వీర దేశభక్తులు
జీవన కాలమ్
ఈ మధ్య దేశభక్తుల జాబితా బొత్తిగా క్రిక్కిరిసి పోయింది. రోజుకో దేశ భక్తుడు బయటపడుతున్నాడు మన దేశంలో. దశా బ్దాలుగా దౌర్జన్యకారులను మన దేశంలోకి పంపుతున్న పాకిస్తాన్ దౌర్జన్యకారుల స్థావరాల మీద ఎట్టకేలకు భారతదేశం పంజా విప్పింది. సర్జికల్ దాడి అన్నారు. అంటే ఎక్కడ నొప్పెడుతుందో అక్కడ దెబ్బ కొట్టడం. పోలీసోడి దెబ్బలాగ. పాకిస్తాన్ ‘కుంయ్యి’మనలేదు. కారణం.. దాడి జరిగిందంటే దౌర్జన్యకారుల స్థావ రాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టు. లేదంటే - దాడి దెబ్బ ఏమయినట్టు! లారీలతో శవాలను తీసుకెళ్లడం తెలిసిందని గూఢచారి వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా - మన దేశంలో చాలామంది వీర దేశభక్తులు తలలెత్తారు. పాకిస్తాన్ దాడులు జరగ లేదంటోంది. భారతదేశం జరిపాం అంటోంది. నిజంగా దాడులు జరిగాయా? జరిగితే రుజువులు ఏవి? పాకిస్తాన్ మాటా అదే. కానీ నిన్నటిదాకా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్న చిదంబరం అనే దేశ భక్తుడు - భారతదేశం జరిపిన దాడుల రుజువుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
యుద్ధాన్ని ప్రకటించినప్పుడు- సగం చచ్చి, మరో గత్యంతరం లేక, ప్రజలు ముఖంమీద పేడ జల్లుతారనే భయంతో - కేవలం నిస్సహాయంగానే ప్రభుత్వ చర్యకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. తమ ఇంట్లో పిల్లి పరిగెత్తితే - మోడీ పంపిన గూఢ చారిగా గొంతు చించుకునే మరో భారతరత్న కేజ్రీ వాల్ అంతే నిస్సహాయంగా ప్రభుత్వాన్ని సమర్థిం చారు. ఇప్పుడు కేజ్రీవాల్‌గారు ‘జూలియస్ సీజర్’లో ఆంటోనీ ఉపన్యాసాన్ని తలపించే ప్రసంగాన్ని పత్రికా సమావేశంలో చేశారు. ‘మేం బేషరతుగా మోదీగారిని సమర్థిస్తున్నాం. వారికి నా జోహార్. కానీ పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పడానికయినా, ఆ దాడుల సాక్ష్యాలను బయ టపెట్టండి. నా కోసం కాదు.
ఈ దేశం గొప్పతనాన్ని నిరూపించడానికి. మరొక్కసారి మోదీకి నా జోహార్’. పాపం, సంజయ్ నిరుపమ్ అనే దేశ భక్తుడికి ఇవన్నీ తెలియవు. ఆయన నిన్నకాక మొన్న బొడ్డూడని వీర దేశభక్తుడు. వారు ‘ఈ దాడులు ఉత్త హుళక్కి’ అన్నారు. యువరాజు ఈ ప్రభుత్వం సైనికుల రక్తంతో వ్యాపారం చేస్తున్నదన్నారు. ఏదయినా చిన్న సాకు దొరికితే తమ అక్కసు ప్రకటించాలనుకున్న పార్టీలు గళాలు విప్పాయి. సీతారాం ఏచూరి నోరిప్పారు. శరద్ పవార్ నోరిప్పారు. యుద్ధం మాట దేవుడెరుగు- ఇందుమూలంగా రాబోయే ఎన్నికల్లో పాలకవర్గానికి కిరీటం దక్కితే!
ప్రపంచ దేశాలన్నీ ఏకమయి భారతదేశానికి మద్దతు పలుకుతుండగా, ఏ ఒక్క దేశమూ - ‘రుజు వులు చూపండి’ అని అడగకపోగా, సార్క్ దేశాల పెద్దలు బేషరతుగా దేశానికి దీటుగా నిలబడగా - వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ గొప్ప పార్టీ నాయకులు - వారం తిరక్కుండానే వీధిన పడటం - వారి ‘అసలు రంగు’కి నిదర్శనం.
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాలు ఎదు ర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాజ్‌పేయీ - సైన్యానికి పచ్చజెండా ఊపుతూ ఒకేమాట చెప్పారట. ‘ఏం చేసినా దేశ సరిహద్దు రేఖని దాటవద్ద’ని. మొన్న భారత సైన్యాలు ఒకప్పటి భారత భూభాగం - ఇప్పటికీ వివాదంలో ఉన్న ‘భారత’ భూభాగంలోకే జొరబడి - కేవలం దౌర్జన్యకారుల స్థావరాలను దెబ్బ తీసి వచ్చాయి. ఇది దౌత్యపరంగా అతి కుశాగ్ర బుద్ధితో, అతి సునిశితమైన ఆలోచనా సరళితో తీసు కున్న నిర్ణయమని మనం గర్వపడాలి.
ఈ మధ్య నేను నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ రాసిన నా కాలమ్ చదివి ‘ఇంకాస్త ముందుకు పోయి మీరు మోదీని రాముడు, శ్రీకృష్ణుడు అంటారేమో!’ అని ఈమెయిల్ పంపారు. ‘అయ్యా, నాకంత అభి రుచి దారిద్య్రం లేదు. కాని నేను మోదీ అభిమానిని. అయితే నేను బీజేపీ కార్యకర్తను కాను. తమ హయాంలో 5 లక్షల 57వేల కోట్లు దోచుకున్న (నా లెక్కలు తప్పయితే క్షమించండి) దేశంలో కనీసం 200 పైచి లుకు సంస్థలకు గత 70 సంవత్సరాలలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు పెట్టి మనల్ని తరింపజేసిన, ఇంకా కొన్నాళ్లుంటే - రాహుల్ గాంధీ, ప్రియాంక, వాద్రా సంస్థలతో మన జన్మల్ని తరింప జేయగలిగిన ఇటలీ భక్తుల (ఉదా: ఖత్రోచీ, ఎంబ్రి యార్ కుంభకోణాలు) అభిమానిని కాను. మరొక్క మాట. పాకిస్తాన్‌ని రెండుసార్లు ఎదిరించి బుద్ధి చెప్పింది బీజేపీ హయాంలోనే అని మరచి పోకూడదు. పాపం, కాంగ్రెసుకి అంత టైమెక్కడిది - తమ ఇల్లు చక్కపెట్టుకునే వ్యవధే చాలకపోయె!
దేశభద్రత.. పత్రికల్లో ప్రకటించే కరపత్రం కాదు! కాదు! కాదు! దేశభక్తి ఫేస్‌పౌడరు కాదు-అవసరం తీరగానే చెరిపేసుకోడానికి. ‘చలికోటు’ కాదు- యుద్ధాలు వచ్చినప్పుడు తొడుక్కుని ఆపై విప్పి పారే యడానికి. పసివాడు ముఖంమీద పెట్టుకునే ‘పులి బొమ్మ’ కాదు. ఆటల్లో చిరిగిపోయేదాకా కలసి రావడానికి.
గొల్లపూడి మారుతీరావు