KI Varaprasad Reddy Tributes To Sri Ramana With Article - Sakshi
Sakshi News home page

Sri Ramana: హాస్యం... సెంటిమెంట్‌ కలిస్తే... అది శ్రీరమణ!

Published Thu, Jul 20 2023 1:49 PM | Last Updated on Thu, Jul 20 2023 1:58 PM

KI Varaprasad Reddy Tributes To Sri Ramana With Article - Sakshi

శ్రీరమణ పేరు చెప్పగానే చాలాకాలం పాటు ఆయన హాస్యం, వ్యంగ్యం గుర్తుకు వచ్చేవి. హాస్యానికీ, వ్యంగ్యా నికీ చిరునామాగా ఆయన పేరే వినబడేదంటే అతిశ యోక్తి కాదు. తర్వాత సినీ రచయితగా, బాపు–రమ ణల అంతే వాసిగా ప్రసిద్ధు లయ్యారు. ‘బంగారు మురుగు’ కథ తర్వాత నుంచి ఆయనకు గొప్ప కథకుడిగా పేరు వచ్చింది. హాస్యమూ, వ్యంగ్యమూ మాత్రమే కాదు, సెంటిమెంటు కూడా అంతే గొప్పగా పండించ గలడన్న సంగతి పాఠక లోకానికి విదితమైంది.
ఇక ‘మిథునం’తో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఏ వృద్ధ దంపతులను చూసినా ‘మిథునం’ గుర్తుకు వచ్చేటంతగా ఆయన పాఠకుల హదయాలపై ముద్ర వేసేశారు. ముసిముసి నవ్వులు పూయించే వికటకవే కాదు, గుండెను తట్టి మనసు పొరల్లో తడి స్రవింపచేసే కవీ తనలో ఉన్నాడని నిరూపించుకున్నారు.

హాస్య ప్రక్రియల్లో అన్నిటికన్న  క్లిష్టమైనది ప్యారడీ రచన. దానికి ఎంతో అధ్యయనం, పరిశీలన కావాలి. రచయిత రచనాశైలిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో పట్టుకోగలగాలి. దాన్ని తరచుగా వాడడాన్ని గమనించి, దాన్ని ఎత్తి చూపితే నవ్వు పుట్టించే అవకాశం ఉందని గ్రహించాలి. దాన్ని ఉత్ప్రేక్షించి, ఆ అవకరాన్ని సామాన్య పాఠకుడి దృష్టికి తీసుకుని రాగల రచనాకౌశలం ఉండాలి. శ్రీరమణ ఆధునిక వచన రచయితలలో ప్రముఖులందరినీ ప్యారడీ చేశారు. వచనాన్ని ప్యారడీ చేయటం అంత సులభం కాదు. వారి మూలరచనలు  చదివినవారికే ఆ ప్యార డీలలో స్వారస్యం బోధపడుతుంది. శ్రీరమణ ఆ సాహిత్యాలన్నీ చదివి ఒంటపట్టించుకున్న పండి తుడు, నిశిత పరిశీలన Výæల విమర్శకుడు, దానిలో వక్రతను పసిగట్ట గలిగిన రసజ్ఞుడు. వారిలో యింకో విశేష మేమిటంటే, ఈయన చేత చురకలు వేయించుకున్న వారు కూడా పగలబడి నవ్వేటంత సంస్కార యుతంగా రాయగలగడం!

పాత్రికేయ ఉద్యోగానికే పరిమితమైతే ఆయన ఒక పరిధిని దాటలేక పోయే వారేమో! కానీ ఆయన మద్రాసు వెళ్లారు. బాపు – రమణలతో చేరారు. వారి సమస్త వ్యవహారాలూ ఈయన చూసే వారు. వారు సొంతానికైతీసిన సినిమాలలో, ఇతరులకు తీసి పెట్టిన సినిమాలలో ఈయన అనేక బాధ్యతలు నిర్వర్తించేవారు. వాళ్లు వెళ్లిన చోటకల్లా వెళుతూ వారిలో ఒకడిగా ఉన్నారు. దీని కారణంగా ఆయనకు ఎంతో విస్తృత ప్రపంచం దర్శనమైంది. ‘బంగారు మురుగు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించ బడినప్పుడు సంచలనాన్ని సృష్టించింది. దాదాపు 800 ఉత్తరాలు వచ్చాయట. ఇది మా బామ్మ కథే అని ఒకరు, కాదు కాదు... మా అమ్మమ్మ కథ అని మరొకరు... ఇలా అందరూ తమని తాము ఐడెంటిఫై చేసేసుకున్నారు. ‘మిథునం’ వెలువడే టప్పటికి అందరూ వారిలో తమ తలిదండ్రులను ఐడెంటిఫై చేసుకున్నారు. శ్రీరమణ పాత్రలు మన నిత్యజీవితంలో చూసేవే. షోడా నాయుడు, ధన లక్ష్మి... వీళ్లందరూ మన చుట్టూ ఉన్నవాళ్లే!

‘ధనలక్ష్మి’ కథలో  ఆయన  వ్రాసిన మాండలిక పదాలు, తెలుగు పలుకుబడులు, తెలుగువారికి దొరికే అరుదైన మృష్టాన్న భోజనం. కొన్ని వర్ణనలు క్రొంగొత్తగా అనిపించి అలరిస్తాయి. 
ఉదాహరణకు:  ‘‘రోషం  కమ్మేసిన  అతని  మొకం  తుమ్మల్లో   పొద్దుగూకి నట్లుంది.’’
‘‘...చీమలకు చక్కెర దొర గ్గాలేంది, మనుషులం మనకు నాలుగు మెతుకులు దొరకవా...’’
‘‘...పిండిమర మెళుకువలన్నీ ఇప్పుడు ధన మ్మకు కొట్టినపిండి...’’
ఇలాంటి చమక్కులెన్నో వారి రచనల్లో కనిపి స్తాయి. 
 శ్రీరమణకు మొహమాటాలు తక్కువ, తెగువ ఎక్కువ. మతం పేరుతో చేసే అట్టహాసాలను వెక్కి రించడంలో దిట్ట. ఆచార వ్యవహారాల కంటె మాన వత్వానికే పెద్దపీట వేసే ‘బంగారు మురుగు’లో బామ్మ స్వాములారిని కడిగి పారేస్తూంటే మనకు లోపల్నుంచి సంతోషం తన్నుకు వస్తుంది. అలాగే ‘అరటిపువ్వు స్వాములా’రి పాత్ర ద్వారా కుహనా ప్రవచనకారులకు చాకిరేవు పెట్టేశారు. 
వారపత్రికా సంపాదకుడిగా ఆయన రాజకీయ నాయకుల గురించి  కూడా  నిర్భయంగా తూర్పార బట్టారు. నిజజీవితంలో కూడా ఆయన వ్యాఖ్యల్లో వెక్కిరింత, మాటల్లో వగరు మనల్ని తాకుతూనే
ఉంటాయి. కానీ ఆయన విమర్శలో ఉన్న వాస్తవం మనల్ని ఆకట్టుకుంటుంది. 
నాకు బాపు–రమణలు అత్యంత ఆప్తులు. వారికి నేను వీరాభిమానిని. శ్రీరమణతో నాకు ఉన్నది పరిమిత పరిచయమే. కానీ వారి రచనలు చాలా ఇష్టంగా చదువుతాను. వారి రచనల ద్వారా, వారిలో ఉన్న హాస్యాన్ని పండించే శైలి ద్వారా సెంటిమెంట్‌ వ్రాయడంలో వారికున్న ప్రతిభ ద్వారా నాకు బాగా నచ్చిన, బాగా ఇష్టపడిన రచయితగా నా మనః
పథంలో శాశ్వతంగా ఉండిపోతారు. అంతేకాకుండా నా ఆప్తమిత్రులు బాపు–రమణలకు అంతేవాసిగా కూడా నేను వారిని బాగా ఇష్టపడతాను.

కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి, వ్యాసకర్త వ్యవస్థాపక ఛైర్మన్,శాంతా బయోటెక్నిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement