకువెళ్తాను ’’ అన్నాడు కెరోల్యీ. ఆమెను ఎత్తుకునే విజేతలు నిలిచే స్థలంలో నిలిచి ఆమె స్వయంగా స్వర్ణపతకాన్ని అందు కునేటట్టు చేశాడు కెరోల్యీ. ‘‘భగవంతుడు అందమైన రబ్బరు బొమ్మల్ని తయారు చేసి అందులో ఎముకలని ఉంచడం మరచిపోయాడు’’ అన్నాడు ఓ పత్రికా రచ యిత. తరువాత కెర్రీ స్కూలు టీచరుగా పని చేసి టక్సన్ (అరిజోనా)లో రాబర్ట్ ఫిషర్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకుంది. ఒక కొడుకు పుట్టాడు (ఈ కథని ఈ కాల మ్లో మూడోసారి రాస్తున్నాను). 2015. న్యూయార్క్‌లో స్వీట్‌హోం హైస్కూలులో చదువుతున్న 15 ఏళ్ల అమ్మాయి. పేరు శామ్ పీటర్ మాన్. ఆమెకి న్యూరో కార్డియోజనిక్ వ్యాధి. ఎక్కువగా పరిగెడితే ఈ జబ్బువల్ల నరాల వ్యవస్థ అదుపు తప్పు తుంది. ఊపిరి అందదు. ప్రాణం పోవచ్చు. 1500 మీట ర్ల పరుగు పందెంలో ఆ అమ్మాయి రోగం తెలిసీ పాలు పంచుకుంది. ఆమె స్కూలులో 6వ స్థానంలో ఉంది. ఇప్పుడు తన స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి పరుగు. ఆమె ఆరోగ్యం గురించి తెలిసిన తండ్రి డేల్ పీటర్ మ్యాన్ గమ్యం దగ్గర నిలబడతాడు. ఆమె పరుగు అయ్యాక కూలిపోతుంది. అప్పుడు అతని పరుగు ప్రారంభమవుతుంది. ఈసారి మొదటి స్థానంలోకి వచ్చింది. ఊపిరి అందడం లేదు. తండ్రి చేతులు చాచా డు. అతని చేతుల్లోకి వాలిపోయింది. గడ్డి మీద పడు కోబెట్టి శ్వాస అందుకునేటట్టు చేసి మంచినీరిచ్చాడు. ‘‘నాకు మెడల్ వస్తుందా?’’ అని అడిగింది శామ్. తండ్రి కన్నీళ్ల పర్యంతమై కూతుర్ని పొదివి పట్టుకుని భుజం మీద ఎత్తుకున్నాడు (ఎంత ప్రయత్నించినా ఇంతకంటే మంచి ఫొటో సంపాదించలేకపోయినందుకు క్షమిం చాలి). అనూహ్యమైన లక్ష్యశుద్ధి, అజేయమైన సంకల్ప బలం ఆయా వ్యక్తులను చరిత్ర సృష్టించేటట్టు చేస్తాయి. అన్నిటికీ మించి- ఆకాశాన్ని కళ్ల ముందు నిలుపుకుని- అనుకున్నది సాధించడం అపూర్వమైన గుండెబలం. ఈ దేవకన్యల సౌందర్యం శరీరానిది కాదు. కొండలని ఢీకొనే వారి వజ్ర సంకల్పానిది. గొల్లపూడి మారుతీరావు. -
‘బుచ్చిబాబు’ చిరంజీవి
- జీవన కాలమ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు మూడు పారాయణ గ్రంథాలు- కృష్ణశాస్త్రిగారి ‘కృష్ణపక్షం’, బుచ్చిబాబుగారి ‘చిరంజీవి’, చెలంగారి ‘మ్యూ జింగ్స్’. నా జీవితంలో అదృష్టం ఏమిటంటే ఆ ముగ్గురితోనూ అతి సన్నిహితమైన పరిచయాలు ఏర్పడటం. 1960లో ఆంధ్రప్రభలో చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చెలంగారు ఉన్న తిరు వణ్ణామలై ఆశ్రమానికి వెళ్లేవాడిని. మరో మూడేళ్లకి ఆలిండియా రేడియోలో కృష్ణశాస్త్రిగారు, బుచ్చి బాబుగారితో కలసి పనిచేశాను. నేనూ, శంకరమంచి సత్యం, ఉషశ్రీ యువతరం రచయితలం. పెద్దలతో కలసి పనిచేయడం పండగ. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ స్ఫూర్తి నూటికి నూరుపాళ్లూ నా మొదటి నవల ‘చీకటిలో చీలికలు’ మీద కనిపిస్తుంది. పుస్తకం పేజీలు చిరిగిపోయేదాకా చదివి ఉంటాను. బుచ్చిబాబుగారు మితభాషి, మా రేడియో కేంద్రానికి ఎదురుగా అసెంబ్లీ క్యాంటీన్లో భాస్కరభట్ల కృష్ణారావుగారి వీడ్కోలు సభలో మాట్లాడాను. బయటికి వస్తూనే భుజం మీద చెయ్యి వేసి ‘బాగా మాట్లాడావు అబ్బాయ్!’’ అన్నారు బుచ్చిబాబు. నన్ను ‘అబ్బాయ్’ అనే వారు. అదొక పెద్ద కితాబు. ఏదైనా ప్రోగ్రాం బాగా చేస్తే మర్నాడు ముఖం చూసి హార్దికంగా నవ్వేవారు. అదే అభినందన, మాటల్లేవు. ఒక సందర్భం- నాకు జీవితంలో పాఠం నేర్పిన సందర్భం. రోజూ రేడియోలో ముందురోజు కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక మీటింగు ఉం టుంది. ముందురోజు ప్రసారమయిన బుచ్చిబాబుగారి కార్యక్రమాన్ని ఒక ఉత్త రదేశపు ఆఫీసరుగారు చీల్చిచెండాడాడు. బుచ్చిబాబుగారు సీనియర్ ఆఫీసరు. కాగా గొప్ప రచయిత. మేమందరం ఇబ్బందిగా చూస్తున్నాం. ఆ ఆఫీసరు విమర్శ ముగిశాక అందరం బుచ్చిబాబుగారి సమాధానానికి ఎదురుచూస్తున్నాం. బుచ్చిబాబుగారికి ఉబ్బసం. ఊపిరి కూడతీసుకుని నవ్వి, విమర్శించిన ఆఫీసరు వేపు తిరిగి ‘నా తప్పులు సరిదిద్దుకుంటాను. థాంక్యూ’ అన్నారు. అంతే. చర్చ ముగిసింది. ‘సమాధానం చెప్పరేం?’ అన్నా ను బయటకు వచ్చాక. నవ్వి, ‘ఎందుకూ! మంచి ఉంటే నేర్చుకుందాం. చెడు అయితే మరిచిపోదాం’ అన్నారు. ‘మరి ఆ ఆఫీసరుకి తెలిసేదెలా?’. నవ్వి ‘అది నా పని కాదు’ అన్నారు. అక్కరలేని గుంజాటనకి ‘మౌనం’ చక్కని సమాధానమని నేర్పిన అద్భుతమైన సందర్భమది. ఇప్పటికీ ఆ హితవుని పాటించి నేను మనశ్శాంతిని సమకూర్చుకుంటూంటాను. బి.ఎన్.రెడ్డిగారి ‘మల్లీశ్వరి’కి బుచ్చిబాబుగారు రాసిన ఒక రేడియో నాటిక మాతృక అని నిరూపణ అయినా కాలుదువ్వని సౌమ్యుడాయన. ప్రశాంతమయిన ఆలోచన, జీవనం సాగించిన వ్యక్తి. ఆయన వాటర్ కలర్ చిత్రాలు అంతే సరళంగా, అంతే పవిత్రంగా, అంతే గజిబిజి లేకుండా కనిపిస్తాయి. నాకు పాట్నా బదిలీ అయిందని కంట తడిపెట్టుకున్నప్పుడు బుచ్చి బాబుగారు నన్ను అసిస్టెంట్ స్టేషన్ డెరైక్టర్ గదికి తీసుకువెళ్లారు. అప్పుడు ధర్మజ్ఞాని అనే ఆయన మిత్రులు ఆఫీసరు. ఆ కుర్చీలో కూర్చుని నన్ను ఓదార్చి ఉద్యోగం మానవద్దని హితవు చెప్పారు. నేను నటుడినయేదాకా- 20 సంవత్సరాలు ఆ హితవుని పాటించాను. తీరా నాకు విజయవాడ బదిలీ అయాక, ఇంటికి వెళ్తూ నన్ను పిలిచి భుజం మీద చెయ్యి వేసి, ‘రాత్రి భోజనానికి రా అబ్బాయ్’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆనాడు మాతో భోజనం చేసిన మరో గొప్ప రచయిత మొక్క పాటి నరసింహశాస్త్రిగారు. వారి శ్రీమతికి (సుబ్బలక్ష్మి గారి వయసు ఇప్పుడు 90) నేనంటే అమితమైన అభిమానం. బెంగళూరులో తమ్ముడి కొడుకు సుబ్బారావుగారి దగ్గర ఉంటున్నారు. రెండేళ్ల కిందట ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమా నికి బుచ్చిబాబుగారిదీ, ఆమెదీ కథలు రికార్డు చేశాను. ‘మరో రెండేళ్లు బత కాలని ఉంది మారుతీరావ్. బుచ్చిబాబుగారి శతజయంతి చేసి వెళ్లిపోతాను’ అన్నారు. 14న శతజయంతి ఉత్సవం జరిపిస్తున్నారు. బుచ్చిబాబు ఇంగ్లిష్ ఎమ్మే చదివారు. ఆయన షేక్స్పియర్ మీద రాసిన వ్యాస సంపుటికి ఆయన పోయాక అకాడమీ బహుమతి వచ్చింది. అనా రోగ్యం కారణంగా సర్వీసులో ఉండగానే (51) వెళ్లిపోయారు. కథా సాహిత్యంలో బుచ్చిబాబుగారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ ఒక కళాఖండం. బుచ్చిబాబుగారి జీవితమే ఒక కళాఖండం. ఏమీ అరమరకలు లేని, గజిబిజిలేని, సరళమైన జీవితాన్ని గడిపిన గొప్ప ఇంటలెక్చువల్ బుచ్చి బాబు. ఆయన మంచి కవి. ఆ సాక్ష్యాలు ఇప్పటికీ శివరాజు సుబ్బలక్ష్మిగారి దగ్గర ఉన్నాయి. - గొల్లపూడి మారుతీరావు (జూన్ 14న బుచ్చిబాబు శతజయంతి) -
‘కారే రాజులు...’
జీవన కాలమ్ ప్రజాధనాన్నీ, కోట్లాది ప్రజల విశ్వాసాన్నీ కొల్లగొట్టిన చర్లపల్లి జైల్లో 4148 నంబరు ఖైదీ కథ ఈ దేశపు విలువలు ఎంత పతనమయ్యాయో చెప్పక చెప్తుంది. ప్రజల విశ్వాసాన్ని డబ్బు చేసుకున్న వ్యాపారి, పదవిని డబ్బు చేసుకుంటున్న చాలా మంది వ్యాపారుల చరిత్రలకి అద్దం పడుతున్నారు. ‘సత్యం’పేరిట కార్పొరేట్ రంగంలో జరిగిన ‘అసత్యం’ ఈ దేశంలో, బహుశా ప్రపం చంలోనే చరిత్ర. అవినీతిలో నీతి ఏమి టంటే ‘నేను పులి మీద స్వారీ చేయాలని ప్రయత్నించాను. అది నన్ను కబళించ కుం డా ఎలా దిగాలో తెలియక’ అని ఒప్పుకుంటూ రామలింగరాజుగారు బయట పడ్డారు. 7,123 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఏడేళ్ల జైలుశిక్షను సంపాదించుకున్నారు. సాలీనా 65 దేశాలలో రెండున్నర బిలియన్ డాలర్ల వ్యాపారం చేసి 53 వేల సిబ్బందితో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ‘సత్యం’ సంస్థ అధిపతి, ఒకనాడు గర్వంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సరసన కూర్చుని తెలుగువారికి గర్వకారణ మైన రామలింగరాజు ఇవాళ తొమ్మిది మంది అనుయాయులతో చర్లపల్లి జైలుకి తరలిపోయారు. ఆయన అస్తిత్వం ఇప్పుడు ఖైదీ నంబర్ 4148. ‘కారే రాజులు..’ అన్నమాటలు అసురపతి బలి చక్రవర్తివి. అసుర వంశంలో దైవత్వ లక్షణాలున్న ఒక మహానుభావుడి ఉవాచ. 58 సంవత్సరాల కిందట, నేను ఆనర్స్ చదువుతుండగా చూసిన ఒక గొప్ప సినిమా ఇంకా మరచిపోలేదు. రాడ్ స్టీగర్ నటించిన ‘ఎక్రా స్ ది బ్రిడ్జ్’. ఓ గొప్ప వ్యాపారి అదుపులో పెట్టలేని వ్యాపారం చేశాడు. సినిమాలో అతని పరిచయం వంద రెట్లు పెద్ద ఫొటో ముందు పిపీలికం లాగా కనిపించే వ్యాపారి. పులిని దిగ లేక దేశం నుంచి పరారై మరో వ్యక్తిగా మారిపోయాడు, రైలు ప్రయాణంలో. ఆ ‘మరో’ వ్యక్తి తనతో ఓ కుక్కని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడది ఈ కొత్త యజమానికి దక్కింది. ఓ విశ్వాస ఘాతకుడికి, విశ్వాసానికి మారుపేరయిన కుక్క స్నేహితుడు. ఇద్దరూ దేశం ఎల్లలు దాటారు. జీవితంలో పులిస్తరాకులు తినే స్థితికి వచ్చారు. ఈ దేశం అధికా రులు ఇతన్ని తమ దేశంలోకి రప్పిస్తే కాని అరెస్టు చేయలేరు. కుక్కని దొంగతనం చేసి, దేశపు ఎల్లలకి ఇటుపక్క కట్టేశారు. కోట్ల దోపిడీకి దేశాన్ని కొల్లగొట్టిన వ్యాపారి ఆ కుక్క కోసం ఎల్లలు దాటాడు. అధికారులు వెంటదరిమారు. కుక్కా, వ్యాపారీ పరాయి దేశం వైపు పరుగు తీశారు. అధికారులు తుపాకీ కాల్చారు. దేశపు సరిహద్దు గీత మీద అతనూ, కుక్కా శవాలయి కూలి పోయారు. 58 ఏళ్లు మనసులో నిలిచిన కథ ఇది. ఎక్కిన పులికంటే ఎక్కాలన్న మనస్తత్వం మనిషిని పత నానికి దారి తీయిస్తుంది. 108 సంవత్సరాల కిందట ఒక పార్శీ వ్యాపారి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఉక్కు అవస రమని గుర్తించి, దేశంలో మొదటి ఉక్కు కర్మాగారాన్ని స్థాపించి, దేశానికి ఉపకారం చేసి లాభాన్ని వినియో గించుకున్నాడు. ఆయన పేరు జంషెడ్జీ టాటా. ఆయన పేరిట ఇవాళ ఒక నగరమే ఉంది. ఆయన వారసుడికి స్వతంత్ర భారత ప్రభుత్వం ‘భారతరత్న’ ఇచ్చి సత్క రించింది. ఒక వ్యాపారికి భారతరత్న గౌరవాన్ని ఇవ్వ డం ఒకే ఒక్కసారి. ‘‘ఆలోచన, ఆచరణలో అప్పటి సమాజానికి అనువయిన దారిలో ప్రయాణం చెయ్య డం, అదీ ఒక మార్గదర్శి, ఒక వైతాళికుని దృష్టి. దాన్ని సామాజికమన్నా, భౌతికమన్నా, ఆధ్యాత్మికమన్నా ఆ లక్ష్యాన్ని నిర్దేశించిన ధైర్య సాహసాలున్న వ్యాపారి జంషెడ్జీ టాటా. ఆధునిక భారత నిర్మాణ వ్యవస్థాపకులలో ఒకరుగా ఆ కార ణానికే ఆయనకి మన నివాళులర్పించాలి’’ అన్నారు ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. మరొకాయన తను ప్రారంభించిన వ్యాపారంలో లాభాలను తన సిబ్బందితో పంచుకున్నారు. ఆయన పేరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. పై రెండు ఉదాహరణల కూ బంధుత్వం ఉంది. నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఒకప్పుడు జేఆర్డీ టాటా కం పెనీలో పనిచేశారు. సత్సంప్రదాయం వారసత్వం. వ్యాపారం పులి మీద స్వారీ కాదు. అసుర వంశంలో పుట్టిన ఒక వ్యక్తి మహనీయత అతన్ని చిరస్మరణీయు ణ్ణి చేసింది. ఒక పార్శీ వ్యాపారి దార్శనికత అతన్ని భారతరత్నను చేసింది. ‘సత్యం’ను తాకట్టు పెట్టని ‘అసత్యం’ కథ బలి చక్రవర్తిది పురాణం. ‘సత్యం’ను తాకట్టు పెట్టిన ‘సత్యం’ కథ ఈనాటి వాస్తవం. ప్రజాధనాన్నీ, కోట్లాది ప్రజల విశ్వాసాన్నీ కొల్ల గొట్టిన చర్లపల్లి జైల్లో 4148 నంబరు ఖైదీ కథ ఈ దేశపు విలువలు ఎంత పతనమయ్యాయో చెప్పక చెప్తుంది. ప్రజల విశ్వాసాన్ని డబ్బు చేసుకున్న వ్యాపారి, పదవిని డబ్బు చేసుకుంటున్న చాలా మంది వ్యాపారుల చరిత్ర లకి అద్దం పడుతున్నారు. ప్రస్తుతం చాలామంది నేతల అడ్రసులూ చర్లపల్లి జైలుకి బదలీ కావడాన్ని మనం వింటున్నాం. ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే వారేరీ...!!!’ అన్న నీతి ఒంట బట్టడానికి కూడా సంస్కారం కావాలి. ప్రహ్లాదుడి జీన్స్ బలి చక్రవర్తిలో ఉన్నట్టే, జంషెడ్జీ జీన్స్ జేఆర్డీ టాటాలోనూ ఉన్నాయి. కానీ మనం మహాత్ముడు, లాల్ బహదూర్‌శాస్త్రి, టంగుటూరి జీన్స్‌ని ఎక్కడో తాకట్టు పెట్టేశాం. -
చరిత్ర ఓ శిఖరం
జీవన కాలమ్ నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవన సరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న మనియార్డర్ కథ ముగిసింది. ఈ మధ్య ఇలాగే టెలిగ్రామ్ వారసత్వమూ ముగిసింది. ఎప్పుడో 1880లో దేశంలో లక్షా 55 వేల పోస్టాఫీసులలో ఈ సౌకర్యాన్ని ఆనాటి ప్రభుత్వం ఏర్పరిచింది. కొన్ని చరిత్రలకి కాలదోషం పట్టడం కాలధర్మం. మా అమ్మ చెప్పేది. ఆవిడకి పన్నెండో యేట పెళ్లయింది. భర్త దగ్గరకి- అంటే విజయనగరం నుంచి విశాఖపట్నం రావాలి. ఈవిడ పెద్దమ్మాయి. అత్తారింటికి వెళ్లనని ఏడ్చేదట. మా తాతగారు బుజ్జగించి ఓ మిఠాయి పొట్లాం కొనిచ్చి, విజయనగరం రైల్వేస్టేషన్ దాకా ఒంటెద్దు బండి కట్టించి పంపేవారట. విశాఖపట్నంలో విప్పర్తివారి వీధిలో కాపురం. ఆ ఇంట్లోనే మరో కుటుంబం ఉండేది- శ్రీశ్రీ తల్లిదండ్రులు. ఇప్పుడు ఒంటెద్దు బండి దాదాపు చరిత్ర. నాకు మొదటి కథకి 5 రూపాయలు మనియార్డరు రావడం గుర్తుంది. రెండు కారణాలకి అది పెద్ద జ్ఞాపకం. మొదటి సంపాదన. కథకి రాబడి. ప్రొద్దుటూరులో జూటూరు రమణయ్య గారనే వదాన్యులు, ఆయన నా నాటిక ఏదో చూశారు. ముచ్చటపడి - ఆ నాటికని మెచ్చుకుంటూ నాకు ‘వరుమానంగా’ 15 రూపాయలు మనియార్డరు పంపారు. ఒక ప్రశంసకి మనియార్డరు ఒక అభిమాని పంపడం అదే మొదటిసారి. ఆఖరిసారీను. ‘మనిషికో చరిత్ర’లో నా పేరు పంచముఖాగ్ని హోత్రావధాని. పోచికోలు కబుర్లు చెబుతూ కాలం వెళ్లబుచ్చే తెలివైన సోమరి. భార్య వెంకటలక్ష్మికి మని యార్డరు వస్తుంది. పోస్ట్‌మ్యాన్‌ని నిలదీస్తాడు. ‘వెంకట లక్ష్మి లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. అడ్రసు తెలీదు. ఏం చేస్తావ్?’ ‘డబ్బు కట్టిన వాళ్లకే పంపించేస్తాం’ ‘మరి వాళ్లు కట్టిన చార్జీలు?’ ‘డిపార్టుమెంటుకి.’ ‘అదెలాగయ్యా? మా డబ్బులు మీ దగ్గర కొంతకాలం మూట కట్టించుకుని మళ్లీ మాకే ఇచ్చెయ్యడానికి మేం చార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో వేస్తే వడ్డీ వస్తుంది కదా! రెండూ గవర్నమెంట్ సంస్థలే కదా? పోస్టల్ డిపార్టుమెంటుకి ఒక రూలు, బ్యాంకులకి ఒక రూలా?’ మన తరంలోనే 7 విషయాలు అంతరించాయట. ఇది ఆలోచించాల్సిన విషయం. 1. పోస్టాఫీసు, ఉత్తరాలు, మనీయార్డర్లు, ట్రంక్‌కాల్స్ అవసరాలు తీరి పోయాయి. 2. చెక్కుబుక్కు. ఈ మధ్య ఏదో కంపెనీ ఇంటర్నెట్లో డబ్బు కడితే 20 రూపాయలు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. 3. పుస్తకం. రచయితగా ఈ ఆలోచన బాధగా ఉన్నా మరో రూపంలో రచన జీవిస్తుంది- రాయడానికి కంప్యూటర్, పంపడానికి ఇంటర్నెట్ కాక కనీసం 200 పైచిలుకు పుస్తకాలను దాచుకోవడానికి ‘ఎమెజాన్’ ఉంది. ఇంకా హార్డ్‌కాపీలు, పెన్‌డ్రైవ్‌లూ- మీ ఇష్టం. 4.అమెరికా గ్రంథాలయాల్లో చాలా చోట్ల ఆడియో పుస్తకాలను చూశాను. తెలుగులో మొదటి ఆడియో నవల - నా ‘పిడికెడు ఆకాశం’ని మిత్రులు పెద్దిరెడ్డి గణేశ్‌గారు ప్రచురించారు. తెలుగు చదవడంరాని ఈనాటి చాలామంది తెలుగువారికి ‘ఆడియో’ పెద్ద వరం. 5. టెలిఫోన్ డిపార్టుమెంట్ అవినీతితో, అహంకారంతో దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవించిన మనకి ఇంటి ‘ల్యాండ్ టెలిఫోన్’ దరిద్రం వదిలి పోయింది. 6. ఈ తరంలోనే విశ్వరూపం దాల్చిన మరో వినోదం- టెలివిజన్. ఇవాళ ప్రతి సెల్‌ఫోనూ ఒక టెలివిజనే. 7. సంగీత వాద్యాలు. ఇవాళ ఏ వాయిద్యాన్నయినా వాయించగల సింథసైజర్స్ వచ్చేశాయి. ఈ మధ్య పేరూరులో ఒక ఊరేగింపులో నాదస్వరం కచ్చేరీ వినిపించింది. డోలు వాయిస్తున్న వాద్యగాడిని మెచ్చుకోవాలని పరుగెత్తాను. సింథసైజర్ ముందు కూర్చుని కళ్లు తిరిగిపోయేలాగ వాయిస్తున్న క్లారినెట్కి సహకార వాద్యాన్ని అందిస్తున్నాడు. కోల్పోయే ముఖ్యమైన విషయం- మన ఏకాం తం. ఒక్క ఆధార్ కార్డు చాలు దేశంలో ఎక్కడయినా మన చరిత్రను విప్పడానికి. ఉపగ్రహంతో కనుగొనే సాధనాల ద్వారా విశాఖపట్నంలో మన ఇంటిమీద ఎన్ని పెంకులున్నాయో కెనడాలో కూర్చుని లెక్క పెట్టవచ్చు. నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవనసరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. తాతగారు కన్నుమూయడం కాలధర్మం. కాని మనుమడు ఆయన వారసత్వపు మూలాలను నిక్షిప్తం చేస్తూనే కొత్తపుంతలను తొక్కడ మూ కాలధర్మమే అవుతుంది. లేకపోతే మానవుడు ఇప్పటికీ కొండ గుహల్లోనే జీవిస్తూ ఉండేవాడు. (కొసమెరుపు: ఇంతకీ పోస్టల్ డిపార్టుమెంట్ మనియార్డరు విధానాన్ని నిలిపి వేయలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ప్రధాన పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ ప్రకటించారు.) -
హనీమూన్ అయిపోయింది
జీవన కాలమ్ భారతీయ జనతా పార్టీ హనీమూన్ గడువు ముగిసింది. హనీమూన్ దశలో చిన్న చిన్న అపశ్రుతులను మోజు భర్తీ చేస్తుంది. కాని ఇప్పటికి జరిగిన సంఘటనలలో పెద్ద పెద్ద కప్పదాట్లున్నాయి. అదుపు తప్పిన ఆత్మవిశ్వాసం ఉంది. 2014లో భారతీయ జనతా పార్టీ - తద్వారా నరేంద్ర మోదీ విజయానికి అహర్నిశలూ కష్టపడి పనిచేసిన పార్టీ కాంగ్రెస్. పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలనతో విసిగి వేసా రిపోయిన ఓటరు ఈ అవినీతి పాలనకు ఏనాటికయినా ప్ర త్యామ్నాయం కనిపిస్తుందా అని నిస్సహాయంగా ఎదురు చూస్తూ మోదీ నాయక త్వాన్ని నిర్ద్వంద్వంగా ఆహ్వానించారు. ఇందులో ఆ పార్టీకి సంబంధించిన కొన్ని అతివాద విధానాలనీ, మత ఛాందసాన్నీ సమ్మతించనివారూ, మతేతరులూ కూడా ఉన్నారు. నరేంద్ర మోదీని నిండు మనస్సుతో ఆహ్వానిం చిన కోట్లాదిమందిలో నేనూ ఉన్నాను. ఆయన పార్లమెంటు ముందు మోకరిల్లినప్పుడు అందరం పులకించాం. తల్లి దీవెనలందుకున్నప్పుడు ఆర్ద్రతతో కరిగి పోయాం. పదవీ స్వీకారానికి సార్క్‌దేశాల నాయకులను ఆహ్వానించినప్పుడు ఆయన రాజనీతిజ్ఞతకు పొంగిపో యాం. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌గారి తల్లికి ఆత్మీ యంగా పట్టుశాలువా పంపినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వపు విలువలకి పెద్దపీట వేసినం దుకు మోదీని ప్రశంసించాం. ప్రతిపక్షాలు ఆయన ప్రతి ష్టను విదేశాలలో గబ్బు పట్టించిన నేపథ్యంలో ఒక్కొక్క దేశపు ప్రశంసలనీ ఆయన అందుకుంటున్నప్పుడు మోదీ రాజకీయ దౌత్యానికి సంబరపడ్డాం. నవాజ్ షరీఫ్‌తో భుజాలు కలిపినా పాకిస్తాన్ హురియత్ నాయకులను చర్చలకు ఆహ్వానించినప్పుడు - రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని నిలిపి వేసినందుకు గర్వపడ్డాం. పెద్ద మనస్సుకీ, బుద్ధి లేని చర్యకీ చాలా దూరం ఉందని ప్రభుత్వం హెచ్చరిం చడాన్ని గర్వంగా ఆహ్వానించాం. కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసే శక్తులు కొన్ని పార్టీ వర్గాల్లో మేల్కొన్నాయి. ఒకాయన నాథూ రాం గాడ్సేకి దేవాలయం కడతానన్నారు. ఒకానొక మంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి నిండు సభలో ‘మీకు రాం జాదోం (రామ సేవకులు) కావాలా? హరాం జాదోం కావాలా?’ అని బల్లగుద్దినప్పుడు దేశం తెల్లబోయింది. మరో మంత్రి గిరిరాజ్ సింగుగారు బరితెగించి ‘రాజీవ్ గాంధీ ఓ తెల్ల అమ్మాయిని కాక ఏ నైజీరియా అమ్మా యినో చేసుకుంటే ఆమెని పార్టీ నాయకురాలిని చేసే వారా?’ అన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు మోహన్ భగ వత్గారు మదర్ థెరిస్సా లక్ష్యం మత మార్పిడి అన్నా రు. సాక్షి మహరాజ్ అనే పార్లమెంటు సభ్యులు ప్రతీ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్ తొగాడియా గారు ఆ ఆలోచనని వెంటనే సమర్థించారు. గోవా ముఖ్య మంత్రిగారు నర్సులు ఎండల్లో సమ్మె చేస్తే కమిలి పోతారన్నారు. రాంప్రసాద్వర్మ అనే మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు పొగాకుకీ, కేన్సర్‌కీ సంబంధం లేదన్నారు. ఈలోగా కశ్మీర్లో పదవి మాత్రమే లక్ష్యంగా పాకి స్తాన్ని సమర్థించే పీడీపీతో భారతీయ జనతా పార్టీ చెయ్యి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశం షాక్ అయింది. పదవిలోకి రాగానే పీడీపీ నాయకులు ముఖ్య మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఉవాచ: ‘పాకిస్తాన్ ధర్మమా అంటూ, వేర్పాటువాదుల సహకారంతో కశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి’. దేశం ఆగ్రహంతో విలవిలలాడింది. ఈలోగా నాలుగేళ్లుగా జైలులో ఉన్న కశ్మీర్ వేర్పాటు వాది, ఉద్యమాలలో 112 మంది మారణహోమానికి కారణమైన పాకిస్తాన్ అనుయాయుడు మస్రత్ ఆల మ్ను ముఫ్తీగారి ప్రభుత్వం విడుదల చేసింది. దేశం తెల్లబోయింది. వేర్పాటువాదులతో చర్చలకు ఆహ్వానించినందుకే అధికార చర్చలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం కశ్మీర్ జాతీయ దినోత్సవానికి హురియత్ నాయకులతో పాటు పాల్గొనడానికి విదేశాంగ ఉపమంత్రిని పంపింది. ముం దు రోజే కశ్మీర్ పొలిమేరల్లో తన కొడుకును దుండగులు చంపగా ఓ తల్లి కొడుకు శవాన్ని పట్టుకుని ‘నా కొడుకు మాటేమిటి? మోదీ ఏం సమాధానం చెబుతారు?’ అని ఆక్రోశించింది. పదవిలో ఉండగా సంయమనాన్ని పాటిస్తూ, అందరినీ కలుపుకుని పాలన చేసిన ఆ పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజపేయి భారతరత్నంగా దేశం మన్న నలు పొందడాన్ని ఆ పార్టీయే మరచిపోకూడదు. భారతీయ జనతా పార్టీ హనీమూన్ గడువు ముగి సింది. హనీమూన్ దశలో చిన్న చిన్న అపశ్రుతులను మోజు భర్తీ చేస్తుంది. కాని ఇప్పటికి జరిగిన సంఘట నలలో పెద్ద పెద్ద కప్పదాట్లున్నాయి. అదుపు తప్పిన ఆత్మ విశ్వాసం ఉంది. మించి-చిన్న నిరంకుశ లక్షణాలు ఉన్నాయి. పార్టీ అనుయాయుల విశృంఖలత్వం పట్ల మోదీ మౌనం పరోక్షంగా ఆయన మద్దతుగా దేశం భావి స్తుంది. ఓటరు నిర్వేదం మూట బరువెక్కకుండా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభం కావాలని- కోరి గద్దెనెక్కిం చిన ఓటరు ఆత్రుతగా, కాస్త కలవరంతో ఎదురుచూసే రోజులొచ్చాయి. -
ట్రాజిక్ హీరో
జీవన కాలమ్ ‘ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’ అని ఎ. రాజా నెలల తరబడి గొంతుచించు కున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్నవారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి. రాజకీయ రంగంలో పదవికీ, అధికారానికీ మధ్య చిన్న దు ర్మార్గం ఉంది. పదవిలో పని చేస్తే డబ్బు వర్షం కురుస్తుంది. విచిత్రం, ఏమీ చెయ్యకపోవ డం వల్ల కూడా డబ్బు వర్షం కురుస్తుంది. రెండో పని తన చుట్టూ జరుగుతూంటే కళ్లు మూసుకుని తన నిజాయితీని మాత్రం కాపాడుకున్న ట్రాజిక్ హీరో మన్మోహన్సింగ్. భారత చరిత్రలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు దారి తప్పి రాజకీయ రంగంలోకి వచ్చారు- సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం, మన్మోహన్సింగ్. ఆయన దగ్గర పనిచేసి, ఆయన మీద పుస్తకం రాసిన సంజయ్ బారూ; బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన వినోద్ రాయ్ ఆక్స్‌ఫర్డ్‌లో సింగుగారి దగ్గర చదువుకున్నారు. మొదటి ముగ్గురు నాయకులూ అవినీతితో ప్రమేయం లేకుండా జీవించారు. మన్మోహన్ సింగు గారు తన చుట్టూ అవినీతిని పెరగనిచ్చి- తను మాత్రం కళ్లు మూసుకుని చరిత్రహీనులయ్యారు. మన్మోహన్సింగుగారు మొక్కవోని నిజాయితీ పరు డనే, నిప్పులాంటివాడనే అపప్రథ దేశంలో ఉంది. ఇది ‘అపప్రథ’ అనడానికి కారణం తనచుట్టూ విస్తరించే అవి నీతిని తెలిసి-తాను అందులో భాగస్వామి కాని ఒక్క కారణానికే సంతృప్తి చెందిన ఆత్మవంచన సింగు గారిది. జస్వంత్‌సింగ్ పుస్తకం, సంజయ్బారూ (ది ఆక్సిడెంటల్ ప్రైమినిస్టర్) పుస్తకం, జయంతి నటరాజన్ అక్కసుతో చేసిన ప్రకటనలూ ఈ విషయాన్ని చెప్పక చెప్తాయి. ‘‘ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’’ అని ఏ. రాజా నెలల తరబడి గొంతుచించుకున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్న వారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి. ఎదిరి పక్షం పదవిలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని తవ్వి బయటికి తీస్తూంటే ఈ రొంపిలోంచి తను బయ టపడడానికి బీజేపీ నాయకులను సింగుగారు ప్రతిదినం సంప్రదిస్తున్నట్టు వార్త. ఆయన్ని కోర్టుకు హాజరు కావా లని సమన్సు పంపితే- చచ్చి గింజుకున్నా ఇంటర్వ్యూ ఇవ్వని సోనియా గాంధీగారు మొదటిసారిగా తమ నాయకమ్మన్యుల బృందంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని ఇంటికి నాలుగు వందల గజాలు నడిచి వెళ్లడం సుందర దృశ్యం. ఇదే సోనియాగారు అలనాడు ప్రధాని పీవీ నరసిం హారావుగారిపై లఖూబాయ్ కేసు, సెంట్ కీట్స్ కేసు, జేఎంఎం కేసు, లెబర్హాన్ కమిషన్ విచారణ జరిగిన ప్పుడు ఒక్కసారి కూడా ఆయనను పలకరించలేదు. జేఎంఎం కేసులో ఆయన నిందితుడని కోర్టు తీర్పు ఇచ్చి నప్పుడు - ఇంకా రాజకీయాలు తలకెక్కని మన్మోహన్ సింగు ఒక్కరే పీవీని పరామర్శించడానికి వచ్చారు. నిన్న ఢిల్లీలో ఊరేగిన నాయకమ్మన్యులు ఒక్కరూ రాలేదు. పీవీ కన్నుమూసినప్పుడు వారి భౌతికదేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోకి రానివ్వలేదు. భారతదేశ చరిత్రలో రాజధానిలో కాక వేరే చోట అంత్యక్రియలు జరిగిన ఒకే ఒక్క ప్రధాని పీవీ. మరెందుకు ఇప్పుడు మన్మోహన్సింగుగారి మీద ప్రత్యేక అభిమానం? యూపీఏ గోత్రాలన్నీ ఆయనకి తెలుసు కనుక. ఏనాడయినా వాటిని ఆయన విప్పద లిస్తే అంతకన్న సాధికారకమైన రుజువులు మరెక్కడా దొరకవు కనుక. ఏమాటకామాటే చెప్పుకోవాలి- అలాంటి మనస్తత్వమే మన్మోహన్సింగుగారికి ఉంటే - దేశ చరిత్రలో పీవీగారి హయాంలో లిబర లైజేషన్‌కు చరి త్రను సృష్టించిన ఒక మేధావి- కేవలం ‘మడి’ కట్టుకుని అపకీర్తిని మూటకట్టుకోడు (సంజయ్ బారూ పుస్తకమే ఇందుకు సాక్ష్యం). హత్యానేరానికి జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయ టకు వచ్చిన శిబూ సోరెన్ జైలు నుంచి సరాసరి బొగ్గు మంత్రిగా ఢిల్లీ చేరడం ప్రధాని గారికి తెలియకుండానే జరిగిందా? ఒక రాజా, ఒక కనిమొళి, ఒక సురేశ్ కల్మా డీ, ఒక షీలా దీక్షిత్, ఒక దయానిధి మారన్, ఒక జగ ద్రక్షకన్, ఒక నవీన్ జిందాల్, ఒక శ్రీప్రకాశ్ జైస్వాల్ కథ లని సింగుగారు వినలేదా? సింగుగారు అమెరికాలో ఉండగా అవినీతి నిరోధక ఆర్డినెన్స్ ‘నాన్సెన్స్’ అని పత్రికా సమావేశంలో కాగి తాన్ని ముక్కలు చేసిన రాహుల్ కుర్రచేష్టల్ని పెద్ద వయ స్సుతో భరించి- అపకీర్తిని నిశ్శబ్దంగా మూటకట్టుకుని చరిత్రలో ట్రాజిక్ హీరోగా మిగిలిపోయిన మేధావి, ఇం టలెక్చువల్, పెద్దమనిషి మన్మోహన్సింగు. ఆ కార ణానికే వెన్నెముక లేని ప్రవర్తనకి యూపీఏ అవినీతికి పరోక్షమైన వాటాదారుడు. ‘రాబోయే కాలంలో చరిత్ర నన్ను సానుభూతితో అర్థం చేసుకుంటుంది’ అని వాపోయిన పెద్దమనిషి- తన మంచితనాన్ని, స్వామిభక్తిని, నిర్వేదాన్ని చివరం టా వాడుకొని - ఇప్పటికీ ముఖం తుడుపుకి- రోడ్ల మీద ఊరేగింపు జరిపిన అవినీతిపరుల విన్యాసాలకు బలి అయిన అపర ‘కర్ణుడు’ మన్మోహన్సింగ్. ఈ మధ్య ఓ మిత్రుడు వేరే సందర్భంలో ఈ వాక్యాల్ని ఉటంకించారు: Silence in the face of evil is evil in itself. Not to speak is to speak. And not to act is to act. -
ది లాస్ట్ మొఘల్
జీవన కాలమ్ నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్తత్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్బోయిస్తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. భారతీయ సినీ ప్రపంచంలో మరో రామానాయుడు ఉండరు. ఇది చాలా తేలికగా అని పించే మాటగా చాలామందికి కనిపించవచ్చు కాని- ఆ ప్రత్యే కతని ఒక జీవితకాలం కేవలం పరిశ్రమతో, చిత్తశుద్ధితో నిరూ పించుకున్న వ్యక్తి రామానా యుడుగారు. సినీమా రంగానికి ఏ మాత్రమూ సంబంధం లేని రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో వృత్తుల్ని చేపట్టారు. ఒక పక్క చదువుకొంటూ ఆసుపత్రి కాంపౌండర్‌గా పని చేశారు. రైసు మిల్లు నడిపారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేశారు. చుట్ట, పంచె, లాల్చీతో ఆనాడు మద్రాసుకు కేవలం పొగాకు వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చి, సినీ రంగంలో ముమ్మరాన్ని చూసి- ఓ రోజంతా ఆం ధ్రా క్లబ్బు చెట్టుకింద కూర్చుని ఆ వాతావరణాన్ని పరి కించి, అవగాహన చేసుకుని రంగంలోకి దిగి- సినీరం గంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తయినా మరిచి పోలేని శిఖరాలను అధిరోహించిన వ్యక్తి నాయుడుగారు. చదువుతో సంబంధం లేని ఇన్స్టింక్ట్ ఆయన పెట్టుబడి. నేలబారు వ్యక్తి ఆర్తి ఆయన మూలధనం. దేశంలో 13 భాషలలో వందల చిత్రాల్ని నిర్మించారు. నాగిరెడ్డి గారి తో కలసి చిత్రాలు తీశారు. విజయం ఆయన ఊతప దం. ఆయన ఓసారి నాతో అన్నారు - ఏనాటికయినా స్టూడియోని నిర్మించాలని. ఒకటికాదు, రెండు స్టూడి యోలు నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎన్నో సినీమాలు నటించాను. కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం అన్నింటిలో వ్యక్తిగతమయిన ప్రమేయం పెట్టుకుని-తను చేసేదేదో ఎరిగి చేసిన నిర్మా త-రామానాయుడుగారు. నటుల ఆహార్యం, పాత్రీక రణ - అన్నింటినీ తన ధోరణిలో ఆపో శన పట్టేవారు. ‘మాంగల్యబలం’లో నేను చేసిన ‘బూతుల బసవయ్య’ పాత్ర ఆయనకి అత్యంత ప్రియమైనది. కార ణం- ఆ పాత్ర ఆయనకి తెలుసు. నా దగ్గర కూచుని ఆ పాత్రను నా కళ్లకు కట్టా రు. కారంచేడులో వారి చెల్లెలుగారింట్లో ఉండి ‘శ్రీకట్నలీలలు’ సినీమా చేశాను. ఇన్ని కమర్షియల్ సినీమాలు నిర్మించినా ఆయనకు ఆర్ట్ ఫిలిం తీయాలని సరదా. నా ‘కళ్లు’ కథని బాలచందర్ నిర్మిస్తున్నా రని తెలిసి నన్ను పిలిచి ఆ కథ హక్కులు తీసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎన్నో చిత్రాలలో నటించారు. ఆ మధ్య గోవా చలన చిత్రోత్సవంలో నన్ను చూసి, ‘‘ఈ మధ్య నా సినీమాలు ఏం చూసినా నువ్వు కనిపిస్తున్నావయ్యా!’’ అన్నారు. చాలామందికి తెలియని విషయం- నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్త త్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్బోయి స్తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. మేము తేలికగా 40 సంవత్సరాలు ఇరుగు పొరుగు ఇళ్లలో మద్రాసులో జీవించాం. కుటుంబాలతో ఆత్మీయ మైన పరిచయం. ఈ మధ్య ఏదో పని మీద ఒక ఉపకా రం కోసం ఆయనకి ఫోన్ చేశాను. ఆ పని పూర్తి చేసి మర్నాడు రోజంతా నా కోసం ఫోన్ చేస్తున్నారు. స్నేహా నికీ, ఆత్మీయతకూ ఆయన ఇచ్చే ప్రాధాన్యం అది. ఏ షూటింగ్‌లోనో గుర్తులేదు కాని ఓ రోజు ఆల స్యంగా సెట్టు మీదకి వచ్చి ‘‘మా సురేష్ కొడుక్కి నా పేరు పెట్టాడయ్యా!’’ అనడం గుర్తుంది. మనవడిని పరి శ్రమ మళ్లీ ‘రామానాయుడు’ అనలేక ‘రానా’ అంది. రానాతో ‘లీడర్’ చేస్తూ ఈ మాటని గుర్తు చేశాను. సినీ రంగంలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన అదృష్టం నాది. నాయుడుగారు, వెంకటేష్, రానా. అలాగే కె. ఎస్. ప్రకాశరావుగారు, రాఘవేంద్రరావు, ఇప్పుడు ప్రకాష్. ఒక కళని సంప్రదాయం చేసుకున్న కుటుంబాలివి. తన వైభవాన్నీ, సంపదనీ తన కుటుంబానికే పరి మితం చేసుకోకుండా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక అభివృద్ధికి డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి కేంద్రాన్ని స్థాపించి, మెదక్‌లో ఉదారంగా 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కారంచే డులో, పరిసర ప్రాంతాల్లో ఎన్నో కల్యా ణ మండపాలను నిర్మించారు. సామా జిక చైతన్యానికి అద్దం పట్టే చిత్రం ‘హోప్’ (ఆశ)లో ప్రముఖ పాత్ర ధరిం చారు. కేవలం సామాజిక ప్రయోజనం కారణంగానే ఆ చిత్రానికి జాతీయ బహు మతి లభించింది. అభిరుచికీ, సాటి మనిషి అభ్యుదయానికీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే రామానాయుడుగారు సినీ నిర్మాణంలో గిన్నిస్‌బుక్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఒకే ఒక్క నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. పద్మభూషణ్. ఆయన్ని బాగా, ఆత్మీయంగా తెలిసిన వారికి నాయుడుగారు జీవితాన్ని జీవనయోగ్యం చేసుకున్న మొఘల్. బాగా లోతుకు వెళ్లి చూస్తే మూలాలను మరచి పోని మనిషి. పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే రామానాయుడు గారి జీవితం ఒక సందేశం. మృత్యువు ఒక క్రూరమైన ముగింపు. స్వయంకృషితో తన లక్ష్యాలే పెట్టుబడిగా మానవతా విలువలని రాజీ పరచకుండా విజయానికి మన్నికైన అర్థాన్ని కల్పించిన- మరొక్కసారి- మూవీ మొఘల్ రామానాయుడు. ఎవరో రచయిత అన్నాడు: జీవితం ఒక ఆక్సిడెంట్. ఎక్కువమంది ఆ ప్రయాణంలో గాయపడుతుంటారు- అని. కానీ జీవితంలో ఎందరి ఆక్సిడెంట్లకో మన్నికైన ప్రత్యామ్నాయాన్ని కల్పించిన వ్యక్తి నాయుడుగారు. ఆయన కన్నీరు-నాకు తెలిసి ఎరుగరు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా-ఆయన కారణంగా కన్నీరు ఎరుగరు. -
అభినవ పాదుకాపట్టాభిషేకం
జీవన కాలమ్ ముంతదార్ ఆల్-జైదీ బుష్ మీద బాగ్దాద్‌లో బూటు విసిరి ‘ఇది ఇరాకీ ప్రజలు నీకిచ్చే వీడ్కోలు ముద్దురా, కుక్కా!’ అని అరిచాడు. ఆ తర్వాత ముద్దునీ, బూటునీ నెత్తిన పెట్టుకుని అరబ్ దేశాలు పండుగ చేసుకున్నాయి. అరాచకం అంటువ్యాధి. తిరుగుబాటు దొమ్మీ సంస్కా రం. వ్యక్తిగత విచక్షణకీ, గుం పు ఆవేశానికీ పొంతన ఉం డదు. అలాగే వ్యక్తి సంస్కారం ఉన్నతంగా ఉన్నా గుంపు ఉద్రేకమే నిలదొక్కుకుంటుం ది. ఇది ఒక సమూహానికి సం బంధించిన మనస్థితి. ఒకాయన 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. ఆయన పేరు మహాత్మాగాంధీ. అది దావానలంలాగ ప్రపంచమంతా వ్యాపించింది- గొప్ప ఆయుధంగా. అది ఉద్యమం. ఒకాయన ఆరేళ్ల క్రితం సామ్రాజ్యశక్తుల మీద తన అసహనాన్ని ప్రకటించాడు-బాగ్దాద్‌లో, అమెరికా అధ్య క్షుడు బుష్ మీద బూటు విసిరి. తర్వాత- ప్రపంచమం తా-50 సందర్భాలలో తమ బూట్లను వేర్వేరు కారణా లకి నాయకుల మీద విసిరి తమ అసంతృప్తినీ నిరసననీ ప్రకటించారు. యూరోపు, ఉత్తర అమెరికా, ఇండియా, చైనా, హాంకాంగ్, ఇరాక్, టర్కీ, ఆస్ట్రేలియాలలో ఈ విన్యాసాలు సాగాయి. వ్యవస్థలో అక్రమాన్ని ఎదిరించలేని సామాన్య మానవుడు- ఒక వ్యక్తి తెగించి, ఆవేశంతో చేసిన పనిని ఆనందంగా, అంతే ఆవేశంతో సమర్ధించడం - ఈ చర్య లకు మూలసూత్రం. సినీమాల లో మెలోడ్రామాకీ, గుడు లలో దేవుడికి చేసే మన ప్రార్థనలకీ మూలసూత్రం ఇదే. ‘భగవంతుడా! వెంకయ్య నా ఆస్తి దోచేశాడు. వాడికి బుద్ధి చెప్పు!’- ఇది సామాన్య మానవుడి తిరుగుబాటు ఆయుధం. రిక్షా వాడిని పోలీసు కాల్చుకు తింటున్నాడు. అతని అవినీతిని హీరో రోడ్డు మీద ఎదిరించి నిలదీశాడు. గొప్ప రాణింపు కథకి. ఒక పాత్రికేయుడు- ముంత దార్ ఆల్-జైదీ బుష్ మీద బాగ్దా ద్లో బూటు విసిరి ‘ఇది ఇరాకీ ప్రజలు నీకిచ్చే వీడ్కోలు ముద్దురా, కుక్కా!’ అని అరిచాడు. ఆ తర్వాత ముద్దునీ, బూటునీ నెత్తిన పెట్టు కుని అరబ్ దేశాలు పండుగ చేసు కున్నాయి. 2009లో ప్రపంచంలో ఉన్న అరబ్బులలో జైదీని మూడో స్థానం లో నిలిపింది ఈ చర్య. తిక్రిత్ అనే చోట ఈ బూటుకు మూడు మీటర్ల విగ్రహాన్ని స్థాపించారు. జైదీ విసి రిన బూటు పేరు డ్యూకాట్ 271. దాన్ని తయారు చేసిన కంపెనీ ఇస్తాంబుల్‌లో బేడాన్ షూ కంపెనీ. ఆ క్షణం నుంచీ ఆ బూటుకి కొత్త పేరు వచ్చింది- ‘బుష్ షూ’. తర్వాత కంపెనీ ‘బైబై బుష్ షూ’గా మార్చింది. అయితే జైదీ సోదరుడు కాస్త దేశభక్తిని ఈ సంఘటనకు జత చేసి ఈ షూ బాగ్దాద్‌లోనే తయారయిందన్నాడు. ఏతావాతా ఈ సంఘటన తర్వాత ఈ షూ ఒక్కవారంలోనే మూడు లక్షల జతలు అమ్ముడుపోయాయట. లండన్ ఆర్టిస్ట్ పావెల్ వానెన్స్కీ 21 కేజీల కంచు బూటును తయారు చేసి, దానికి 24 క్యారెట్ల బంగారం పూతను పూయించాడు. జైదీకి ఆరు తలుపులున్న మెర్జిడిస్ని ఒక అభిమాని బహూకరించాడు. ఆఫ్ఘాన్ రచయితలు ఆయన పాటలు రాసి పాడుకున్నారు. ఒక సౌదీ వ్యాపారి జైదీ విసిరిన బూటుని 10 మిలియన్ అమెరికన్ డాలర్లకి కొనడానికి ముందుకొచ్చాడు. ఒక జాతి నిరసనని తెలపడానికి కొత్త ఆయుధాన్నీ, కొత్త పద్ధతినీ ఆవిష్కరించిన వైతాళికుడు జైదీ. దరిమి లాను ఢిల్లీలో (2009) మన ఆర్థికమంత్రి చిదంబరం మీద ఒక సిక్కు పాత్రికేయుడు జర్నాయిల్ సింగ్ 1984 సిక్కుల మారణహోమం పట్ల ప్రభుత్వం అలసత్వానికి నిరసనగా బూటు విసిరాడు. 2010లో షమీద్ ఖాన్ పాకి స్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మీద బూటు విసిరాడు. ఇప్పుడు మరొక బూటు కథ. రియో డి జనిరో (బ్రెజిల్)లో జరిగిన ప్రపంచ బంతి ఆట పోటీలలో అర్జెంటీనాతో ఫైనల్లో ఆడి ఒకే ఒక గోల్‌తో కప్పును గెలిపించిన ఆట గాడు మారియో గోడ్జీ. ఈ విజయంతో 24 సంవత్సరాల తర్వాత జర్మనీ కప్పును గెలుచుకుం ది. అది ఒక చరిత్ర. గోడ్జీ ఆ గోల్ కొట్టిన బూట్లని ఆనాడు గ్రౌండ్లో వాటికంటుకున్న గడ్డిపోచలతో సహా భద్రంగా 22 సంవత్సరాలు దాచాడు. మొన్న పసిపిల్లల సంక్షేమ నిధికి ఒక్క ఎడమకాలి బూటుని మాత్రం వేలం వేశారు. 2.38 మిలి యన్ల అమెరికన్ డాలర్లకి ఆ బూటు అమ్ముడయింది. పాదుకలను శిరస్సున ధరిం చి- సింహాసనం మీద ఉంచి అన్న శ్రీరామచంద్రుడికి ప్రతినిధిగా పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేసిన భరతుడి కథ మనకు పురాణం. ఈ కాలంలో పాదుకల విలువ- రెండు మిలియన్లు, మెర్సిడెస్ కారు, లక్షల వ్యాపారం, ప్రపంచ ప్రఖ్యాతి- అన్నిటికీ మించి ఓ జాతి ఆత్మ గౌర వానికి అభిజ్ఞ. కాదు- ఓ జాతి తనకు జరిగిన అవమా నానికి చేసిన తిరుగుబాటుకి గుర్తు. మరొక్కసారి - అరాచకం అంటువ్యాధి. అరాచకా నికి జాతి ఉదాసీనత తోడయితే అది మళ్లీ ఉద్యమమ వుతుంది. ఒక సందేశమవుతుంది. ఉద్యమ లక్ష్యం ఉదాత్తమయితే అది భరతుడి ‘పాదుక’ అవుతుంది. ఒకటి నిరసన, మరొకటి నివేదన, ఇంకొకటి ఆరాధన. -
గాడ్సే గుడి
జీవన కాలమ్ గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమాజమంతా సమర్థించదు కదా! అఖిల భారత హిందూ పరి షత్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూ ర్లో జాతిపిత హంతకుడు గాడ్సే స్మృతికి ఒక దేవాలయా న్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించా రు. గాడ్సే మేనకోడలు హిమా నీ సావర్కర్ దాచిపెట్టిన గాడ్సే చితాభస్మాన్ని పుణే నుం చి తీసుకువచ్చి ఈ ఆలయం లో భద్రపరుస్తారని ఉన్నావ్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు సాక్షి మహరాజ్ ప్రకటించారు. జాతిని నడిపించే నాయకుడిని ‘దేవుడి’ని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామ కరణం చేశారు. ఒక దశలో విశ్వాసం, అభిమానం కూడా మైకమే. ప్రశంసించి, అభిమానించి, ఆరాధించి, ఆఖరికి దేవుడిని చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి సంతోషపడతాం. మన దేశంలో గుడులు బోలెడు. శంబల్పూర్లో గాంధీ జీకి గుడి ఉంది. కర్ణాటకలో రజనీకాంత్‌కి గుడి ఉంది. తిరుచినాపల్లిలో కుష్బూకి గుడి ఉంది. తిరునల్వేలిలో నమితా అనే నటీమణికి గుడి ఉంది. బుందేల్‌ఖండ్‌లో మాయావతికి గుడి ఉంది. దక్షిణ కలకత్తాలో అమితాబ్ బచ్చన్‌కి గుడి ఉంది. ఇందిరాగాంధీకి బోలెడు గుడులు ఉన్నాయి. తెలంగాణను ప్రసాదించినందుకు నాటి శాస నసభ్యులు శంకరరావుగారు సోనియాను ‘తెలంగాణ దేవత’గా అభివర్ణిస్తూ గుడి నిర్మించారు. మన దేశంలో సచిన్ తెండూల్కర్ దేవుడు. ఒక ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేసి, తరతరాల జీవన ధోరణినే మార్చిన సర్ ఆర్థర్ కాటన్ దేవుడు. ఓట్లతో గెలిచిన రాజకీయ నాయ కుడు దేవుడు. అయితే రాజీవ్‌గాంధీ మారణహోమానికి కారణమ యిన శివరాసన్ని మహా త్యాగమూర్తి అని తమిళ నాడులో ఊరేగింపులు జరిపారు. ఇందిరాగాంధీని కాల్చి చంపిన బియంత్‌సింగ్, సత్వంత్‌సింగ్‌లను అమృత్ సర్‌లో అఖల్‌తఖ్త్ (సిక్కుమత ప్రధాన పీఠం) అమర వీరులుగా గుర్తించి, అక్టోబర్ 31న అంటే, బియంత్ సింగ్‌ను ఉరి తీసిన రోజును స్మారకదినంగా పండుగ చేస్తోంది. ఒక మతం అంగీకరించి, హత్యని ఆత్మత్యాగంగా గుర్తించిన సందర్భమది. ఒక ప్రధాని మారణహోమాన్ని ఒక వర్గం నెత్తిన పెట్టుకుని కుట్రదారుడిని వీరుని చేసిన సందర్భం శివరాసన్ అనే హంతకుడికి నివాళి. గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమ ర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమా జమంతా సమర్థించదు కదా! వీరు మైనారిటీ దేవుళ్లు. మొదటిరకం దేవుళ్లు వ్యవస్థ మీద తిరుగుబాటు దేవుళ్లు. ఒక ఉదాహరణ. గురువుగారు సిగరెట్లు కాల్చడం నేరం అని బోధించారు. మీకు గురువుగారి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా ప్రకటించాలి? గబగబా నాలుగు సిగరెట్లు కాల్చి, సిగరెట్లు కాల్చానని గురువుగారి ముందు బోర విరిచారు. ఇప్పుడేం చేస్తారు? పర్యవసానం కాదు, కేవలం ఆ చర్యే తన ‘తిరుగుబాటు’కి ఉపశమనం. ఈ నెగిటివ్ గుడుల లక్ష్యం అదే. మాయావతి, కుష్బూ, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్‌ల గుడులు కూడా ఒక వికారమే. శివరాసన్, బియంత్‌సింగ్, గాడ్సేల గుడులు వికారానికి ఆవలిగట్టు. కొందరికి దేవుడు ఆరోగ్యకరమైన ఆలోచనల పర్య వసానం. మరికొందరికి తమ ఆలోచనలకు అద్దం పట్టని వ్యవస్థని నిర్మూలించినందుకు దేవుడు. ఏ దేవుడు మీకిష్టం? విశ్వాసానికి ఏది అంగీకరించడానికి యోగ్యమైన కొలమానం? నలుగురి నమ్మకాన్ని ఆకాశంలో నిలిపిన మెజారిటీ విలువా? పదిమంది కోపానికి కారణమయిన ఒక మైనారిటీ భావించే అన్యాయమా? శిష్ట సమాజానికి ఒక నియతి ఉంది. నలుగురితో చావు- అది అవాంఛనీయమైనా- అది పెళ్లి. ఒక్కడితో చావు- అది అతనికి సహేతుకమైనా- ప్రమాదకరమైన చావు. ఈ కొలబద్దతో చూస్తే గాంధీని చంపిన గాడ్సే నేరాన్ని‘పొరపాటు’ అని సరిపెట్టుకుని గుడి కట్టే సాక్షి మహరాజుల చర్య భయంకరమైన, ప్రమాదకరమైన అవినీతి. నీకు నచ్చకపోతే వేంకటేశ్వరస్వామికి దండం పెట్టకు. రజనీకాంత్‌కి గుళ్లో హారతి ఇవ్వకు. ఇబ్బంది లేదు. కాని సమాజం- అది నీకు సబబుగా కనిపించక పోయినా- తిరస్కరించిన హంతకుడిని ‘దేవుడి’ని చేసే హక్కు నీకులేదు. ఇది బియంత్‌సింగ్‌కీ వర్తిస్తుంది. శివ రాసన్‌కీ వర్తిస్తుంది. గాడ్సేకీ వర్తిస్తుంది. మా మిత్రుడి మాటల్లో ఇది న్యూరో- సోషియో డిజార్డర్. గుడి సంగతి తర్వాత- ముందు ఈ గుడి నిర్మాతలకి వైద్య సహాయం కావాలి. -
అంతులేని ‘కథకుడు’
కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొందరికి అంతఃచేతన. ఆఖరి రోజుల్లో అపస్మారకంలో ఉండిపోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. సినీమా బలహీనత నాటకం. కాని ఆనాటి ఫాల్కే ‘హరిశ్చంద్ర’ నుంచి, తొలినాటి పుల్ల య్యగారి ‘భక్త ప్రహ్లాద’ దగ్గర్నుంచి నేటి వరకు ఆ బలహీనత సామాన్యగుణంగా భార తీయ సినీమాలో రాజ్య మేలు తూవచ్చింది. కాని ఐదు దశా బ్దాల పాటు ‘నాటకీయత’నే సినీమాకి బలమూ, అలంకారమూ, ఆకర్షణా చేసి - వెండితెర మీద అపూర్వమైన నాటకాలను రచించిన వెండితెర మేస్త్రి కె. బాలచందర్. 76 సంవత్సరాల కిందట తంజావూరు జిల్లా నల్లమాంగుడి అనే గ్రామంలో 8 ఏళ్ల కుర్రాడికి నాటకం ఊపిరి. ఊరి మధ్య అరుగు మీద నాటకం వేస్తూంటే వాళ్ల నాన్నకి తెలిసి, నాటకం మధ్యలో స్టేజీ మీదకి వచ్చి కొడుకుని చెవి పట్టుకు తీసుకుపోయి ఇంట్లో చావ గొట్టాడు. అయితే ఆ వ్యసనం కారణంగానే ఆ కుర్రాడు తర్వాతి జీవితంలో 9 జాతీయ బహుమతులూ, 13 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, కళైమామణి, ఏఎన్నార్ అవార్డు పుచ్చుకుని భారతదేశంలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదిం చుకుంటాడని ఆయనకి తెలీదు. 19 ఏళ్లకి ఆయన ఊళ్లో బడిపంతులయ్యాడు. తర్వాత ఎకౌటెంట్ జనరల్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం. అప్పుడే ఒక నాటక సమాజాన్ని ఏర్పరు చుకుని మొట్టమొదటి నాటకం ‘మేజర్ చంద్రకాంత్’, రచన, ప్రదర్శన. దరిమిలాను సుందరరాజన్ అనే నటుడు సినీమాలో ఆ పాత్ర వేసి ‘మేజర్’ని ఇంటిపేరు చేసుకున్నాడు. ఓ పేరులేని దర్శకుడు ‘ధాయ్ పిరందాళ్ వళి పిరుక్కుం’ (ఆషాఢమాసం వస్తే దారి అదే దొరు కుతుంది) అనే సినీమా తీసి, అనుకోకుండా బోలెడు డబ్బు సంపాదించి, బాలచందర్ ‘నీర్ కుమిళి’ అనే నాటకాన్ని చూసి, దాన్ని సినీమాగా తీయా లనుకున్నాడు. బాలచందర్నే దర్శకత్వం వహిం చమన్నాడు. నాకు చాతకాదని వచ్చేశాడు బాలచందర్. తోటి నటులు తిట్టి అతనికి నమ్మకం లేని వ్యాసంగం లోకి అతన్ని తోశారు. అలా మొదటి సినీమాకి దర్శకుడయ్యారు. నా ‘కళ్లు’ నాటిక మీద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చిన్న సమీక్ష చదివి దర్శకుడు ఎస్.డి. లాల్ ద్వారా నాకు కబురు పంపారు. నేను కథ చెప్తే పొంగిపోయి నాటిక హక్కులు కొని చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు. పేరు ‘ఊమై విళిగళ్’ (మూగకళ్లు). జయసుధ, జయశంకర్ నటీనటులు. తీరా నాలుగు రీళ్లు తీశాక నిర్మాణం నిలిచి పోయింది. సంవత్సరం తర్వాత ఇద్దరం పామ్‌గ్రోవ్ హోటల్లో కలిశాం. ‘ఆపేశారేం సార్?’ అనడిగాను. ‘నాటికలో మీరు సూచించిన సింబల్ తెర మీద విస్తృతిలో పల్చబడుతోంది. నచ్చక ఆపేశాను’ అన్నారు. ఒక గొప్ప దర్శకుడి కళాత్మకమయిన నిజాయితీకి ఇది నిదర్శనం. మా వాసూ పేరిట స్థాపించిన గొల్లపూడి శ్రీనివాస్ స్మారక సంస్థ ప్రారంభోత్సవ సభలో అక్కినేని, సునీల్ దత్, అపర్ణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్‌తో పాటు బాలచందర్ ముఖ్య అతిథి. మాట్లాడుతూ, ‘‘విశాఖ సముద్రతీరంలో శ్రీనివాస్ మృతికి నా చేతులకూ రక్తం అంటిందేమో! సముద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరిం చిన నేరం నాది’’ అంటూ ‘డ్యూయెట్’ సినీమా షూటింగ్ అక్కడ మొదలెట్టి వాసూ జ్ఞాపకంతో తీయలేక ఒకరోజు విరమించుకున్నారట. కారణాన్ని మీనాక్షీ శేషాద్రికి చెప్పారట. మరో పదేళ్ల తర్వాత హిందీ హీరో ఆమీర్‌ఖాన్ బహుమతినందుకుంటున్న సభకి వచ్చి ఆయన సినీమా ‘తారే జమీన్ పర్’లో కృషిని ప్రశంసిస్తే, ఆమీర్‌ఖాన్ పసివాడిలాగ కంటతడి పెట్టుకున్నాడు. వేదిక మీదే బాలచందర్ చేతిలో ప్రసంగ పాఠాన్ని లాక్కొని ‘‘నేను ముసలివాడినయ్యాక నా మనవలకి ఈ ప్రసంగం చదివి వినిపిస్తాను’’అంటూ, ‘‘మా అమ్మ ఈ సభలో ఉంటే ఎంతో సంతోషించేది’’ అన్నారు. కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొం దరికి అంతఃచేతన. ఆఖరిరోజుల్లో అపస్మారకంలో ఉండి పోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. ఓ జీవితకాలం వెండితెరకి నాటకం రుచిని మప్పిన రుషి బాలచందర్. కథనీ, పాత్రలనీ, చిక్కగా కాచి వడపోసి అందులో పాత్రలయిన ప్రతి నటుడినీ ‘చరిత్ర’ ను చేసిన సృష్టికర్త. కమల్‌హాసన్, రజనీకాంత్, సరిత, మమ్ముట్టి, ప్రకాష్‌రాజ్, ఏఆర్ రెహమాన్- ఉదాహరణలు చాలు. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. ఒక జీవితకాలంలో పట్టిందంతా బంగారం చేసి, తన సంతకాన్ని ప్రతి సృష్టి లోనూ నిలుపుకున్న దర్శక నిర్మాత- మరొక్కరే గుర్తు కొస్తారు నాకు- ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. అయితే వారి ధోర ణులు వేరు. భాషలు వేరు. ప్రేక్షకులు వేరు. కాని ఇద్దరూ ఆక్రమించుకున్న ఆకాశం ఒక్కటే. -
రాహుల్ నవ్వాలి
జీవన కాలమ్ పాపులారిటీ పెరగాలంటే రాహుల్ గాంధీ ఏం చెయ్యాలి? సంజయ్ నిరుపమ్గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు. ఈ మధ్య రాహుల్‌గాంధీ బొత్తిగా నవ్వకుండా బుంగ మూతి పెట్టుకు కనిపిస్తు న్నారు. ఎక్కడ మాట్లాడినా నుదురు ముడతలు పడు తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన పాపులారిటీ తగ్గడానికి కారణాలని ఆయన సన్నిహి తులూ, కాంగ్రెస్ నాయకులూ కొందరు గ్రహించారు. వారిలో పవన్‌కుమార్ బన్సల్, చిరంజీవి, సంజయ్ నిరుపమ్ వంటి ముఖ్యులు ఉన్నారు. వీరు ఈ మధ్య రాహుల్‌గాంధీ గారితో ఏకాంతంగా సమావేశమ య్యారని వార్త. పాపులారిటీ పెరగాలంటే రాహుల్‌గాంధీ ఏం చెయ్యాలి? మరికాస్త విశాలంగా, హాయిగా నవ్వుతూ కనిపించాలి. సంజయ్ నిరుపమ్గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు. చిరంజీవి అనే మెగాస్టార్, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్టులు. వారికి గొప్ప రహస్యాన్ని ఉద్బోధించారు. ‘‘బాబూ! రాజకీయాలు కూడా ఒక విధంగా నటిం చడమే!’’ అనే బ్రహ్మసూత్రాన్ని ప్రబోధించారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో ‘నటిస్తున్న’ కారణంగానే వారి రేటింగ్ పెరుగుతున్నదని చిరంజీవిగారు స్వానుభవంతో గ్రహించి ఉండవచ్చు. అందరి ఉమ్మడి అభిప్రాయం ఏమిటంటే- రాహుల్ గాంధీగారు ఇప్పటికన్నా పాత్రికేయులతో మరింత స్నేహ పూర్వకంగా ఉండాలి. అంటే? ఒక కాంగ్రెస్ నాయ కులు అన్నారు: ‘అప్పుడప్పుడు వాళ్ల భుజాల మీద చేతులు వెయ్యాలి’ అని. మోదీగారి సభల్లో వేదిక మీద ఎప్పుడూ 40 మంది ఉంటారు. వాళ్ల మధ్య ఆయన చుక్కల్లో చంద్రుడిలాగ వెలిగిపోతూంటారు. కాని రాహుల్ గారి సభల్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని దిక్కులు చూస్తున్న, బొత్తిగా చిరు నవ్వు మరచిపోయిన కమాండోలు ఉంటారు. ఇవి ఆత్మీయులయిన, అనుభవం గల సన్నిహితులు చెప్పే గొప్ప సూచనలని నేను నమ్ముతాను. కాకపోతే నావి మరికొన్ని సూచనలున్నాయి. రాహుల్ గాంధీగారు పత్రికా సమావేశాల్లో జొరబడి ఆర్డినెన్స్ కాగితాలు చించెయ్యడం, పార్లమెంటులో నిద్ర పోవడం వంటి కుర్ర చేష్టలు తరుచూ చేస్తుంటారు కనుక- చూడగానే పెద్దమనిషిలాగ మర్యాదగా కనిపించడానికి చిరంజీవిగారి సహాయంతో జుత్తుకి తెల్లరంగు వేయ డమో, కాస్త తెల్లబడిన జుత్తున్న విగ్గు పెట్టడమో చేయాలి. నుదురు కాస్త ముడుతలు పడినట్టు కనిపించడానికి రకరకాల మేకప్ పరికరాలున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రతిరోజూ గెడ్డం గీసుకోవాలి. ఎప్పుడూ దిక్కుమాలిన కుర్తా కాక తరుచుగా అత్తా కోడలంచు పంచె, పొందూరు ఖద్దరు కండువా వేసు కోవాలి. ‘‘రాజకీయాలు నటన వంటివే’’ అన్న సత్యాన్ని రాహుల్‌గాంధీ గారు గీతావాక్యం లాగ గోడకు తగిలిం చుకుని ఓ మూల చిరంజీవి బొమ్మని ఉంచుకోవాలి. ఇక- పాత్రికేయులతో భుజం మీద చెయ్యి వేయడం చాలదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు పెద్దగా నవ్వుతూ వీపు మీద తట్టడం, మధ్య మధ్య చిలిపిగా కడుపులో పొడవడం వంటి సరదా పనులు చెయ్యాలి. అప్పుడప్పుడు సభల్లో దేశవాళీ అలవాట్లను మెచ్చుకుంటూ - దారి పక్కన నిలబడ్డ కుర్రాడి చేతిలో మొక్కజొన్న కండె, దూరంగా నిలబడిన అమ్మాయి చేతిలో పకోడీ పొట్లం లాక్కొని చటుక్కున నోట్లో వేసుకోవాలి. సగం సగం బట్టలున్న పేదపిల్లని హఠాత్తుగా ఎత్తుకుని కెమెరాకి కనిపించేటట్టు బుగ్గలు నిమరాలి. ఇవన్నీ తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఇమేజ్‌ని ప్రజల్లో పెంచుతాయి. సందేహం లేదు. అయితే ముఖ్యమయిన పని మరొకటుంది. రాహుల్‌గాంధీ గారు కేవలం నవ్వడమే కాక అప్పు డప్పుడు కాస్త ఏడవడం కూడా అలవాటు చేసు కోవాలి. వాళ్ల అమ్మ హయాంలో జరిగిన దిక్కు మాలిన అవినీతులు- బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, తెల్గీ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, ప్రజా శ్రేయస్సుని కాక పార్టీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకూ ఉపకారం జరగని రీతిలో పార్లమెంటులో దీపాలార్పి రాష్ట్రాన్ని చీల్చిన కుంభకోణం- వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారనీ, అసహ్యించుకుని తమ అసహ్యాన్ని ఓట్ల ద్వారా నిర్దాక్షిణ్యంగా, కుండబద్దలు కొట్టినట్టు తెలియ చేశారనీ గుర్తుంచుకుంటే - చేసిన తప్పిదాలను - ఎలా గూ ముఖం చెల్లనిస్థితి వచ్చింది కనుక- కనీసం ఒప్పు కోవడం, పశ్చాత్తాపాన్ని ప్రకటించడం- రాజకీయ నాయకులలో అరుదయిన ‘నిజాయితీ’కి అద్దం పడ తాయి. ఏమయినా రాహుల్ గారు ముందు ముందు ఇంకా విశాలంగా, ఇంకా నిండుగా, ఇంకా మెండుగా నవ్వుతారు. అది మన అదృష్టం.