సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మీడియా కోరగా.. ఆమె తిరస్కరించారు.
ప్రస్తుతం ఆమె యూపీలో నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ల సమ్మిట్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమెను పలకరించిన మీడియా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై వివరణ కోరింది. ‘ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. వారు చేసే వ్యాఖ్యలతో నాకేం సంబంధం? నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం కూడా నాకు లేదు’ అని ఆమె మీడియాకు బదులిచ్చారు.
అస్సాంలోని చాలా జిల్లాల్లో అక్రమ ముస్లిం వలసదారులు వస్తున్నారని, వీరి కారణంగా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని రాజకీయ పార్టీ ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) బలం పుంజుకుంటోందని, బీజేపీ కన్నా వేగంగా ఆ పార్టీ ఎదుగుతోందని బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏఐయూడీఎఫ్ అనే పార్టీ ఉంది. దీన్ని పరిశీలిస్తే, బీజేపీ ఇన్నేళ్ళలో ఎదిగినదాని కన్నా ఎక్కువగా ఈ పార్టీ ఎదుగుతోంది. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుంది’’ అని జనరల్ బిపిన్ రావత్ అన్నారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా... అందులో రాజకీయాలు, మతపరమైన ఉద్దేశాలేవీ లేవని ఇండియన్ ఆర్మీ గురువారం ప్రకటించింది. మరోవైపు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రావత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment