సాహితీలోకం
రఫీ నోట సినారె పాట
రఫీ తెలుగు పాట పాడటం విడ్డూరం. అదీ ఎన్టీఆర్‌కు పాడటం ఇంకా విచిత్రం. కానీ ఆ విచిత్రం సాధ్యమైంది. పైగా అది జనానికి నచ్చింది. నిర్మాత పుండరీకాక్షయ్యకు రఫీ అంటే అభిమానం. ఆయన తన ‘భలే తమ్ముడు’లో రఫీ చేత పాడిద్దామనుకున్నారు. ఇది షమ్మీ కపూర్ ‘చైనా టౌన్’కు రీమేక్ కాబట్టి అందులో హిట్ అయిన ‘బార్ బార్ దేఖో’ను తెలుగులో అనుసరించి దాంతోపాటు మిగిలిన పాటలను కూడా రఫీ చేత పాడిద్దామనుకున్నారు. ఆ పాటలు సినారెకు రాసే అవకాశం వచ్చింది. ‘ఎంతవారు కాని వేదాంతులైన కాని’ పెద్ద హిట్. ‘నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే’ పాట కూడా. ఆ తర్వాత ‘గీత్’ రీమేక్ ‘ఆరాధన’లో సినారె రాసిన పాటలకు మళ్లీ రఫీ పాడారు. ‘నా మది నిన్ను పిలిచింది గానమై’, ‘నేడే తెలిసింది ఈనాడే తెలిసింది’ నేటికీ రేడియోలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మంచి అవకాశం ఏమిటంటే సి.రామచంద్ర సంగీతంలో ‘అక్బర్ సలీం అనార్కలి’కి సినారె పాటలు రాయడం. అందులోని ‘సిపాయీæ సిపాయీ’, ‘తానె మేలి ముసుగు తీసి’.. రఫీ గొంతులో తెలుగు ప్రేక్షకులను అలరించాయి. రఫీకి తెలుగు రాదు కనుక సినారెకు ఉర్దూ బాగా వచ్చు కనుక వారిద్దరికీ అలా కుదిరింది. ఆ జోడీ మాధుర్యం మనకు మిగిలింది.
కవి రెచ్చిపోతే...
కవికి కవి పాత్ర దొరకడం చాలా అరుదు. సినారెకు అలాంటి అవకాశం కె.విశ్వనాథ్ ద్వారా వచ్చింది. ‘చెల్లెలి కాపురం’లో శోభన్‌బాబు కవి. వాణిశ్రీ డాన్సర్. ఒక సందర్భంలో ఇరువురి మధ్యా పోటీ వస్తుంది. పాటకు సైదోడుగా డాన్స్ చేస్తానని వాణిశ్రీ అంటుంది. ఇక్కడ కవి రెచ్చిపోవాలి. ‘మీ ఇష్టం... మీరే హీరో అనుకుని ఏం రాస్తారో రాయండి’ అన్నారు కె.విశ్వనాథ్. ఇక సినారె కలం జవనాశ్వం మీద పరుగు తీసింది.
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కరకంకణములు గలగలలాడగ
వినీల కచభర విలాస బంధుర
తనూలతిక చంచలించిపోగా
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకునుగని నా పలుకు విరియ
నీ నటననుగని నవ కవిత వెలయగా
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ....
ఈ పాటలో సినారె చాలా కఠినమైన క్లిష్టమైన సంస్కృత పదబంధాలు వేసినా ప్రేక్షకులు ఇబ్బంది పడలేదు. పైగా పాటల పోటీలో ఈ పాట పాడటం ఒక ఆనవాయితీగా మారింది. దీని మీద పారడీలు రావడం కూడా కద్దు.
బంధాలకు మాటలు అద్దాడు
సినారెకు తోడబుట్టువులు లేరు. అందుకని చెల్లెలి బంధం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ‘బంగారుగాజులు’ సినిమాలో చెల్లెలి పాట రాసే అవకాశం వచ్చినప్పుడు దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ‘అన్నయ్య సన్నిధి’ పాట ఇప్పటికీ హిట్. ఇక తండ్రి గురించి రాసిన ‘ఓ నాన్నా నీ మనసే వెన్న’... తండ్రి గొప్పతనం తెలియచేస్తుంది. ‘ప్రేమించు’ సినిమాలో ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా?’ పాట చాలా ఆర్ద్రంగా అమ్మ గొప్పతనం తెలియ చేస్తుంది. ఇక స్నేహం మీద సినారె రాసిన ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ చిరస్థాయిగా నిలిచి ఉంది. ఇన్ని బంధాల గురించి రాసిన సినారెనే మనుషులలో ఉండే కృత్రిమత్వాన్ని ఏవగిస్తూ ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) రాశారు.
సూపర్ హిట్ ఐటమ్ సాంగ్
ఐటమ్ సాంగులు ఇవాళ ప్రతి సినిమాకు ఒక హిట్ ఫార్ములాగా మారాయి. కాని పాత రోజుల్లో ఒక పాట గొప్ప ఐటమ్ సాంగ్‌గా రాణించింది. ఆ పాట సినారె వల్ల జన్మెత్తింది. ‘అమ్మ మాట’ సినిమాలో జ్యోతిలక్ష్మితో ఒక డాన్స్ నంబర్ చేయాలని దర్శకుడు భావించాడు. దానికి గీత రచయిత సినారె, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చుని కుస్తీలు పడుతున్నారు. ఎంతకీ పాట కుదరలేదు. రమేశ్ నాయుడు మొదట లంచ్‌కు వెళ్లిపోయారు. సినారె పేపర్ మీద అసలు పాటకు కావలసిన రఫ్ నోట్స్‌లా ‘మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘమాసం వెళ్లేదాకా మంచి ముహూర్తం లేదన్నాడు ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా’ అని రాసుకుని తానూ లంచ్‌కు వెళ్లారు. లంచ్ నుంచి తిరిగి వచ్చిన రమేశ్‌నాయుడు ఈ సంగతి తెలియక అదే పాట పల్లవి అనుకుని దానికి అద్దిరిపోయే ట్యూన్ కట్టారు. సినారె వచ్చి ఆశ్చర్యపోయి దానికి కొనసాగింపుగా చరణాలు రాశారు. ఆ పాట బహుశా తెలుగులో చాలా పెద్ద ఐటమ్‌సాంగ్‌గా నిలిచింది. ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులో గొప్ప అందం సంతరించుకుంది. ఇదే ఎల్‌ఆర్ ఈశ్వరి పాడిన ‘నందామయా గురుడ నందామయ’ కూడా పెద్ద హిట్ సాంగే. ‘దమ్ మారే దమ్’ పాటను అనుసరిస్తూ తెలుగు నేటివిటీతో సినారె ఆ పాటను రాస్తే జె.వి.రాఘవులు ట్యూన్ చేశారు. చేవ ఉన్న కవికి ఏ సందర్భమైనా ఒకటే... మెప్పించే పాట బయటకు వస్తుంది అనడానికి ఈ సందర్భాలు ఉదాహరణ.
క్లాసిక్ పాటల కొలువు
‘మల్లెలు పూచె వెన్నెల కాచె ఈ రేయి హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా’....
రాజన్ నాగేంద్ర సంగీతంలో సినారె రాసిన ఈ పాట ఎటువంటి చికాకు సమయంలో అయినా సేద తీరుస్తుంది. ఇదే కాదు ఇలాంటి క్లాసిక్ పాటలు సినారె చిట్టాలో చాలానే ఉన్నాయి. ‘నిర్దోషి’ కోసం ఆయన రాసిన ‘మల్లియలారా... మాలికలారా’... ఘంటసాల గాత్రంలో అమరత్వాన్ని పొందింది.‘తిరుపతమ్మ కథ’లో ‘పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బాలా’... కూడా క్లాసిక్ కిందకే వస్తుంది. ‘ఏకవీర’లోని ‘తోటలో నా రాజు తొంగి చూచెను నాడు’ ఒక కోమలమైన గీతం. దీనిని రాసిన సినారె కె.వి.మహదేవన్ ముందు పెడితే దానిని ఆయన ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ స్టయిల్‌లో చాలా ఫాస్ట్‌గా ట్యూన్ కట్టాడట. అప్పుడు సినారె అది క్లాసిక్‌గా ఉండాలని ఇప్పుడు రికార్డ్ అయి ఉన్న వరుసలో తానే పాడగా సినారె ఆ వరుసనే తీసుకున్నారు. ఇక అమరశిల్పి జక్కన కోసం ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ ఆల్‌టైమ్ క్లాసిక్ కింద చెప్పుకోవాలి.
ఇందులో– ‘పైకి కఠినమనిపించును– లోన వెన్న కురిపించును జీవమున్న మనిషి కన్న– శిలలే నయమనిపించును’... అనడంలో ఎంతో లోతు, తాత్త్వికత ఉన్నాయి. సినారె రాసిన కొన్ని పాటలు స్పీడ్‌గా ఉన్నా క్లాసిక్ స్థాయిలో నిలబడ్డాయి. ‘ఆడబ్రతుకు’ కోసం ఆయన రాసిన– ‘అందము చిందె హృదయకమలం– అందుకునే రాజొకడే వేల తారకల బృందములోన– వెలిగె చందురుడొకడే’... ఒక కొత్త సొబగుతో పదాల పొహళింపుతో ఉంటుంది. పౌరాణిక సినిమాలలో ‘కురుక్షేత్రం’ కోసం రాసిన ‘మోగింది కల్యాణ వీణ’... చారిత్రక సినిమాలలో తాండ్ర పాపారాయుడుకు రాసిన ‘అభినందన మందార మాల’ క్లాసిక్స్ స్థాయిలో నిలిచాయి. ఇన్ని పాటలు ఇచ్చి వెళ్లిన కవి సినారె. ఎన్నో పాటలు ఇచ్చి వెళ్లిన కవి సినారె.
జాతి కోసం పరితపించే పాట
తెలుగు ప్రాంతాలన్నా తెలుగు భాష అన్నా తెలుగు జాతి అన్నా సినారెకు ఎంతో ప్రాణం ఎంతో ఇష్టం. ఇరు ప్రాంతాల మధ్య విభేదం ఆయనకు అంతగా నచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆయన ఇరువర్గాల సహజీవనాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాశారు. ఈ సంగతి విన్న ఎన్టీ రామారావు ఆ సమయంలో తాను తీస్తున్న ‘తల్లా పెళ్లామా’లో ఒక పాటను సందర్భం లేకపోయినా రాసి పెట్టించారు. అదే– ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’. ఈ పాటను ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచార సమయంలో చైతన్యరథం మీద విపరీతంగా వినిపించేవారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడినా ఇద్దరూ గ్రహించ వలసిన ఉపదేశం ఈ పాటలో కనిపిస్తుంది.
‘వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’...
‘మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్నా’..... కవి పలుకు అక్షర సత్యం.
జయలలిత స్విమ్‌సూట్ సాంగ్
‘మనుషులు–మమతలు’ సినిమా నాటికి జయలలిత ఇంకా స్టార్ కాలేదు. ఆమెకు సినారె రాసిన కవ్వించే పాట పెద్ద హిట్టయ్యింది.
‘సిగ్గేస్తో్తందా సిగ్గేస్తో్తందా మొగ్గలాంటి చిన్నది బుగ్గ మీద చిటికేస్తేసిగ్గేస్తుందా– నీకు సిగ్గేస్తుందా’...ఈ పాటలో నాగేశ్వరరావు బిడియస్తుడిగా కనిపిస్తారు.‘చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే‘ సిగ్గేస్తుంది అంటారు. ఈ పాటలో జయలలిత స్విమ్‌సూట్‌లో కనిపించి ప్రేక్షకులకు హుషారు కలిగిస్తారు. అప్పటికి అలాంటి డ్రస్సుల్లో పాటలు కొత్త.ఈ పాటే కాదు జయలలిత కోసం సినారె రాసిన ‘అయ్యయ్యో బ్రహ్మయ్య’ పాట కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. జగపతివారి ‘అదృష్టవంతులు’ సినిమాలో జయలలితను కవ్విస్తూ నాగేశ్వరరావు ఈ పాట పాడతాడు. ఈ లెక్కన సినారె ఇద్దరు (మాజీ) సి.ఎం.లకు పాట రాసినవారయ్యారు.