Army Chief General Bipin Rawat
-
సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ/కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏను ఉపసంహరించుకునే దాకా నిరసనలను ఆపేది లేదని బెంగాల్ సీఎం మమత అన్నారు. అది నాయకత్వ లక్షణం కాదు ‘సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నిరసన కారుల్లో ఎక్కువమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ప్రజలను హింసకు ప్రేరేపించడం నాయకత్వ లక్షణం కాదు’అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాయకుడంటే సరైన దిశలో నడిపించేవాడు. మంచి సూచనలిస్తూ మన సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అతడు ముందు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు. అయితే, ఇది అనుకున్నంత సులువు కాదు. చాలా క్లిష్టమైన వ్యవహారం.’అని తెలిపారు. అయితే, రాజకీయ పరమైన వ్యవహారాల్లో జనరల్ రావత్ తలదూర్చడం కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ‘ఆయన చెప్పింది నిజమే. అయితే, ప్రధాని పదవిపై ఆశతోనే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది’ అని ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికాధికారులకు మాత్రమే ఉంటుంది. ఆయనకు ఇలాగే మాట్లాడే అవకాశం ఇస్తే సైనిక తిరుగుబాటుకు కూడా దారిచూపినట్లవుతుంది’ అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ట్విట్టర్లో పేర్కొన్నారు. జనరల్ రావత్ తన పరిధి తెలుసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘జనరల్ రావత్‌తో ఏకీభవిస్తున్నా. మత విద్వేషాలు రెచ్చగొట్టి, రక్తపాతానికి పాల్పడిన వారు కూడా నాయకులు కాదుకదా?’అని ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా జనరల్ రావత్ వ్యాఖ్యలను ఖండించింది. ఈ పరిణామంపై ఆర్మీ స్పందించింది. ఆర్మీచీఫ్ వ్యాఖ్యలు కేవలం సీఏఏ ఆందోళనలనుద్దేశించి చేసినవి కావని పేర్కొంది. ఆయన ఏ రాజకీయ పార్టీని కానీ, వ్యక్తిని కానీ ప్రస్తావించలేదు. విద్యార్థులను గురించి మాత్రమే జనరల్ రావత్ మాట్లాడారు. కశ్మీర్ లోయకు చెందిన యువతను వారు నేతలుగా భావించిన వారే తప్పుదోవపట్టించారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 31వ తేదీతో రావత్ పదవీ కాలం ముగియనుంది. ఆందోళనలు ఆపేదిలేదు: మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని ఉపసంహరించుకోనంత కాలం ఆందోళనలను కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.సీఏఏకి వ్యతిరేకంగా గురువారం సెంట్రల్ కోల్‌కతాలో ఆమె భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనలను కొనసాగించాలని విద్యార్థులను కోరారు. ‘మీరు దేనికీ భయపడకండి. మీకు అండగా నేనుంటా. నిప్పుతో ఆటలు వద్దని బీజేపీని హెచ్చరిస్తున్నా’అని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై పోరాడుతున్న జామియా మిల్లియా, ఐఐటీ కాన్పూర్ తదితర వర్సిటీల విద్యార్థులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు తిండి, బట్ట, నీడ ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను కనిపెట్టే పని మాత్రం చేపట్టిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి సీఏఏపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అయోమయం సృష్టిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ‘పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఒక్క ప్రతిపక్ష నేత కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ చట్టంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ఢిల్లీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.కాగా కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)తో, 2010నాటి ఎన్పీఆర్కు పోలికే లేదన్నారు. ఎన్నార్సీతో సంబంధం లేకుండా, 2010 నాటి ఎన్పీఆర్ చేపట్టాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ దురుద్దేశంతో దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా గురువారం మైసూరులో జరిగిన భారీ ప్రదర్శన -
పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13న జరిగే జల్సా (ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. – న్యూఢిల్లీ/గ్వాలియర్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి అధీనంలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యకైనా సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జల్సా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేను తిరిగి భారత్‌లో అంతర్భాగంగా చేసుకోవడమే ప్రభుత్వం తదుపరి లక్ష్యమంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ప్రకటనపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోకేను స్వాధీనం చేసు కోవడంతోపాటు దేనికైనా మేం సంసిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీవోకే రాజధాని ముజఫరాబాద్‌లో 13వ తేదీన జరిగే జల్సా(ర్యాలీ)కి వెళ్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పీవోకేపై ప్రత్యేక వ్యూహం ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)కు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వెల్లడించారు. మన బలగాలు పీవోకేలోకి ప్రవేశించేందుకు సదా సన్నద్ధంగా ఉన్నాయి.. అయితే, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ..‘పీవోకే విషయంలో ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి విషయాలను బహిర్గతం చేయరాదు’అని తెలిపారు. -
ఇమ్రాన్ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి భారత్ ఇంటి పనేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ దీటుగా తిప్పికొట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ పాత్రపై భారత్ పూర్తి ఆధారాలను పాక్‌కు ఇచ్చిందని చెప్పారు. భారత నిఘా సంస్ధలు పుల్వామాలో ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అందించాయని..ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తన అమెరికా పర్యటన సందర్భంగా పుల్వామా దాడిలో పాకిస్తాన్ పాత్ర లేదని, భారత భద్రతా దళాల వేధింపులతో విసుగుచెందిన ఓ కశ్మీరీ యువకుడు ఈ ఘాతుకానికి తెగబడగా, అనూహ్యంగా పాకిస్తాన్ పేరును తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్తాన్లో ఉన్నా కశ్మీర్‌లోనూ దాని ఉనికి ఉందని, పుల్వామా దాడి భారత్‌లో జరిగిన దేశీయ దాడిగా ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది మురణించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. -
‘ఉగ్ర శిబిరాల మూసివేతను నిర్ధారించలేం’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉగ్రవాద శిబిరాలు మూతపడ్డాయనే వార్తలను తాము నిర్ధారించబోమని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాక్ చర్యలతో నిమిత్తం లేకుండా తమ సరిహద్దుల వెంబడి భారత సైన్యం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. పీఓకేలో ఉగ్ర శిబిరాలు మూతపడ్డాయని వచ్చిన వార్తలతో పాటు తమ భూభాగంలో ఉగ్ర కార్యకలాపాలను పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేయాలని అమెరికా పాక్‌ను హెచ్చరించిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. కాగా, ఇండో-పాక్ సరిహద్దులో నిఘాను పటిష్టం చేసేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సేనలు 2,500కు పైగా బంకర్లు నిర్మించాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ము, కథువా, సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో పదివేలకు పైగా బంకర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. -
స్మార్ట్ ఫోన్లు వాడకుండా వారిని ఆపలేం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక యుద్ధ తంత్రాల్లో సోషల్ మీడియా పాత్రను విస్మరించలేమని, సైనికులు వారి కుటుంబాలను స్మార్ట్ ఫోన్లు ఉపయోగించకుండా ఎవరూ ఆపలేరని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని సైనికులను కోరాలని తమకు సూచనలు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండాలని సైనికులు, వారి కుటుంబాలను కోరగలమా అని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్‌ను అనుమతిస్తూనే క్రమశిక్షణను తీసుకురాగలగడం ముఖ్యమని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను విస్మరించలేమని, సైనికులు దీన్ని వాడుకుంటారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను సైనికులు అవకాశంగా మలుచుకోవాలని రావత్ సూచించారు. ఆధునిక కదనరంగంలో కృత్రిమ మేథను అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకునే ఆలోచన చేయాలని కోరారు. -
గవర్నర్ పాలనపై స్పందించిన ఆర్మీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన అమలు చేయడం ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలపాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్‌సింగ్ రావత్ స్పష్టం చేశారు. తమ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. రంజాన్ సందర్భంగానే తాము ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను నిలిపివేశామని, అయితే పాక్ నుంచి కవ్వింపు చర్యలు ఎదురవడంతో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్లో తక్షణం అమలయ్యేలా ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణం ప్రభుత్వం కుప్పకూలిన మరుక్షణమే గవర్నర్ పాలన విధించారు. రంజాన్ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పునరుద్ధరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. వేర్పాటువాదులకు మరికొంత సమయం ఇవ్వాలని మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ కోరుతుండగా, వేర్పాటువాదులకు ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చామని, అయితే వారు సానుకూలంగా స్పందించడంలో విఫలమయ్యారని బీజేపీ వాదిస్తోంది. -
రావత్ వ్యాఖ్యలతో నాకేం సంబంధం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మీడియా కోరగా.. ఆమె తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె యూపీలో నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమెను పలకరించిన మీడియా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై వివరణ కోరింది. ‘ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. వారు చేసే వ్యాఖ్యలతో నాకేం సంబంధం? నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం కూడా నాకు లేదు’ అని ఆమె మీడియాకు బదులిచ్చారు. అస్సాంలోని చాలా జిల్లాల్లో అక్రమ ముస్లిం వలసదారులు వస్తున్నారని, వీరి కారణంగా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) బలం పుంజుకుంటోందని, బీజేపీ కన్నా వేగంగా ఆ పార్టీ ఎదుగుతోందని బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏఐయూడీఎఫ్ అనే పార్టీ ఉంది. దీన్ని పరిశీలిస్తే, బీజేపీ ఇన్నేళ్ళలో ఎదిగినదాని కన్నా ఎక్కువగా ఈ పార్టీ ఎదుగుతోంది. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుంది’’ అని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా... అందులో రాజకీయాలు, మతపరమైన ఉద్దేశాలేవీ లేవని ఇండియన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రావత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. -
