ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం | Nirmala Sitharaman response to Rahul Bajaj comments | Sakshi
Sakshi News home page

ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం

Published Tue, Dec 3 2019 5:13 AM | Last Updated on Tue, Dec 3 2019 5:36 AM

Nirmala Sitharaman response to Rahul Bajaj comments - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేకుండా పోయిందంటూ వ్యాపార దిగ్గజం రాహుల్‌ బజాజ్‌ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. తమ సొంత అభిప్రాయాలను అందరికీ ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.  ఇలాంటి విమర్శలు .. జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, అమిత్‌ షాల సమక్షంలోనే రాహుల్‌ బజాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎవరూ దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితులేమైనా ఉంటే చక్కదిద్దేందుకు కృషి చేస్తామని షా స్పందించారు. ఈ చర్చాగోష్టి క్లిప్పింగ్‌ను మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన నిర్మలా సీతారామన్‌.. అన్ని సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటోందని, పరిష్కరించే ప్రయత్నాలూ చేస్తోందని చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.  

బజాజ్‌కు ‘బయోకాన్‌’ షా మద్దతు ..
మరోవైపు, రాహుల్‌ బజాజ్‌కు మద్దతుగా మరో పారిశ్రామిక దిగ్గజం బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా స్పందించారు. కార్పొరేట్‌ సంస్థలను ప్రభుత్వం అంటరానివాటిగా చూస్తోందని, ఎకానమీ గురించి ఏ విమర్శలనూ వినదల్చుకోవడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అటు నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌ పోస్ట్‌లపైనా షా స్పందించారు. కార్పొరేట్‌ సంస్థలు.. దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ‘మేడమ్‌ మేం జాతి వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక శక్తులం కాము. ఎకానమీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయ వంతం కావాలనే మేమూ కోరుకుంటున్నాం‘ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఇక, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలకు దిగాయి. ‘విమర్శించడమనేది జాతి ప్రయోజనాలకు ముప్పు అంటే.. ప్రభుత్వాన్ని పొగిడితేనే దేశ ప్రయోజనాలను కాపాడినట్లవుతుందా’ అంటూ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ ట్వీట్‌ చేశారు.   

5 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు..  
న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును తగ్గించడం వల్ల పన్ను వసూళ్లపై ప్రతికూల ప్రభావమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ దాకా స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 5 శాతం పెరిగాయని ఆమె తెలిపారు.  ట్యాక్సేషన్‌ చట్ట సవరణ బిల్లు 2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా.. ప్రత్యక్ష పన్ను వసూళ్లేమీ తగ్గలేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఆఖరు త్రైమాసికంలోనే అత్యధికంగా ఉంటాయని ఆమె చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement