కె.బాలచందర్ (జూలై 9, 1930 - డిసెంబర్ 23, 2014)తో వ్యాసకర్త (ఫైల్ ఫోటో)
కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొందరికి అంతఃచేతన. ఆఖరి రోజుల్లో అపస్మారకంలో ఉండిపోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు.
సినీమా బలహీనత నాటకం. కాని ఆనాటి ఫాల్కే ‘హరిశ్చంద్ర’ నుంచి, తొలినాటి పుల్ల య్యగారి ‘భక్త ప్రహ్లాద’ దగ్గర్నుంచి నేటి వరకు ఆ బలహీనత సామాన్యగుణంగా భార తీయ సినీమాలో రాజ్య మేలు తూవచ్చింది. కాని ఐదు దశా బ్దాల పాటు ‘నాటకీయత’నే సినీమాకి బలమూ, అలంకారమూ, ఆకర్షణా చేసి - వెండితెర మీద అపూర్వమైన నాటకాలను రచించిన వెండితెర మేస్త్రి కె. బాలచందర్.
76 సంవత్సరాల కిందట తంజావూరు జిల్లా నల్లమాంగుడి అనే గ్రామంలో 8 ఏళ్ల కుర్రాడికి నాటకం ఊపిరి. ఊరి మధ్య అరుగు మీద నాటకం వేస్తూంటే వాళ్ల నాన్నకి తెలిసి, నాటకం మధ్యలో స్టేజీ మీదకి వచ్చి కొడుకుని చెవి పట్టుకు తీసుకుపోయి ఇంట్లో చావ గొట్టాడు. అయితే ఆ వ్యసనం కారణంగానే ఆ కుర్రాడు తర్వాతి జీవితంలో 9 జాతీయ బహుమతులూ, 13 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, కళైమామణి, ఏఎన్నార్ అవార్డు పుచ్చుకుని భారతదేశంలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదిం చుకుంటాడని ఆయనకి తెలీదు.
19 ఏళ్లకి ఆయన ఊళ్లో బడిపంతులయ్యాడు. తర్వాత ఎకౌటెంట్ జనరల్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం. అప్పుడే ఒక నాటక సమాజాన్ని ఏర్పరు చుకుని మొట్టమొదటి నాటకం ‘మేజర్ చంద్రకాంత్’, రచన, ప్రదర్శన. దరిమిలాను సుందరరాజన్ అనే నటుడు సినీమాలో ఆ పాత్ర వేసి ‘మేజర్’ని ఇంటిపేరు చేసుకున్నాడు. ఓ పేరులేని దర్శకుడు ‘ధాయ్ పిరందాళ్ వళి పిరుక్కుం’ (ఆషాఢమాసం వస్తే దారి అదే దొరు కుతుంది) అనే సినీమా తీసి, అనుకోకుండా బోలెడు డబ్బు సంపాదించి, బాలచందర్ ‘నీర్ కుమిళి’ అనే నాటకాన్ని చూసి, దాన్ని సినీమాగా తీయా లనుకున్నాడు.
బాలచందర్‌నే దర్శకత్వం వహిం చమన్నాడు. నాకు చాతకాదని వచ్చేశాడు బాలచందర్. తోటి నటులు తిట్టి అతనికి నమ్మకం లేని వ్యాసంగం లోకి అతన్ని తోశారు. అలా మొదటి సినీమాకి దర్శకుడయ్యారు. నా ‘కళ్లు’ నాటిక మీద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చిన్న సమీక్ష చదివి దర్శకుడు ఎస్.డి. లాల్ ద్వారా నాకు కబురు పంపారు. నేను కథ చెప్తే పొంగిపోయి నాటిక హక్కులు కొని చిత్ర నిర్మాణానికి ఉపక్రమించారు.
పేరు ‘ఊమై విళిగళ్’ (మూగకళ్లు). జయసుధ, జయశంకర్ నటీనటులు. తీరా నాలుగు రీళ్లు తీశాక నిర్మాణం నిలిచి పోయింది. సంవత్సరం తర్వాత ఇద్దరం పామ్‌గ్రోవ్ హోటల్లో కలిశాం. ‘ఆపేశారేం సార్?’ అనడిగాను. ‘నాటికలో మీరు సూచించిన సింబల్ తెర మీద విస్తృతిలో పల్చబడుతోంది. నచ్చక ఆపేశాను’ అన్నారు. ఒక గొప్ప దర్శకుడి కళాత్మకమయిన నిజాయితీకి ఇది నిదర్శనం.
మా వాసూ పేరిట స్థాపించిన గొల్లపూడి శ్రీనివాస్ స్మారక సంస్థ ప్రారంభోత్సవ సభలో అక్కినేని, సునీల్ దత్, అపర్ణాసేన్, ఆదూర్ గోపాలకృష్ణన్‌తో పాటు బాలచందర్ ముఖ్య అతిథి. మాట్లాడుతూ, ‘‘విశాఖ సముద్రతీరంలో శ్రీనివాస్ మృతికి నా చేతులకూ రక్తం అంటిందేమో! సముద్రాన్ని ఆకర్షణీయంగా అలంకరిం చిన నేరం నాది’’ అంటూ ‘డ్యూయెట్’ సినీమా షూటింగ్ అక్కడ మొదలెట్టి వాసూ జ్ఞాపకంతో తీయలేక ఒకరోజు విరమించుకున్నారట. కారణాన్ని మీనాక్షీ శేషాద్రికి చెప్పారట.
మరో పదేళ్ల తర్వాత హిందీ హీరో ఆమీర్‌ఖాన్ బహుమతినందుకుంటున్న సభకి వచ్చి ఆయన సినీమా ‘తారే జమీన్ పర్’లో కృషిని ప్రశంసిస్తే, ఆమీర్‌ఖాన్ పసివాడిలాగ కంటతడి పెట్టుకున్నాడు. వేదిక మీదే బాలచందర్ చేతిలో ప్రసంగ పాఠాన్ని లాక్కొని ‘‘నేను ముసలివాడినయ్యాక నా మనవలకి ఈ ప్రసంగం చదివి వినిపిస్తాను’’అంటూ, ‘‘మా అమ్మ ఈ సభలో ఉంటే ఎంతో సంతోషించేది’’ అన్నారు.
కొందరికి వృత్తి ఉపాధి. కొందరికి ఊపిరి. మరికొం దరికి అంతఃచేతన. ఆఖరిరోజుల్లో అపస్మారకంలో ఉండి పోయారు. స్పృహలేదు. అయినా మధ్యలో ఆయన పెదాలు ‘లైట్స్’,‘కెమెరా’, ‘స్టార్ట్ ’ అన్నాయట. ఓ జీవితకాలం వెండితెరకి నాటకం రుచిని మప్పిన రుషి బాలచందర్. కథనీ, పాత్రలనీ, చిక్కగా కాచి వడపోసి అందులో పాత్రలయిన ప్రతి నటుడినీ ‘చరిత్ర’ ను చేసిన సృష్టికర్త. కమల్‌హాసన్, రజనీకాంత్, సరిత, మమ్ముట్టి, ప్రకాష్‌రాజ్, ఏఆర్ రెహమాన్- ఉదాహరణలు చాలు.
బాలచందర్ ఒడుపు కథ. నాటకం పెట్టుబడి. వ్యూహం కథనం. వాటిలో అంతర్భాగమయిన ప్రతి ఒక్కరూ మణిపూసలయ్యారు. ఒక జీవితకాలంలో పట్టిందంతా బంగారం చేసి, తన సంతకాన్ని ప్రతి సృష్టి లోనూ నిలుపుకున్న దర్శక నిర్మాత- మరొక్కరే గుర్తు కొస్తారు నాకు- ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. అయితే వారి ధోర ణులు వేరు. భాషలు వేరు. ప్రేక్షకులు వేరు. కాని ఇద్దరూ ఆక్రమించుకున్న ఆకాశం ఒక్కటే.