మొత్తం 40 వేల పాటలు, 16 భారతీయ భాషలు, అన్ని భాషల టాప్ హీరోలకు గాత్రదానం చేసి పుణ్యం కట్టుకున్నారు. పద్మభూషణ్ సన్మానితులు. ప్రతిభ, ఓర్పు, సహనం కలబోసుకున్న త్రివేణి యస్పీ బాలు. తల్లిదండ్రులకు వరపుత్రుడు, భార్యకి పూర్వజన్మ సుకృతం, పిల్లలకి ఆదర్శప్రాయుడైన తండ్రి, జన్మజన్మలకి ఈ అన్నే కావాలనుకునే చెల్లెమ్మలు, ‘మావాడు’ అని విర్రవీగే నెల్లూరు సీమవాసులు, భూమధ్యరేఖ ఎగువన దిగువన బాలు పాట కోసం కలవరించే పిచ్చి అభిమానుల పొగరు, గర్వం నిన్న మధ్యాన్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు (25.9.2020) ఒక్కసారిగా అణిగాయి. తెలుగువాళ్లం ఇంకా ఏం చూసుకు గర్వపడాలి? మాకోసం ఎన్ని విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కొల్లగొట్టుకు తెచ్చారు? ఒక మంద నందుల్ని (21) ఎక్కడెక్కడ నుంచో తోలుకొచ్చి మాకు కైవసం చేశారు. ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని టీవీ షోలని పండించారు? మీరు కనిపించ కుండా ఒక్కపూట గడుస్తుందా? మాకు మీ పాట వినిపించకుండా ఒక గంట గడుస్తుందా? మీ వయసెంతని ఎవరైనా ఎపుడైనా అడిగారా? ఎన్నేళ్లనుంచి ఈ రేయింబవళ్ల కోలాహలం జనం కోసం సాగిస్తారని అడిగామా? బాలూ! నువ్వంటేనే పాటల జాతర. నెల్లూరు సీమలో ఎన్నడో కోయిలలు స్వరాలు మర్చిపోయాయి. బహుశా 1966లో మహా గానగంధర్వుడు గళం విప్పాడని చెవులారా విని, పిక సముదాయం ఒక్క పలుకుమీద నిలిచి సృష్టికి కొరత లేదని కూతలు కట్టుకున్నాయ్. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి... )
వానలో తడియనివారు, ఎండ పొడ సోకని వారు, బాలు మా బంగారు నాయనతో జ్ఞాపకాలు అనుభవాలు లేని వారు ఎవరూ ఉండరు. ఎన్ని భాషల అనుభవాలు, ఎన్నేసి జ్ఞాపకాలు, అనుభవాలు లేని జ్ఞాపకాలు. పాడిన పాటల గురించి కాదు, ఆయన పాడని పాటల గురించి కలలు కంటూ ఉండే వారు. వృత్తిమీద గౌరవం, భయభక్తులు బాలుకి పుటకతో అబ్బిన సుగుణాలు. బాపు రమణలు ‘త్యాగయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు బాలుని సంప్రదించారు. ‘నా భాగ్యం’ అన్నారు నమస్కరిస్తూ. తర్వాత రెండో రోజో, మూడో రోజో బాలసుబ్రహ్మణ్యంగారి తండ్రి సాంబమూర్తి బాపు రమణలని కలవడానికి మా ఆఫీస్‌కి వచ్చారు. పెద్దలు, మీకో మాట చెప్పాలని వచ్చాను. మా వాడికి శాస్త్రీయం తెలియదు. తెలిసి తెలిసి మీరు పెట్టుకున్నారు. ‘అయ్యా, ఒకటికి రెండుసార్లు మూడుసార్లు పాడించండి. కొంచెం దగ్గరగా జరిగి, అవసరమైతే ఒక దెబ్బ వేసైనా సరే, సరిగ్గా పాడించండి’ అని హితవు పలికారు. బాపుగారు ఆ మాటకి పడీపడీ నవ్వారు. ఎందుకంటే అప్పటికే శంకరాభరణం పాటలు గ్లోబ్ మొత్తం మార్మోగుతున్నాయ్. బాపు రమణలకి బాలు అంటే ప్రాణం. 1967 బాపు రమణలు సాక్షి తొలి చిత్రం తీశాక, వెంటనే ‘బంగారు పిచిక’ సినిమా ప్లాన్ చేశారు. మొదట్లో దాని పేరు ‘స్వయంవరం’ ఫొటోకార్డ్స్ కూడా వచ్చాక దానిపేరు మార్చారు. అయితే బంగారుపిచుకలో బాలుని హీరోగా ఎన్నుకున్నారు. అప్పుడు బాలు సుకుమారం అంతటిది. ఆయన సరసన నాయికగా యుద్ధనపూడి సులోచనా రాణిని ఖాయం చేశారు. అయితే, కారణం ఏదైతేనేం ఈ బంగారు పిచిక రెక్కలు విదిల్చి ఎగరనే లేదు. బాపు రమణలకు బాలు సమర్పించిన అపురూప జంట మహదేవన్, పుహళేంది. కడదాకా ఈ స్నేహాలు సాగాయి.
నేటి ప్రఖ్యాత చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ దృష్టి ఆరుద్రపై తొలిసారి పడింది. ఒక టోర్నీకి యస్పీతో ఆరుద్ర స్పాన్సర్ చేయించారు. ఇలాంటి సందర్భాలు బాలు జీవితంలో కోకొల్లలు. హైదరా బాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్టకి బాలు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. బాలుగారి జీవితంలో తీరిన కోరికలు కోటానుకోట్లు. తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి. అదేమంటే నవంబర్ నెల తేట నీటిపై గోదావరి మీద పున్నమి వెన్నెలపై పాపికొండలు దాటి శబరి కలిసేదాకా మూడు లాంచీలు, ఆరు పంట్లు (పంట్ అంటే లాంచీకి టగ్ చేసే ఫ్లాట్‌ఫాం) కట్టుకుని అలా పాడుకుంటూ వెళ్లాలని. అందులో బాలు, బాపురమణ, వేటూరి, ఎ.ఆర్. రెహ్మాన్ (అప్పట్లో దులీప్ ఆయన పేరు) ఇంకా శివమణి (డ్రమ్స్), ఫ్లూట్ మాస్టర్ గుణ ఉంటారు. చిన్న సరంజామాతో బాలు పాటలు పాడతారు. వేటూరి వెన్నెట్లో గోదారి అందాలమీద, దేవిపట్నం రంపచోడవరం అల్లూరి పౌరుషాగ్ని మీద మూడు పల్లవులు, ఆరు చరణాలు చెబుతారు. బాపు ఆ వెన్నెల వెలుగులో లాంచీ తూగులో భద్రాచలంపై కొలువుతీరిన రాముణ్ణి పిచ్చి పిచ్చిగా గీసుకుంటారు. ఇదీ యాత్రా విశేషం.
బాలూ గారూ! పోనీ ఒక్కసారి రాకూడదూ? మన గోదారి యాత్ర పండించుకుందాం. ఎందరో ఎన్నేళ్లుగానో మమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నారు. ఆఖరికి ఇలా జరిగింది. ఏమివ్వగలం ఈ గుప్పెడు అక్షరాలు తప్ప. పైగా మీరు నాకు మరీ ప్రత్యేకం. మీరు నా హీరో... మిథునం ఫేమ్.
వ్యాసకర్త: శ్రీరమణ
ప్రముఖ కథకుడు
తెలుగోడి పొగరు, గర్వం అణిగాయి
Published Sat, Sep 26 2020 2:59 AM | Last Updated on Sat, Sep 26 2020 3:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment