‘గొల్లపూడి మారుతీరావు గొప్ప నాటక రచయిత మాత్రమే కాదు, చాలా మంచి నటుడు కూడా. సినిమాల్లో వేస్తే ముఖ్య పాత్రలో బాగా రాణించగ లడు’ అంటూ 1970లో ప్రముఖ పత్రికా సంపాద కులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గొల్లపూడిని అంచనా వేశారు. తర్వాత అక్షరాలా అంతే జరి గింది. పదేళ్ల తర్వాత ముఖానికి రంగు పూసుకుని వెండితెరకెక్కారు. గద్దముక్కు, తీక్షణమైన చూపులు, సన్నగా పొడుగ్గా కింగ్ సైజు సిగరెట్ లాంటి విగ్రహం, చేతులు వూపేస్తూ వాదనలో పస లేకపోయినా అవతలివాళ్లని తగ్గేట్టు చేసే వాగ్ధాటి గొల్లపూడికి ముద్రవేసి నటుడిగా నిలబెట్టాయి. తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య...’ చిత్రంతోనే అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నారు. వంద సినిమాల తర్వాత అబ్బాల్సిన ‘ఈజ్’ మొదటి దెబ్బకే వంటబట్టింది. ఇక తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు.
మారుతీరావుది పరిపూర్ణ జీవితం. పద్నాలుగే ళ్లప్పుడే మించిన ప్రతిభని ప్రదర్శిస్తూ ‘ఆశాజీవి’ కథ రాశారు. ఇంకో రెండేళ్లకి తొలి నాటకం అనంతం, ఇంకో రెండేళ్లకి మరో మంచి పెద్ద కథ గొల్లపూడిని రచయితగా నిలబెట్టాయి. విశాఖ పట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చది వారు. ఆ పట్టాని, దాష్టీకమైన వాక్కుని పట్టుకుని విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదిం చారు. అక్కడ మహానుభావుల మధ్యలో ఉండి కలానికి పదను పెట్టుకున్నారు. సరిగ్గా వృత్తి నాటక రంగం వెనకబడి సినిమాకు అన్ని కళలూ, శక్తి యుక్తులూ దాసోహం అంటున్న తరుణంలో నాటి కలు, నాటకాలు రాసేవారు ఒట్టిపోయారు. ఈ మహా శూన్యంలో గొల్లపూడి ప్రవేశించి పుంఖాను పుంఖాలుగా నాటక రచనలు చేసి తెలుగు అమె చ్యూర్ థియేటర్‌కి కొత్త చిగుళ్లు తొడిగారు. ‘అనంతం’ కొన్ని వందల ప్రదర్శనలకు నోచు కుంది. ‘బియాండ్ ది హొరైజన్’ ఆధారంగా తీర్చిది ద్దిన ‘రాగగాగిణి’ మాతృక వలే ఖ్యాతి పొందింది. కొత్త కొత్త నాటకాలు చదవడం, తనదైన శైలిలోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
తన రచనలకు బారసాలలు చేసి పేర్లు పెట్టడంలో గొల్ల పూడిది విలక్షణమైన దారి. పిడికెడు ఆకాశం, వెన్నెల కాటేసింది, రెండురెళ్లు ఆరు, మళ్లీ రైలు తప్పిపోయింది, కరుణించని దేవతలు, రోమన్ హాలిడే, కళ్లు, సత్యంగారి ఇల్లెక్కడ, చీకట్లో చీలి కలు, ఎర్రసీత ఇవన్నీ కొత్తగా ఆకర్షణీయంగా ఉంటాయ్. ఆఖరికి ఆయన స్వీయ చరిత్రకి ‘అమ్మ కడుపు చల్లగా...’ అని నామకరణం చేసు కున్నారు. విజయనగరం నేల మహత్యం, గాలి నైజం మారు తీరావుకి పుట్టుకతోనే (1939) అంటింది. హమేషా కొత్తపూలు విరిసే విశాఖ ప్రభాతం ఆయనపై పూర్తిగా పడింది. తెలుగు కథని జాగృతం చేసిన చా.సో., కా.రా., రావి శాస్త్రి, భరాగో ఇంకా మరెం దరో గొల్లపూడి రెక్క విచ్చే టప్పుడు ఉత్సాహంగా రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి అప్పట్లో సరస్వతీ నిలయం. శంకర మంచి సత్యం, ఉషశ్రీ, జీవీ కృష్ణారావ్, బుచ్చి బాబు లాంటి విశిష్టులు తమ ప్రజ్ఞా పాటవాలతో వెలుగుతున్నారు. ఈ వనంలో తనూ ఒక మల్లె పొదలా ఎదిగి గుబా ళించారు గొల్లపూడి.
పరిమళాలు గాలివాటున చెన్నపట్నందాకా వెళ్లాయి. అన్నపూర్ణ సంస్థ ‘చక్ర భ్రమణం’ ఆధా రంగా తీస్తున్న ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి మాటల రచయితగా మారుతీరావుకి పిలుపు వచ్చింది. ఆయనకు సహజంగా ఉన్న మాటకారితనం సిని మాల్లో బాగా పనిచేసింది. 80 సినిమాలకు కథలు, మాటలు ఇచ్చారు. నటుడిగా 200 పైగా చిత్రాల్లో కనిపించి మెప్పించారు. నటుడు, రచయిత, వ్యాఖ్యాత, వ్యాసకర్త, విశ్లేషకుడు– అన్నిటా రాణిం చారు. నటుడుగా విలనీ, కామెడీ ఇంకా అనేక షేడ్స్ చూపించారు. ‘వందేళ్ల తెలుగు కథకి వందనాలు’ పేరిట కె. రామచంద్రమూర్తి పూనికతో గొల్లపూడి రూపొందించిన టీవీ కార్యక్రమం ఆయన మాత్రమే చేయగలడు. 14వ ఏట నించి సృజనాత్మకంగా ఆయన జీవితం సాగింది. అన్నీ ఒక ఎల్తైతే పాతి కేళ్లపాటు అవిచ్ఛిన్నంగా నడిచిన ఆయన ‘జీవన కాలమ్’ మరో ఎత్తు. బ్రాడ్వే నాటకాలను స్వయంగా వెళ్లి, చూసి వచ్చి ఆయన అందించిన విపుల సమీ క్షలు మనకి విజ్ఞానదాయకాలు. గొల్లపూడికి అక్షర నివాళి.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment