కోవెలకుంట్ల: జైలు శిక్షపడిన యువ ఖైదీ అక్కడి అధికారుల సహకారం, పట్టుదలతో లా కోర్సు చదివి న్యాయవాద పట్టాతో తన తండ్రిని నిర్దోషిగా నిరూపించేందుకు న్యాయస్థానంలో వాదించి గెలిచిన ఘటనను 20 ఏళ్ల క్రితం స్టూడెంట్ నంబర్ –1 సినిమాలో చూశాం. అదే తరహాలో యావజ్జీవ కారాగార శిక్షపడిన ఓ యువకుడు నిజ జీవితంలో విజయం సాధించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదివేవాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అక్కడి జైలు అధికారులు చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పది చదివిన వారిని దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు. శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు ప్రోత్సాహమందించారు. 2020లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు
మహమ్మద్ రఫీ ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు. వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సమకూర్చుకుని జైలులోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదివాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022లో పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియాలజీలో మొదటి ర్యాంకుతో గోల్డ్ మెడల్ కైవశం చేసుకున్నాడు.
జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని యూనివర్సిటీ అధికారులు ఇటీవల జైలు అధికారులకు సమాచారం అందించారు. కోర్టు అనుమతితో నాలుగు రోజులు బెయిల్ మంజూరు కావడంతో గురువారం హైదరాబాద్లోని అంబేడ్కర్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ జగదీశ్ ఆధ్వర్యంలో గోల్డ్‌మెడల్ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తన జీవితం జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో పట్టుదలతో పీజీ సాధించానన్నారు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్‌మెడల్ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment