జీవన కాలమ్
మహా పురుషుల పాద రేణువులతో పవిత్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– సల్మాన్‌ఖాన్ వంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టు లతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవిత్రత’ను కోల్పోదు.
ఈ దేశం అట్టు ఉడికినట్టు ఉడికిపోయింది. కొందరు గుండెలు బాదుకున్నారు. గుండె ధైర్యం చాలని కొందరు చచ్చిపోయారు. ప్రతీ ఊరులోనూ హాహా కారాలు చేశారు. కొన్ని వేల మంది ఆయన ఇంటి చుట్టూ, మరి కొన్ని వేలమంది జోద్ పూర్ జైలు గోడల్ని పట్టుకుని రోదిస్తూ ఆ మహానటుడి దీన వదనాన్ని దర్శించడానికి గుంజాటన పడ్డారు. కారణం– సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక రాత్రి జైల్లో గడపాలి– 20 సంవత్సరాల కిందట నల్లజింకని చంపి నందుకు.. నన్ను క్షమించాలి. నేనెప్పుడూ నా అంతట నేనుగా సల్మాన్ ఖాన్ చిత్రాన్ని చూడలేదు– ఒకసారి మా అబ్బాయి ఒత్తిడి మీద ‘భజరంగీ భాయీజాన్’ చిత్రాన్ని చూసి కంటతడి పెట్టుకున్నాను. అయితే ఆయన కంట తడిని పెట్టించే నటుడు కాదని తర్వాత తెలిసింది. జోద్‌పూర్ జైలు ఆవరణలోకి ఈ నటుడు నడిచి రావడాన్ని మా అబ్బాయి చూపించాడు– టీవీలో, సల్మాన్ ఖాన్ గారి నడకను తమరు ఈ పాటికే గ్రహించి ఉండాలి. పెదాలు బిగించి, రెండు భుజ బాహువుల్లోంచీ రెండు ఈత చెట్లను నిలిపేంత ఠీవిగా నడిచి వచ్చారు. తెల్లారితే రాహుల్, మోదీ లతో మొహం మొత్తే పత్రికలు, చానల్స్ జో«ద్‌పూర్ జైలు ఆవరణ ఆఫీసు గదిలో వారు కాళ్లు దాదాపు జైలర్ మీదికి జాపి కూర్చున్న ఫొటోని ప్రచురిస్తూ– ‘ఈ ఫొటో మొదటిసారి వేస్తున్నది మేమే’ అని గర్వంగా చెప్పుకున్నారు.
మరి 20 ఏళ్ల క్రితం ఈ సుంద రాంగుడు నలుగురు అందమైన అమ్మాయిల్ని తోడు తీసుకుని అడవికి వెళ్లి, అరుదైన అడవి జంతువు నల్ల జింకను చంపిన వైనం ఈ దేశం మరచిపోయింది. న్యాయస్థానాలు వెనక్కి నెట్టాయి. మరి ఇంత చిన్న నేరానికి శిక్ష విధించడానికి 20 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఏ పత్రికా తమ పత్రికల్లో రాయలేదు. ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. డబ్బు, పరపతి, న్యాయ స్థానాలకి సినిమా రంగం మీద ఉన్న భయం (ప్రియం కాదు– గమనించాలి). మన దేశంలో జైలుకెళ్లిన మహానుభావుల్ని ఒకసారి స్మరించుకుని తరిద్దాం. లాలూప్రసాద్ యాదవ్ (వెంటనే వీరినే ఎందుకు స్మరించాలి?). ఒక రిపోర్టు ప్రకారం, వీరి హయాంలో ఒక్క 8 సంవత్సరాలలో మాత్రమే 32 వేల మందిని ఎత్తుకు పోయి, వారిలో చాలామంది డబ్బు చెల్లించాక హత్యలు జరిపించారట.
వీరు కాక ఈ మహానుభావుల జాబితాల్లో ఆసా రామ్ బాపూ, గురు మీత్ సింగ్ రామ్ రహీం ఉన్నారు, వారి ఉంపుడుకత్తె హనీ ప్రీత్ కౌర్ ఉంది. మధుకోడా ఉన్నారు. శిబూ సొరేన్, పండిత్ సుఖ్‌రామ్ ఉన్నారు, ఓం ప్రకాశ్ చౌతాలా, ఎ. రాజా, కనిమొళి ఉంది. వీళ్ల జైలు జీవితం మాటేమోకానీ, ఈ రాత్రి సల్మాన్ ఖాన్ సుఖంగా ఉండటానికి నాలుగు బొంత లిస్తారట. జైలరుగారి అనుంగు పుత్రుడు అవసరమ యితే వాళ్ల నాన్న తల పగులగొట్టి రెండు పరుపులు, నాలుగు దుప్పట్లూ సల్మాన్ గదికి తరలించి, రాత్రంతా ఆయనకి సేవ చేసి, తను చచ్చిపోయేదాకా ఆ అనుభూ తిని పెళ్లాం పిల్లలతో చెప్పుకుని గర్వపడతాడని నా నమ్మకం.
మన దేశంలో బొత్తిగా పనికిరాని, అరెస్టైన కొందరు నేరస్థులను కూడా తలచుకోవడం న్యాయం. జయ ప్రకాశ్ నారాయణ్, క్లుప్తత కోసం కొన్ని పేర్లు– సర్దార్ వల్లభాయి పటేల్, రాజాజీ, పట్టాభి సీతా రామయ్య, మౌలానా అజాద్, లాల్ బహదూర్ శాస్త్రి. వీరందరూ అజరామరమైన కీర్తి శేషులు. మరో మాట లేదు. కావా లనే నెహ్రూ గురించి వ్రాయడం లేదు. కారణం ఆయన ఆ వైభవాన్నీ అనుభవించారు. అంత గొప్పగానూ నిష్క్రమించారు. మరో మూడు పేర్లే రాసి ఈ కాలమ్ ముగిస్తాను. మహాత్మా గాంధీ 2,500 సంవత్సరాల దక్షిణాయతన పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ మహా స్వామి, వినోభా భావే.
మహాత్ముడు సగం జీవి తాన్ని జైళ్లో గడిపాడు. తుండు గుడ్డ, పంచె ఆయన ఆభర ణాలు. జయేంద్ర సరస్వతి మహాస్వామి 61 రోజులు జైల్లో ఉన్నారు. శిరస్సుపైన ఉన్న దివ్య వస్త్రమే (‘శాటి’) వారు ఉప యోగించుకున్నవి. మరొక మహా పురుషుడు వినోభా భావే. మహాత్ముడు నిరాహార దీక్షలలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య మూలాలను పెకలించి, ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టి మార్టిన్ లూథర్ కింగ్, బాద్‌షా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారికి గురువై– ఎన్నో దేశాల స్వాతంత్య్రానికి కారణమ య్యాడు. మరొక మహాస్వామి ఈ జాతి ఆధ్యాత్మిక సంప దను సుసంపన్నం చేశారు. మరొకాయన వినోభా భావే. ఆయన శరీరంలో భాగాలు మందులకు ఎదురు తిరిగితే– ‘ఈ శరీరం ఇక చాలునంటోంది’ అని స్వచ్ఛం దంగా మృత్యువుని ఆశ్రయించిన అపర బీష్ములు. ఇలాంటి మహా పురుషుల పాద రేణువులతో పవి త్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– ఇలాంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టులతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవి త్రత’ను కోల్పోదు.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment