వరి కంకుల తోరణాలతో ప్రత్యేకం
క్రియేటివిటీకి సోషల్ మీడియా గైడ్
ఆర్గానిక్ వస్తువులకే ప్రాధాన్యత
యువతలోనూ పెరిగిన ఆసక్తి
నగర జీవనంలో ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతే కనిపిస్తుంటుంది. ఆధునిక పోకడలతో మనవైన సంప్రదాయాలను పక్కనపెట్టేస్తున్నారు అనుకునే వారి ఆలోచనలకు నగరవాసులు ఎప్పుడూ కొత్త అర్థాలను చెబుతూనే ఉన్నారు. తెలుగింటి ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ బద్దంగా ఆచరించే వేడుకలలో మొట్టమొదటి వేడుక శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ పూజ. నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం సాంప్రదాయ వస్త్రధారణతో చూడముచ్చటగా అలంకరించుకుని.. తెలుగింటి వంటలు ప్రసాదాలుగా చేసి, పచ్చని తోరణాలతో, పుష్పాలతో అమ్మవారి అలంకరణలో వైభవంగా తమదైన సృజనకు మెరుగులు దిద్దుతున్నారు. – సాక్షి సిటీబ్యూరో
పర్యావరణ అలంకరణ..
మట్టి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు నింపి, పువ్వులతో అలంకరించి, వాటి మధ్యలో అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారు. లిల్లి, నందివర్ధనం, మల్లెలు, తెల్ల చామంతి, తామర పువ్వులతో పాటు డెకార్ పువ్వులను కూడా వాడుతున్నారు. వాడిన ప్రతి వస్తువునూ రీ సైక్లింగ్ విధానంతో పర్యావరణ అనుకూలంగా మార్చుతున్నారు.
తోరణపు కళ.. బ్యాక్ డ్రాప్స్..
నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఇంటికి శోభని, శుభాన్ని కలుగజేసే వరి తోరణాలతో పాటు ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్ తోరణాలనూ అలంకరణకు ఉపయోగిస్తున్నారు. అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్‌లో వాడుకోవడానికి ఐదారు అడుగుల ఎత్తున్న ఫ్రేమ్‌లు రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. పచ్చని కళ రావాలంటే విస్తరాకులు, కొబ్బరి ఆకులు, తమలపాకులు, ఇలా ఏదైనా ఆకులతో చేసే బ్యాక్ డ్రాప్‌ను వాడుతున్నారు. పట్టు చీరలు, ఇండోర్ మొక్కలు, రాగి, ఇత్తడి పాత్రలు అలంరకణలో చేరాయి.
భక్తిని అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందో వరలక్ష్మీ వ్రతం రోజున ఇంటి కళను బట్టి తెలిసిపోతుంది. వారం పది రోజుల ముందు నుంచే అమ్మవారి అలంకరణకు కావాల్సిన వస్తువుల ఎంపిక మొదలవుతుంది. వీటిని పూజా స్టోర్స్, ఆన్‌లైన్, జనరల్ స్టోర్స్, బేగం బజార్, డెకార్ ప్లేస్‌లకు వెళ్లి నచి్చనవి ఎంపిక చేసుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒక్కో డిజైన్ సెట్‌కి సాధారణంగా 2 నుంచి 10 వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి లాంటి వేడుకలకే కాదు పండగల్లోనూ కలర్‌ఫుల్ థీమ్‌తో చేసే అలంకరణలో మహిళలు తమదైన ప్రత్యేకతను చూపుతున్నారు.
ముందే అడిగి..
ఐదేళ్ల క్రితం అమ్మవారి అలంకరణ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు డెకరేట్ చేస్తారు అని వెదికేవారు. అలా మేం పదిహేనేళ్లుగా వరలక్ష్మీ పూజలకు డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు సోషల్‌మీడియాలోని వీడియోలు చూసి సొంతంగా ఎవరికి వారు క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. వారి సొంతంగానే డిజైన్ చేసుకుంటున్నారు. ఈ ఆలోచన వల్ల ఆన్‌లైన్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. యువత తమ భక్తిని చాలా అందంగా చూపుతున్నారు. ఎలాంటి డిజైన్స్ కావాలో ముందే అడిగి మరీ అలంకరణ చేయించుకుంటున్నారు.
– కల్పనారాజేష్, డెకార్ బై కృష్ణ
ఆర్గానిక్ మెటీరియల్స్..
నా ఎంపిక ప్రతి వస్తువూ తిరిగి ఉపయోగించుకునేలా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌కి తాజా పువ్వులు వాడతాం. అమ్మవారికి కట్టే చీర హ్యాండ్లూమ్‌దే ఎంచుకుంటాం. తిరంగా స్టైల్‌లో అమ్మవారి అలంకరణ చేశాను. అమ్మవారికి ముఖం, కాళ్లూ చేతులు కొని పెట్టి, వాటిని మొత్తం సెట్ చేసి, మేమే అలంకరిస్తాం. తాంబూలాన్ని వస్త్రంతో చేసిన బ్యాగ్‌లో/ తాటాకు బుట్టలలో పెట్టి ఇస్తుంటాం. ప్రతి వస్తువూ ఆర్గానిక్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.
– ప్రతిమ, వైష్ణవి రాపర్తి, వెస్ట్‌మారేడుపల్లి
పాజిటివ్ వైబ్రేషన్స్..
బిజీ జీవనంలోనూ అమ్మవారి పూజ ప్రత్యేకంగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ముందునుంచే అమ్మవారి అలంకరణకు సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకోవడం, వీలైనంతగా ముందురోజే సిద్ధం చేసుకోవడం జరుగుతుంటుంది. ప్రతియేటా ఒక ప్రత్యేకమైన కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. పిల్లలు కూడా ఈ పనిలో భాగం అవుతుంటారు. ఈ విధానం వల్ల వారిలో సృజన పెరుగుతుంది, భక్తి కూడా అలవడుతుంది.
– డాక్టర్ శిరీషారెడ్డి, తార్నాక
Comments
Please login to add a commentAdd a comment