అసలు లీడరు ధారాళంగా ఉపన్యసిస్తూ ఉంటాడు. గంభీరంగా, విసుర్లతో, కసుర్లతో, చేసిన సేవ, మిగిలిన ప్రజాసేవని చెప్పుకుంటూ వెళ్తారు. ఇక్కడో సంప్రదాయం ఉంది. మహా నేత ఏ సభలో ప్రసంగిస్తుంటే ఆ ప్రాంతపు అభ్యర్థి ఎడమవైపున ఒద్దికగా నిలబడి ఉంటారు. క్యాండిడేటు నుదుట చిందరవందరగా వీర తిలకాలు అద్దించుకుని, అలిసిన ముఖంతో, మెడలో పార్టీ కండువాలతో నిలబడి విశాలమైన నవ్వుతో అర్ధ వృత్తాకారంలో మొహం తిప్పుతూ శ్రమిస్తుంటారు.
‘... వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటే మీకు సిగ్గులేదా అని అడుగుతున్నా’ ఆవేశంగా ప్రశ్నిస్తాడు నేత. అభ్యర్థి అదే నవ్వుతో చేతులు జోడించి మరీ ప్రేక్షకులవంక తలతిప్పుతాడు. ‘.. శరం లేదా? బుద్ధి జ్ఞానం లేదా? అని అడుగుతున్నా?’ క్యాండిడేటు అదే యాక్షన్ యాంత్రికంగా చేస్తారు. ‘...అవసరమైతే వ్యవసాయానికే కాదు, ఇళ్లక్కూడా ఉచిత విద్యుత్తు ఇస్తాం. ప్రజాక్షేమమే నాకు ముఖ్యం. ఈ సంగతి మీకు బాగా తెల్సు’. మళ్లీ విశాలమైన నవ్వు.. జనం చప్పట్లలోంచి కని పిస్తుంది. అభ్యర్థి వెక్కిరిస్తున్నాడా, సానుకూలంగా స్పందిస్తున్నాడా అర్థం కాదు. వినిపించే స్పీచ్‌కి, కన్పించే ముఖ కవళికలకి పొంతనే ఉండదు. జాతీయ నేతలొచ్చినప్పుడు అనువాదకులు వేరేమైకులో సిద్ధంగా ఉంటారు. మూల ప్రసంగానికి తెలుగుసేతకి అస్సలు సంబంధం ఉండదు. ఆ మధ్య ఒక పెద్దాయనకి తన మాటలకి అంతగా అన్నిసార్లు నవ్వుతున్నారేమిటని అనుమానం వచ్చిందిట. తీరా ఆరాతీస్తే అదంతా అనువాదకుడి సొంత పొగడ్తల వల్లనేనని అర్థమైందిట. ఏమైతేనేం తన స్పీచ్ అందర్నీ అలరించిందని ఆనందించాడట. పాపం, మన నేతలు అల్పసంతోషులు.
మొన్న మా సెంటర్లో రోడ్ షో దర్శించే మహదవకాశం దొరికింది. అబ్బో, అదొక పెద్ద సందడి. ‘వీటిని ఎదురుపడకుండా చూడాలి. ఇదొక పెద్ద న్యూసెన్సు’ అని చిరాకుపడ్డాడొక పోలీస్ అధికారి. రోడ్ షోలో ఒకర్ని మించి ఒకరు అవాకులు చెవాకులు పేల్తున్నారు. ‘నాకు పోటీగా నిలబడ్డ వ్యక్తి తాహతేంటో మీ అందరికీ బాగా తెలుసు. ఒకప్పుడు నేనున్న పార్టీలోనే ఉన్నాడు. డ్రైనేజీ గుంటల్లో పూడికలు తీసే కాంట్రాక్టుల్లో అడ్డంగా సంపాయించాడు. బతుక్కి కనీసం ఈరోజుకి బీపీగానీ షుగర్‌గానీ లేదు. ఏవిటీయన చేసే ప్రజాసేవ? మళ్లీ అయిదేళ్లకిగానీ చిగురించని మీ విలువైన ఓటుని ఈ అర్హత లేని వాడికి వేస్తారా? ఆలోచించండి. నేను రెండేళ్ల క్రితం గుండె బైపాస్ చేయించుకున్నా. నా బామ్మరిది ఈ మధ్యనే కిడ్నీ మార్పించుకున్నాడు. నా డ్రైవర్‌కి రెండు స్టెంట్లు వేయించి ఖర్చంతా నేనే భరించా’. మీకు తీరిక ఓపిక ఉండాలేగానీ ఇలాంటి ప్రసంగాలు కావల్సినన్ని.
చంద్రబాబు ప్రసంగాలు అరిగిపోయిన రికార్డులు. దేశ ప్రజల సంక్షేమంతప్ప వేరే ఆకాంక్ష లేదు. అవసరమైతే అందుకు కేసీఆర్‌తో అయినా కరచాలనం చేస్తారు. టీడీపీని తెలంగాణలో గెలి పించడం కూడా చారిత్రక అవసరమేనా? చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణలో కొన్ని తప్ప మిగతావన్నీ చంద్రబాబు చలవేనని స్వయంగా చెప్పుకుంటున్నారు. వారి ప్రసంగ పాఠాలు వినగా వినగా అవే కలల్లోకి వచ్చి పీడిస్తున్నాయ్. నిన్న పట్టపగలు నాకో పీడకల వచ్చింది. ఢిల్లీ రాజకోట ముందు పెద్ద వేదికమీద విక్టోరియా రాణి ఇంగ్లిష్ యాసలో మాట్లాడుతోంది. ‘మద్రాస్ నించి కలకత్తా రైల్వేలైను నేనే వేశా, సముద్రం ఉన్నచోట లేనిచోట కూడా హార్బర్లు నేనే కట్టించా, ఊటీ కొండకి రోడ్లు వేయించా, నా హయాంలో సిటీలన్నీ డెవలప్ చేశా, రోడ్లన్నీ వెడల్పు చేశా’ ఇలా నడిచింది. అంతా విస్తుపోయి వింటున్నారు. తర్వాత సూటుబూటులో వచ్చి మౌంట్‌బాటన్ మాట్లాడాడు. ‘ఇండియాకి సంస్కృతీ సంప్రదాయాలు మేమే నేర్పాము’ ఇక ఆపైన జనం మాట సాగనియ్యలేదు. జనం హాహాకారాలకి నేను ఉలిక్కిపడి లేచాను. కల చెదిరింది. ప్రజాస్వామ్యంలో ప్రజాధనంతో ప్రజా సహకారంతో ప్రజోపయోగం కోసం చేసే పనులు నేతలు తమ సొంత ఖాతాలో వేసుకోవడం నేరం కాదా?
వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు
Published Sat, Dec 1 2018 1:16 AM | Last Updated on Sat, Dec 1 2018 1:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment