జీవన కాలమ్
ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపా యలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావుగారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు.
ఒక వయసు దాటాక మనిషి చిరాయువుగా ఉండటానికి కారణం శరీర ఆరోగ్యం కాదు. మానసిక ఆరోగ్యం. దానిని పుష్కలంగా పెంచుకుని జీవి తాన్ని కళగా జీవించిన అరు దైన మిత్రులు ఇచ్చాపురపు జగన్నాథరావు. కొందరు ఉన్న చోట ఉత్తుంగ తరంగంలాగ లేచి పడుతూంటారు. మరికొందరు ప్రశాంతమైన సరో వరంలాగ హాయిగా, గర్వంగా, తృప్తిగా, హుందాగా జీవిస్తారు. అలా ఆఖరి క్షణం వరకూ జీవించిన గొప్ప కళాత్మకమైన దృష్టి, దృక్పథమూ కలవారు జగన్నాథ రావు. ఆయన నోటి వెంట ఏనాడూ ‘నెగటివ్’ ఆలోచన రావడం ఎరుగను. జీవించడంలో నిర్దిష్టమైన స్పష్టత, ఆలోచనలో అతి నిలకడైన దృక్పథమూ కల ఆఫీసరు రావుగారు. ‘ఆఫీసరు’ని ముందు నిలపడానికి కారణం శషబిషలు లేని ఆలోచనా సరళి. ఒకసారి నాతో అన్నారు: ‘‘మారుతీరావుగారూ! మనం పోయాక మన పిల్లలు పది రోజులు బాధపడతారు. మన మీద ప్రేమ ఉంటే పది నెలలు బాధపడతారు. ఎల్లకాలం బాధ పడాలని మనం కోరుకోకూడదు. అది వారికే మంచిది కాదు. జీవితం సాగాలి. అలా సాగుతూనే ఉండాలి’’.
నాకు అతి తరచుగా జోకులు, అందమైన, ఆలోచ నాత్మకమైన కథలు కంప్యూటర్‌లో పంపే వ్యక్తి రావు గారు. ఎప్పుడూ ‘హాస్యం’ వాటి ప్రధాన అంశం. సరిగ్గా ఆయన వెళ్లిపోవడానికి మూడు రోజుల కిందట జోక్ పంపారు. మొదటి వాక్యం చెప్పాలి: ‘‘నువ్వు రోజూ వ్యాయామం చెయ్యడంవల్ల లాభం– ఆరోగ్యంగా వెళ్లి పోవడానికి దగ్గర తోవ’’. తెల్లబట్టలు వేసుకుని, సూర్యోదయాన్ని చూస్తూ, వేడి కాఫీ తాగుతున్నంత హాయిగా ఉంటాయి ఆయన రచనలు. దేశ అభ్యుదయం, విప్లవం, తిరుగుబాటు– ఇలాంటి మాటలు తెలుగులో ఉన్నాయని కూడా ఆయ నకి తెలీదేమో.
దాదాపు 28 సంవత్సరాల కిందట ఆయన చెన్నైలో కస్టమ్స్ కలెక్టరు. ఆయన చేత చాలా నాటికలు రాయించిన తృప్తి నాది. ఓసారి కథ రాయమని ఫోన్ చేశాను. ‘ఈ ఉద్యోగ రద్దీలో ఇతివృత్తం మనసులో లేదండీ’ అన్నారు. ‘మీ ముందు టేబిలు మీద ఏమేం ఉన్నాయి?’ అని అడిగాను. ఫైళ్లు, టెలిఫోన్, పిన్ కుషన్– ఇలా చెప్పారు. ‘గుండుసూది’ మీద కథ రాయ మన్నాను. ఆ కథ చాలా గొప్పది. ఏళ్ల తర్వాత విహారి ఆ కథని మెచ్చుకున్నారట. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈమెయిల్ పంపారు. ఆఖరి వాక్యాలివి. I recall your inspiration which resulted in a story which was bigger than me. If someone raves about a story a quarter of a century later, there must be something in it. Ego? No. I feel humbled.కృతజ్ఞత చాలా అరుదైన లక్షణం. స్వామిభక్తి, కృతజ్ఞతని– సగం మనిషి, సగం జంతువు ద్వారా మనకి నేర్పాడు వాల్మీకి– రామాయణంలో. (క్షమించాలి. నేను హనుమంతుడనే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. పురాణాన్ని కించపరచడం లేదు. తీరా నా పేరూ అదే!)
ఒక్క సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచు రించిన ‘సురభి’ మాస పత్రికలో నా ఒత్తిడి మేరకి ‘తగిన మందు’ అనే కథ రాశారు. తర్వాత ఏదైనా రాశారేమో నాకు తెలీదు. నా అభిమాన రచన వారి నవలిక ‘గులా బిముళ్లు’. దాన్ని ‘చేదు నిజం’ అనే పేరిట గంట నాట కంగా రేడియోలో ప్రసారం చేశాను. ఏదైనా సభల్లో మాట్లాడే విషయం కుదరనప్పుడు ఆ కథని అనర్గళంగా చెప్పి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి, కొసమెరుపుగా ‘ఇది ఇచ్చాపురపు జగన్నాథరావుగారి రచన’ అని చెప్పడం రివాజు. ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపాయలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావు గారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు.
రావుగారు ఆయన షరతుల మీదే హాయిగా జీవిం చారు. ఆయన షరతులమీదే రచనలు చేశారు. 13వ తేదీ సాయంకాలం ఏడున్నరకి ఓ మంచి జోక్‌ని మా అంద రికీ పంపడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నారు. 7.45కి తల వెనక్కు వేలాడిపోయింది. గుండెపోటు. తన షరతుల మీదే నిష్క్రమించారు. రావుగారు నిగర్వి. కానీ జీవించడంలో తన పరిధుల్ని ఎరిగి, ఆ చట్రం మధ్య అందమైన ముగ్గులాగ జీవితాన్ని పరుచుకుని ప్రశాం తంగా జీవించిన వ్యక్తి.
ఆగస్టు 8న ఆ దంపతులని చూడటానికి వెళ్లాను. వృద్ధాప్యం ముసురుకున్న జీవితాల్ని డిగ్నిఫైడ్‌గా అలం కరించుకోవడం చూశాను. బయలుదేరుతూంటే దంప తులు గుమ్మందాకా వచ్చారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి నట్టు– ‘మీ ఇద్దరి ఫొటో తీసుకుంటాను’ అన్నాను. ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు. ‘ఈమాటు వచ్చిన ప్పుడు తీసుకుందాం’ అని. మరో అవకాశం లేదని ఆనాడు తెలియదు. ఆనాడు తీసుకోని ఫొటో ఒక జీవితకాలం ఆలశ్యం అయి పోయింది.
వ్యాసకర్త ప్రముఖ సినీ రచయత
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment