
చట్టానికి చక్కని కళ్లు
నేరంపట్ల కర్కశంగా ఉన్నా, నేరస్తునిపట్ల ‘దయ’కూడా ‘న్యాయం’లో భాగమే. న్యాయంకంటే గొప్పది ఉదాత్తత. నిష్కర్ష కంటే గొప్పది దయ. అవినీతిని శిక్షించడమంటే నేరస్తుడిని దండించడమే కానక్కరలేదు. ఆ నేరానికి కారణమైన వ్యవస్థని నిలదీయడమూ శిక్షే. వ్యక్తి వ్యవస్థలో ఒక భాగం. వ్యక్తి పట్ల వ్యవస్థ నిర్దాక్షిణ్యం కూడా భయంకరమైన అవినీతే.
సరిగ్గా 57 సంవత్సరాల కిందట ‘మాయాబజార్’ సినీమాలో పింగళి నాగేంద్రరావుగారు ఓ డైలాగ్ రాశారు. ‘‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానూ చెపుతుంది. మనం సౌమ్యంగా, సారాంశమే తీసుకోవా లె!’’ ఈ మాటని హాస్య పాత్ర వంగర చెప్పినా, అందులోని సత్యం మాత్రం తెగేసి చెప్పిందే.
రెండు ఉదాహరణలు చూద్దాం. మద్రాసు హైకోర్టు ఆవరణలో ఇప్పటికీ ఓ విగ్రహం ఉంది. అది మనునీతి చోళన్‌ది. ‘మనునీతి’ చోళన్ ఇంటి పేరు కాదు. నీతికి నిలబడిన లేదా నీతిని నిలబెట్టిన రాజు కథ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే పాలకుడు రాజు. అంతేకాదు. తన రాజ్యంలో ఎవరి కయినా, ఎప్పుడయినా, ఏ కారణానికయినా తనని సంప్రదించి న్యాయ పరిష్కారాన్ని పొందవచ్చునని కోట ప్రాంగణంలో ఒక గంటని ఏర్పాటు చేయిం చాడు. ఎవరయినా న్యాయాన్ని కోరుకున్నవారు- లేదా అన్యాయానికి లోనయినవారు ఆ గంటని మోగించవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా ఏ ఒక్కరూ ఆ గంటని ఆశ్రయించలేదు. కారణం ఎవరికీ అన్యా యం జరగని పాలనని సాగిస్తున్నాడు రాజు.
ఒకరోజు రాజు కొడుకు నగరంలో వాహ్యాళికి బయలుదేరాడు తన రథంలో. యువరాజుని చూసి ప్రజలు ఆనందంతో భేరీలు మోగించారు. జయ జయ ధ్వానాలు చేశారు. డప్పులు వాయించారు. ఆ చప్పుళ్లకి ఓ ఆవుదూడ బెదిరి, అటూ ఇటూ పరు గులు తీసి యువరాజు రథ చక్రాల కింద పడి చచ్చి పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి ఆవు గొల్లు మంది. కోట ప్రాంగణానికి వచ్చి తనకి జరిగిన అన్యాయానికి పరిష్కారం చూపమంటూ ఆవు గం టని మోగించింది (అదీ హైకోర్టులో విగ్రహం). జరి గిన అన్యాయం రాజుకు తెలిసింది. చాలాసేపు గుం జాటన పడ్డాడు. చివరికి తీర్పు చెప్పాడు. ఆవుదూడ ఎలా చచ్చిపోయిందో తన కొడుకునీ అలాగే అతని మీద నుంచి రథాన్ని నడిపి చంపించాడు. ఆవు లోన యిన పుత్రశోకాన్ని తనూ పంచుకున్నాడు.
ఇది శాస్త్రం నిష్కర్షగా, కర్కశంగా ప్రవర్తించిన కథ. ఇండోనేసియాలో ఒకాయనకి కర్రపెండలం తోటలున్నాయి. ఓ ముసలావిడ- రెండు కర్ర పెండ లం దుంపల్ని దొంగతనం చేసింది, యజమాని కేసు పెట్టాడు. కేసు విచారణకు ఓ మహిళా న్యాయమూర్తి దగ్గరకి వచ్చింది (ఆ న్యాయమూర్తి పేరు మార్జుకీ). ‘‘ఏమ్మా, దొంగతనం చేశావా?’’ అనడిగింది న్యాయమూర్తి. ముసలావిడ కంటతడి పెట్టుకుంటూ నేరాన్ని ఒప్పుకుంది.
‘‘ఎందుకు చేశావు?’’
ఆమె పేదరాలు. కొడుకు జబ్బుపడ్డాడు. మన వడు ఆకలితో ఏడుస్తున్నాడు. చూడలేక-రెండు దుంపలు తీసుకుంది. ‘‘ఆమె మీద దయతలచండి!’’ అన్నది న్యాయమూర్తి, ఫిర్యాదితో. యజమాని ఒప్పుకోలేదు. శిక్ష వెయ్యా ల్సిందేనని పట్టుబట్టాడు. న్యాయమూర్తి కాగితాలు చూసింది. నిస్సహాయంగా ముద్దాయితో అంది: ‘‘నువ్వు చేసింది నేరం. నేనేం చెయ్యలేను. నీకు శిక్ష వెయ్యాల్సిందే’’ అంటూ లక్ష రుపియాలు జరి మానా విధించింది. జరిమానా చెల్లించకపోతే రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష. ముసలావిడ ఏడ్చింది. తన దగ్గర డబ్బు లేదంది.
న్యాయమూర్తి కోర్టులో అందరినీ ఉద్దేశించి అంది: ‘‘ఈ నగరంలో నివసిస్తున్న సాటి పౌరులుగా ఒక పసివాడు ఆకలితో అలమటిస్తూ ముసలి అవ్వ దొంగతనం చేయాల్సిన పరిస్థితి రావడానికి మనం దరి పాత్రా ఉంది. అందుకని ఈ కోర్టు హాలులో ఉన్న ప్రతీ వ్యక్తికి 50 వేల రుపియాల జరిమానా విధిస్తున్నాను’’అంటూ తన టోపీ తీసి, అందులో తన పర్సులోంచి 50 వేలు తీసి వేసి, కోర్టు రిజి స్ట్రార్‌ను డబ్బు వసూలు చేయమంది.
కర్రపెండలం యజమాని కూడా 50 వేల రుపి యాలు చెల్లించాడు. మూడున్నర లక్షల రుపియాలు వసూలయినాయి. కోర్టుకి జరిమానా చెల్లించగా మిగతా సొమ్ముని ముసలావిడకిచ్చారు. ఇది వాస్త వంగా జరిగిన సంఘటన. పింగళివారు చెప్పిన-శాస్త్రాన్ని సౌమ్యంగా, సా రాంశాన్ని గ్రహించిన అద్భుతమైన సందర్భమిది.
నేరం పట్ల కర్కశంగా ఉన్నా, నేరస్తుని పట్ల ‘దయ’ కూడా ‘న్యాయం’లో భాగమే. న్యాయం కంటే గొప్పది ఉదాత్తత. నిష్కర్ష కంటే గొప్పది దయ. అవినీతిని శిక్షించడమంటే నేరస్తుడిని దండిం చడమే కానక్కరలేదు. ఆ నేరానికి కారణమైన వ్యవస్థని నిలదీయడమూ శిక్షే. వ్యక్తి వ్యవస్థలో ఒక భాగం. వ్యక్తి పట్ల వ్యవస్థ నిర్దాక్షిణ్యం కూడా భయం కరమైన అవినీతే.
(వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత, నటుడు)
గొల్లపూడి మారుతీరావు