ఒలేస్యా! నూట పదహారేళ్ళ ప్రేమకథ | 116 years love story of Oleshya | Sakshi
Sakshi News home page

ఒలేస్యా! నూట పదహారేళ్ళ ప్రేమకథ

Published Sun, Sep 27 2015 1:23 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

ఒలేస్యా! నూట పదహారేళ్ళ ప్రేమకథ - Sakshi

ఒలేస్యా! నూట పదహారేళ్ళ ప్రేమకథ

నాగరికత కళంకం అంటని స్వచ్ఛమైన యువతి ఒలేస్యా. ఆమెది అడవి లోతుల్లోని సౌందర్యం. ఇవాన్ నగరపు లౌకిక ప్రతినిధి. ఆమె నిసర్గ ప్రపంచానికి పరాయివాడు. అయితే ఆ పరిమితులు, సరిహద్దులు తెలియని అమాయక ప్రేమలో నిలువెల్లా మునిగిపోతారు.  
 
 ఏనాటిది ఈ విఫల ప్రణయగాథ. మళ్లీ మన కాలంలో సరాసరి ఒదిగిపోయిన వ్యధ. రష్యన్ రచయిత కుప్రీన్ నూట పదహారేళ్ళ కిందట రాసిన కథ. ఆ వనవాస వనితతో అవినాభావ సంబంధం అమర జ్ఞాపకాంతరంలో నిక్షిప్తమయ్యే ఉంది. నేటికీ అంతమొందని అంధవిశ్వాసం ఒకటి, సాటి మనిషిని గ్రామం నుంచి నిర్జనారణ్యంలోకి, శిథిలకుటీరం నుంచి మృత్యులోయలోకి తరిమికొట్టడం కొనసాగుతోంది.

అలెగ్జాండర్ కుప్రీన్ (1870-1938) రాసిన అద్భుతమైన కథల పుస్తకం ‘రాళ్ళవంకీ’. ఆర్వియార్ తెలుగులోకి తర్జుమా చేశారు. 1985లో రాదుగ ప్రచురణగా మాస్కోలో ముద్రించారు. మోలఖ్, ఒలేస్యా, గంబ్రీనస్, ఇజుమృద్, రాళ్లవంకీ అనే అయిదు ప్రసిద్ధ కథల సంపుటమిది. విషాదోల్లాసపు కన్నీటిముత్యాల గుచ్ఛమిది. ‘జీవిత కళాకారుడు’ అనే చెర్నిషోవ్ ముందుమాటతో మొదలవుతుంది. కథకుని జీవితం, సాహిత్యం గురించిన కొన్ని విలువైన సంగతులు మనకు తెలియచెబుతుంది.
 
 రచయిత కావాలని కుప్రీన్ కలగన్నాడు. కుర్రవాడిగా కవిత్వ రచన ప్రారంభించాడు. భృతికోసం పలు చిత్రమైన ఉద్యోగాలు చేశాడు. జారిస్టు రష్యా కపటం ఎడల ఎరుకగలవాడు. వైవిధ్యభరిత జీవిత దాహార్తుడిగా, రచనకి అవసరమైన ముడిసరుకుని సేకరించుకొన్నాడు. 19వ శతాబ్దం ఆఖరిలోను, 20వ శతాబ్దం ఆరంభంలోను ఆరితేరిన కథకుడు. విప్లవ పూర్వ రష్యన్ జీవితపు విశాల దృశ్యాల చిత్రకారుడిగా పేరు మోసాడు. టాల్‌స్టాయ్,  చెహోవ్‌ల సమకాలికుడైన కుప్రీన్‌ను అద్భుత సాహిత్యకారుడనే ప్రశంసల్లో మక్సీమ్‌గోర్కీ ముంచెత్తేడు. ఈ లోకంలోకి మనిషి అనంతమైన స్వేచ్ఛకోసం, సృజనాత్మక కృషికోసం, ఆనందం పొందడంకోసం వచ్చాడని... ఓ చోట కుప్రీన్ రాసిన వాక్యమే, అతని సాహిత్య వ్యాసంగం ఆద్యంతం అతిక్రమించని నియమంగా పాటించాడు.

‘రాళ్ళవంకీ’ పుస్తకం పాతికేళ్లుగా దుకాణాల్లో దొరకటం లేదు. ఈ ప్రతి నేను 1986లో కొన్నది. వెల పది రూపాయలు. కథ కథకీ ఇవాషెంకొ వేసిన కమనీయ చిత్రాలు. ఎకాయెకీ కథల్లోకి ప్రవేశించాను. ఆమూలాగ్రం చదివాను. చకితుడనై పోయాను. మళ్లీ 92వ పుటనే తెరిచాను. ప్రపంచమంతా తిరిగాను కాని, అంతరంగం అక్కడే ఉంది. సందె దీపమూ, అమ్మ పిలుపూ... అన్నారు ఇస్మాయిల్. అలాగన్న మాట. అక్కడ ఒక్కగానొక్క ప్రేయసి ఉంది. ఆమె ఒలేస్యా.
 
 పొలేస్యే, ఓ మారుమూల ప్రాంతం. సమీప గ్రామం పెరెబ్రోద్. నగరవాసి అయిన ఇవాన్‌కి కొన్నాళ్లు అక్కడ గడపవలసి వస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రజల, పోలిష్ భూస్వామ్య దాస్యకాలపు ఆచార వ్యవహారాల్లో బతుకుతుంటారు. వైద్యం, పుస్తక పఠనం తర్వాత తీరికవేళ అడవిలో జంతువుల వేట ఇవాన్ వ్యాపకం.  పొలేస్యెలో ఒకప్పుడు మనూలిఖా అనే మంత్రగత్తె, ఆమెతో బాటుగా మనమరాలు ఒలేస్యా ఉండేవారని నౌకరు నోటమ్మట వింటాడు. ఊరికి అపకారం చేస్తున్నారన్న నెపంతో ఇరువురినీ అడవిలోకి తరిమి వేశారని తెలుసుకుంటాడు. దానితో అతనికి మంత్రగత్తెలను చూడాలన్న ఉత్సుకత కలుగుతుంది.
 
 ఒకరోజు అడవిలో దారి తప్పిన ఇవాన్, యాదృచ్ఛికంగా మనూలిఖా గుడిసెకు వెళతాడు. అపుడు ఒలేస్యా అతను కోరిన మీదట పేక ముక్కలతో జోస్యం చెబుతుంది: ‘ఇవాన్ ! నీకు కళావరురాణి పరిచయమవుతుంది. ఆమెనుంచి నీకు ఎంతో ప్రేమ లభిస్తుంది’ అంటుంది. నాగరికత కళంకం అంటని స్వచ్ఛమైన యువతి ఒలేస్యా. ఆమెది అడవి లోతుల్లోని సౌందర్యం, కోమల కంఠస్వరం. కేవలం ఆ అందమైన రూపం మాత్రమే కాదు ఇవాన్‌ని సమ్మోహ నపరించింది; ఆమె నిజాయితీ, అరమరికల్లేని నడవడిక కూడా. అతనొక నగరపు లౌకిక ప్రతినిధి. ఆమె నిసర్గ ప్రపంచానికి పరాయివాడు. అయితే ఆ పరిమితులు, సరిహద్దులు తెలియని అమాయక ప్రేమలో నిలువెల్లా మునిగిపోతారు. ఇవాన్‌ని వరించిన కళావరురాణీ ఒలేస్యానే.
 
 మంత్రగత్తెలు, ఆడదెయ్యాలు, దొంగలనే అపవాదుల నుంచి, గ్రామస్తుల వెలివేతల నుంచి, పోలీసుల వేధింపుల నుంచి, సమస్త అమానవీయ ప్రపంచం నుంచి అతను ఆ ఇరువురినీ విముక్తం చేయాలనుకుంటాడు. ఒలేస్యాను పెళ్లి చేసుకోవాలని, తనతోబాటు నగరం తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా నిశ్చయించుకుంటాడు. అందుకు ఆమె సమ్మతిస్తుంది, మిక్కిలి సంతోషిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాన్ అభీష్టం మేరకు ఒలేస్యా, ఒకనాడు గ్రామంలోని చర్చికి వెళుతుంది. అంతటితో కథ విషాదాంతమవుతుంది. ఈ కథాకథనం వయస్సు నూటపదహారేళ్లు. ఇప్పటికి అనేకసార్లు చదివి ఉంటాను. ప్రతి పర్యాయం నేను ఇవాన్ వలెనే బాధపడతాను. అసలుకి నేను ఇవాన్‌ని అయిపోతాను. ఆమెలేని అడవిలో ఒంటిరెక్కతో ఎగరలేకపోతాను. ఏదో అవ్యక్తమైన పశ్చాత్తప్త కన్నీటి తుంపరలో చివికిపోతుంటాను. అప్పటికీ ఆమెకోసం డైరీలో ‘ఒలేస్యా, ఓ కళావరురాణీ అని స్మృతిగీతం రాసుకునే ఉన్నాను. మళ్లీ మళ్లీ 92వ పుటనే చేరవస్తాను.
 
 ఇటీవల జార్ఖండ్‌లోని రాంచీజిల్లా కంజియా గ్రామంలో అయిదుగురు ఆదివాసీ మహిళలను మంత్రగత్తెలనే నెపంతో హతమార్చివేశారు. నేను చిన్నతనం నుంచీ పత్రికల్లో చదువుతున్న వరుసవార్తల్లో ఇది కూడ ఒకటి. ఈ క్రూరకృత్యం శతాబ్దాల తరబడి పునరావృతమవుతోంది. ఇటువంటి మూఢనమ్మకం కారణంగానే ఆనాడు ఒలేస్యా అదృశ్యమయింది.
 
 ఈ తరుణంలోనే, సాంఘికోద్యమాలను విస్మరించిన దళిత నాయకులను ఉద్దేశించి కె.బాలగోపాల్ రాసిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. కారంచేడు మారణకాండ పూర్వరంగంలో దళిత ఉద్యమం తీరుని ఆయనొక వ్యాసం (1999)లో పునస్సమీక్షించారు. ‘దళిత ఉద్యమం కమ్యూనిస్టులకు ఎంత నేర్పిందో ఏం నేర్పిందో గానీ, రాజ్యాధికారం అన్ని సమస్యల పరిష్కారానికి నాంది అన్న అభిప్రాయాన్ని కమ్యూనిస్టుల నుండి తాను స్వీకరించి నష్టపోయింది. అంబేడ్కర్, పెరియార్, ఫూలే... ముగ్గురూ రాజకీయ మార్పులకంటే సాంఘిక మార్పునకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దళిత నాయకులు ఈ కృషిని విస్మరిస్తున్నారు’ అని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 ఈ భూమ్మీద మాంత్రికులంటే స్త్రీలు, దళితులు, ఆదివాసులు, బహుజనులే కదా! మరి ఈ సుదీర్ఘకాలపు మరుపులో ఎందరెందరు ఒలేస్యాలు ప్రాణాలు కోల్పోతారు!
 - నామాడి శ్రీధర్
 9396807070
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement