శుక్రవారం ఢిల్లీలో తనను సన్మానిస్తున్న కార్యకర్తలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ.. హర్షధ్వానాలు చేస్తున్న మహిళా కార్యకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రంలో పూర్తి మెజార్టీతో కూడిన బలమైన, సుస్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బిల్లుకు రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, చిరకాలం నాటి కల సాకారమైందని అన్నారు. పూర్తి మెజార్టీతో కూడిన స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చని ఈ పరిణామం నిరూపిస్తోందని తెలిపారు.
బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ మహిళా ఎంపీలు, నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచడం అనేది సాధారణ చట్టం కాదని చెప్పారు.
ఇది నవ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక అంకితభావ తీర్మానమని స్పష్టం చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్న ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పుడు తాము తీసుకొచి్చన బిల్లుకు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళా శక్తి పెరిగిందని, అందుకే బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించిందని వివరించారు.
గౌరవాన్ని పెంచితే తప్పేమిటి?
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం కంటే ముందే మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని స్థాయిల్లో మహిళల స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేశామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు అడ్డుపడకుండా చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఈ బిల్లు విషయంలో అప్పటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆక్షేపించారు.
మహిళలను కించపర్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహిళా బిల్లుకు ‘నారీశక్తి వందన్’ అనే పేరుపెట్టడం పట్ల విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. మహిళామణుల గౌరవాన్ని పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు. బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల బీజేపీ ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు.
మహిళల్లో నూతన విశ్వాసం
కొన్ని నిర్ణయాలకు దేశ భవిష్యత్తు మార్చే శక్తి ఉంటుందని, ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వాటిలో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. ఈ చట్టం మహిళల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని, దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ నెల 20, 21న కొత్త చరిత్ర నమోదైందని, దీని గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని పేర్కొన్నారు. ‘మోదీ గ్యారంటీలు’ అమలవుతాయని చెప్పడానికి మహిళా బిల్లే ఒక నిదర్శనమని చెప్పారు.
మహిళల సారథ్యంలో అభివృద్ధి అనే నూతన శకంలోకి అడుగుపెట్టబోతున్నామని ప్రకటించారు. భారత్‌ను చంద్రుడిపైకి చేర్చడంలో మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment