సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’... ఇన్సూరెన్స్ ఫాడ్స్ర్ చేసిన త్రయం విషయంలో ఈ ఆంగ్ల నానుడి సరిగ్గా సరిపోతుంది. నగరానికి చెందిన ఇద్దరు వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్న ముగ్గురు నిందితులు రూ.6.74 కోట్లు కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తొలి కేసు నమోదైన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులనూ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు మోసం సొత్తుతో స్థిర, చరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తోంది. ఈ రెండు కేసులూ మోసాన్ని సూచించే ఐపీసీలోని 420 తదితర సెక్షన్లతో నమోదు కావడంతో ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది.
పక్కాగా స్కెచ్ వేసి స్వాహా...
కుత్భుల్లాపూర్‌లో నివసిస్తున్న పుల్లేటి సుబ్రహ్మణ్యం, బీరంగూడ వాసి ఉడుత మనోజ్‌కుమార్, గుర్రంగూడకు చెందిన బండారి మహేష్ గౌడ్‌లతో కూడిన ముఠా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పథకం వేసింది. వివిధ కంపెనీలకు చెందిన పాలసీ హోల్డర్ల ఫోన్ నంబర్లు సేకరించి ప్రధానంగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని వారికి నమ్మకం కలిగించి నిండా ముంచింది. నగరానికి చెందిన ఇద్దరి నుంచి వేర్వేరుగా రూ.6.74 కోట్లు నగదు రూపంలో తీసుకుని నకిలీ బాండ్లు అంటగట్టి మోసం చేసింది. తన కుమారుడు విదేశాల నుంచి వచ్చి గుర్తించే వరకు ఒక బాధితుడు, వీరి అరెస్టు విషయం పత్రికల్లో చూసే వరకు మరో బాధితుడు తాము మోసపోయినట్లు గుర్తించలేకపోయారు.
కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి...
మొదటి బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపై న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే మోసం సొమ్మును ముగ్గురూ పంచుకున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యం తన స్వస్థలమైన గుడివాడలోని ఎస్‌ఎన్ పురంలో రూ.60 లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించాడని, కుత్భుల్లాపూర్‌లో రూ.కోటితో ప్లాట్ కొన్నాడని, తన కుమార్తె పేరుతో రూ.1.5 లక్షలు పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడని తెలుసుకున్నారు. మనోజ్‌కుమార్ బీరంగూడలో రూ.70 లక్షలతో ఫ్లాట్ ఖరీదు చేయగా, మహేష్ తన వివాహానికి డబ్బు ఖర్చు చేయడంతో పాటు భార్యకు పది తులాల బంగారం, తమ కోసం ఓ కారు ఖరీదు చేసుకున్నట్లు గుర్తించారు.
స్వాధీనానికి ఆస్కారం లేకపోవడంతో...
విలాసాలకు అలవాటుపడిన వీరు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. వృద్ధుల నుంచి కొట్టేసిన సొమ్ముతోనే ఇవన్నీ చేశామంటూ వారు అంగీకరించినా... పోలీసులకు ఆధారాలు లభించినా వాటి జోలికి వెళ్లే ఆస్కారం లేకుండా పోయింది. ఈ కేసును పోలీసులు ఐపీసీలోని 420 తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. కేవలం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద నమోదైన వాటిలోనే ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం ఉంది.
ఈ చట్టం వర్తించాలంటూ నిందితులు బాధితుల నుంచి డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకుని ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ నేరం ఆ తరహాకు చెందినది కాకపోవడంతో అలా చేసే వీలులేదు. దీంతో ఈ వివరాలతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు న్యాయస్థానానికి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టు నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండో కేసులో వీరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు.
అనివార్యంగా మారిన చట్ట సవరణ...
కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు అనేక మోసాల కేసుల్లో బాధితుల పరిస్థితి ఇలానే ఉంటోంది. నిందితులు అరెస్టు అయినా వారికి న్యాయం అందడం లేదు. ఒకప్పుడు రూ.వేలు, రూ.లక్షలతో ముడిపడి ఉన్న మోసాల కేసుల ‘విలువ’ ఇప్పుడు రూ.కోట్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. కేవలం పోలీసు విభాగంలోనే కాకుండా ఆయన డిప్యుటేషన్‌పై పని చేసిన ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖల్లోనూ అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన మార్కు చూపించారు. ఈ విషయంలోనే ఆయన స్పందించి భారీ మొత్తాలతో ముడిపడి ఉన్న మోసం కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకునేలా సవరణకు ప్రతిపాదించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే మోసగాళ్లకు కళ్లెం పడటంతో పాటు బాధితులకు పూర్తి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది.
(చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్)
Comments
Please login to add a commentAdd a comment