సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చట్టబద్ధంగా పడుతున్న శిక్షలశాతం పెరుగుతోంది. పోలీసుల దర్యాప్తులోని సాంకేతిక సంస్కరణలకు తోడు నిందితుల గుర్తింపునకు, ఆధారాల సేకరణకు ఎప్పటికప్పుడు పాటిస్తున్న మెళకువలు శిక్షల శాతాన్ని పెంచాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తన వార్షిక నివేదిక లో పలు వివరాలు వెల్లడించింది. గతంలో నిందితులకు శిక్షల శాతం 11, 12 ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అది గత ఐదేళ్లు క్రమంగా పెరుగుతూ గతేడాది 50 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మేర శిక్షలశాతం నమోదు కాకపోవడం గమనార్హం.
గతేడాదిలో ఒకరికి ఉరి...
2021లో న్యాయస్థానాలు ఒక నిందితుడికి ఉరిశిక్ష, 82 కేసుల్లో 126 మందికి జీవితఖైదు విధించాయి. ఒక కేసులో నిందితుడికి 30 ఏళ్లు, మరో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష విధించాయి. మరో 21 మంది ఖైదీలకు 20 ఏళ్లు, ఒకరికి 15 ఏళ్లు, ఒకరికి 14 ఏళ్ల శిక్ష విధించాయి. 2021లో ఒకరోజు జైలుశిక్ష నుంచి ఉరిశిక్ష వరకు పడినవారి జాబితాలో 38,812 మంది ఉన్నారు. 126 మందికి జీవితఖైదు శిక్షపడ్డగా.. వారిలో 92 మంది హత్యకేసుల్లో నిందితులేనని, మరో 9 మంది మర్డర్ ఫర్ గెయిన్ కేసుల్లో, ఇంకో 25 మంది లైంగిక దాడి(అత్యాచారం) కేసుల్లో నేరస్తులని పోలీస్‌శాఖ తెలిపింది.
మహిళలపై దాడుల కేసులో...
గతేడాది లైంగికదాడి చేసి హత్య చేసిన ఉదంతాల్లో, వరకట్న వేధింపులతో హత్య చేసిన కేసుల్లో, లైంగికదాడి కేసు, సాధారణ హత్య కేసుల్లో మొత్తం 39 మందికి జీవితఖైదును కోర్టులు విధించాయి. 8 మంది వరకట్న వేధింపులకు పాల్పడి హత్య చేసినవారు కాగా, లైంగికదాడికి పాల్పడి హతమార్చిన కేసులో ఇద్దరు, లైంగికదాడి కేసుల్లో 9 మంది, మహిళల హత్య కేసుల్లో 20 మందికి జీవితఖైదు పడింది.
2021లో పోక్సో యాక్ట్ కేసుల్లో ఒకరికి ఉరిశిక్ష పడగా, 18 మందికి న్యాయస్థానాలు జీవితఖైదు విధించినట్టు పోలీస్ శాఖ స్పష్టం చేసింది. కోర్టులు ఒకరికి 30 ఏళ్లు, ఒకరికి 25, 21 మందికి 20 ఏళ్లు, ఇద్దరు నిందితులకు 15 ఏళ్లు, 14 ఏళ్లు పోక్సో కేసుల్లో శిక్ష విధించాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment