నెమ్మదిగా వెళ్లి వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్‌లో కూర్చున్నాను. అటువైపు సీబీఐ స్పెషల్ జడ్జి స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. అతడు ఉన్నది లక్నోలో. నేను ఉన్నది ఢిల్లీలో. ‘‘మొదలు పెడదామా మిస్టర్ అడ్వాణీ..’’ అన్నాడు.
జడ్జి వైపు చూశాను.
‘‘మిస్టర్ అడ్వాణీ, చెప్పండి.. ఆ రోజు కరసేవకుల్ని రెచ్చగొట్టి మీరే కదా అయోధ్యలోని బాబ్రీ మసీదు ధ్వంసం అవడానికి ప్రేరణ అయ్యారు?’’ అన్నాడు నేరుగా నన్ను గుచ్చి చూస్తూ! అతడెలా అడిగాడంటే.. నా కళ్లలో ఇప్పటికీ కరసేవకులు గునపాలతో ఆ కట్టడాన్ని కూలగొడుతున్న దృశ్యం కనిపిస్తున్నట్లుగా అడిగాడు.
‘‘మీరు ఏ కట్టడం గురించి అడుగుతున్నారో ఆ కట్టడం గురించి నాకసలు ఏమీ తెలీదు. అడ్వాణీకి తెలుసు అని మీతో ఎవరైనా చెప్పి ఉంటే, లేదా మీకై మీరు ఊహించి ఉంటే మీరు విన్నది నిజం కాదు. మీ ఊహా ఎటూ నిజం కాబోదు..’’ అని చెప్పాను.
జడ్జి ఒక్క క్షణం ఆగాడు.
‘‘మిస్టర్ అడ్వాణీ.. మిమ్మల్ని నేను అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఒక వెయ్యీ నలభై తొమ్మిది ఉన్నాయి. నా ప్రతి ప్రశ్నకూ మీరు ఒక వెయ్యీ యాభై సమాధానాలు ఇచ్చుకుంటూ పోతుంటే కొన్ని గంటల్లోనో, కొన్ని రోజుల్లోనో, కొన్ని సంవత్సరాల్లోనో మేము మీ నుంచి స్టేట్‌మెంట్ తీసుకోలేం. ఆగస్టు 31 లోపు మా విచారణ పూర్తవాలని సుప్రీంకోర్టు మమ్మల్ని ఆదేశించింది కనుక మేము మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు మీరు మాకిచ్చే సమాధానాలను ఉప ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా పరిమితం చేసుకోవడం వల్ల ఈ తొంభై రెండేళ్ల వయసులో మీరు మీ మధ్యాహ్న భోజనాన్ని వేళ తప్పకుండా తీసుకునేందుకు కూడా ఎలాంటి అంతరాయమూ ఏర్పడబోదని నేను భావిస్తున్నాను’’ అన్నాడు!!
‘‘ఢిల్లీలో నా భోజన వేళల గురించి లక్నోలో ఉండి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు మిస్టర్ జస్టిస్. ప్రశ్నలూ సమాధానాలు అనేవి అడగడాన్ని బట్టి, చెప్పడాన్ని బట్టి తమ విస్తృతిని, సుదీర్ఘతను కలిగి ఉండవు. వాటిని కుదించుకోవడంలో ప్రావీణ్యం లేకపోవడం వల్లనే అవి విస్తరిస్తాయి. నన్ను అడిగేందుకు మీ దగ్గర సిద్ధంగా ఉన్న ఒక వెయ్యీ యాభై ప్రశ్నలన్నిటికీ నేను ఇవ్వవలసిన సమాధానాలను రెండంటే రెండే సమాధానాలుగా కుదించుకోగలను. నా రెండు సమాధానాలకు తగ్గట్లు మీరు మీ ఒక వెయ్యీ యాభై ప్రశ్నలను రెండంటే రెండే ప్రశ్నలుగా కుదించుకోగలరా? అప్పుడు లక్నోలో మీ భోజనం వేళల గురించి కూడా ఢిల్లీ నుంచి నేను ఆందోళన చెందవలసిన పని ఉండదు..’’ అన్నాను.
జడ్జి ముఖం అప్రసన్నం అయింది.
‘‘మిస్టర్ అడ్వాణీ.. సులువుగా పని చేయడం ఒకటి ఉంటుంది. పద్ధతిగా పని చేయడం ఒకటి ఉంటుంది. సులువైన పద్ధతిలోకి వెళ్లామంటే సులువు అవడం కోసం పద్ధతి తప్పుతున్నామనే. సీబీఐ ఎప్పుడూ అలా చేయదు. చెప్పండి. నా రెండో ప్రశ్న.. మసీదు కూల్చివేతకు రెండేళ్ల ముందు మీరు అరెస్టు అయ్యారు. మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు కరసేవకులు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఇవన్నీ కూల్చివేత కుట్రలో భాగమైన పరిణామాలే కదా..’’ అన్నాడు!
‘‘నేనే కుట్రా పన్నలేదు. నా మీదే కుట్రలు పన్నారు’’ అని చెప్పాను.
‘‘ఇవేనా.. రెండుగా కుదించుకున్న మీ సమాధానాలు?’’ అనేసి, లంచ్‌కేమో లేచాడు.
డెబ్బై ఐదేళ్ల వయసులో డిప్యూటీ పీఎంగా ఉన్నప్పుడు నా దగ్గర ఎన్ని సమాధానాలైతే ఉన్నాయో.. ఈ తొంభై రెండేళ్ల వయసులోనూ అన్నే సమాధానాలు ఉన్నాయి. సీబీఐయ్యే అనవ సరంగా ప్రశ్నలు పెంచుకుంటూ వస్తోంది.
-మాధవ్ శింగరాజు
ఎల్.కె. అడ్వాణీ (బీజేపీ లీడర్) రాయని డైరీ
Published Sun, Jul 26 2020 1:27 AM | Last Updated on Sun, Jul 26 2020 1:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment