చైనా-భారత్ ఘర్షణ: సిక్కింలో ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భూటాన్‌లో రోడ్డు విషయంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ గురువారం సిక్కిం పర్యటన చేపట్టారు. ఆయన రెండురోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారని, రాష్ట్రంలో ఉన్న ఫార్మేషన్ హెడ్ క్వార్టర్స్‌లో టాప్ ఆర్మీ కమాండర్లతో భేటీ అయి సరిహద్దుల్లోని పరిస్థితి, కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆర్మీ చీఫ్ రావత్ సిక్కిం రాక మామూలు పర్యటనే అని ఆ వర్గాలు వెల్లడించాయి.
సిక్కిం సెక్టార్‌లోని భూటాన్ భూభాగంలో చైనా సైన్యం రోడ్డు నిర్మిస్తుండటంతో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణాన్ని భూటాన్, భారత్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ.. భారతీయులు చేపట్టే మానస సరోవర్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీంతో సిక్కిం సెక్టార్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.