Madav shinga raju
-
మెహబూబా ముఫ్తీ (కశ్మీర్ నేత) రాయని డైరీ
ఏడాదిగా నేను వెలుగునే చూడలేదు! శ్రీనగర్‌లో నేను బందీగా ఉన్న ఈ ఫెయిర్ వ్యూ గృహంలో నిరంతరం విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఎన్ని దీపాలు వెలుగుతుంటే ఏంటి? బయటి వెలుగే సోకకుండా! నా తోటి వారందరినీ విడుదల చేసి మోదీజీ నన్ను మాత్రం నిర్బంధంలోనే ఉంచేశారు! సజ్జద్ గనీని ఆగస్టు ఐదుకు నాలుగు రోజుల ముందే వదిలిపెట్టారు. ఫరూక్ అబ్దుల్లాను, ఒమర్ అబ్దుల్లాను ఆగస్టు ఐదుకు ఐదు నెలల ముందే వదిలిపెట్టారు. నన్ను కూడా సజ్జద్ తర్వాత ఆగస్టు ఐదు లోపే వదిలి పెడతారనే ఆశించాను. అయితే ఆగస్టు ఐదు తర్వాత కూడా ఇంకో మూడు నెలలు నేను ఈ నిర్బంధంలోనే ఉండిపోవాలని మోదీజీ ఆశిస్తున్నట్లు వరండాలో నా నుంచి కశ్మీర్‌కు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి ఎవరితోనో అంటుంటే ఆ మాటలు వినిపించాయి. ‘‘ఏంటి! ఇంకో మూడు నెలలు నేను బందీగానే ఉండిపోవాలా!’’ అని అతడిని పిలిచి అడిగాను. ‘‘మేడమ్‌జీ.. మీరిలా ప్రతిసారీ నన్ను పిలిచి ఏదో ఒకటి అడగడం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద శిక్షార్హమైన నేరం. ఆ నేరానికి శిక్ష మీకు పడుతుందా, నాకు శిక్ష పడుతుందా అనేది చెప్పలేను కానీ నేరం నేరమే’’ అన్నాడు! ‘‘ప్రతిసారీ నిన్నెప్పుడు పిలిచాను?!’’ అని అడిగాను ఆశ్చర్యపడుతూ. ‘‘ఫరూక్ సార్ విడుదలైనప్పుడు పిలిచారు. ఒమర్ సార్ విడుదలైనప్పుడు పిలిచారు. ఇప్పుడు సజ్జద్ సార్ విడుదలైనప్పుడూ పిలుస్తున్నారు’’ అన్నాడు. ‘‘నేనేమీ కొత్తగా ప్రశ్నలు అడగడానికి పిలవడం లేదు. నేను ఇంకో మూడు నెలలు నిర్బంధంలోనే ఉండిపోవాలని మోదీజీ ఆశిస్తున్నట్లు నువ్వు ఎవరితోనో అంటుంటే వినిపించి పిలిచాను’’ అన్నాను. ‘‘అది నా వ్యక్తిగతమైన విషయం అవుతుంది మేడమ్‌జీ. నేను మాట్లాడుతున్నది మీ గురించే అయినప్పటికీ, మాట్లాడుతున్నది మీతో కాదు కనుక అది నా వ్యక్తిగతమైన విషయమే. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నా వ్యక్తిగత విషయాలను నిర్బంధంలో ఉన్న వారితో పంచుకోవడం కూడా నేరమే కావచ్చని నా భయం. మీరు అడిగారు కాబట్టి మీకు అవసరంలేని ఒక విషయం చెప్పగలను. ఎవరితోనూ పంచుకునే వీలులేకనే నేను ఎవరో ఒకరితో పంచుకుంటున్నాను. అది మీరు విన్నారు’’ అన్నాడు. నవ్వాను. ‘‘నేను నా వ్యక్తిగత విషయాలను నీతో పంచుకుంటే అది కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నేరం అవుతుందన్న భయం కనుక నీకు లేకపోతే మోదీజీ గురించి నీతో నేను కొద్దిసేపు మాటల్ని పంచుకుంటాను..’’ అన్నాను. ‘‘మోదీజీ గురించి నాతో మాట్లాడాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మేడమ్‌జీ? మీరు అనుకోవలసింది నేరుగా మోదీజీతోనే మాట్లాడాలని కదా!’’ అన్నాడు. ‘‘నిన్నూ, మోదీజీని నేను వేర్వేరుగా చూడటం లేదు. కశ్మీర్ నుంచి ఆయన భారత ప్రజల్ని కాపాడుతున్నారు. నా నుంచి నువ్వు కశ్మీర్ ప్రజల్ని కాపాడుతున్నావు. ఇద్దరూ ఒకటే..’’ అన్నాను. అతడి ముఖం వెలిగిపోయింది. ఆగస్టు ఐదున కశ్మీర్లో త్రీసెవెంటీని రద్దు చేశాక ఈ ఏడాదిలో నేను చూసిన తొలి వెలుగు అది! ‘‘అందర్నీ వదిలిపెట్టి, నన్నిలా వదిలేశారు. మోదీజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి?!’’ అని అడిగాను. గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ‘‘మేడమ్ జీ.. నేనొకటి చెబుతాను నిరుత్సాహపడకండి’’ అన్నాడు. చెప్పమన్నట్లు చూశాను. ‘‘మోదీజీని ఎవరి సమయాన్ని బట్టి వారు అర్థం చేసుకోవలసిందే. ఒకే సమయంలో ఇద్దరికి ఆయన ఎప్పుడూ అర్థం కారు..’’ అన్నాడు!! -మాధవ్ శింగరాజు -
ఎల్.కె. అడ్వాణీ (బీజేపీ లీడర్) రాయని డైరీ
నెమ్మదిగా వెళ్లి వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్‌లో కూర్చున్నాను. అటువైపు సీబీఐ స్పెషల్ జడ్జి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అతడు ఉన్నది లక్నోలో. నేను ఉన్నది ఢిల్లీలో. ‘‘మొదలు పెడదామా మిస్టర్ అడ్వాణీ..’’ అన్నాడు. జడ్జి వైపు చూశాను. ‘‘మిస్టర్ అడ్వాణీ, చెప్పండి.. ఆ రోజు కరసేవకుల్ని రెచ్చగొట్టి మీరే కదా అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం అవడానికి ప్రేరణ అయ్యారు?’’ అన్నాడు నేరుగా నన్ను గుచ్చి చూస్తూ! అతడెలా అడిగాడంటే.. నా కళ్లలో ఇప్పటికీ కరసేవకులు గునపాలతో ఆ కట్టడాన్ని కూలగొడుతున్న దృశ్యం కనిపిస్తున్నట్లుగా అడిగాడు. ‘‘మీరు ఏ కట్టడం గురించి అడుగుతున్నారో ఆ కట్టడం గురించి నాకసలు ఏమీ తెలీదు. అడ్వాణీకి తెలుసు అని మీతో ఎవరైనా చెప్పి ఉంటే, లేదా మీకై మీరు ఊహించి ఉంటే మీరు విన్నది నిజం కాదు. మీ ఊహా ఎటూ నిజం కాబోదు..’’ అని చెప్పాను. జడ్జి ఒక్క క్షణం ఆగాడు. ‘‘మిస్టర్ అడ్వాణీ.. మిమ్మల్ని నేను అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఒక వెయ్యీ నలభై తొమ్మిది ఉన్నాయి. నా ప్రతి ప్రశ్నకూ మీరు ఒక వెయ్యీ యాభై సమాధానాలు ఇచ్చుకుంటూ పోతుంటే కొన్ని గంటల్లోనో, కొన్ని రోజుల్లోనో, కొన్ని సంవత్సరాల్లోనో మేము మీ నుంచి స్టేట్మెంట్ తీసుకోలేం. ఆగస్టు 31 లోపు మా విచారణ పూర్తవాలని సుప్రీంకోర్టు మమ్మల్ని ఆదేశించింది కనుక మేము మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు మాకిచ్చే సమాధానాలను ఉప ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా పరిమితం చేసుకోవడం వల్ల ఈ తొంభై రెండేళ్ల వయసులో మీరు మీ మధ్యాహ్న భోజనాన్ని వేళ తప్పకుండా తీసుకునేందుకు కూడా ఎలాంటి అంతరాయమూ ఏర్పడబోదని నేను భావిస్తున్నాను’’ అన్నాడు!! ‘‘ఢిల్లీలో నా భోజన వేళల గురించి లక్నోలో ఉండి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు మిస్టర్ జస్టిస్. ప్రశ్నలూ సమాధానాలు అనేవి అడగడాన్ని బట్టి, చెప్పడాన్ని బట్టి తమ విస్తృతిని, సుదీర్ఘతను కలిగి ఉండవు. వాటిని కుదించుకోవడంలో ప్రావీణ్యం లేకపోవడం వల్లనే అవి విస్తరిస్తాయి. నన్ను అడిగేందుకు మీ దగ్గర సిద్ధంగా ఉన్న ఒక వెయ్యీ యాభై ప్రశ్నలన్నిటికీ నేను ఇవ్వవలసిన సమాధానాలను రెండంటే రెండే సమాధానాలుగా కుదించుకోగలను. నా రెండు సమాధానాలకు తగ్గట్లు మీరు మీ ఒక వెయ్యీ యాభై ప్రశ్నలను రెండంటే రెండే ప్రశ్నలుగా కుదించుకోగలరా? అప్పుడు లక్నోలో మీ భోజనం వేళల గురించి కూడా ఢిల్లీ నుంచి నేను ఆందోళన చెందవలసిన పని ఉండదు..’’ అన్నాను. జడ్జి ముఖం అప్రసన్నం అయింది. ‘‘మిస్టర్ అడ్వాణీ.. సులువుగా పని చేయడం ఒకటి ఉంటుంది. పద్ధతిగా పని చేయడం ఒకటి ఉంటుంది. సులువైన పద్ధతిలోకి వెళ్లామంటే సులువు అవడం కోసం పద్ధతి తప్పుతున్నామనే. సీబీఐ ఎప్పుడూ అలా చేయదు. చెప్పండి. నా రెండో ప్రశ్న.. మసీదు కూల్చివేతకు రెండేళ్ల ముందు మీరు అరెస్టు అయ్యారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు కరసేవకులు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఇవన్నీ కూల్చివేత కుట్రలో భాగమైన పరిణామాలే కదా..’’ అన్నాడు! ‘‘నేనే కుట్రా పన్నలేదు. నా మీదే కుట్రలు పన్నారు’’ అని చెప్పాను. ‘‘ఇవేనా.. రెండుగా కుదించుకున్న మీ సమాధానాలు?’’ అనేసి, లంచ్కేమో లేచాడు. డెబ్బై ఐదేళ్ల వయసులో డిప్యూటీ పీఎంగా ఉన్నప్పుడు నా దగ్గర ఎన్ని సమాధానాలైతే ఉన్నాయో.. ఈ తొంభై రెండేళ్ల వయసులోనూ అన్నే సమాధానాలు ఉన్నాయి. సీబీఐయ్యే అనవ సరంగా ప్రశ్నలు పెంచుకుంటూ వస్తోంది. -మాధవ్ శింగరాజు -
సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీ
కరణ్ ఫోన్ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్?’ అని అతడు ఎప్పుడూ అడగడు. అతడు ఫోన్ చేసినప్పుడు నేను ఏం చేస్తూ ఉండి ఉంటానని అతడు అనుకుంటూ ఉంటాడో అది అడుగుతాడు. ఒకసారి ఇలాగే ఫోన్ చేసి, ‘‘ఏంటి స్నానం చేస్తున్నావా సల్మాన్! అని అడిగాడు. ‘నేను స్నానం చేస్తూ ఉంటానని ఎందుకు అనుకున్నావు కరణ్’ అన్నాను. నేనప్పుడు స్నానం చేస్తూనే ఉన్నా, స్నానం చేస్తున్నానని అకారణంగా అతడు ఊహించడం నాకు నచ్చలేదు. ‘చేయడం లేదు చెప్పు’ అన్నాను. ‘స్నానం చేశాక చెప్పాల్సిన విషయం’ అన్నాడు! ‘అదేంటి!’ అన్నాను. ‘స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటాం. మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ మైండ్‌తో ఉన్నప్పుడు ఫోన్ వస్తే.. ‘ఆ.. చెప్పు’ అనేయకుండా.. ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా?’ అంటాం. స్నానంలో ఉన్న మహిమ అది’ అన్నాడు. ‘నేనిప్పుడు స్నానమైతే చేయడం లేదు కానీ, ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా కరణ్’ అనైతే అనగలను’ అన్నాను. ఆ రోజు అతడేం చెప్పాడో గుర్తు లేదు. గుర్తుంచుకునేవేవీ కరణ్ చెప్పడు కాబట్టి గుర్తు చేసుకున్నా లాభం లేదు. గుర్తుకు రాకపోయినా నష్టం లేదు. అయినా ఇద్దరు మగవాళ్ల మధ్య స్నానం గురించి అంతసేపు డిస్కషన్ బాగనిపించలేదు. తర్వాత ఓసారి ఫోన్ చేసి.. ‘ప్రభుదేవా పక్కనే ఉన్నాడా?’ అన్నాడు! ‘ఉన్నాడు’ అన్నాను. ‘రాధే’ పూర్తయ్యే వరకు పక్కనే ఉంటాడు’ అన్నాను. దేవానే ఆ సినిమాకు డైరెక్టర్. ‘అయితే రాధే పూర్తయ్యాక ఫోన్ చెయ్యనా?’ అన్నాడు. కోపం వచ్చినట్లుంది. ‘సెట్స్ నుంచి బయటికి వచ్చాక నేనే చేస్తాను’ అన్నాను. తర్వాత నేనూ చెయ్యలేదు, అతడూ చెయ్యలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఫోన్ చేసి ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్?’’ అంటున్నాడు! ‘‘నేనేమీ ఆలోచించడం లేదు కరణ్. నీవ్వెందుకలా ఆలోచిస్తున్నావ్?’’ అని అడిగాను. ‘‘నేను ఆలోచిస్తున్నదే నువ్వూ ఆలోచిస్తున్నావేమోనని తెలుసుకుందామని అలా అన్నాను’’ అన్నాడు! ‘‘నేను రాధే రిలీజ్ గురించి ఆలోచిస్తున్నాను. మే ఇరవై రెండున రిలీజ్ అవాలి. అవలేదు. నెక్ట్స్ ఎప్పుడు రిలీజ్ డేట్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాను. ‘‘నీ ఆలోచన సరే. మనిద్దరికీ సంబంధించిన ఆలోచన.. అదీ నేను అడుగుతున్నది’’ అన్నాడు! ‘‘సరే, ఇద్దరి ఆలోచనా ఒకటేదో ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. అదే నేనూ ఆలోచిస్తున్నది అవుతుంది’’ అన్నాను. కరణ్ కాసేపు మాట్లాడలేదు. ‘‘కరణ్.. ఉన్నావా?’’ అన్నాను. ‘‘ఉన్నాను.. ఉన్నాను. పాపం ఆ కుర్రాడు.. ఎందుకిలా చేశాడా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు. ఏ కుర్రాడో నాకు స్ట్రయిక్ కాలేదు. చాలామంది కుర్రాళ్ల గురించి మాట్లాడుతుంటాడు కరణ్. చాలామంది కాదు. కుర్రాళ్ల గురించే మాట్లాడుతుంటాడు. ‘‘నీకు తెలుసు కదా ఆ కుర్రాడు!’’ అన్నాడు. ‘‘ఏ కుర్రాడు?’’ అని అడిగాను. చెప్పాడు. ‘‘కుర్రాడు నాకు తెలియదు కానీ, నేను ఆ కుర్రాడికి తెలిసే ఉంటాను. మనోజ్‌తో కలిసి యాక్ట్ చేసేటప్పుడు మనోజ్ కాళ్లకు దండం పెట్టాడట కదా. నాకూ అలానే పెట్టే ఉంటాడు. గుర్తుకు రావడం లేదు’’ అన్నాను. ‘‘పాపం కదా.. సల్మాన్’’ అన్నాడు. ‘‘కుర్రాళ్ల గురించి ఆలోచించడం మానేయ్ కరణ్. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది’’ అని చెప్పాను. -మాధవ్ శింగరాజు -
ప్రియా వారియర్ (స్టూడెంట్) రాయని డైరీ
ప్రతి మనిషికీ లైఫ్‌లో ఏదో ఒక టైమ్‌లో ఎవరో ఒకరి మోరల్ సపోర్ట్ అవసరమౌతుంది! సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా బతికేయొచ్చు. మోరల్ సపోర్ట్ లేకపోతే.. బతికే ధైర్యమే ఉండదు. తిండికి అమ్మ సపోర్ట్, కాలేజ్‌కి నాన్న సపోర్ట్. అంతవరకు ఓకే. బయట ఏదైనా సమస్య వచ్చినప్పుడే.. ఇంట్లో అమ్మానాన్న ఇచ్చే సపోర్ట్ సరిపోదు. బయటి నుంచి మోరల్ సపోర్ట్ రావాలి. ఇంట్లో ఇంత తిని, కాలేజ్‌కి వెళ్లొచ్చి, మళ్లీ రాత్రికి ఇంత తింటే తిని, నిద్రొచ్చే వరకు వాట్సాప్ చూసుకుంటూ, తెల్లారే లేచి మళ్లీ కాలేజ్‌కి వెళ్లొస్తుంటే.. సమస్యలేం ఉండవు. ఇల్లు, కాలేజీ కాకుండా.. ఆడపిల్ల ఇంకో ప్లేస్‌లో కనిపిస్తేనే మోరల్ సపోర్ట్ కోసం చూడాల్సి వస్తుంది! అలాగని ఇష్టమైన ప్లేస్‌లకు వెళ్లకుండా ఎలా?! సమాజం.. విలువల్ని పట్టుకుని వేలాడుతోందని, ఆడపిల్లలూ ఇంటిని పట్టుకుని వేలాడాలా?! కోర్టుకు రమ్మని సమన్లు వచ్చిన రోజు చూడాలి ఇంట్లో! ‘మన వంశంలో లేని పనులు ఎందుకంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎవరో కేసు వేశారు. పరువు పోయింది’ అన్నారు నాన్న. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఆయన. సోషల్ మీడియాలో నేను వైరల్ అయినందుకు ఆఫీస్‌లో అంతా ఆర్నెల్లుగా నాన్నకు కంగ్రాట్స్ చెబుతూనే ఉన్నారట. ‘నీకేమైనా సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందా తల్లీ.. వాళ్లలా కంగ్రాట్స్ చెబుతుంటే నేను థ్యాంక్స్ చెప్పడానికి!’ అన్నారు. ‘సివిల్స్‌లో ర్యాంక్ వస్తే వైరల్ అవుతారా.. నాన్నా..’ అనబోయాను. ‘అయినా.. ఆ కన్ను గీటటం ఏంటే?’ అంది అమ్మ.. నా బుగ్గలు నొక్కేస్తూ. ఆ రోజు అమ్మ, నాన్న.. ఇద్దరూ నా గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు. ‘సర్లే.. భయపడకు’ అన్నారు. అది నాకు ధైర్యం చెప్పినట్లు లేదు. వాళ్లకు వాళ్లు ధైర్యం చెప్పుకున్నట్లే ఉంది. నవ్వాను. ‘‘ఏంటే నవ్వుతున్నావ్?’’ అంది అమ్మ. ‘ఇంకెప్పుడూ కన్ను గీటనులే’ అని అమ్మకు కన్ను గీటాను. సపోర్ట్ ఇచ్చేవాళ్లు చుట్టూ చాలామందే ఉంటారు. మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్లే.. కేరళలో ఒకరిద్దరు, ఢిల్లీలో ఇద్దరుముగ్గురు ఉంటారు. ఫస్ట్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది రాహుల్ గాంధీ. ఇవ్వడం అంటే.. ఫోన్ చేసి ‘ఏం పర్లేదు ప్రియా’ అని చెప్పడం కాదు. సినిమా కోసం నేను చేసిన పనే, పార్లమెంటులో ఆయన చేశారు. కన్నుగీటారు. మనం చేసిన పనే మరొకరు చేస్తే అంతకుమించిన మోరల్ సపోర్ట్ ఏముంటుంది? నిన్న మళ్లీ ఢిల్లీ నుంచి సపోర్ట్ వచ్చింది. ఈసారి సుప్రీంకోర్టు నుంచి. ముగ్గురు జడ్జిలు నన్ను సపోర్ట్ చేశారు. ‘ఎవరో సినిమా తీస్తే, ఎవరో పాట పాడితే, ఎవరో అందులో యాక్ట్ చేస్తే.. వేరే పనేమీ లేనట్లు కేసు వెయ్యడమేనా?’ అని.. నాపై కేసు కొట్టేశారు. సుప్రీంకోర్టే కొట్టేశాక.. ఇక ఏ దేవుడి కోర్టు నన్ను దైవదూషణ కింద శిక్షిస్తుంది! ఈ నెలలో నా బర్త్‌డే. సుప్రీంకోర్టు నుంచి అడ్వాన్స్‌గా నాకు బర్త్‌డే విషెస్ వచ్చినంత ఆనందంగా ఉంది. ఈ నెలలోనే.. నేను కన్ను గీటిన సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ నెలలోనే.. దుల్ఖర్తో నేను యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. అవి కూడా నాకు బర్త్‌డే గిఫ్ట్‌లు. ఊహు.. బర్త్‌డే గిఫ్టులు కాదు.. బర్త్‌డే లే! -
ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇంత వైరుధ్యమా?!
బ్లెనిమ్ ప్యాలెస్‌కు వెళ్లేటప్పటికి భార్యాభర్తలిద్దరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. థెరిసా మే గ్రేస్‌ఫుల్‌గా ఉంది! ‘నా భర్త ఫిలిప్స్’ అంటూ ఓ వ్యక్తిని పరిచయం చేసింది. థెరిసా చలాకీగా ఉంది. మెలానియ కన్నా పన్నెండేళ్లు పెద్ద. అయినా చలాకీగా ఉంది. ‘చూశావా?’ అన్నట్లు మెలానియ వైపు చూశాను. ‘చూస్తూనే ఉన్నా..’ అన్నట్లు చూసింది. థెరిసా తను వెనుక ఉండి, నన్ను ముందుకు నడిపిస్తోంది! ప్యాలెస్‌లోకి ఒక్కో మెట్టూ ఎక్కిస్తోంది. స్త్రీలో ఆ చొరవ ఉండాలి. అన్నీ మగాళ్లే చేస్తుంటే మహరాణుల్లా కోట పైభాగం ఎక్కి సామ్రాజ్యాన్ని వీక్షించడం కాదు. ‘‘నేను నడవగలను థెరిసా.. అంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘శ్రమ కాదు. సంప్రదాయం’’ అంది. మెలానియ నా వెనుక ఉంది. ఆమె వెనుక.. బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఎవరున్నారో మరి. వెనక్కు తిరిగి చూద్దాం అనుకున్నాను. థెరిసా తల తిప్పుకోనివ్వడం లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడికి వెళ్లబోతున్నాం థెరిసా?’’ అని అడిగాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీకోసం బ్లాక్ టై డిన్నర్ సిద్ధంగా ఉంది’’ అంది. ‘‘అందులోకి ఏముంటుంది థెరిసా’’ అని అడిగాను. ‘‘స్కాట్లాండ్ దేశపు సాల్మన్ చేపలు, వేయించిన హార్ఫోర్డ్ ఎద్దు మాంసం ఫిలెట్స్, గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌లో బిగుసుపోయిన స్ట్రాబెర్రీస్..’’ అని చెప్పింది. అన్నీ నాకు ఇష్టమైనవే! మెలానియకు, థెరిసాకు ఎంత తేడా! ‘డిన్నర్‌లోకి ఏముంది మెలానియా’ అని ఎప్పుడైనా అడిగితే.. ‘ఏమో నాకేం తెలుసు?’ అని విసురుగా అంటుంది.. పింగాణీ ప్లేట్‌ని ఎత్తి ముఖానికి కొట్టినట్టు! ఇద్దరు ఆడవాళ్ల మధ్య సృష్టిలో ఇంత వైరుధ్యం ఏమిటో?! ‘‘నాకోసం చాలా శ్రమ పడినట్లున్నారు థెరిసా’’ అన్నాను. ‘‘సంప్రదాయం’’ అంది మళ్లీ. ట్రంపెట్స్ చప్పుళ్లలో ఎవరి మాటా ఎవరికీ వినిపించడం లేదు. డిన్నర్ హాల్లోకి వెళ్లి కూర్చున్నాం. హాలు నిశ్శబ్దంగా ఉంది. థెరిసా కూడా నిశ్శబ్దంగానే ఉన్నట్లు గమనించాను. నాకై నేను అడగడమే కానీ, తనకై తనేం చెప్పడం లేదు! ‘‘సారీ.. థెరిసా, మీ గురించి నేను అన్నది వేరు. పత్రికలు రాసింది వేరు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రశంసించాను. కానీ ఎంతగానో విమర్శించినట్లు రాశారు వాళ్లు’’ అని చెప్పాను. ‘‘ప్రెస్‌వాళ్లు ఉన్నదే అందుకు కదా మిస్టర్ ప్రెసిడెంట్’’ అని నవ్వింది థెరిసా. ఎంత చక్కగా అర్థం చేసుకుంది! దేవుడు స్త్రీలందరినీ ఒకేలా ఎందుకు పుట్టించడో మరి! ముఖాలు వేర్వేరుగా ఉంచేసి, మనసులన్నీ ఒకేలా ఉంచాలన్న ఐడియా అతడికి ఎప్పటికైనా వస్తుందా? - మాధవ్ శింగరాజు -
రాం మాధవ్ (బీజేపీ ప్రధాన కార్యదర్శి) రాయని డైరీ
గవర్నర్ పాలన విధించాక ఈ మూడు రోజుల్లో కశ్మీర్‌కు కాస్త కళ వచ్చింది. జమ్మూ లోయలో పూలు చక్కగా వికసిస్తున్నాయి. సీజన్ కాదు కాబట్టి కశ్మీర్లో ఆపిల్స్ మాత్రం కనిపించడం లేదు. ఆగస్టు నాటికి అవీ వచ్చేస్తాయి. మూడు రోజుల గవర్నర్ పాలనకే కశ్మీర్ ఇంత కన్నుల పండుగగా ఉంటే బీజేపీ పవర్లోకి వస్తే ఇంకెంత మనోహరంగా ఉంటుందోనని.. ముఫ్తీ మెహబూబా, ఒమర్ అబ్దుల్లా తప్ప.. కశ్మీర్ ప్రజలందరూ ఇళ్లలో కూర్చుని, కిటికీల్లోంచి చేతులు బయటపెట్టి, వాన చినుకుల్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది! సిగ్నిఫికెంట్ ఛేంజ్! ‘‘మీరూ ఇక్కడికే షిఫ్ట్ అయిపోండి రామ్‌జీ’’ అన్నారు కశ్మీర్‌లోని మా ఎమ్మెల్యేలు. నవ్వాను. ‘‘నేను కూడా కశ్మీర్‌కి సీజన్ లాంటి వాడినే. రావాలి, వెళ్లాలి. అంతే తప్ప, ఉండిపోకూడదు’’ అన్నాను. ‘‘మేమైతే గవర్నర్ రూల్‌ని భలే ఎంజాయ్ చేస్తున్నాం రామ్‌జీ. పవర్లో లేకపోయినా, పవర్లో ఉన్నట్లే ఉంది. మెహబూబా మాత్రం కోపంగా ఉన్నారు.. సపోర్ట్ లాగేసుకుంటున్నట్లు ఒక్కమాటైనా చెప్పలేదని!’’ అన్నారు. గవర్నర్‌కి ఫ్యాక్స్ పంపుతున్నప్పుడే మెహబూబాకూ ఫోన్ చేశాను. గవర్నర్‌కి ఫ్యాక్స్ వెళ్లింది. మెహబూబాకు ఫోన్ వెళ్లలేదు. కారుకు జామర్లు పెట్టుకుని తిరిగితే ప్రజలు ఎలా కనెక్ట్ అవుతారు? ‘‘ఒమర్ అబ్దుల్లా కూడా మిమ్మల్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు రామ్‌జీ’’ అన్నాడు కవీందర్ గుప్తా. తిడితే నన్ను గుప్తా తిట్టాలి. మెహబూబా సీఎం సీటుతో పాటు, అతడి డిప్యూటీ సీటూ పోయింది. ‘‘పోనీలే గుప్తాజీ.. మీరైతే తిట్టుకోవడం లేదు కదా నన్ను’’ అని నవ్వాను. అసెంబ్లీలో నాలుగు సీట్లున్న ప్రతివారికీ కోపమే! సీట్లో కూర్చునే అర్హత ఉండీ, రెండేళ్లుగా నిలబడే ఉన్నవాళ్లకు ఇంకెంత కోపం రావాలి?! ఎమ్మెల్యేల్ని కొనొచ్చన్న నమ్మకంతోనే బీజేపీ బయటికెళ్లిపోయిందని ఒమర్ ప్రచారం చేస్తున్నాడు! ఎవరి మీద వారికి నమ్మకం లేకుండా ఉంటుందా? ఒక సీటొచ్చిన సీపీఎంకీ ఉంటుంది. పన్నెండు సీట్లున్న కాంగ్రెస్కీ ఉంటుంది. ఏ పార్టీలోనూ లేని ఇండిపెండెంట్లకీ ఉంటుంది. ఒమర్‌కే లేనట్లుంది. ఆయన్ని ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు కానీ, ఆయనే ఎమ్మెల్యేల్ని నమ్మడం లేదు. ఇలాంటి లీడర్లు పవర్లోకి వస్తే ప్రజల్ని కూడా నమ్మరు. గవర్నర్‌కి మళ్లీ ఒక ఫ్యాక్స్ కొట్టి రిలాక్స్ అవుతుంటే ఆర్ణబ్ గోస్వామి ఫోన్ చేశాడు. ‘‘నేషన్ వాంట్స్ టు నో’’ అన్నాడు. నేషన్‌కి ఇప్పుడు ఏం తెలియకుండా పోయింది ఆర్ణబ్?’’ అని పెద్దగా నవ్వాను. అతడు నవ్వలేదు. ‘‘సీరియస్లీ.. నేషన్ వాంట్స్ టు నో’’ అన్నాడు. నేషన్కైనా, మనిషికైనా ఎక్కువ తెలిస్తే ఇదే ప్రాబ్లమ్. ఏమీ లేనిదాని గురించి ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. -
రాయని డైరీ
సీపీఎం గొప్పతనం ఇదే! అందరూ ఒక మాట మీద ఉంటారు. విడిగా మళ్లీ ప్రతి ఒక్కరూ ఒక మాటతో ఉంటారు. ఎంతమంది ఉంటే అన్ని మాటలు. ఎన్ని మాటలుంటే అన్ని సిద్ధాంతాలు. సమావేశాలయ్యే సరికి అంతా ఒక మాట మీదకు వచ్చేస్తారు. అందరూ కలిసి స్టేజీ మీద ఒక మనిషినే నిలబెట్టి మిగతావాళ్లంతా కిందికి వెళ్లి, కార్మికుల్లో కలిసిపోతారు! ఐదు రోజులుగా హైదరాబాద్‌లో తలా ఒక మాట మాట్లాడుతున్నాం. ముందు ప్రకాశ్ కారత్ ఒక మాట మాట్లాడాడు. తర్వాత నేనొక మాట మాట్లాడాను. నేను మాట్లాడిన మాటపై, కారత్ మాట్లాడిన మాటపై మళ్లీ ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడారు. కారత్ మాట్లాడిన మాట, జనవరిలో నేను మాట్లాడిన మాటకు ఎదురుమాట. సీపీఎంలో ఎవరూ వెంటనే మాటకు మాట అనేయరు. మళ్లీ వచ్చే జాతీయ మహాసభల వరకు ఆగుతారు. మాట అంటున్నప్పుడే ఒకవేళ మహాసభలు ముగిస్తే, పనిలో పనిగా మాట అనేసి స్టేజీ దిగిపోరు. స్టేజీ దిగిపోయాక.. మళ్లీ మూడేళ్లకు మహాసభల్లో మాట్లాడ్డానికి సిద్ధమౌతారు. డిసిప్లీన్! సీపీఎంలో ఉన్న మరో డిసిప్లీన్.. ఎవరు ఎవరి మాటకైనా ఎదురు చెప్తారు. ఎదురు చెప్పకపోతే ఎందుకు ఎదురు చెప్పలేదని ప్రశ్నిస్తారు. ‘నీకొక సిద్ధాంతం లేదా?’ అని నిలదీస్తారు. ‘నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందుకే ఎదురు చెప్పలేదు’ అని ఎవరైనా అంటే.. ‘ఏకీభవించడం కూడా మన పార్టీలో ఒక సైద్ధాంతిక విభేదమే కదా! విభేదించకుండా నువ్వసలు పార్టీ మనిషివెలా అవుతావని అడుగుతారు. శుక్రవారం నా మాట మీద, కారత్ మాట మీద పద్దెనిమిది గంటల డిబేట్ జరిగింది. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌ని దూరంగా పెడదాం’ అంటాడు కారత్. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌కి దూరంగా ఉందాం’ అంటాను నేను. దూరంగా పెట్టడమా, దూరంగా ఉండడమా అనే దానిపై డెలిగేట్స్ అంతా తలా ఒక మాట వేశారు. ‘దూరంగా పెట్టడం’, ‘దూరంగా ఉండడం’ అనే మాటలకు మూడొందల డెబ్బై మూడు సవరణలు చేశారు. కారత్ మాట నెగ్గితే ఈసారి మాణిక్ సర్కార్ కానీ, బృందాకారత్ కానీ, బీవీ రాఘవులు గానీ సీపీఎం ప్రధాన కార్యదర్శి అవుతారని మా ఇంటికి వచ్చే పేపర్ రాసింది. వెంటనే కారత్‌కి ఫోన్ చేసి, ‘‘మీ ఇంటికొచ్చే పేపర్ ఏం రాసింది కామ్రేడ్’’ అని అడిగాను. ‘‘మాణిక్ కానీ, బృందా కానీ, రాఘవులు కానీ ప్రధాన కార్యదర్శులు కాకపోతే ఏచూరి మాటే నెగ్గినట్లు అని రాశాయి కామ్రేడ్’’ అని చెప్పాడు. ‘నీమాటే నెగ్గుతుంది అన్నాడు కానీ, మళ్లీ రెండోసారి కూడా నువ్వే కార్యదర్శివి అవుతావు కామ్రేడ్’ అనే మాట అనలేకపోయాడు కారత్! సీపీఎంలో ప్రధాన కార్యదర్శి పదవికున్న వాల్యూ అది! దేశ ప్రధాని పదవినైనా వదులుకుంటారు కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇంకొకరికి పోనివ్వరు. -
'నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు'
ఆరున్నరేళ్లుగా జైలు జీవితంలో లేని ఎగ్జయిట్మెంట్ వారం రోజులుగా కనిపిస్తోంది! కొట్టరు. తిట్టరు. వీడియో కాన్ఫరెన్స్ అంటూ కాళ్లు పీకేలా కూర్చోబెడతారు. అంతే. ఇక్కడ చికాగోలో నేను. అక్కడ ఇండియాలో జడ్జిగారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు. జడ్జిగారి పక్కనే లాయర్లు, పోలీసులు. కడుపులో లేని నిజాలను కూడా కక్కించేలా ఉన్నారు ఒక్కొక్కరు. 26/11 ఎటాక్ కుట్ర నీదే కదా. అవును. నీ వెనుక లష్కరే తోయిబా ఉంది కదా. అవును. లష్కరే వెనుక పాకిస్తాన్ ఉంది కదా. అవును. మూడు ముఖ్యమైన ‘అవును’ ల తర్వాత కూడా ఇంకా ఏం మిగిలి ఉంటుంది నా దగ్గర చెప్పడానికి. వాళ్ల దగ్గర అడగడానికి?! కానీ వాళ్ల దగ్గర ఉంది! పౌరసత్వం అంటారు. పాస్‌పోర్ట్ అంటారు. పాక్ ఉచ్చులో ఎలా పడిపోయావ్ అంటారు. కాస్త గట్టిగా సమాధానం చెబితే.. ఊ.. ఊ.. రెస్పెక్ట్ అంటారు. ఉచ్చులో పడిపోవడం ఏమిటి? మా నాన్న పాకిస్తానీ. రెస్పెక్ట్ తెలియకపోవడం ఏమిటి? మా అమ్మ అమెరికన్. పాకిస్తాన్‌కి ఉన్నంత దేశభక్తి, అమెరికాకు తెలిసినంత రెస్పెక్ట్ వేరే ఏ కంట్రీలో కనిపిస్తాయి? రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని వాళ్లే రెస్పెక్ట్ కోసం ఆదేశాలు జారీ చేస్తారు. ఈ సంగతి వీడియో కాన్ఫరెన్స్‌లో మొదటి రోజే కనిపెట్టేశాను. జడ్జిగారు వస్తున్నప్పుడు లేచి నిలబడి, ఆయన కూర్చున్న తర్వాతే కూర్చోమని నాకు ఇన్స్ట్రక్షన్స్! అది నాకు చెప్పాలా? నాలో అమెరికన్ బ్లడ్ ప్రవహిస్తోంది. అది ప్రవహిస్తున్నంతసేపూ రెస్పెక్ట్ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. నేరస్థులపై ఇండియాకు గౌరవం లేకపోవచ్చు. కానీ ఇండియాలోని న్యాయమూర్తులపై నాకు గౌరవం ఉంది. మొదటి రోజే కాదు.. తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజూ.. నించుని, కూర్చుని.. నించుని, కూర్చుని.. ఆ జడ్జిగారిని నేను గౌరవిస్తూనే ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో కాన్ఫరెన్స్.. నా ముప్పై ఐదేళ్ల శిక్షాకాలం పూర్తయ్యే దాకా కొనసాగుతూనే ఉన్నా.. నా ఎనభై ఏళ్ల వయసులోనూ అప్పటికి ఉన్న గౌరవనీయులైన జడ్జిగారిని నేను గౌరవిస్తూనే ఉంటాను. జైల్లో మొదటి రోజు నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు. ‘మీ పేరు అలా లేదు మిస్టర్ డేవిడ్ హెడ్లీ?’ అంటూ సర్ప్రైజ్ అయ్యారు తోటి ఖైదీలు. ‘నా అసలు పేరు దావూద్ జిలానీ. ఇప్పుడు నమ్ముతారా’ అన్నాను నవ్వుతూ. ‘అఫ్కోర్స్.. మీరు టెర్రరిస్టులా కనిపించడం లేదు మిస్టర్ దావూద్’ అని మళ్లీ ఆశ్చర్యపోయారు. దటీజ్ అమెరికా. దోజ్ ఆర్ అమెరికన్స్. నేనిప్పుడు ఇండియాకు కావాలి. డెన్మార్క్‌కి కావాలి. పాకిస్థాన్‌కి కూడా కావాలి కానీ.. నన్ను నా పితృదేశం మరీ అంత పట్టుబట్టేమీ అడగడం లేదు. ‘నీ మీద కేసులున్నాయి. విచారిస్తారట. వెళతావా?’ అన్నాడు మా యూఎస్ అటార్నీ. ‘నేను మీకు కోపరేట్ చేస్తాను. మీరు నాకు కోపరేట్ చెయ్యండి’ అన్నాను. ఒప్పందం కుదిరింది. ఉరిశిక్ష తప్పింది. ‘మేం పంపించలేం, మా దగ్గర శిక్ష పూర్తవ్వాలి కదా’ అని చెప్పేశాడు అటార్నీ. - మాధవ్ శింగరాజు