Father's Day 2024: హాయ్..! నాన్న..!! | Sakshi
Sakshi News home page

Father's Day 2024: హాయ్..! నాన్న..!!

Published Sun, Jun 16 2024 8:38 AM

Father's Day 2024 Special Story Thanks To Dad

నేడు ‘ఫాదర్స్‌ డే’

"ఏ కష్టం ఎదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం"...

నేడు ‘ఫాదర్స్‌ డే’ ఈ పాట వినగానే గూస్బమ్స్‌ వస్తాయి.. ఇప్పుడెందుకు ఈ పాట గురించి చెప్పాల్సి వచ్చిందంటే..అదే నండి జూన్‌ 16న ‘ఫాదర్స్‌ డే’. నేటి హాయ్‌ నాన్న.. మొదలుకుని.. నాటి ‘డాడీ’ వరకూ అనేక సినిమాలు నాన్న కూతురు, నాన్న కొడుకుల అనుబంధాన్ని తెలిపేలా చిత్రించారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. నిజజీవితంలోనూ మనలో చాలామందికి రోల్‌ మోడల్‌ నాన్నే.. పైకి కోపంగా, కటువుగా, గంభీరంగా కనిపించే నాన్న మనసు పొరల్లో దాగున్న ప్రేమ బయటకు చెప్పలేనిది.

లోపల ఎంత ప్రేమున్నా.. పైకి చూపిస్తే..పిల్లలపై ప్రభావం పడుతుందనుకునే నాన్నను అర్థం చేసుకునేవాళ్లు తక్కువ మందే.. అందుకే చాలా మందికి చివరి వరకూ నాన్న విలన్‌ లానే కనిపిస్తాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి ఆయనే నిజమైన హీరో. అయితే నాన్న ప్రేమను అర్థం చేసుకోవడమూ అంత తేలికేం కాదు...మన కోసం తన కోర్కెలను, ఆశయాలను, ఆలోచనలను, ప్యాషన్‌ను, ఇష్టాలను అన్నీ త్యాగం చేస్తాడు. అలాంటి నాన్నల గురించి ఫాదర్స్‌ డే సందర్భంగా పలువురిని సాక్షి పలుకరించగా.. వారు పంచుకున్న విశేషాలు...వారిమాటల్లోనే...

ఆయన అలవాట్లే నాకొచ్చాయి..
మాది ఉమ్మడి కుటుంబం. తాత కొండా వెంకటరంగారెడ్డి. నాన్న పేరు జస్టిస్‌ కొండా మాధవరెడ్డి. మాది పెద్ద కుటుంబం కావడంతో అంతా కలిసి భోజనం చేసే వాళ్లం. చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ పెరిగాను. ఆయనంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ. ఆయన చెప్పిన ప్రతి అంశాన్నీ విధిగా పాటించేవాడిని. నాపై ఆయన కోపం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఎంత బిజీగా ఉన్నా...కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేవారు. ప్రతి రోజు కలిసే డిన్నర్‌ చేసేవాళ్లం. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే కాకుండా శాస్త్ర, సాంకేతిక అంశాలపై పెద్ద చర్చే జరిగేది.

ఆయన అలవాట్లే నాకూ వచ్చాయని అంతా అంటుంటారు. భోజనం తర్వాత స్వీటు తినే అలవాటు ఆయన నుంచి వచ్చినదే. కోపం కూడా ఆయన మాదిరే. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. జడ్జిగా పని చేస్తూ వ్యవసాయ పనులు చూసుకునే వారు. సాంస్కృతిక కేంద్రాలు. విద్యా సంస్థలు నిర్వహించారు. చాలా అంశాల్లో నాన్నే ఆదర్శం. ప్రతి అంశాన్నీ విశ్లేషించడమేకాదు..వాటి పరిణామాలనూ చెప్పేవారు. – చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

నాన్నే స్ఫూర్తి..
స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. కుటుంబంతో కలిసి సోమాజీగూడలోనే స్థిరపడ్డాం. ఖైరతాబాద్‌ నాసర్‌ స్కూల్లోనే 12వ తరగతి వరకూ చదువుకున్నా. అమ్మ సుజాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఉద్యోగిని. నాన్న చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయినప్పటికీ  ఆఫీస్‌ మా ఇంటి పక్కనే ఉండేది. మధ్యాహ్నం 1.30 గంటలకు స్కూల్‌ అయిపోయేది. దీంతో నాన్నే వచ్చి చూసుకునే వారు. ఆయన ప్రోత్సాహంతోనే స్కూల్‌ టాపర్‌గా మారా.

  • నాన్న వారసురాలిగా 2011లో సీఏ పూర్తి చేసి చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయ్యా. నాన్నకు చిన్న తనం నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. వ్యవసాయ కుటుంబం కావడంతో సాధ్యంకాలేదు. నాకూ చిన్నప్పటికీ నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. మొదటి రెండు ప్రయత్నాల్లో సరైన గైడెన్స్‌ లేక అర్హత సాధించలేకపోయా. మూడో ప్రయత్నంలో నేను చేసిన తప్పు వల్ల అవకాశం కోల్పోయా. అప్పుడు నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.

  • ‘నా కోసం వద్దు. నీకు పూర్తి ఆసక్తి ఉంటే విఫల్యాలను మర్చిపోయి మరింత దీక్ష, ప్రణాళికతో ముందుకెళ్లు’ అంటూ స్ఫూర్తి నింపారు. 2016లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంకుతో ఇండియాన్‌ ఫారెన్‌ సరీ్వస్‌కు ఎంపికయ్యా. ఆ తర్వాత అనేక విభాగాల్లో పనిచేశా. గడిచిన ఆరు నెలలుగా సికింద్రాబాద్‌ ఆరీ్పఓగా సేవ లు అందిస్తున్నా. నా భర్త రోహిత్‌ ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సరీ్వస్‌ (ఐఐఎస్‌) అధికారి. మా పాప సహస్రను ఆయనే చూసుకుంటారు. నాన్నకు సహస్ర మరో స్నేహజ. ‘నేను స్నేహజ ఫాదర్‌’ అంటూ నాన్న గర్వంగా చెప్పుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. –స్నేహజ, ఆర్పీఓ, సికింద్రాబాద్‌

నాన్న వల్లనే ఈ స్థాయికి..
చిన్న తనం నుంచి చదువు ఎంత ముఖ్యమో చెప్పేవారు. తాను హెడ్మాస్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగవిరమణ చేసినా పిల్లలందరినీ ఉన్నత చదువులకు పట్టుబట్టారు. నాన్న పేరు అంబడపూడి మనోహరం. నాన్నతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ఎంతో ప్రేమానురాగాలను పంచేవారు. ఎంత కష్టమైనా ఉద్యోగాలు పొందాలనే అందరికీ చెప్పేవారు. ఆయన ఒత్తిడితోనే గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాను. ఆడపిల్లలకు నాన్న అంటే భరోసా, కొండంత అండ, అన్నింటికీ నాన్న ఉన్నాడులే అనే భావన ఎప్పటికీ ఆడపిల్లలకు ఉంటుంది. అందుకే నాన్నే నాకు స్పూర్తి. – అంబడపూడి శారద, ప్రిన్సిపల్‌ – సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డి

 
ఆత్మీయ అనురాగాలకు నిదర్శనం..
నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ మనకు తెలియకపోవచ్చు. ఆయన మరణించిన తర్వాత ఆ పాత్ర ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంటుంది. మాది కోనసీమజిల్లా చెయ్యేరు అగ్రహారం. దార్ల లంకయ్య(అబ్బాయిగారు), తల్లి దార్ల పెదనాగమ్మకు మేము ఐదుగురు సంతానం. అయినా ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమతో చూసేవారు. తాను చదువుకోకపోయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు.

నాన్న ఎన్నో రాత్రులు ఆకలితో పస్తులున్నా మా కడుపులు నిండాలని తపించేవారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. ఆ ఫలితాలను అనుభవించడానికి ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. మా చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తుకుని నాటకాలకీ, సినిమాలకీ తీసుకెళ్లేవారు. ఆహార పదార్థాలను తన చేతి రుమాలలో మూటగట్టుకొని తెచ్చిన రోజుల్ని మర్చిపోలేము.

మా నాన్నని అందరూ ముచ్చటగా ‘అబ్బాయి’ అని పిలిచేవారు. అసలు పేరుకంటే అదే íస్థిరపడిపోయింది. అదే మానాన్న ఆత్మీయానురాగాలకు గొప్ప నిదర్శనం. నాన్న జ్ఞాపకార్థం హెచ్‌సీయూలో ప్రతి ఏటా ఎంఏ తెలుగు విద్యార్థులకు ఒక గోల్డ్‌ మెడల్‌ ఇస్తున్నాను. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు–హెచ్‌సీయూ

మంచి ఇంజినీర్‌ కావాలి..
ఆస్తులు అమ్మి అయినా ఖర్చు పెడతా అనేది మా తండ్రి. మహబూబ్‌నగర్‌ జిల్లా కౌకుంట్లలో పేద కుటుంబం మాది. నాన్న జి బాలకిష్టయ్య గౌడ్, అమ్మ లక్ష్మీదేవమ్మ. ఇంట్లో ఆరుగురు అక్కలు పుట్టిన తర్వాత నేను పుట్టడం, అదే రోజు మా వనపర్తి రాజుగా ఉండే రామేశ్వరరావు ఊరికి రావడంతో అయన పేరునే నాకు పెట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో తెలుగు మీడియం చదివా. తర్వాత పాలిటెక్నిక్‌ చేసి ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్‌ చదివా.

అవసరమైతే ఆస్తులు అమ్మేస్తా... నువ్వు ఇంజినీర్‌ అయ్యి అందరికీ ఆదర్శంగా ఉండాలనేవారు. నాన్న కల నెరవేర్చేందుకు మా తమ్ముడిని కూడా ఇంజినీరింగ్‌ చదవించా. ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాకు డైరెక్టర్‌ కావడం నాన్న ప్రోద్బలమే.. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నలుగురూ చదువుకునేలా ప్రోత్సహించాలనేవారు నాన్న. ఇప్పటికీ నాన్న మాటలు నా చెవులకు వినిపిస్తుంటాయి. – డాక్టర్‌ జి రామేశ్వరరావు, డైరెక్టర్‌ ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా

అందరూ చదవాలి..
ఎంతకష్టమైనా పడతా...చదవండి అనేవారు నాన్న... అనంతపురం  రాయదుర్గంలో టైలర్‌ మహ్మద్‌ అనీఫ్‌ నాన్న. కుటుంబంలో చదువుకున్నవారుంటే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఎంత కష్టమైనా పడతా చదవండి అంటూ మమ్మల్ని ప్రోత్సహించారు.

ఒకరిని నేవీలో ఉన్నతస్థాయికి చేరేలా ప్రోత్సహించారు. అక్క మంచి గైనకాలజిస్ట్‌గా గుర్తింపు పొందారు. నన్ను కూడా చదివించగా అనంతపురం జేఎన్‌టీయూలోఎంటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. అనంతరం ఏపీపీఎస్‌సీ పరీక్షలు రాసి 1999లో రాయదుర్గం జీఐఎల్‌టీలో లెక్చరర్‌గా చేరా. ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నాను. ఇప్పటికీ రాయదుర్గంలో ఉంటూ ఫోన్‌ చేస్తే మొదట పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతారు. –షేక్‌ ఎక్బాల్‌ హుస్సేన్‌, ప్రిన్సిపల్, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెదర్‌ టెక్నాలజీ–రాయదుర్గం

నా ఇష్టాలను గౌరవిస్తారు...
నాన్న అడక్కుండానే అన్నీ ఇచ్చేవారు. మొదట సినిమాల గురించి అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. దీంతో టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే ఓ షార్ట్‌ఫిల్మ్‌ కాంటెస్ట్‌లో చేయడం, అది పెద్దగా హిట్‌ అవ్వడంతో సుకుమార్‌ నన్ను రంగస్థలానికి ఎంపికచేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ప్రీమియర్‌కి పిలిచినప్పుడే చెప్పా.

యాక్టింగ్‌ చూశాక హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. అప్పటి వరకూ ఒప్పుకోరనుకున్నా.. మా నాన్నే నా లైఫ్‌లో రియల్‌ హీరో.. ఇండస్ట్రీకి ఓ అమ్మాయి వెళ్తుందంటే చాలా విమర్శలు ఎదుర్కోవాలి. కానీ నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించారు. రూమర్స్‌ని అస్సలు పట్టించుకోరు.. నా ఎదుగుదల చూసి గర్వపడతారు.. – పూజిత పొన్నాడ, హీరోయిన్‌

ఇవి చదవండి: 

Advertisement
 
Advertisement
 
Advertisement