ఓ ‘‘చౌకీదారు’’ కథ | Opinion on PM Modi Relatives Jeevana Kalam by Gollapudi Maruthi rao | Sakshi
Sakshi News home page

ఓ ‘‘చౌకీదారు’’ కథ

Published Thu, Jan 12 2017 12:55 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఓ ‘‘చౌకీదారు’’ కథ - Sakshi

ఓ ‘‘చౌకీదారు’’ కథ

జీవన కాలమ్‌
నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు.

కొంతకాలం  కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్‌ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్‌ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్‌! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని  ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం.

కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్‌  జనరల్‌ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్‌ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య.  

ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్‌. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు.

ఇక  నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్‌ భాయ్‌–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్‌ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు.

మోదీ అన్నయ్య–సోంభాయ్‌ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు.

మోదీ అన్నయ్య అమృతాభాయ్‌(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్‌ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్‌కీ, రాబర్ట్‌ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి.

నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని  గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్‌ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. మోదీకి జోహార్‌!


(వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement