యుద్ధ విధుల్లో మహిళ
మహిళలు సైనికులుగా పోరాట విధులను నిర్వహించగలరా? ఎడతెగని ఈ చర్చ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ట్టే ఉంది. మహిళలకు పోరాట విధులను అప్పగిస్తామని, రిక్రూట్‌మెంట్ కూడా మొదలైందని మన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల తెలిపారు. ఆదే సాకారమైతే జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాల సరసన భారత్ కూడా త్రివిధ బలగాలలోని దాదాపు అన్ని విభాగాలలోనూ మహిళలకు ప్రవేశం కల్పించిన దేశంగా సగర్వంగా నిలవగలుగుతుంది. 1992లోనే మన సైన్యం మహిళలకు తలు పులు తెరిచినా వారి నియామకాలను వైద్య, విద్య, న్యాయ విభాగాలకు, సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విభాగాలకు పరిమితం చేసింది.
2015లో వైమానిక, నావికా బలగాలు మహిళలను పోరాట విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించి, అమలు చేస్తున్నాయి. సైన్యం తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా నేరుగా మహి ళలను పోరాట విధులలో నియమించాలని కాదు. ముందుగా వారిని సైనిక పోలీసు విధులలోకి తీసుకుంటారు. అంటే కంటోన్మెంట్‌లు, సైనిక సంస్థలలో పోలీసు విధు లనూ, యుద్ధ సమయాల్లో శరణార్థులు, యుద్ధ ఖైదీల బాధ్యతలను నిర్వహిస్తారు. ఇప్పటికే సశస్త్ర సీమా బల్ వంటి పారా మిలిటరీ బలగాలలో మహిళలు సరిహద్దు లలో కఠోర విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
2010లో లెఫ్టినెంట్ జనరల్ మితాలి మధుమిత కాబూల్‌లోని మన దౌత్య కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలకు తెగించి 11 మంది సైనికుల ప్రాణాలను కాపా డారు. ఆమె అప్పుడు విద్యా విభాగంలో పని చేస్తున్న సైనికాధికారి. అంతేకాదు, రెండున్నర దశాబ్దాల మన మహిళా సైన్యం చరిత్రలో ఏకైక శౌర్య పతక విజేత ఆమె ఒక్కరే! అందుకు కారణం, సైన్యంలోని ఇతర మహిళలకు అలాంటి ధైర్యసాహ సాలు కొరవడటం కాదు, వాటిని ప్రదర్శించే అవకాశాలను కల్పించకపోవడం.
పైగా విద్య, వైద్యం తప్ప మరే విభాగంలోనూ మహిళలకు, పురుషులకు వలే 5 నుంచి 14 ఏళ్ల స్వల్ప కాలిక సర్వీసు ముగిశాక పర్మనెంట్ కమిషన్డ్ అధికారులుగా పనిచేసే అవకాశాన్ని కల్పించడం లేదు. పురుషులతో సమానంగా కఠోరమైన శిక్షణను పొంది, అన్ని కష్టాలకు ఓర్చి, కుటుంబాలకు దూరమై పనిచేస్తే... పెన్షన్‌కు అర్హతనిచ్చే 20 ఏళ్లయినా పని చెయ్యకుండానే గెంటేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేసే మహిళా సైనికాధికారులకు కొదవలేదు. స్వల్పకాలిక సర్వీసు ముగిశాక కూడా సైనిక విధులలో కొనసాగాలని కోరుకునే మహిళలను సైనిక విధులకు దూరం చేయడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. పని ప్రదేశాలలో వివక్ష అన్ని చోట్లా ఉన్నదే. అది సైన్యంలోని మహిళలపట్ల ఉండకూడదు అనుకోవడం అత్యాశ గానీ, చాలా సందర్భాల్లో మహిళా సైనికులకు ప్రత్యేకంగా మరుగు దొడ్లు సైతం ఏర్పాటు చేయలేకపోవడాన్ని ఏమనాలి?
రావత్ ఆశిస్తున్నట్టు మహిళా జవాన్లు పోరాట యోధులుగా శిక్షణ పొంది రావడాన్ని చూడాలంటే.. ఇప్పటికే సైన్యంలో ఉన్న మహిళల్లో పలువురు ఐదేళ్ల కనీస సర్వీసు కాలవ్యవధి గడిచాక, గరిష్ట పరిమితి దాటకుండానే పదవీ విరమణ చేసేలా నిరుత్సాహపరిచే ఈ పరిస్థితులను మార్చక తప్పదని గుర్తించడం అవసరం. సైనిక పోలీసులుగా మహిళలు తన విధులను విజయవంతంగా నెరవేర్చ డంలో దృఢసంకల్పాన్ని, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించాలని, ఆ తర్వాతనే మహి ళలను పోరాట విధుల్లోకి తీసుకుంటామని రావత్ అన్నారు. దీంతో మహిళలు పోరాట సైనికులుగా మారడానికి ఇంకా ఎంత కాలం పడుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు బలగాల్లో, సైన్యంలో, పారా మిలిటరీ బలగాల్లో దశాబ్దాల తరబడి సమర్థవంతంగా పురుషులకు ధీటుగా పనిచేస్తున్న మహిళలు ఇంకా ఏం రుజువు చేసుకోవాలి? సైనిక రంగంలో ఆధునిక సాంకేతికత పాత్ర నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగానే సాయుధ బలగాలలో శారీరక దారుఢ్యం ప్రాధాన్యం తగ్గుతోంది. అయినా మన సైనిక నాయకత్వం మహిళలను పోరాట విధులలోకి తీసుకోడానికి బదులు అంతకు ముందు ఈ సైనిక పోలీసు మజిలీని ఎందుకు ఎంచుకుంది?
పదవీ విరమణ చేసిన మహిళా సైనికాధికారులు సహజం గానే సంధిస్తున్న సమంజసమైన ప్రశ్నలివి. ఆచితూచి మాట్లాడటం కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించే రావత్ అసలు ఉద్దేశాలపై సైతం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్‌లో రాళ్లు రువ్వే మూకలలోని మహిళలతో మహిళా సైనిక పోలీçసులయితే సమర్థవంతంగా తలపడగలరనీ, ఇతర పౌర ఆందోళనలలో సైతం సైన్యం మహిళలను ఎదుర్కొనవలసి వస్తున్నందున సైనిక మహిళా పోలీసులు చాలా ఉపయోగకరమని రావత్ చేసిన వ్యాఖ్యలే ఆ అను మానాలకు తావిస్తున్నాయి. అంతర్గత అశాంతి, ఆందోళనలను అదువు చేయడంలో సైన్యం ఇకపై ఇప్పటికంటే విస్తృతమైన పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని స్ఫురించేలా చేస్తున్నాయి.
అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని ఎక్కువగా ఉపయోగించడం వాంఛనీయం కాదనేదే ఇంతవరకు మన సైనిక బల గాల నాయకత్వం వైఖరి. నిజానికి అది మన సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యానికి పూర్తి విభిన్నమైదిగా నిలిపే విశిష్టతలలో ఒకటి. అనుద్దేశపూర్వకంగానే అయినా రావత్ వ్యాఖ్యలు మన సైన్యం ఆ వైఖరికి భిన్నమైన వైఖరిని చేపడుతున్నదా? అనే సందే హాన్ని రేకెత్తిస్తున్నది. పౌర అశాంతి, ఆందోళనలను నియంత్రించడంలో సైన్యం పాత్ర తాత్కాలికమైనది. అందుకోసం శాశ్వత ప్రాతిపదికపై మహిళా సైనిక పోలీ సుల ఏర్పాటు అసంగతం కాదా? అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు బహిరం గంగా మాట్లాడేటప్పుడు సూటిగా, సరళంగా, అస్పష్టతకు, అపార్థాలకు తావు లేకుండా ఉండటం అత్యావశ్యకం. కశ్మీర్ అశాంతిపైనా, మానవ రక్షణ కవచం ఉదంతంపైనా చేసిన వ్యాఖ్యలతో రావత్ ఇప్పటికే అనవసర వివాదాలకు కేంద్రమై రచ్చకెక్కారు. ఇకనైనా ఆయన భారత సైనిక సత్సాంప్రదాయాలకు తగ్గట్టు మాటలు తగ్గించి, కార్యదక్షతను చూపిస్తే ఆయనకు, మన సైన్యానికి, దేశానికి కూడా గౌరవం.