చైనా-భారత్ ఘర్షణ: సిక్కింలో ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భూటాన్‌లో రోడ్డు విషయంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గురువారం సిక్కిం పర్యటన చేపట్టారు. ఆయన రెండురోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారని, రాష్ట్రంలో ఉన్న ఫార్మేషన్ హెడ్ క్వార్టర్స్‌లో టాప్ ఆర్మీ కమాండర్లతో భేటీ అయి సరిహద్దుల్లోని పరిస్థితి, కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్మీ చీఫ్ రావత్ సిక్కిం రాక మామూలు పర్యటనే అని ఆ వర్గాలు వెల్లడించాయి. సిక్కిం సెక్టార్‌లోని భూటాన్ భూభాగంలో చైనా సైన్యం రోడ్డు నిర్మిస్తుండటంతో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణాన్ని భూటాన్, భారత్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ.. భారతీయులు చేపట్టే మానస సరోవర్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో సిక్కిం సెక్టార్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. చదవండి: చైనా దుందుడుకుతనం చదవండి: మోదీ అమెరికా టూర్: డ్రాగన్ కుతకుత! చదవండి: పెట్రేగిన చైనా.. మానస సరోవర్ మార్గం బంద్ -
యుద్ధ విధుల్లో మహిళ
మహిళలు సైనికులుగా పోరాట విధులను నిర్వహించగలరా? ఎడతెగని ఈ చర్చ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ట్టే ఉంది. మహిళలకు పోరాట విధులను అప్పగిస్తామని, రిక్రూట్మెంట్ కూడా మొదలైందని మన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల తెలిపారు. ఆదే సాకారమైతే జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాల సరసన భారత్ కూడా త్రివిధ బలగాలలోని దాదాపు అన్ని విభాగాలలోనూ మహిళలకు ప్రవేశం కల్పించిన దేశంగా సగర్వంగా నిలవగలుగుతుంది. 1992లోనే మన సైన్యం మహిళలకు తలు పులు తెరిచినా వారి నియామకాలను వైద్య, విద్య, న్యాయ విభాగాలకు, సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విభాగాలకు పరిమితం చేసింది. 2015లో వైమానిక, నావికా బలగాలు మహిళలను పోరాట విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించి, అమలు చేస్తున్నాయి. సైన్యం తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా నేరుగా మహి ళలను పోరాట విధులలో నియమించాలని కాదు. ముందుగా వారిని సైనిక పోలీసు విధులలోకి తీసుకుంటారు. అంటే కంటోన్మెంట్లు, సైనిక సంస్థలలో పోలీసు విధు లనూ, యుద్ధ సమయాల్లో శరణార్థులు, యుద్ధ ఖైదీల బాధ్యతలను నిర్వహిస్తారు. ఇప్పటికే సశస్త్ర సీమా బల్ వంటి పారా మిలిటరీ బలగాలలో మహిళలు సరిహద్దు లలో కఠోర విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 2010లో లెఫ్టినెంట్ జనరల్ మితాలి మధుమిత కాబూల్‌లోని మన దౌత్య కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలకు తెగించి 11 మంది సైనికుల ప్రాణాలను కాపా డారు. ఆమె అప్పుడు విద్యా విభాగంలో పని చేస్తున్న సైనికాధికారి. అంతేకాదు, రెండున్నర దశాబ్దాల మన మహిళా సైన్యం చరిత్రలో ఏకైక శౌర్య పతక విజేత ఆమె ఒక్కరే! అందుకు కారణం, సైన్యంలోని ఇతర మహిళలకు అలాంటి ధైర్యసాహ సాలు కొరవడటం కాదు, వాటిని ప్రదర్శించే అవకాశాలను కల్పించకపోవడం. పైగా విద్య, వైద్యం తప్ప మరే విభాగంలోనూ మహిళలకు, పురుషులకు వలే 5 నుంచి 14 ఏళ్ల స్వల్ప కాలిక సర్వీసు ముగిశాక పర్మనెంట్ కమిషన్డ్ అధికారులుగా పనిచేసే అవకాశాన్ని కల్పించడం లేదు. పురుషులతో సమానంగా కఠోరమైన శిక్షణను పొంది, అన్ని కష్టాలకు ఓర్చి, కుటుంబాలకు దూరమై పనిచేస్తే... పెన్షన్‌కు అర్హతనిచ్చే 20 ఏళ్లయినా పని చెయ్యకుండానే గెంటేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేసే మహిళా సైనికాధికారులకు కొదవలేదు. స్వల్పకాలిక సర్వీసు ముగిశాక కూడా సైనిక విధులలో కొనసాగాలని కోరుకునే మహిళలను సైనిక విధులకు దూరం చేయడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. పని ప్రదేశాలలో వివక్ష అన్ని చోట్లా ఉన్నదే. అది సైన్యంలోని మహిళలపట్ల ఉండకూడదు అనుకోవడం అత్యాశ గానీ, చాలా సందర్భాల్లో మహిళా సైనికులకు ప్రత్యేకంగా మరుగు దొడ్లు సైతం ఏర్పాటు చేయలేకపోవడాన్ని ఏమనాలి? రావత్ ఆశిస్తున్నట్టు మహిళా జవాన్లు పోరాట యోధులుగా శిక్షణ పొంది రావడాన్ని చూడాలంటే.. ఇప్పటికే సైన్యంలో ఉన్న మహిళల్లో పలువురు ఐదేళ్ల కనీస సర్వీసు కాలవ్యవధి గడిచాక, గరిష్ట పరిమితి దాటకుండానే పదవీ విరమణ చేసేలా నిరుత్సాహపరిచే ఈ పరిస్థితులను మార్చక తప్పదని గుర్తించడం అవసరం. సైనిక పోలీసులుగా మహిళలు తన విధులను విజయవంతంగా నెరవేర్చ డంలో దృఢసంకల్పాన్ని, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించాలని, ఆ తర్వాతనే మహి ళలను పోరాట విధుల్లోకి తీసుకుంటామని రావత్ అన్నారు. దీంతో మహిళలు పోరాట సైనికులుగా మారడానికి ఇంకా ఎంత కాలం పడుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు బలగాల్లో, సైన్యంలో, పారా మిలిటరీ బలగాల్లో దశాబ్దాల తరబడి సమర్థవంతంగా పురుషులకు ధీటుగా పనిచేస్తున్న మహిళలు ఇంకా ఏం రుజువు చేసుకోవాలి? సైనిక రంగంలో ఆధునిక సాంకేతికత పాత్ర నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగానే సాయుధ బలగాలలో శారీరక దారుఢ్యం ప్రాధాన్యం తగ్గుతోంది. అయినా మన సైనిక నాయకత్వం మహిళలను పోరాట విధులలోకి తీసుకోడానికి బదులు అంతకు ముందు ఈ సైనిక పోలీసు మజిలీని ఎందుకు ఎంచుకుంది? పదవీ విరమణ చేసిన మహిళా సైనికాధికారులు సహజం గానే సంధిస్తున్న సమంజసమైన ప్రశ్నలివి. ఆచితూచి మాట్లాడటం కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించే రావత్ అసలు ఉద్దేశాలపై సైతం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్లో రాళ్లు రువ్వే మూకలలోని మహిళలతో మహిళా సైనిక పోలీçసులయితే సమర్థవంతంగా తలపడగలరనీ, ఇతర పౌర ఆందోళనలలో సైతం సైన్యం మహిళలను ఎదుర్కొనవలసి వస్తున్నందున సైనిక మహిళా పోలీసులు చాలా ఉపయోగకరమని రావత్ చేసిన వ్యాఖ్యలే ఆ అను మానాలకు తావిస్తున్నాయి. అంతర్గత అశాంతి, ఆందోళనలను అదువు చేయడంలో సైన్యం ఇకపై ఇప్పటికంటే విస్తృతమైన పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని స్ఫురించేలా చేస్తున్నాయి. అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని ఎక్కువగా ఉపయోగించడం వాంఛనీయం కాదనేదే ఇంతవరకు మన సైనిక బల గాల నాయకత్వం వైఖరి. నిజానికి అది మన సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యానికి పూర్తి విభిన్నమైదిగా నిలిపే విశిష్టతలలో ఒకటి. అనుద్దేశపూర్వకంగానే అయినా రావత్ వ్యాఖ్యలు మన సైన్యం ఆ వైఖరికి భిన్నమైన వైఖరిని చేపడుతున్నదా? అనే సందే హాన్ని రేకెత్తిస్తున్నది. పౌర అశాంతి, ఆందోళనలను నియంత్రించడంలో సైన్యం పాత్ర తాత్కాలికమైనది. అందుకోసం శాశ్వత ప్రాతిపదికపై మహిళా సైనిక పోలీ సుల ఏర్పాటు అసంగతం కాదా? అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు బహిరం గంగా మాట్లాడేటప్పుడు సూటిగా, సరళంగా, అస్పష్టతకు, అపార్థాలకు తావు లేకుండా ఉండటం అత్యావశ్యకం. కశ్మీర్ అశాంతిపైనా, మానవ రక్షణ కవచం ఉదంతంపైనా చేసిన వ్యాఖ్యలతో రావత్ ఇప్పటికే అనవసర వివాదాలకు కేంద్రమై రచ్చకెక్కారు. ఇకనైనా ఆయన భారత సైనిక సత్సాంప్రదాయాలకు తగ్గట్టు మాటలు తగ్గించి, కార్యదక్షతను చూపిస్తే ఆయనకు, మన సైన్యానికి, దేశానికి కూడా గౌరవం. -
‘మళ్లీ తెగబడితే తగిన బుద్ధి చెబుతాం’
న్యూఢిల్లీ : భారత్ సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీ డే సందర్భంగా ఆయన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర్ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు సెల్యూట్ అని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడితే తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక జవాన్ల సమస్యల పరిష్కరానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసవరం అయితే జవాన్లు తనను నేరుగా కూడా కలవొచ్చని రావత్ తెలిపారు. దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు గ్యాలంటరీ అవార్డు ప్రదానం చేశారు. (సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుని, ఆరు రోజుల మృత్యువుతో పోరాడి లాన్స్‌నాయక్ హనుమంతప్ప వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.) అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు.