'నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు' | Devid Headley not written diary of 26/11 terrorist attack | Sakshi
Sakshi News home page

'నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు'

Published Sun, Feb 14 2016 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

'నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు'

'నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు'

ఆరున్నరేళ్లుగా జైలు జీవితంలో లేని ఎగ్జయిట్‌మెంట్ వారం రోజులుగా కనిపిస్తోంది! కొట్టరు. తిట్టరు. వీడియో కాన్ఫరెన్స్ అంటూ కాళ్లు పీకేలా కూర్చోబెడతారు. అంతే. ఇక్కడ చికాగోలో నేను. అక్కడ ఇండియాలో జడ్జిగారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు. జడ్జిగారి పక్కనే లాయర్లు, పోలీసులు. కడుపులో లేని నిజాలను కూడా కక్కించేలా ఉన్నారు ఒక్కొక్కరు. 26/11 ఎటాక్ కుట్ర నీదే కదా. అవును. నీ వెనుక లష్కరే తోయిబా ఉంది కదా. అవును. లష్కరే వెనుక పాకిస్తాన్ ఉంది కదా. అవును. మూడు ముఖ్యమైన ‘అవును’ ల తర్వాత కూడా ఇంకా ఏం మిగిలి ఉంటుంది  నా దగ్గర చెప్పడానికి. వాళ్ల దగ్గర అడగడానికి?! కానీ వాళ్ల దగ్గర ఉంది!
 
 పౌరసత్వం అంటారు. పాస్‌పోర్ట్ అంటారు. పాక్ ఉచ్చులో ఎలా పడిపోయావ్ అంటారు. కాస్త గట్టిగా సమాధానం చెబితే.. ఊ.. ఊ.. రెస్పెక్ట్ అంటారు. ఉచ్చులో పడిపోవడం ఏమిటి? మా నాన్న పాకిస్తానీ. రెస్పెక్ట్ తెలియకపోవడం ఏమిటి? మా అమ్మ అమెరికన్. పాకిస్తాన్‌కి ఉన్నంత దేశభక్తి, అమెరికాకు తెలిసినంత రెస్పెక్ట్ వేరే ఏ కంట్రీలో కనిపిస్తాయి?
 
రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని వాళ్లే రెస్పెక్ట్ కోసం ఆదేశాలు జారీ చేస్తారు. ఈ సంగతి వీడియో కాన్ఫరెన్స్‌లో మొదటి రోజే కనిపెట్టేశాను. జడ్జిగారు వస్తున్నప్పుడు లేచి నిలబడి, ఆయన కూర్చున్న తర్వాతే కూర్చోమని నాకు ఇన్‌స్ట్రక్షన్స్! అది నాకు చెప్పాలా? నాలో అమెరికన్ బ్లడ్ ప్రవహిస్తోంది. అది ప్రవహిస్తున్నంతసేపూ రెస్పెక్ట్ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. నేరస్థులపై ఇండియాకు గౌరవం లేకపోవచ్చు. కానీ ఇండియాలోని న్యాయమూర్తులపై నాకు గౌరవం ఉంది. మొదటి రోజే కాదు.. తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజూ.. నించుని, కూర్చుని.. నించుని, కూర్చుని.. ఆ జడ్జిగారిని నేను గౌరవిస్తూనే ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో కాన్ఫరెన్స్.. నా ముప్పై ఐదేళ్ల శిక్షాకాలం పూర్తయ్యే దాకా కొనసాగుతూనే ఉన్నా.. నా ఎనభై ఏళ్ల వయసులోనూ అప్పటికి ఉన్న గౌరవనీయులైన జడ్జిగారిని నేను గౌరవిస్తూనే ఉంటాను.  
 
జైల్లో మొదటి రోజు నేను టెర్రరిస్టునంటే ఎవరూ నమ్మలేదు. ‘మీ పేరు అలా లేదు మిస్టర్ డేవిడ్ హెడ్లీ?’ అంటూ సర్‌ప్రైజ్ అయ్యారు తోటి ఖైదీలు. ‘నా అసలు పేరు దావూద్ జిలానీ. ఇప్పుడు నమ్ముతారా’ అన్నాను నవ్వుతూ. ‘అఫ్‌కోర్స్.. మీరు టెర్రరిస్టులా కనిపించడం లేదు మిస్టర్ దావూద్’ అని మళ్లీ ఆశ్చర్యపోయారు. దటీజ్ అమెరికా. దోజ్ ఆర్ అమెరికన్స్.

 నేనిప్పుడు ఇండియాకు కావాలి. డెన్మార్క్‌కి కావాలి. పాకిస్థాన్‌కి కూడా కావాలి కానీ.. నన్ను నా పితృదేశం మరీ అంత పట్టుబట్టేమీ అడగడం లేదు. ‘నీ మీద కేసులున్నాయి. విచారిస్తారట. వెళతావా?’ అన్నాడు మా యూఎస్ అటార్నీ.  ‘నేను మీకు కోపరేట్ చేస్తాను. మీరు నాకు కోపరేట్ చెయ్యండి’ అన్నాను. ఒప్పందం కుదిరింది. ఉరిశిక్ష తప్పింది.  ‘మేం పంపించలేం, మా దగ్గర శిక్ష పూర్తవ్వాలి కదా’ అని చెప్పేశాడు అటార్నీ.
 - మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement