నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.
యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
సందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..
డియర్ అక్షితా
మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.
- మీ పప్పా
జమ్‌సెట్‌జీ టాటా
భారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్‌సెట్‌జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్‌పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్‌సెట్‌జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్‌జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్‌డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment