బూర్గంపాడు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య, మాదక ద్రవ్యాలకు బానిసైన తనను నిత్యం వేధిస్తున్నాడని కొడుకు.. ఇద్దరూ పక్కాగా ప్లాన్ వేసి దారుణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో నాలుగు రోజుల క్రితం సయ్యద్ రఫీ(38) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపాడు ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక మసీద్‌రోడ్‌లో నివాసముంటున్న సయ్యద్ రఫీ అలియాస్ జాఫర్ ఈనెల 10న తెల్లవారుజామున ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్, పోలీసు జాగిలాల సాయంతో చేపట్టిన విచారణలో హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ కనుగొన్నారు. రఫీ హత్యకు అతని కుమారుడు(15) కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
అయితే మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రఫీ భార్య జీనత్ ఫర్వీన్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. విచారణలో రఫీ కుమారుడు వెల్లడించిన వివరాలతో జీనత్‌ను కూడా విచారణ చేశారు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో అతనిని వదిలించుకునేందుకు పథకం ప్రకారమే హత్యకు పాల్పడినట్లు ఆమె అంగీకరించింది. మాదక ద్రవ్యాలకు అలవాటైన కొడుకును ఈ హత్యకు ఉసిగొల్పింది.
కాళ్లను తల్లి పట్టుకోగా.. కొడుకు తండ్రి తలపై సుత్తితో బలంగా కొట్టి..
రఫీ భార్య జీనత్ ఫర్వీన్‌కు బూర్గంపాడు మండలం నకిరిపేటకు చెందిన కొర్ర జంపన్నతో ఆరు నెలల క్రితం పరిచయమైంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని రఫీ గమనించి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. రఫీని వదిలించుకుంటే తమకు అడ్డుండదని జంపన్న జీనత్‌కు సలహా ఇచ్చాడు. ఇందుకోసం మూడునెలల క్రితమే పథకం వేశారు.
జంపన్న తీసుకొచ్చిన మత్తుమాత్రలను జ్యూస్‌లో కలిపి ఇచ్చారు. అయితే రఫీకి మత్తు ఎక్కకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కాగా, ఈ నెల 9న డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రఫీ.. గంజాయి మత్తులో ఉన్న కొడుకును తిట్టాడు. అందుకు అడ్డుపడిన భార్యతో పాటు కుమారుడిని కూడా రెండు దెబ్బలు కొట్టాడు. దీంతో ఆ రాత్రే రఫీని చంపాలని భార్య, కొడుకు పథకం వేశారు.
గాఢ నిద్రలో ఉన్న రఫీ కాళ్లను జీనత్ గట్టిగా పట్టుకోగా, కొడుకు పెద్దసుత్తితో కొట్టి తలమొత్తం ఛిద్రం చేశాడు. దీంతో రఫీ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, రక్తపు మరకలున్న బట్టలను నిందితుడు మోతె గ్రామ సమీపంలో దాచిపెట్టాడు. పోలీసు జాగిలాలు సుత్తిని, దుస్తులను గుర్తించాయి. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment