ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన అమలు చేయడం ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్‌సింగ్ రావత్ స్పష్టం చేశారు. తమ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. రంజాన్ సందర్భంగానే తాము ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను నిలిపివేశామని, అయితే పాక్ నుంచి కవ్వింపు చర్యలు ఎదురవడంతో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్‌లో తక్షణం అమలయ్యేలా ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.
రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణం ప్రభుత్వం కుప్పకూలిన మరుక్షణమే గవర్నర్ పాలన విధించారు. రంజాన్ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పునరుద్ధరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే.
వేర్పాటువాదులకు మరికొంత సమయం ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ కోరుతుండగా, వేర్పాటువాదులకు ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చామని, అయితే వారు సానుకూలంగా స్పందించడంలో విఫలమయ్యారని బీజేపీ వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment