కాలంలో కరిగిన ప్రేమకథ | Gollapudi Maruthi Rao Story On Love | Sakshi
Sakshi News home page

కాలంలో కరిగిన ప్రేమకథ

Published Mon, Dec 16 2019 12:07 AM | Last Updated on Mon, Dec 16 2019 12:12 AM

Gollapudi Maruthi Rao Story On Love - Sakshi

బస్సు జుజుమురా దగ్గర ఆగినప్పుడు ఆ అమ్మాయిని చూశాను. నవంబర్‌ చలి దుర్మార్గుడి పగలాగ పట్టుకుని వదలకుండా ఉంది. శంభల్‌పూర్‌ నుంచీ భువనేశ్వర్‌ ప్రయాణం. ‘‘ఈ రాత్రి వద్దు భాయ్‌. రెఢాకోల్‌ అడవిలో చలి తట్టుకోలేవు’’ అన్నాడు సాహు. ‘‘రేపు ఉదయం భువనేశ్వర్‌లో పని ఉందం’’టూ బస్సు ఎక్కేశాను.
ముతక శంభల్‌పూర్‌ చీరలో చుట్టిన రబ్బరు బొమ్మలాగా ఉంది ఆమె. ఒరియా అమ్మాయేమో అనుకున్నాను. నన్ను తికమక పెట్టింది ఒకటే– ఆమె సిగలో కెంపులాంటి గులాబీ పువ్వు. ఇక్కడ అమ్మాయిలు పువ్వులు పెట్టుకోరు. శరీరంలో కనిపించని ఏ అందాన్నయినా భర్తీ చేయగలిగిన అందమైన కళ్లు. నా ముందు సీట్లో కూర్చుంది. పక్కన ఎవరూ లేరు. ముసలి పండా కారా కిళ్లీ చారలో చొంగ కలిసి వంటి మీదకి కారుతుండగా చలిని జయించి నిద్రపోతున్నాడు. ఆంధ్రదేశంలో చలికాలానికి ఉపయోగించే ఏ దుప్పటీ ఈ చలికి ఆగడం లేదు.
ఉన్నట్టుండి బస్సు కుదుపుతో ఆగింది. ఒరియా భాష ఒక్కసారి నిద్రలేచింది. అతి త్వరగా మాట్లాడుతారు. మాటల్లో కంచు గొంతు వెదికి తెచ్చుకుంటారు. డ్రైవరు ఏదో చెబుతున్నాడు. కొన్ని నిద్రముఖాల్లో కోపం తెలుస్తోంది. ప్రయాణికులంతా దిగారు. నా ముందున్న అమ్మాయి ఊదారంగు శాలువా వదిలించి దగ్గరగా లాక్కుని లేచింది. నేనూ లేచాను.
‘‘జుజుమురా’’ అన్న నల్లటి అక్షరాలు బస్సు లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి. చిన్న గ్రామం. డ్రైవరు ఏం చెపుతున్నాడో తెలుసుకోవాలనిపించింది. ఒక రాయిమీద కూర్చుంది అమ్మాయి. ఇంగ్లిష్‌ అర్థమవుతుందేమో, అడిగాను. ‘‘డ్రైవరు ఏం చెపుతున్నాడో చెప్పగలరా?’’
‘‘ఇంజిన్‌ చెడిందట. క్షణంలో బాగు చేస్తానంటున్నాడు’’ తెలుగులో వచ్చింది సమాధానం. ‘‘నాకు తెలుగు ఎలా వచ్చునా అని ఆశ్చర్యపోతున్నారా?’’
‘‘అది ఒకటి. నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారా అని.’’

‘‘పాన్‌ వేసుకుంటే ఇక్కడ వాళ్లు గంటల కొద్దీ బుగ్గన ఉంచుకుంటారు. మీరేమో కిటికీ దగ్గర కూర్చున్నారు. అయిదు నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నారు.’’
‘‘కానీ నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పలేదు’’
‘‘మీ చేతుల్లో తెలుగు ఉత్తరం ఉంది. మీరు కట్టుకున్న పంచె పొందూరు ఖద్దరు.’’ క్షణం నిర్ఘాంతపోయాను. ‘‘మీరేం చేస్తారు?’’ అంది.
‘‘టెక్స్‌టైల్‌ మిల్‌ ఏజెంటుని. ప్రతి సీజన్‌లోనూ వచ్చి ధర్మవరం చీరలకు ఆర్డర్స్‌ తీసుకుంటాను. తిరిగి వెళ్లి సరుకు పంపే ఏర్పాటు చేస్తాను. అమ్మకంలో రెండు పర్సెంట్‌ కమీషన్‌ ఇస్తారు. అందులో ఒక పర్సెంట్‌ జర్దాకిళ్లీలు నమిలి ఒరిస్సాకే చెల్లించి వెళ్లిపోతాను.’’
గలగలమని నవ్వింది. నిద్రపోతున్న జుజుమురాలో కాస్త చైతన్యం వచ్చినట్టనిపించింది.
‘‘ఎలా ఉంది ఒరిస్సా మీకు?’’
‘‘ఇక్కడికి వస్తూ పోతూండడం 14 నెలల అలవాటు. దిగులుగా, తీరుబాటుగా, ఒంటరిగా, భయంగా ఉంది. తెలుగు భాష వినిపిస్తే ఆప్తబంధువుని చూసినట్టు ఫీలవుతాను.’’
‘‘అయితే మీకో ఆప్తబంధువు దొరికినట్టే.’’
ఆమె చొరవకి ఆశ్చర్యం కలిగినా, ఆనందంగానే ఉంది. ప్రయాణికులంతా మా వేపు దొంగ చూపులు చూసి నవ్వుకున్నారు.
‘‘మీ పేరు?’’
‘‘మీరా’’

బస్సు రిపేరు అయిందని అరుస్తున్నాడు కండక్టరు. లేచి చీరె సవరించుకుంది. నేను లేవడానికి చెయ్యి అందించింది. జారిపోయిన నా కండువాని తనే భుజం మీద వేసింది. బస్సులో ఇదివరకే కూర్చున్న సీటులోకి కునుకుతున్నాను. నా పక్కన కూర్చున్న పండా ఏదో అన్నాడు. మీరా నవ్వుతోంది. ‘‘ఆయనేమంటున్నాడో తెలుసా? మీరిద్దరూ భార్యాభర్తలు కదా, రెండు సీట్లెందుకు? మీరు నా పక్కన కూర్చుంటే, ఆయన పడుకుంటాడట.’’
నా ముఖం ఎరుపెక్కింది. ‘‘మనం భార్యాభర్తలం కానక్కరలేదు కానీ నా పక్కన కూర్చోండి. పాపం, పడుకుంటాడు’’ అంది. నా భార్య అయ్యే అర్హతలు మీరాకి లేవా? జీవితం పట్ల ఆమెకున్నపాటి కలలు కూడా నాకు లేవు. ‘‘ఊరు పేరు తెలీని అమ్మాయి నా భార్య అంటాడా ఈ ఫూల్‌’’ అని కోపం వచ్చింది మీకు. అవునా?’’
‘‘మీకెలా తెలుసు?’’
‘‘నేను బీఏ సైకాలజీ స్టూడెంటుని.’’
ఆ అమ్మాయి అంత చదువుకున్నదని ఊహించలేదు. మనలో లేని గుణాన్ని ఇంకొకరిలో చూడడాన్ని ఆకర్షణ అంటారనుకుంటాను. మీరా నన్ను ఆకర్షించింది. క్రమంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకి మనస్సు ఒదిగిపోయింది. ‘‘నేను పూరీ వెడుతున్నాను. ఈ పండా ఆశీర్వాదం ఫలించాలని జగన్నాథుడికి చెప్పుకుంటాను’’ అన్నాను.

నాకు తెలుగు 
ఎలా వచ్చునా అని 
ఆశ్చర్యపోతున్నారా?’’
‘‘అది ఒకటి. 
నేను తెలుగువాడినని 
ఎలా అర్థం చేసుకున్నారా అని.’’
ఇప్పుడామె ముఖంలో ఆశ్చర్యం.

‘‘అమ్మ లేదు. నాన్న లేడు. పెళ్లి నా జీవితంలో కలకాలం నిలవడానికి చేసే స్నేహం లాంటిది. మీరు మంచి స్నేహితులు కాగలరని ఈ చిన్న వ్యవధిలోనే అనిపించింది.’’
అంత పెద్ద కళ్లలో కదిలిన నీటితెరని ఆ మసక వెలుగు దాచలేకపోయింది. ఆమె చెయ్యి నా చేతిని బలంగా పట్టుకుంది. నేను వణుకుతున్నానని అప్పుడర్థమయింది– నేను తీసుకున్న నిర్ణయానికి గానీ చలికి గానీ. ‘‘అదేమిటి వణుకుతున్నారు? ఈ శాలువా కప్పుకోండి.’’
ఇప్పుడు ఆమె శరీరం నాకు తగులుతోంది. సన్నటి నడుం వెచ్చగా నా కుడిచేతికి ఆనుకుంది. ఎంతసేపు గడిచిందో తెలియలేదు.
‘‘రెఢాఖోల్‌ వచ్చాం. కాస్త టీ తాగరూ?’’ చుట్టూ చూశాను. బస్సంతా ఖాళీ. ఆమె ఒళ్లో తలపెట్టుకున్నానని అర్థమై, సిగ్గుపడిపోయాను. ఇద్దరం దిగాం.
‘‘భర్త అపస్మారంలో ఉపయోగపడడానికి భార్యకి ఎంత అదృష్టం.’’
‘‘ప్రతి స్త్రీ పుట్టుక నుంచీ వైవాహిక జీవితానికి సిద్ధపడుతుందనుకుంటాను. భార్య పాత్రని ఎంత సులువుగా స్వీకరిస్తున్నారు మీరు?’’

చిన్న కుర్రాడు రొట్టెలు చేస్తున్నాడు. కాల్చడానికి పెనం ఏమీ లేదు. నేలకి సమంగా ఒక కుండని పాతేశారు. మూడు రొట్టెలు కొన్నాను. పప్పు సెగలు కక్కుతోంది.
ఆకలి చల్లార్చుకుని బస్సు ఎక్కాం. భయంకరమైన రోడ్డు. విడాకులు ఇచ్చుకుందామని నిశ్చయం చేసుకున్న భార్యాభర్తల్ని బస్సులో కూర్చోపెడితే ఆ రోడ్డు వాళ్లని అనుగుల్‌ చేరే లోపల ఏకం చేస్తుంది. ప్రతి పది నిమిషాలకీ నా చేతుల్లో ఉంటోంది మీరా. బస్సులో దీపాలన్నీ ఆర్పేశారు. మా పెళ్లి, తర్వాతి జీవితాన్ని గురించి 30 మైళ్లు చర్చించుకున్నాం. నేను కంపెనీ తరపున బరంపురంలో ఉండిపోయేట్టు ఏర్పాటు చేసుకుంటాను. నా క్యాంపులన్నీ ఇద్దరం కలిసే తిరుగుతాం. ముగ్గురు పిల్లలు. ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. ఇద్దరమ్మాయిలు, అబ్బాయి అయినా ఫరవాలేదు. ముగ్గురూ అమ్మాయిలే పుడితే?
అనుగుల్‌ వచ్చేసింది. దూరంగా ఉన్న టీ దుకాణం వేపుకి మళ్లించింది మీరా. ‘‘ఇష్, ఇటు’’ అంది. నా భుజం మీద పడిన ఆమె వేళ్లు వణుకుతున్నాయి. ‘‘ముద్దు పెట్టుకోరూ!’’ అంది. దిమ్మర పోయాను. నా చేతులు స్వాధీనం తప్పాయి. మంచులాంటి గాలి మా మధ్య వేడెక్కింది. కాసేపటికి ఆమె ఏడుస్తోందని తెలుసుకున్నాను. ఊపిరి సలపని ఆనందానికి పరాకాష్ట దుఃఖమేమో!

డ్రైవరు మా కోసమే హారను మోగిస్తున్నాడు. అనుగుల్‌ వచ్చిన డ్రైవరు గుర్రు తీస్తున్నాడు. కొత్త డ్రైవరు నడుపుతున్నాడు. అతి సులువుగా నా కౌగిట్లో ఒదిగిపోయిన ఈ మీరా నా జీవితంలో వహించనున్న పాత్రకి అర్హురాలేనా?
ఢెంకనాల్‌ దాటి కుంఠలీ. ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. ‘‘నేను కటకంలో దిగాలి’’ అంది. కటకం దగ్గరవుతుందనగానే ఆమె కంఠంలో దిగులు. ‘‘వస్తే రానీ నాతో భువనేశ్వర్‌ వస్తున్నావు నువ్వు’’. అదే మొదటిసారి నువ్వు అనడం– ఆశ్చర్యపోయింది. ‘‘నిన్ను దిగనివ్వను.’’ నా వేపు జాలిగా చూసింది. ‘‘నా మీద అప్పుడే అంత హక్కును పెంచుకున్నారా?’’ అంది.
‘‘రాత్రంతా ఆలోచనల్తో రెచ్చగొట్టి ఇప్పుడు హఠాత్తుగా మాయమవుతావా?’’ మీరా మాట్లాడలేదు. దిగే ప్రయాణికులంతా హడావుడిలో పడ్డారు. ‘‘ఇక్కడ అరగంట పైగా ఆగుతుంది. అలా నడుద్దాం పదండి’’ అంది. ‘‘నాకూ మిమ్మల్ని వదిలి పోవాలని లేదు. చిన్నతనంలో చెట్టపట్టాలేసుకు నడిచే భార్యాభర్తల్ని చూస్తూ ఇలాగా నా రోజులూ గడవాలనుకునేదాన్ని. ఇద్దరం భవిష్యత్తును గురించి కలలు కన్నాం. నా జీవితానికి ఈ ఒక్క రాత్రి చాలు’’.
‘‘కానీ మీరా! ఈ ఒక్క రాత్రి ఏం ఖర్మ. మన మధ్య ఇలాంటి ఎన్నో రాత్రులు ఉంటాయి. జీవితమంతా నేను నీతో ఉంటాను.’’
‘‘ఉండే మనస్సు మీకుంది. కానీ ఉంచుకునే అదృష్టం నాకు లేదు. నాకు లంగ్‌ కేన్సర్‌.’’
మున్సిపాలిటీ దీపాలు గుప్పుమని ఆరిపోయాయి. నా గొంతు పెగలలేదు. ‘‘కానీ మీరా! మీరా! ఇది ఘోరం.’’
‘‘నేనిక్కడే ఆగిపోతాను. నీ ఆపరేషను అయ్యేవరకు ఉంటాను.’’
‘‘వద్దు. వీల్లేదు. మీరు వెళ్లాలి. ఇప్పుడే, ఈ బస్సులోనే.’’
ఇద్దరం కళ్లనీళ్లు కారుస్తూనే ఉన్నాం.
డ్రైవరు హారన్‌ మోగిస్తున్నాడు.
∙∙ 
ఈసారి భువనేశ్వర్‌ వచ్చినప్పుడు కటకంలో ఆగి మీరా చెప్పినట్టే వాకబు చేశాను. డిసెంబర్‌లో మేం అనుకున్నట్టు పెళ్లయితే జరగలేదు కానీ క్రిస్ట్‌మస్‌ రెండు రోజులుందనగా మీరా కన్ను మూసింది.
శంభల్‌పూర్‌ బస్సులో ప్రయాణం చేస్తూ జుజుమురా వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చెయ్యమని కండక్టరుతో చెప్పాను. కళ్లిప్పేసరికి బస్సు ఇంకా నడుస్తోంది. కండక్టర్‌ని అడిగాను. జుజుమురా వెళ్లిపోయిందన్నాడు.
ఒక అపూర్వమైన అనుభవాన్ని మీరా రూపంలో ప్రసాదించి నా దారి నుంచి సవినయంగా తప్పుకుంది జుజుమురా.    

గొల్లపూడి మారుతీరావు  ‘జుజుమురా’కు సంక్షిప్త రూపం ఇది. కాలదోషం పట్టనిదే మంచికథ అయితే గనక ఈ కథ ఆ ప్రమాణానికి నిలబడదు. ఇలాంటి ఎన్నో ప్రేమకథలు మనం వినివుండటమే దానికి కారణం. ఒక విషయం మళ్లీ మళ్లీ వాడకంలోకి రావడం వల్ల దాని గొప్పతనం కోల్పోతుంది. ఈ కథ కూడా అదే కోవలోనిది. కానీ గుర్తుంచుకోవాల్సింది, అలాంటి ఎన్నో ప్రేమకథలు సినిమాలుగా రాకముందు 1971లో రాసిందిది. ఆ కారణం వల్లే ఇది ఆ కాలపు ఎందరో పాఠకుల్ని ఆకర్షించింది. సినిమా నటుడు, సినిమా, నాటక, రేడియో రచయిత, పాత్రికేయుడు, కాలమిస్టు, టీవీ ప్రయోక్త అయిన గొల్లపూడి చివరివరకూ ‘జీవన కాలమ్‌’ రాస్తూనే వున్నారు. అమ్మ కడుపు చల్లగా ఆయన ఆత్మకథ. సాయంకాలమైంది ఆయన నవల.

గొల్లపూడి మారుతిరావు  14 ఏప్రిల్‌ 1939 
12 డిసెంబర్‌ 2019 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement