పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే! | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!

Published Tue, Apr 30 2024 12:26 AM

Sakshi Guest Column On Western Asia

విశ్లేషణ

భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. గల్ఫ్‌ ముడిచమురుపై భారత్‌ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. పైగా యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. అత్యధిక లాభాలనిచ్చే యూరోపియన్  మార్కెట్లకు భారత్‌ తన సరుకులు రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా అన్నది!

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు భారత్‌ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తీవ్రత, నష్టం ఏమిటన్నవి ఇంకా అంచనా వేయాల్సే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బాహ్య పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాగలవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ , రష్యా మధ్య 2022లో యుద్ధం మొదలైన తరువాత పలు దేశాల్లో పరిస్థితులు మారినట్లే పశ్చిమాసియా పరిణామాలు కూడా అంతర్జాతీయంగానే కాకుండా, స్థానికంగానూ కలకలం సృష్టించనున్నాయి. 

పరిస్థితి సద్దు మణగకుంటే... లేదా మరింత దిగజారితే ఇప్పటికే ఎదురవుతున్న పలు సవాళ్లను తట్టుకోవడం కష్టమని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాదు... కొన్ని అసందిగ్ధ పరిస్థితులు ఎదు ర్కోవాల్సి రావచ్చు అని కూడా ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సప్లై చెయిన్ లో వచ్చే ఇబ్బందుల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు కేంద్ర మంత్రి. 

ఆర్థిక పరిపుష్టి మార్గంలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలు అర్థం చేసుకోదగ్గవే. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) 7 శాతం కంటే ఎక్కువ ఉండవచ్చునని ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న వేళ అంతర్జా తీయ సంస్థలు కూడా తమ అంచనాలను సవరించుకుంటున్న విషయం తెలిసిందే. 

ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌ (అంత ర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్‌) ఇటీవలే భారత్‌ జీడీపీ వృద్ధిరేటును 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 6.4 నుంచి 6.6 శాతానికీ, ‘స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ గ్లోబల్‌’ 6.4 నుంచి 6.8 శాతానికీ ఈ ఆర్థిక సంవత్సరపు భారత జీడీపీ రేటును సవరించాయి. అయితే ఈ అద్భుతమైన పురోగతిని అంతర్జాతీయ అంశాలు నిరాశా పూరితం చేసే అవకాశం ఉంది. రానున్న వారాల్లో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఒక దశ దాటాయంటే మాత్రం ఇప్పటివరకూ హెచ్చరికలు అనుకుంటున్న పలు ఘటనలు వాస్తవం కావచ్చు. 

ఒకవేళ ఇరాన్  తన హోర్‌ముజ్‌ జలసంధి ద్వారా ముడిచమురు, సహజవాయువు రవాణాలను నిలిపివేసిందని అనుకుందాం. పెర్షియన్ , ఒమాన్  గల్ఫ్‌లను కలిపే ఈ సన్నటి రవాణా మార్గాన్ని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్  ఏజెన్సీ గుర్తించింది. పర్షియన్  గల్ఫ్‌ నుంచి రవాణా అయ్యే ముడిచమురులో 80 శాతం ఈ జలసంధి ద్వారానే ఖండాలు మారుతుంది. 

భారత దేశం కూడా ఈ ప్రాంతపు ముడిచమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మనపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. భారత్‌ ఉపయోగించే ముడిచమురులో 30 శాతం వరకూ రష్యా నుంచే వస్తున్నా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా, పశ్చిమాసియా, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తూండటం గమనార్హం. హోర్‌ముజ్‌ జలసంధి ఎంత కీలకమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. 

రెండో అంశం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే సూయిజ్‌ కాలువను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఆసియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఈ కాలువకు వెళ్లే మార్గం బాబ్‌ ఎల్‌–మందేబ్‌ అనే చిన్న కాలువ దగ్గరి నుంచి మొదలవుతుంది. యెమెన్  కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న ప్రాంతమిదే. వీరంతా హమాస్‌కు మద్దతుగా ఉన్నవారు. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే రవాణా కొంత ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ (దక్షిణాఫ్రికా) మీదుగా మళ్లింది. ఫలితంగా రవాణ ఖర్చులు పెరిగిపోవడమే కాదు... సమయం కూడా ఎక్కువవుతోంది. పరిస్థితి ముదిరితే అత్య ధిక లాభాలనిచ్చే యూరోపియన్  మార్కెట్లకు భారత్‌ తన సరుకులు రవాణా చేయడం కష్టమవుతుంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎగుమతులు స్తంభించిపోతే వాణిజ్య ప్రవాహాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతాయి.

మూడో ప్రమాదం ఇంకోటి ఉంది. యుద్ధం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. బారెల్‌కు 75–80 డాలర్ల అత్యంత తక్కువ శ్రేణి ధరలు ఇప్పటికే లేకుండాపోయాయి. ప్రస్తుతం బ్రెంట్‌ ముడిచమురు ధరలు 87 నుంచి 89 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇప్పటికైతే ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఘర్షణ ఈ ధరల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇంకొంచెం తీవ్రమైతే అవి పెరగడం ఖాయం.

ముడిచమురు ధరలు పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయి. కరెంట్‌ అకౌంట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోలు, డీజిళ్ల ధరలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే కోరుతూండటం గమనార్హం. ఇది బహుశా ఎన్నికల తరువాతే జరగవచ్చు. అయినా, ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడటం ఖాయం. 

ముడి చమురుకు మనం పెట్టే ఖర్చు మాటెలా ఉన్నా... పశ్చిమాసియా మీద అలుముకున్న యుద్ధమేఘాలు తొలగకపోతే మన వ్యూహా త్మక అవసరాల కోసం స్థిరంగా చమురు అందుబాటులో ఉండటమూ అత్యంత కీలకమే. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగు మతులతోనే తీరుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే?... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా? అన్నది. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు కానీ... మనకు మిత్రదేశాలే అయిన ఇజ్రాయెల్, ఇరాన్ లకు నిగ్రహం పాటించమని కోరడం మాత్రం చేయదగ్గ పనే. ముడిచమురు విషయానికి వస్తే ఇటీవలి కాలంలో వేర్వేరు మార్గాల ద్వారా కొను గోలు చేయడం కొంచెం ఎక్కువైంది. 

అలాగని గల్ఫ్‌ నుంచి వచ్చే లోటు మొత్తం భర్తీ అవుతుందని కాదు. కానీ ఈ మార్గాల గుండా వచ్చే ఇతర సరుకుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయాలు వెత కడం అసాధ్యం. కానీ ఈ ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిణామాలే ఎదురైతే రానూ పోనూ సరుకుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి.

ఘర్షణ తాలూకు ఇతర ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయ లేము. కానీ ఉదాహరణకు రష్యా–ఉక్రెయిన్  యుద్ధం మొదలైనప్పుడు వేర్వేరు లోహాల ధరలు అమాంతం పెరిగాయి. సన్ ఫ్లవర్‌ నూనెలు దొరక్కుండా పోయాయి. ఇలాగే పశ్చిమాసియాలో యుద్ధం లాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య పరిణామాలు తప్పకుండా ఉంటాయి. 

నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే... పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని మాత్రమే ఎవరైనా కోరుకోగలిగేది!

సుష్మా రామచంద్రన్  
వ్యాసకర్త సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement