‘‘నందిగ్రామ రాజ్యము’’ | nandigama rajyam administration in gollapudi jeevana kalam | Sakshi
Sakshi News home page

రెండున్నర లక్షలకి 90 వేలు కంపు కొట్టే నోట్లు

Published Thu, Nov 17 2016 8:20 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

‘‘నందిగ్రామ రాజ్యము’’ - Sakshi

‘‘నందిగ్రామ రాజ్యము’’

జీవన కాలమ్‌
ఇటీవల ప్రభుత్వం పెద్ద నోట్ల విశృంఖల వినిమయాన్ని నియంత్రించింది. ఈ నోట్లు 2017 మార్చి వరకూ చెల్లుతాయి. అయితే వలలో పడాల్సిన పెద్ద చేపలకు ముందుగానే ఉప్పు అందిందన్న వార్తలు వస్తున్నాయి.

కవి కాలం కంటే ముందు చూసేవాడు. ద్రష్ట. విశ్వనాథ సత్యనారాయణగారు వెళ్లిపోయిన సంవత్సరంలో – అంటే జూలై 1976లో ఆయన ఆఖరి నవల రాశారు. అది అముద్రితం. 40 సంవత్సరాల కిందటే ఇప్పటి పరిస్థితులను వివరించే వ్యంగ్య నవల అది. 54 పేజీలు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు నందిగ్రామం వచ్చాడు. సాకేత రాజ్యంలో కొందరు – భరతుడు నందిగ్రామం నుంచి పరిపాలన సాగిస్తున్న కారణాన – తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించి తమ పాలనను సాగిస్తున్నారు. వర్తమాన వ్యవస్థలో ఉన్న దుర్లక్షణాలన్నీ ఆ పాలనలో ఉన్నాయి. రాముడితోపాటు అనేకమంది రాక్షసులూ, కోతులూ వచ్చారు. వీరి దర్శనానికి ప్రజలూ విరగబడ్డారు.

ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. రాముడి పట్టా భిషేకం వ్యవహారాలూ, ఖర్చులూ అన్నీ చూసుకోడానికి సుగ్రీవుడిని ఆ శాఖ మంత్రిని చేశారు. సుగ్రీ వుడు తన వానర ప్రతినిధు లతో కలసి – ఈ రాజులవద్ద కోటి బంగారు నాణాలు వసూలు చెయ్యడం కార్యక్రమం. పాలకులూ, ఉద్యోగులూ ఈ కార్యక్రమానికి తలా గుమ్మడికాయంత బంగారం ఇవ్వాలన్నారు. గుమ్మ డికాయ మీద స్థూల రూపంతో హనుమంతుడు కూర్చున్నాడట. వసూళ్లు పెరిగాయి. అక్రమార్జన అంతా ఖజానాకు చేరింది. పట్టాభిషేకం జరిగి పోయింది. అదీ నవల. మరచిపోవద్దు. ఈ అరా చకం రామరాజ్యంలో కాదు. ఆయన పరిపాలనకి ముందు. ఇది వ్యంగ్య నవల. (విమర్శిని, పేజీ 269)

ఇటీవల ప్రభుత్వం 500, 1000 రూపాయి నోట్ల విశృంఖల వినిమయాన్ని నియంత్రించింది. ఇందులో గమనించాల్సిన విషయం – ఈ నోట్లు 2017 మార్చి వరకూ చెల్లుతాయి – సందేహం లేదు. అయితే 8వ తేదీ రాత్రి నుంచి – చెల్లే ప్రతీ నోటూ లెక్కల్లోకి రావాలి. అంతే నియమం. అయితే ఇందులో పెద్ద తిరకాసు ఉంది. వలలో పడాల్సిన పెద్ద చేపలకు ముందుగానే ఉప్పు అందిందన్న వార్తలు వస్తున్నాయి.

కిలో 250 రూపాయలకి కందిపప్పు కొనుక్కోవలసిన రోజుల్లో కనీసం 500 జేబులో ఉంచుకోని నేలబారు మనిషి ఎవరుంటారు? మొక్కజొన్న కండెలు కాల్చే మనిషి ఎంతలేదన్నా సాయంకాలానికి 500 సంపాదిస్తుంది. ముందు రోజు సంపాదనని ఇంట్లో పిడతలో దాచుకుని ఉంటుంది. ఆ నోటు వెంటనే అక్కరకు రాదనీ, దాన్ని బ్యాంకులో కట్టి సొమ్ము చేసుకోవాలనీ వారికి తెలీదు. తెలిసినా చేసుకోవడం తెలీదు. వినియోగించుకోలేని నేలబారు మనిషికి నోటు తాత్కాలికంగానైనా చిత్తుకాగితమే. ఇది ఈ సమస్యకి ఒక పార్శ్వం.

రెండు సరదా కథలు. ఢిల్లీ చత్తర్‌పూర్‌లో కోటీ శ్వరుడు. బుధవారం ఉదయం లేచేసరికి తనదగ్గరున్న డబ్బు చిత్తు కాగితాలని తేలింది. బెంగళూరులో ఒక ఫ్యాక్టరీని శుక్రవారంలోగా రిపేర్లు చేయించి ఒక కంపెనీకి అప్పగించాలి. 90 వేలు ఖర్చు. బ్యాంకుల్లో కోట్లు ఉన్నాయి. కానీ చేతిలో చెల్లని నోట్లున్నాయి. బిజినెస్‌ క్లాసులో బెంగళూరు వచ్చాడు. ట్యాక్సీ వాడు కరెన్సీ పుచ్చుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి 10 కిలో మీటర్లు నడిచి వెళ్లాడు.

చిల్లర డబ్బు కావాలి. ఎలా? తన మిత్రులు జోక్‌గా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. బిచ్చగాళ్లు ఈ సమయంలో కోటీశ్వరులు. ఒక పోలీసు అధికారి ద్వారా బిచ్చగాళ్ల ముఠా అడ్రసు పట్టుకున్నాడు. బెంగళూరు రైల్వేస్టేషను, మెజెస్టిక్‌ బస్టాండ్‌ సమీపంలో ఒక కుళ్లు గూడానికి వచ్చాడు. భరించలేని కంపు. బిచ్చగాళ్ల రాజుగారు చిరునవ్వు నవ్వారు. ఈ కోటీశ్వరుడు బేరం చెయ్యగా రెండున్నర లక్షలకి 90 వేలు కంపు కొట్టే నోట్లు మారకం చేసుకున్నాడు.

మరో సరదా కథ – కాదు సరదాల కథ. మమతా బెనర్జీ సామ్రాజ్యంలో లక్షమంది రిజిస్టరయిన సెక్స్‌ వర్కర్లున్నారట. వారు నిరభ్యంతరంగా పెద్ద నోట్లు తీసుకుంటున్నారని, తీసుకుంటారని దర్బార్‌ మహిళా సమాఖ్య కమిటీ మెంబరు భారతి వాక్రుచ్చారు. సోనాగచీలో ఉషా మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ బ్యాంకులో మొదటి రెండు రోజుల్లో కేవలం 55 లక్షలు నమోదయింది.

ఏతావాతా – మొదటి రెండు రోజుల్లో కనీసం 4 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నమోదయిందని తెలిసింది. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడిన చిన్న చిల్లర కావాల్సిన మనుషులు బేషరతుగా ప్రభుత్వ చర్యని హర్షిస్తూ, తమ పాట్లకు ఎవరినీ నిందించలేదు. ప్రభాకర్‌ ముంద్‌కూర్‌ అనే ఆర్థిక నిపుణుడు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. ఆఖరి వాక్యాలు: ‘.... I know that I am speaking on behalf of millions of honest Indians. I am proud of you.

గొల్లపూడి మారుతీరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement