ఉదాశీనయ్యలు–శీను బాబు | Sri Ramana Guest Column On Intellectuals Silence In Sakshi | Sakshi

ఉదాశీనయ్యలు–శీను బాబు

Oct 31 2020 12:43 AM | Updated on Oct 31 2020 12:43 AM

Sri Ramana Guest Column On Intellectuals Silence In Sakshi

ఉదాశీన శీలురు యుగయుగాలుగా ఉన్నారు. వారి ఉదాశీనతవల్లే బోలెడు ఘోరాలు రాజ్యమేలాయి. నిండుసభలో ఇంటికోడల్ని అవమానించినపుడు పెద్దలు మేధావులు.. చెప్పతగినవారు, చెప్పాల్సిన వారు నోరు చేసుకుని ఉంటే కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగి ఉండేది కాదు. త్రేతా యుగంలో కైక వరాలకు దశరథుడు శిరసా వహించినపుడు అయోధ్యలో ఉన్న శిష్టులో వశిష్టులో రంగంలోకి దిగి ఉంటే రామాయణం మరోలా ఉండేది. రాచమర్యాదలకు పోయి ఎవరూ పర్ణశాలల నించి బయటికి రాలేదు. రాజునైనా చక్రవర్తినైనా సమయం వచ్చినప్పుడు దండించే ఖలేజా మేధావి వర్గానికి ఉండి తీరాలి. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే రోజుల్లోనే పెద్దలు చూసీ చూడనట్టు, వినీ విననట్టుండే వారన్నది చరిత్ర చెబుతున్న సత్యం.

ఇక ధర్మం ఒంటికాలుమీద కుంటుతున్న కలియుగం మాట చెప్పాలా? ఇప్పుడు ఈ బుద్ధి పెద్దలకు నైజంగా మారింది. దీన్నే లౌక్యం అంటున్నారు. గోడమీది పిల్లలువలె ఎటైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటున్నారు. రెండువైపులకి సరిపోయే తర్కం అందు బాటులో పెట్టుకుంటున్నారు. సుఖంగా జీవితం వెళ్లిపోవడమే పర మార్థంగా భావిస్తున్నారు. నిజానికి అలాంటివారే మేధావులుగా చెలా మణీ అవుతున్నారు. సూటిగా ప్రశ్నించే దక్షతని వదులుకుంటున్నారు. అన్యాయాన్ని అధర్మాన్ని వేలెత్తి చూపడం నేరమా? కొన్ని వర్గాలకి ప్రత్యేక కవచాలుంటాయా? ఉంటే వారికెవరిచ్చారు? వీటిని నిగ్గు తేల్చాల్సిన మేలి మలుపు ఆధునిక కాలంలో వచ్చింది. ‘అందరూ సమానమే. కొందరు మరింత ఎక్కువ సమానం’ అనే పాత నానుడిని తిరగరాసుకోవాలి.

ఒకనాటి మన పండితరాయలు ముంగండ అగ్రహారీకుడు. ఢిల్లీ షాజహాన్‌ కొలువులో ఉన్నత పదవులు నిర్వహించాడు. క్షుణ్ణంగా లోకం తెలిసినవాడు. లోకంలో నాలుకతో, కళ్లతో ఎంతటి విషయాన్నైనా చప్పరించే వాళ్లుంటారో చక్కగా వివరించి చెప్పాడు. పండిత రాయలు వీధి వెంట వెళ్తుంటే, ఓ చెట్టు నీడన ఎంగిలి విస్తళ్లు తింటూ ఓ గాడిద కనిపించింది. పనిమాలా దాన్ని పలకరించి, ఏం పాపం ఈ ఆకులు తింటున్నావని సానుభూతితో అడిగాడు. గాడిద, ‘చాల్చాలు నా బతుక్కి ఇదే గొప్ప’ అన్నది. ‘ఓసీ వెర్రిమొహమా! ఆ తెలివితక్కువ తనమే నిన్ను గాడిదని చేసింది’ అనగానే, గాడిద ప్రశ్నార్థకంగా చూసింది. ‘పో... వెళ్లు. వెళ్లి రాజుగారి అశ్వశాలలో చేరిపో.. రోజూ ముప్పూటలా ఉత్తమజాతి గుగ్గిళ్లు దాణాగా పెడతారు’ అని పండిత రాయలు సలహా ఇచ్చాడు. గాడిద ఆ సలహాకి ఉలిక్కి పడి, ‘ఆహా, ఎవరైనా చూస్తే నా నడుం విరగ్గొడతారు. నేను నీకేం అపకారం చేశాను స్వామీ’ అని బాధపడింది. పండితరాయలు చిరునవ్వు నవ్వి, ‘అందుకే నీ బతుకు ఇట్లా అఘోరించింది. నువ్‌ అశ్వశాలలో, గుర్రాల పంక్తిలో ఉంటే నువ్వు గుర్రానివే! గుగ్గిళ్లు వేసే సేవకులు అంతే ఆలోచిస్తారు’ అంటూ ధైర్యం ఇచ్చాడు రాయలు. ‘ఎప్పుడైనా రాజుగారి దండ నాయకుడు శాలకి వస్తేనో’ అంది గాడిద. ‘వస్తే రానీ, తోకల్ని లెక్కేసుకుపోతాడు. వాడికి శాల్తీలు సరిపోతే చాలు’ వివరించాడు రాయలు. గాడిదకి కొంచెం కొంచెం ధైర్యం వస్తోంది. 

‘సరే, ఏ మంత్రిగారో వస్తే...?’ అన్నది గాడిద. ‘వస్తేరానీ, చూస్తారు.. వెళ్తారు’ అన్నాడాయన. 
‘స్వయంగా రాజుగారే వచ్చి, చూసి వచ్చే పండుగకి నేను ఊరే గడానికి దీన్ని సిద్ధం చేయండని పురమాయించి వెళితే...’ అనడిగింది గాడిద. 
‘పిచ్చి మొహమా.. ఎందుకు ప్రతిదానికీ అలా కంగారుపడతావ్‌. ఏమీ కాదు. రాజుగారు దూరం నించి వేలు చూపించి వెళ్తారు. ఇహ ఆ క్షణం నించీ నీ మాలీస్‌ వేరు. తిండి వేరు’. 
‘తీరా ఆ రోజు వస్తే...’ అనడిగింది గాడిద. ‘వస్తే బ్రహ్మాండంగా నిన్ను అలంకరిస్తారు. వజ్రాల బొంతలు కప్పుతారు. రాజు ఎక్కే సమ యానికి అది నువ్వో, గుర్రమో అర్థం కాకుండా చేస్తారు’. 

‘వీధిన వెళ్లేప్పుడు పెద్దలు, తమలాంటి పండితులు’ అని గొణి గింది గాడిద.
‘ఓసీ పిచ్చిదానా! మన ప్రజలు మరీ ముఖ్యంగా తెలివితేటలు ఉన్నవారు చాలా ఉదాశీనులు, ఓర్పువంతులు. వాళ్లంతా చూసి నిన్ను గుర్తుపట్టినా.. రాజుగారు సరదాపడ్డారు కాబోలు. మనకెందుకులే అని నోరు మెదపరు. రాజుగారు ఠీవీగా ఊరేగుతారు’ అంటూ దాని వెన్ను చరిచాడు రాయలు. మేధావుల ఉదాశీనత దేశానికి పట్టిన బూజు. పెద్దల మెదళ్లకి బొజ్జలొస్తే శీనయ్యలు ఉదాశీను బాబులు అవుతారు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement