గవర్నర్ పాలన విధించాక ఈ మూడు రోజుల్లో కశ్మీర్‌కు కాస్త కళ వచ్చింది. జమ్మూ లోయలో పూలు చక్కగా వికసిస్తున్నాయి. సీజన్ కాదు కాబట్టి కశ్మీర్‌లో ఆపిల్స్ మాత్రం కనిపించడం లేదు. ఆగస్టు నాటికి అవీ వచ్చేస్తాయి.
మూడు రోజుల గవర్నర్ పాలనకే కశ్మీర్ ఇంత కన్నుల పండుగగా ఉంటే బీజేపీ పవర్‌లోకి వస్తే ఇంకెంత మనోహరంగా ఉంటుందోనని.. ముఫ్తీ మెహబూబా, ఒమర్ అబ్దుల్లా తప్ప.. కశ్మీర్ ప్రజలందరూ ఇళ్లలో కూర్చుని, కిటికీల్లోంచి చేతులు బయటపెట్టి, వాన చినుకుల్ని ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది! సిగ్నిఫికెంట్ ఛేంజ్!
‘‘మీరూ ఇక్కడికే షిఫ్ట్ అయిపోండి రామ్‌జీ’’ అన్నారు కశ్మీర్‌లోని మా ఎమ్మెల్యేలు. నవ్వాను. ‘‘నేను కూడా కశ్మీర్‌కి సీజన్ లాంటి వాడినే. రావాలి, వెళ్లాలి. అంతే తప్ప, ఉండిపోకూడదు’’ అన్నాను.
‘‘మేమైతే గవర్నర్ రూల్‌ని భలే ఎంజాయ్ చేస్తున్నాం రామ్‌జీ. పవర్‌లో లేకపోయినా, పవర్‌లో ఉన్నట్లే ఉంది. మెహబూబా మాత్రం కోపంగా ఉన్నారు.. సపోర్ట్ లాగేసుకుంటున్నట్లు ఒక్కమాటైనా చెప్పలేదని!’’ అన్నారు.
గవర్నర్‌కి ఫ్యాక్స్ పంపుతున్నప్పుడే మెహబూబాకూ ఫోన్ చేశాను. గవర్నర్‌కి ఫ్యాక్స్ వెళ్లింది. మెహబూబాకు ఫోన్ వెళ్లలేదు. కారుకు జామర్‌లు పెట్టుకుని తిరిగితే ప్రజలు ఎలా కనెక్ట్ అవుతారు?
‘‘ఒమర్ అబ్దుల్లా కూడా మిమ్మల్ని ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు రామ్‌జీ’’ అన్నాడు కవీందర్ గుప్తా. తిడితే నన్ను గుప్తా తిట్టాలి. మెహబూబా సీఎం సీటుతో పాటు, అతడి డిప్యూటీ సీటూ పోయింది.
‘‘పోనీలే గుప్తాజీ.. మీరైతే తిట్టుకోవడం లేదు కదా నన్ను’’ అని నవ్వాను.
అసెంబ్లీలో నాలుగు సీట్లున్న ప్రతివారికీ కోపమే! సీట్లో కూర్చునే అర్హత ఉండీ, రెండేళ్లుగా నిలబడే ఉన్నవాళ్లకు ఇంకెంత కోపం రావాలి?! ఎమ్మెల్యేల్ని కొనొచ్చన్న నమ్మకంతోనే బీజేపీ బయటికెళ్లిపోయిందని ఒమర్ ప్రచారం చేస్తున్నాడు!
ఎవరి మీద వారికి నమ్మకం లేకుండా ఉంటుందా? ఒక సీటొచ్చిన సీపీఎంకీ ఉంటుంది. పన్నెండు సీట్లున్న కాంగ్రెస్‌కీ ఉంటుంది. ఏ పార్టీలోనూ లేని ఇండిపెండెంట్‌లకీ ఉంటుంది. ఒమర్‌కే లేనట్లుంది. ఆయన్ని ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు కానీ, ఆయనే ఎమ్మెల్యేల్ని నమ్మడం లేదు. ఇలాంటి లీడర్‌లు పవర్‌లోకి వస్తే ప్రజల్ని కూడా నమ్మరు.
గవర్నర్‌కి మళ్లీ ఒక ఫ్యాక్స్ కొట్టి రిలాక్స్ అవుతుంటే ఆర్ణబ్ గోస్వామి ఫోన్ చేశాడు.
‘‘నేషన్ వాంట్స్ టు నో’’ అన్నాడు.
నేషన్‌కి ఇప్పుడు ఏం తెలియకుండా పోయింది ఆర్ణబ్?’’ అని పెద్దగా నవ్వాను. అతడు నవ్వలేదు.
‘‘సీరియస్‌లీ.. నేషన్ వాంట్స్ టు నో’’ అన్నాడు.
నేషన్‌కైనా, మనిషికైనా ఎక్కువ తెలిస్తే ఇదే ప్రాబ్లమ్. ఏమీ లేనిదాని గురించి ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది.
రాం మాధవ్ (బీజేపీ ప్రధాన కార్యదర్శి) రాయని డైరీ
Published Sun, Jun 24 2018 3:36 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment