కరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు!
‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ
అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు నేను
ఏం చేస్తూ ఉండి ఉంటానని అతడు
అనుకుంటూ ఉంటాడో అది అడుగుతాడు.
ఒకసారి ఇలాగే ఫోన్ చేసి, ‘‘ఏంటి స్నానం చేస్తున్నావా సల్మాన్! అని అడిగాడు.
‘నేను స్నానం చేస్తూ ఉంటానని ఎందుకు
అనుకున్నావు కరణ్’ అన్నాను. నేనప్పుడు స్నానం చేస్తూనే ఉన్నా, స్నానం చేస్తున్నానని అకారణంగా అతడు ఊహించడం నాకు
నచ్చలేదు. ‘చేయడం లేదు చెప్పు’ అన్నాను.
‘స్నానం చేశాక చెప్పాల్సిన విషయం’ అన్నాడు!
‘అదేంటి!’ అన్నాను.
‘స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటాం. మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ మైండ్‌తో ఉన్నప్పుడు ఫోన్ వస్తే.. ‘ఆ.. చెప్పు’ అనేయకుండా..
‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా?’ అంటాం.
స్నానంలో ఉన్న మహిమ అది’ అన్నాడు.
‘నేనిప్పుడు స్నానమైతే చేయడం లేదు కానీ,
‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా కరణ్’
అనైతే అనగలను’ అన్నాను.
ఆ రోజు అతడేం చెప్పాడో గుర్తు లేదు.
గుర్తుంచుకునేవేవీ కరణ్ చెప్పడు కాబట్టి గుర్తు చేసుకున్నా లాభం లేదు. గుర్తుకు రాకపోయినా నష్టం లేదు. అయినా ఇద్దరు మగవాళ్ల మధ్య స్నానం గురించి అంతసేపు డిస్కషన్ బాగనిపించలేదు.
తర్వాత ఓసారి ఫోన్ చేసి.. ‘ప్రభుదేవా పక్కనే ఉన్నాడా?’ అన్నాడు! ‘ఉన్నాడు’ అన్నాను. ‘రాధే’ పూర్తయ్యే వరకు పక్కనే ఉంటాడు’ అన్నాను. దేవానే ఆ సినిమాకు డైరెక్టర్. ‘అయితే రాధే పూర్తయ్యాక ఫోన్ చెయ్యనా?’ అన్నాడు.
కోపం వచ్చినట్లుంది. ‘సెట్స్ నుంచి బయటికి వచ్చాక నేనే చేస్తాను’ అన్నాను. తర్వాత నేనూ చెయ్యలేదు, అతడూ చెయ్యలేదు.
ఇన్నాళ్లకు మళ్లీ ఫోన్ చేసి ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్?’’ అంటున్నాడు!
‘‘నేనేమీ ఆలోచించడం లేదు కరణ్. నీవ్వెందుకలా ఆలోచిస్తున్నావ్?’’ అని అడిగాను.
‘‘నేను ఆలోచిస్తున్నదే నువ్వూ ఆలోచిస్తున్నావేమోనని తెలుసుకుందామని అలా అన్నాను’’ అన్నాడు!
‘‘నేను రాధే రిలీజ్ గురించి ఆలోచిస్తున్నాను.
మే ఇరవై రెండున రిలీజ్ అవాలి. అవలేదు. నెక్ట్స్ ఎప్పుడు రిలీజ్ డేట్ పెట్టుకోవాలా
అని ఆలోచిస్తున్నాను’’ అన్నాను.
‘‘నీ ఆలోచన సరే. మనిద్దరికీ సంబంధించిన ఆలోచన.. అదీ నేను అడుగుతున్నది’’ అన్నాడు!
‘‘సరే, ఇద్దరి ఆలోచనా ఒకటేదో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. అదే నేనూ ఆలోచిస్తున్నది అవుతుంది’’ అన్నాను. కరణ్ కాసేపు మాట్లాడలేదు. ‘‘కరణ్.. ఉన్నావా?’’ అన్నాను.
‘‘ఉన్నాను.. ఉన్నాను. పాపం ఆ కుర్రాడు.. ఎందుకిలా చేశాడా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు. ఏ కుర్రాడో నాకు స్ట్రయిక్ కాలేదు.
చాలామంది కుర్రాళ్ల గురించి
మాట్లాడుతుంటాడు కరణ్.
చాలామంది కాదు. కుర్రాళ్ల గురించే
మాట్లాడుతుంటాడు.
‘‘నీకు తెలుసు కదా ఆ కుర్రాడు!’’ అన్నాడు.
‘‘ఏ కుర్రాడు?’’ అని అడిగాను. చెప్పాడు.
‘‘కుర్రాడు నాకు తెలియదు కానీ,
నేను ఆ కుర్రాడికి తెలిసే ఉంటాను.
మనోజ్‌తో కలిసి యాక్ట్ చేసేటప్పుడు మనోజ్ కాళ్లకు దండం పెట్టాడట కదా. నాకూ అలానే పెట్టే ఉంటాడు. గుర్తుకు రావడం లేదు’’ అన్నాను.
‘‘పాపం కదా.. సల్మాన్’’ అన్నాడు.
‘‘కుర్రాళ్ల గురించి ఆలోచించడం మానేయ్ కరణ్. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది’’ అని చెప్పాను.
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment