పేరులోననే యున్నది | Gollapudi Maruthi Rao write article Jeevana kalam | Sakshi
Sakshi News home page

పేరులోననే యున్నది

Published Thu, Sep 7 2017 1:19 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

పేరులోననే యున్నది

పేరులోననే యున్నది

జీవన కాలమ్‌
ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించుకోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే.

ఈ మధ్య రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుగారికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. మన దేశంలో రైల్వే ప్రజ లందరికీ మత ప్రమేయం లేకుండా వినియోగపడే ప్రయాణ సాధనం కనుక, విభిన్నమైన సాంస్కృతిక చైతన్యాలను ప్రతిఫలించే దిగా ఉంటే బాగుంటుందని భావించారు. అందు వల్ల ఏం చేయాలి? ఆయా రైళ్లకి వివిధ భాషలలో ప్రముఖ రచయితల రచనల పేర్లను పెడితే– ఆ రైళ్లను తల్చుకున్నప్పుడల్లా ఆయా సంస్కృతుల వైభవం మనసులో కదులుతుందని వారు అభిప్రా యపడ్డారు. ఈ మధ్య రోజుకో రైలు ప్రమాదం జరిగాక– వారు రైల్వే శాఖను వదులుకోవాలని నిర్ణ యించుకున్నాక ఈ ఆలోచన వచ్చిందో లేక ముందే వచ్చిందో మనకు తెలీదు. ఏమైనా సురేష్‌ ప్రభు గారికి ఆయా భాషల రచనల అవగాహన తక్కువని మనం అర్థం చేసుకోవాలి.

ఉదాహరణకి మొన్నటి దురంతో ఎక్స్‌ప్రెస్‌కి ప్రముఖ రచన ‘స్మశానవా టిక’ పేరు ఉంచి– ‘స్మశాన వాటిక ఎక్స్‌ప్రెస్‌’ అన్నారను కోండి– ఆ పేరు సార్థకమయి పోయినట్టే లెక్క. అలాగే తెలుగు వారంతా గర్వించే ‘చివరకు మిగిలేది’ నవల పేరు అటు మొన్న యాక్సి డెంటైన కాలిఫియాత్‌ ఎక్స్‌ ప్రెస్‌కు– ‘చివరకు మిగిలేది ఎక్స్‌ప్రెస్‌’ అని ఉంచితే సార్థ కమయ్యేది. మన తెలుగు వారు గర్వించే మరో గొప్ప రచన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’. అటు మొన్నటి ఉత్కల్‌ ఎక్స్‌ప్రె స్‌ని ‘మహాప్రస్థానం ఎక్స్‌ప్రెస్‌’ అని ఉంటే? గత 5 ఏళ్లలో 586 రైలు యాక్సిడెంట్లు జరిగాయ న్నారు. ఎన్ని రైళ్లకు ఏయే కళాఖండాల పేర్లు పెట్టి మనం సమర్థించగలం? పలానా ఎక్స్‌ప్రెస్‌ని ‘అరి కాళ్లకింద మంటల ఎక్స్‌ప్రెస్‌’ అందామా? ‘కర్రా చెప్పులు ఎక్స్‌ప్రెస్‌’ అందామా? గోదావరి ఎక్స్‌ ప్రెస్‌ని ‘అయ్యో పాపం ఎక్స్‌ప్రెస్‌’ అందామా?

కళాఖండాల పేర్లు ముట్టుకుంటే గొడవల్లో పడ తామని నాకనిపిస్తుంది. ఏమైనా ఇన్నాళ్లకి ఇలాంటి ఆలోచన చేసే మంత్రిగారు రావడం మన అదృష్టం. ఈ దేశంలో జంతు ప్రదర్శన శాలలకు, విమానా శ్రయాలకి, ట్రస్టులకి, అడ్డమైన పథకాలకీ ఇంది రాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీని ఎవడు అడిగాడు? మన రోజులు బాగుండి కాంగ్రెస్‌ పదవిలో లేదు కనుక మనం బతికి పోయాం కానీ ఈ పాటికి ‘రాహుల్‌ గాంధీ’ సంస్థలు పాతికా, ప్రియాంకా గాంధీ సంస్థలు మరో 30 వెలిసి ఉండేవి. మళ్లీ మాట్లాడితే ‘మౌరీన్‌ వాద్రా’ పేరుతో మనకు డజను సంస్థలు వచ్చేవి. ఎవరీ మౌరీన్‌? మన ప్రియాంకాగారి అత్తగారు. మన దేశంలో స్వామి భక్తి పట్టిన, మేధావులు 70 సంవ త్సరాలుగా మన నెత్తిన పెట్టిన దరిద్రమిది.

ఇప్పుడు కొన్ని వైభవాలు చూద్దాం. మన హైద రాబాద్‌ విమానాశ్రయం– రాజీవ్‌గాంధీ విమానా శ్రయం. చెన్నై విమానాశ్రయం– కామరాజ్‌ విమానా శ్రయం. కానీ ఇటలీలో ఒక విమానాశ్రయం పేరు గెలీలియో విమానాశ్రయం. గెలీలియో అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుని పేరుని అజరామరం చేసుకున్న చిన్న దేశమది. మరొక విమానాశ్రయం ‘మైకెలాం జిలో విమానాశ్రయం’. మైకెలాంజిలో గొప్ప శిల్పకా రుడని గుర్తు చెయ్యనక్కరలేదు. మరొకటి ‘లియో నార్డో డివించీ ఎయిర్‌పోర్ట్‌.

తను సృష్టించిన పాత్రను చిరంజీవిని చేసిన ఓ మహా రచయిత ఆర్ధర్‌ కోనన్‌ డాయిల్‌. ఆయన సృష్టించిన పాత్ర షెర్లాక్‌ హోమ్స్‌. లండన్‌ బేకర్‌ స్ట్రీట్‌లో ఇల్లు ఆ పాత్రది. ఇప్పటికీ బేకర్‌ స్ట్రీట్‌లో రైలు ఆగగానే గోడనిండా గొప్పగా షెర్లాక్‌ హోమ్స్‌ బొమ్మ కనిపిస్తుంది. విజ య నగరం స్టేషన్‌లో 125 సంవ త్సరాల చరిత్ర ఉన్న మహా కళాఖండాన్ని సృష్టించిన గుర జాడ ‘గిరీశం’ కనిపిస్తాడా? మన రాజకీయ నాయకుల్ని అడగండి. ‘ఎవరు బాబూ ఈ గిరీశం?’ అంటారు.

ఏతావాతా, నేను సురే ష్‌ప్రభు గారిని అభినందిస్తు న్నాను. మన నెత్తిన ‘రాబర్ట్‌ వాద్రా విశ్వవిద్యాలయం’, ‘మిరయా విశ్వవిద్యాలయం’ (అన్నట్టు మీకీ పేరు తెలియదు కదూ? గత మూడేళ్లు ‘10 జనపథ్‌’ మేడమ్‌ ఈ దేశాన్ని పాలించి ఉంటే ఈపాటికి తమరు ఈ పేరుని గాయత్రిలాగా జపం చేసేవారు. ఇది ప్రియాంకా కూతురు పేరు) అనే ఆలోచనా పరిధి నుంచి బయటికి వచ్చి ఆలో చించే మంత్రులు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ నాదొక విన్నపం. ఆయా మహా రచయి తల రచనలు కాక– వారి పేర్లనే చిరస్మరణీయం చేయండి. చక్కగా దురంతో ఎక్స్‌ప్రెస్‌ని ‘శ్రీశ్రీ ఎక్స్‌ ప్రెస్‌’ అనండి లేదా ‘గోపీచంద్‌ ఎక్స్‌ప్రెస్‌’ అనండి.

పాలక కుటుంబాల అడుగులకు మడుగులొత్తే సంస్కృతి నుంచి బయటపడాలన్న ఆలోచన ఈ దేశానికి మంచి శకునం. ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించు కోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే.

 

   గొల్లపూడి మారుతీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement