తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు | Sri Ramana Guest Column On Present Political Situation | Sakshi
Sakshi News home page

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు

Published Sat, Jun 27 2020 1:08 AM | Last Updated on Sat, Jun 27 2020 1:08 AM

Sri Ramana Guest Column On Present Political Situation - Sakshi

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు /విశ్వదాభిరామ వినురవేమ! అన్న పద్య పాదం సూక్తిగా ప్రచారంలోకి వచ్చింది. మొన్న ఆంధ్రప్రదేశ్‌ గత ప్రభుత్వం చేతగాని అసమర్థ ఆర్థిక నిర్వహణని కాంగ్‌ తూర్పారపట్టింది. వుతికి ఆరేసింది. అక్షింతలు వేసింది. ముక్క చీవాట్లు పెట్టింది. ఇలా పద హారు రకాలుగా చెప్పుకోవచ్చు. కేటాయించిన నిధుల్ని సద్విని యోగం చేయలేక వృథాగా మురగపెట్టారని కంప్ట్రోలర్‌ ఖాతాల వారీగా లెక్కలు చెప్పి మరీ మందలించారు. ప్రపంచ ఆర్థిక సంస్థలకి సూచనలు యిచ్చేది మేమే, రిజర్వ్‌ బ్యాంక్, మాతో సంప్రదించాక అడుగు ముందుకు వేస్తుంది. చిదంబరానికి చిట్కాలు నేర్పింది మేమే. మన్మోహన్‌కి కూడికలు హెచ్చవేతలు మాదగ్గరే దిద్దుకున్నారని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటారు. మరి అంతా కలసి మూకుమ్మడిగా తప్పులో కాలెందుకు వేశారో వారే చెప్పాలి. నక్కలు బొక్కలే వెదుకుతా యని సామెత. తనుదిగి పోయాక ఏమి జరిగినా, జరగక పోయినా నా రోజుల్లో... అంటూ చంద్రబాబు ఫ్లాష్‌బ్యాక్‌లోకి  వెళ్లిపోతారు. అదేదో ఆంధ్రుల స్వర్ణయుగం అయినట్లు కబుర్లు చెబుతారు. ఏ మంచి పనినీ హర్షించే సహనం ఆయనకు లేదు. సరైన లీడర్‌కి వుండా ల్సిన మొదటి లక్షణం ఆ సహనం, ఓర్పు. ఆయనని కిందటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు కాబట్టి యీ ప్రజలు లేదా ఓటర్లెవరూ తనవారు కాదు. ఓటర్లు ఎప్పుడూ వెర్రి గొర్రెల్లా ఒకే ఒక అరుపుతో మందగా వేరే పక్క ఆలోచ నలు లేకుండా ఉండాలని చంద్రబాబు కాంక్ష. కానీ ఎల్లకాలం అలాగే సాగాలంటే చాలా కష్టం. మా వూర్లో ఒక పెద్ద ఆసామి ఆడపడుచులకు చంద్రన్న ఆవుల పంపిణీ పబ్లిసిటీ గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ వుంటాడు. ఒకే ఆవు, ఒక ఆడ పడుచు, ఒక నినాదం అంతే! కొన్ని లక్షల మందికి ఆవుల పంపిణీ జరిగినట్లు సీన్‌ క్రియేట్‌ చేశారు. ఎండ మావిలో నీళ్లు తాగించారు. ఓటర్లు కూడా తగి నట్టుగానే బదులు తీర్చుకున్నారు. చెల్లుకు చెల్లు! ఆఖరికి పంటల బీమా ప్రీమి యంలు కూడా బకాయిలే! చంద్రబాబు విశ్వ విఖ్యాత బకాయిసురుడు!

అతి భయంకరమైన ఓటమిని ఏడాది గడిచి పోయినా నేత జీర్ణించుకోలేకపోతు న్నారు. అందుకని సీనియర్, జూనియర్‌ ప్రతి దానికీ వక్ర భాష్యాలు చెబుతూ కొంత సంతృప్తి చెందుతున్నారు. ఈ సంవత్సరం కూడా రుతుపవనాలు అనుకూలంగా వున్నాయి. అందుకు రాష్ట్ర వాసిగా ఆనందించాలి. గడచిన సంవత్సరం పంటలు బాగు న్నాయి. కరోనా గడ్డుకాలంలో కూడా జగన్‌ యిచ్చిన మాట లన్నీ గడువులు ముందుకు జరిపి మరీ నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఒక్క ఉదాహరణని తన హయాంలో చంద్రబాబు చూపగలరా! ప్రతిదానికీ అవినీతి ఆరోపణలు చెయ్యడం ఆయనకు హెరిటేజ్‌ వెన్నతో పెట్టిన విద్య. మాస్కుల్లో అవినీతి జరిగిందని  ఆరోపణ! ఎన్ని మాట్లాడినా ఎవ్వరూ  దేన్నీ పట్టిం చుకోవడం లేదు. ఇది తెలుసుకొని కొంచెం ప్రభావవంతంగా కాలక్షేపం చెయ్యాలి. ప్రజలు అంతటి గుణపాఠం చెప్పినపుడు మర్యాదగా చంద్రబాబు రాజకీయ సన్యాసం చేయాలి. చివరకు జరిగేది అదే! అయితే స్వయంగా సన్యసించి ఆత్మగౌరవం నిలుపుకున్నారా? లేక ప్రజలు పట్టుబట్టి సన్యాసం అంట గట్టారా? అనేది ముఖ్యం. ఎన్నాళ్లు పాలిస్తే తృప్తి, ఎన్ని తరాలు పాలిస్తే సంతృప్తి?

ఆయన చెప్పిన చెప్పని సంక్షేమ పథకాలన్నింటికీ యీ గడ్డు సమయంలో కోట్లాది రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ పడ్డాయి. పైసా లంచం లేదు. కాళ్ళరిగేట్టు ఆఫీసుల చుట్టూ తిరగడం లేదు. అందుకే ప్రజలు ఆనందంగా వున్నారు. రైతన్నలు, నేతన్నలు, పేద కాపు గృహిణులు జగన్‌ పుణ్యమా అని గలగలలాడుతూ ఖుషీగా వున్నారు. ఈ పంపిణీలో తరు గులు వుండవ్‌. అన్నీ మాట ప్రకారం పైసలతో సహా బ్యాంక్‌లో జమ పడుతుంది. ఆ డబ్బు ఇతర అప్పులకి చెల్లదు గాక చెల్లదు. అది అక్క చెల్లెమ్మలకే అంకితం. మా పథకాలనే మసిపూసి మారేడుకాయ చేసి పంచి పెడుతున్నారని ఒక ఆరోపణ చేశారు చంద్రబాబు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాక ముక్కున వేలేసుకున్నారు. అందరి సంక్షేమం దృష్ట్యా జగన్‌ ఆరంభించిన పథకా లలో మారేడు కాయలేవో, నేరేడు కాయలేవో నిగ్గు తేల్చుకోవాలి. చంద్రబాబు హయాంలో  పథకాలను నామకరణాలు చేయడంతోనే అయి పోయేవి. ఫండ్స్‌ అయితే అస్సలే రాలేవి కావు. పైగా సామాన్య ప్రజలని మీ కలెక్టర్‌ని, మీ అధికారులని నిల దీయండి అని వుసిగొల్పేవారు. అదంతా ఒక పీడకల అని దెబ్బ తిన్న అధి కారొకరు వాపోయారు. 

జగన్‌మోహన్‌రెడ్డి ముందు దేనికైనా ఫండ్స్‌ విడుదల చేసి తర్వాత మాట్లాడతారని ప్రజల్లో నమ్మకం వుంది. బాబు పెట్టిన బకాయిల్ని కూడా యీ ప్రభుత్వం క్లియర్‌ చేసిన సందర్భాలు న్నాయి. ఉత్తుత్తి ప్రచారం వుంటే చాలు. బాబు ఆ చప్పట్ల మోతలో అంతా నిజంగా నమ్మేసి ఓ గంట ప్రసంగిస్తారు. ఒక ఫ్లాష్‌బ్యాక్‌ జ్ఞాపకం రాయలసీమలో చినుకులు లేక పైర్లు ఎండి పోయే స్థితికి వచ్చాయి. రైతులు హాహాకారాలు చేస్తున్నారు. వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొమ్మిది కార్లు దిగారు. క్షణాల్లో ఒక వాటర్‌ గన్‌ ఎండిన చేలో ఏర్పాటైంది. బాబు వాటర్‌ గన్‌లో నీళ్లుతెప్పించి, వలయాకారంగా తిప్పారు. నీళ్లు కురిశాయి. మర్నాడు చంద్రబాబు లక్ష ఎకరాల్లో ఎండి పోయి వున్న పంటని కాపాడినట్టు వార్త పెల్లుబికింది. చివరకు యివన్నీ శాపాలై తగిలాయి.
వ్యాసకర్త ప్రముఖ కథకుడు:శ్రీరమణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement