ఈసారి ఫాదర్స్‌డే.. మలాలాకు స్పెషల్. డిగ్రీని తండ్రికి కానుకగా తెచ్చి ఇచ్చింది. ప్రతి ఏడాదీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. నోబెల్ పీస్ ప్రైజ్.. ‘టైమ్’ కవర్ పేజ్.. యు.ఎన్.లో స్పీచ్.. స్టీవర్ట్ ఇంటర్వూ్య.. అన్నిటికన్నా.. డిగ్రీ పెద్ద గిఫ్ట్ ఆ తండ్రికి! ‘చదివితే చంపేస్తాం’ అన్నారు తాలిబన్‌లు. ‘చదివి చంపేసెయ్’ అన్నాడు ఆయన. అన్నంత పనీ చేసింది. పట్టా కూతురిది.. తలపై క్యాప్ తండ్రిది.
‘‘లోకం మొత్తం మౌనం వహించినప్పుడు.. ఒక్క గొంతు.. ఒక్క గొంతు చాలు లోకం మొత్తం ప్రతిధ్వనించడానికి’’. తండ్రి చెప్పాడు ఆ అమ్మాయికి. పద్నాలుగేళ్ల అమ్మాయికి అంత మాట అర్థం అవుతుందా? అర్థమయ్యేలా చెప్పాడు. ‘‘వన్ చైల్డ్. వన్ టీచర్. వన్ బుక్. వన్ పెన్. ఒక్కటి చాలు.. ప్రపంచాన్ని మార్చెయ్యడానికి’’ తండ్రి చెప్పాడు ఆ అమ్మాయికి. పద్నాలుగేళ్ల అమ్మాయికి అంత మాట అర్థం అవుతుందా? అర్థమయ్యేలా చెప్పాడు. తాలిబన్‌ల తూటాలకు పావురంలా కూలి, కోమాలోకి వెళ్లి, మూడు నెలల తర్వాత మృత్యుంజయురాలై లేచిన మలాలా యూసఫ్జాయ్.. ఆ కూతురు. ఆసుపత్రి నుంచి కూతురు డిశ్చార్జి కాగానే ఇక ముందు ఏమేమి చేయాలో చెప్పిన జియావుద్దీన్.. ఆ తండ్రి.
ఆ తండ్రికి ఆ కూతురు జానీ మన్. ఇంట్లో పిలుపు అదే. సోల్‌మేట్ అని. కూతురికి మలాలా అనే పేరు పెట్టుకుంది కూడా ఆయనే. పాక్ జానపద కథల్లోని ఒక హీరోయిన్ మలాలా. స్త్రీల తరఫున మాట్లాడే గొంతు! పేరు పెట్టి ఊరుకోలేదు. పేరుకే ప్రతిష్ట తెచ్చేలా కూతుర్ని పెంచాడు. పెంచడం అంటే ‘ఇలా నడువు’ అని కాదు. ‘నీలా నడువు’ అని. రెండు ఆయుధాలు కూడా ఇచ్చాడు. విద్య, వాగ్ధార! రెండు రోజుల క్రితమే డిగ్రీ పూర్తి చేసింది మలాలా. అంతకుముందే ప్రపంచమంతా తిరిగి స్పీచ్‌లు ఇచ్చింది. తండ్రే చెప్పాడు. ఫిలాసఫీ చదవమని, పాలిటిక్స్ చదవమని, ఎకనమిక్స్ చదవమని. ‘గడ్డు’న ఉన్న ప్రపంచాన్ని గట్టున పడేసేవి ఈ మూడే అని చెప్పాడు. బాలికల విద్యకోసం ఆమె పోరాటం.. ప్రాణాలు దక్కించుకున్న రోజే మొదలైంది. ‘‘ఆడపిల్లలు చదవడానికి వీల్లేదని కదా ఆ రోజు వాళ్లు కాల్పులు జరిపారు. ఆడపిల్లల్ని చదివించే పోరాటంలో నువ్వు ఎదురు కాల్పులు జరుపు’’ అని చెప్పాడు. చదువు కోసమే కాదు, సమాజ శాంతి కోసమూ పోరాడమని చెప్పాడు. కూతురుకి ఇంతగా చెప్పే తండ్రి ఉండటం లోకానికే వెలుగు. జియావుద్దీన్ విద్యా ఉద్యమ కార్యకర్త. ‘లెట్ హర్ ఫ్లయ్’ అని పుస్తకం కూడా రాశాడు. ఆడపిల్లల్ని ఎగరనివ్వండి అంటాడు.
ఆక్స్‌ఫర్డ్ డిగ్రీ, నోబెల్ ప్రైజ్, జాన్ స్టీవార్ట్ ఇంటర్వూ్య, టైమ్ మ్యాగజీన్ ముఖచిత్రం, యు.ఎన్. స్పీచ్.. మలాలా సాధించిన ప్రతి ఘనత వెనుకా తండ్రి ఛాయ వెలుగుతూ ఆమెను కాంతిమంతం చేసింది. ‘‘స్త్రీవాదం గురించీ, స్త్రీల హక్కుల గురించీ మాట్లాడ్డం అంటే.. స్త్రీవాదనను అంగీకరించాలని పురుషులకు నచ్చచెప్పడమే’’ అని మలాలా దావోస్‌లో ప్రసంగిస్తూ అన్నప్పుడు ఆ తండ్రి హృదయం మురిసిపోయింది.
‘‘ఫెమినిజానికి ఇంకో అర్థం సమానత్వం. స్త్రీ.. సమానత్వాన్ని అడుగుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. అయితే మనం ఫెమినిజం అన్న ప్రతిసారీ అది పురుషుడిని ఉద్దేశించి మాట్లాడడమే’ అని అన్నప్పుడు ఆయన సంతోషం నింగిని తాకింది. తన భావాలు కూతురిగా ఆకృతి దాల్చడాన్ని ఆయన చూస్తున్నాడు మరి. ఆక్స్‌ఫర్డ్‌లో డిగ్రీ చేసింది కూతురే అయినా.. తనే కాన్వొకేషన్ గౌను వేసుకుని, తలపై క్యాప్ పెట్టుకున్నట్లుగా పుత్రికోత్సాహంలో ఉన్నాడు జియావుద్దీన్.
ఓ తండ్రి ప్రయాణం అంటూ జియావుద్దీన్ రాసిన పుస్తకం.. ‘లెట్ హర్ ఫ్లయ్’ (ముందుమాట మలాలా)
Comments
Please login to add a commentAdd a comment