నేడు ఉభయ సభల ముందుకు సామాజిక, ఆర్థిక సర్వే
రేపు లోక్‌సభలో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించండి
అఖిలపక్ష సమావేశంలో పార్టీలకు ప్రభుత్వం విజ్ఞప్తి
తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కోరిన వైఎస్సార్‌సీపీ, జేడీ(యూ), బీజేడీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు 19 రోజులపాటు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. జమ్మూకశీ్మర్ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ఈసారి వాడీవేడిగానే చర్చలు
2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, నిరుద్యోగం, అగి్నవీర్ పథకం, ఆర్థిక వ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, మణిపూర్‌లో శాంతి భద్రతలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయానికొచ్చాయి.
ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైఎస్సార్‌సీపీ
కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నా«థ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన తదితర 44 పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పారీ్టలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్‌సీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతిపక్ష నేతలపై దమనకాండ సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీ(యూ), ఒడిశాకు ప్రత్యేక హోదా కలి్పంచాలని బిజూ జనతాదళ్(బీజేడీ) సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున హాజరైన గౌరవ్ గొగోయ్ కోరారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు.
ఆరు బిల్లులివే..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది. 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్–2024ను తీసుకొస్తోంది. విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేయనున్నారు. అలాగే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.
హోదాపై టీడీపీ మౌనమెందుకో?: జైరాం
అఖిలపక్ష సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు ప్రత్యేక హోదా కలి్పంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేడీ(యూ) డిమాండ్ చేశాయి. విచిత్రంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చింది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment