రొట్టెకొద్దీ పిండి
జీవన కాలమ్
దీపా కర్మాకర్‌కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూకరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి.
మొన్నటి రియో ఒలిం పిక్స్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసిన కళాకారిణి దీపా కర్మాకర్. మృత్యువుని కూడా లెక్క చేయని ప్రొడు నోవా విన్యాసం ఒక విస్ఫో టనం. కొద్ది సెకన్లలో బహు మతిని కర్మాకర్ నష్ట పోయినా, దేశ ప్రజల మన్న నలను నష్టపోలేదు. ఎక్కడో అగర్తలాలో అతి మామూలు కుటుంబంలో పుట్టిన ఈ 23 ఏళ్ల పిల్ల– తన లక్ష్యంలో నిప్పునీ, సాధనలో మృత్యువునీ జయిం చి– ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసింది.
ఆమె విజయానికి మెచ్చి సచిన్ తెందూల్కర్ అనే భారతరత్న ఆమెకు ఒక బీఎం డబ్ల్యూ కారుని బహూకరించాడు. దీని ఖరీదు– కనీసం కోటి రూపా యలు. నా ఉద్దేశం ఇలాంటివి భారతదేశంలో vulgar display of affluence అని.
దీపా కర్మాకర్‌కి ఇది కొత్త సమస్య. పాపం, వాళ్ల ఊర్లో ఇంత పెద్ద, గొప్ప కారు తిరగడానికి రోడ్లు లేవు. కనుక త్రిపుర ప్రభుత్వం నిస్సహాయంగా ఆ ఊర్లో ఫలానా కారు తిరిగే రోడ్లను వేసే కార్యక్రమాన్ని చేప ట్టింది. అయితే పాపం, దీపా ఈ బహు మతిని అందుకున్నప్పుడే ఆమె తండ్రి ఓ మాట చెప్పారు. ‘‘బాబూ! ఈ కారుని నడపడానికి, తట్టుకో వడానికి మాకు శక్తి చాలదు. ఆ కారుకి అయిన డబ్బు ఇవ్వండి. మాకు ఉపయోగపడుతుంది’’ అని.
బీఎండబ్ల్యూ సచిన్ వితరణని, స్థాయిని చెప్తోంది కాని– దీపా కర్మాకర్ స్థాయిని అర్థం చేసుకోని ‘లోపాన్ని’ కూడా చెప్తోంది. ఆ కారు తాళం చెవుల్ని అందుకుంటూ– ఈ దిక్కుమాలిన ‘మొగ్గ’ వేసి గొప్ప ఇబ్బందిని తెచ్చి పెట్టుకున్నానే! అని దీప ఒక్క సారయినా మనసులో అనుకుని ఉంటుందని నాకని పిస్తుంది.
ఆ బాధ నాకు తెలుసు. నా జీవితంలో దాదాపు 17వ యేట నుంచీ ఏవో బహుమతులూ, చిన్న చిన్న జ్ఞాపికలూ, షీల్డులూ అందుతూనే ఉన్నాయి. రాను రాను వాటి ఉధృతం పెరిగి– ప్రతీ సభలో ఏ కొత్త ఉధృతం మీద పడుతుందోనన్న భయం ఎక్కువవు తోంది. సీనా రేకు, ప్లైవుడ్ చెక్కలతో అందంగా బొమ్మ లంటించిన వందలాది షీల్డులను నా జీవితంలో పుచ్చుకున్నాను. పుచ్చుకుంటూనే ఉన్నాను. వాటినేం చెయ్యాలి? ఎక్కడ ఉంచాలి? ఇచ్చేవారి మర్యాద, ఔదార్యం గొప్పవే. కానీ ఉంచుకోవాల్సిన నా ఇల్లు చిన్నది. ఇది 62 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్పాతం. మా ఇంట్లో షెల్ఫులన్నీ, కిటికీలన్నీ, గోడ లన్నీ, ఖాళీ స్థలమంతా వీటికి చాలవు. నాకప్పుడ ప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యకర్తలు– దూర దృష్టితో ఉపయోగపడే వస్తువులేమన్నా ఇవ్వరాదా? అని. కానీ అందరూ తెందూల్కర్‌లే. పెద్ద మనసు కలవారే. ఈ మధ్య టోపీలు వచ్చాయి. ఇక శాలువాలు కొల్లలు. ఒకసారి ఒక సంస్థవారు చక్కటి బ్రీఫ్ కేసు ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని వాడతాను. మరొకరు గొడుగు ఇచ్చారు. వర్షం ఛాయలు కనిపించగానే, ‘ఫ్రెండ్స్ క్లబ్బు గొడుగు కారులో పెట్టారా?’ అని గుర్తు చేసుకుంటాను. శాలువాకి బదులు– చక్కగా పార్సిలు చేసి పది నాప్‌కిన్స్ ఇవ్వరాదా అనుకుంటాను. రోజూ చెయ్యి తుడుచుకుంటూ ఆ సంస్థని జ్ఞాపకం చేసు కోవచ్చు. చక్కటి షేవింగ్ కిట్ ఇవ్వరాదా? రోజూ గెడ్డం చేసుకుంటూ వారిని తలుచుకుంటాం. నాలుగు తువాళ్లివ్వండి. ఒక పడక కుర్చీ ఇవ్వండి. రెండు బెడ్ షీట్లు ఇవ్వండి. రెండు తలగడాలివ్వండి. పది పాకెట్ల సబ్బులివ్వండి. ఆడవాళ్లకి పైట పిన్నులు ఇవ్వండి. జడ కుచ్చులివ్వండి. పోనీ ఇప్పుడు జడలు వేసు కోవడం మానేశారు కనుక– పది నైటీలు ఇవ్వండి. మగాళ్లకు డజను లుంగీలివ్వండి. కందిపప్పు ధరలు మండిపోతు న్నాయి. పది కిలోల కందిపప్పు ఇవ్వండి. 5 కిలోల మినప గుళ్లి వ్వండి. సైకిలు మార్కు ఇంగువ డబ్బాలను ఇవ్వండి. భార్యలు సన్మానం ఎప్పుడా అని ఎదురుచూడకపోతే నన్న డగండి. ఇది నవ్వుతూ అన్నా, నవ్వులాటకి అన్నమాట కాదు. ఎవరినీ చిన్న బుచ్చడం ఎంతమాత్రం కాదు.
ఆ మధ్య కువాయిత్‌లో ఒక సీడీ ప్లేయర్ ఇచ్చారు. ఒక సెల్‌ఫోన్ ఇవ్వండి. ఐపాడ్ ఇవ్వండి. సంగీతం కాసెట్లు ఇవ్వండి. పోనీ, కొత్త సినీమా టికెట్లు ఇవ్వండి. దీపా కర్మాకర్‌కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూ కరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. దీపకి ఒక సంవ త్సరానికి సరిపోయే బంగాళాదుంపల్ని సరఫరా చెయ్యమనండి. ఒక లారీతో గోధుమ పిండిని బహూ కరించమనండి.
అయ్యా, రొట్టె కొద్దీ పిండిని ఎంపిక చేయాలి. భరించలేనివారికి అక్కరలేని సత్కారం– ఇబ్బంది పెట్టే ఇరకాటం అవుతుంది. ఇది ఇచ్చేవారి పెద్ద మన సుని శంకించడం ఎంతమాత్రం కాదు. పుచ్చుకునే అర్హత ఇచ్చుకునే వితరణకు ఉదాత్తతని ఇస్తుంది. అందుకే బలి చక్రవర్తి వితరణ చరిత్ర అయింది. పురాణమయింది–పుచ్చుకున్నవాడు సాక్షాత్తు దేవుడు కనుక. అది అర్హతకి పట్టాభిషేకం. వితరణకు నివాళి.
గొల్లపూడి మారుతీరావు