శ్రమయేవ జయతే.. | special story on Nalgonda district Joint Collector C. Narayana Reddy | Sakshi
Sakshi News home page

శ్రమయేవ జయతే..

Published Sun, Oct 30 2016 2:32 AM | Last Updated on Mon, Oct 24 2022 3:08 PM

శ్రమయేవ జయతే.. - Sakshi

శ్రమయేవ జయతే..

ఆయన మనలాగే ఓ సగటు మనిషి. చదువు కోసం వాగులు, ఒర్రెలు దాటినవారే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా అండగా నిలిచిన అన్నదమ్ముల కలలను నెరవేర్చాడు. అందుకోసం మధ్యలో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చినా అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకుని జీవిత ఉన్నత శిఖరాలకు మెట్లుగా మలచుకున్నాడు. ఓ దశలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైనా అంతటితో సంతృప్తిచెందకుండా అనుకున్న లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు. తన ఆశయూన్ని నెరవేర్చుకునేందుకు ఓ దశలో అజ్ఞాతంలోకి(కుటుంబానికి, మిత్రులకు దూరంగా) వెళ్లాడు. సమస్యలనే సాధనంగా చేసుకుంటూ ఆశయూన్ని అందుకున్నాడు. ఆయనే నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి.

 కుటుంబం.. విద్యాభ్యాసం..  
 మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే గ్రామంలో చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతుల ఆరో సంతానం మన జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి. నలుగురు అన్నలు, ఓ అక్క తర్వాత జన్మించిన ఆయనది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. చిన్నపాటి వ్యవసాయం ఉన్న ఆ కుటుంబంలో తండ్రితో పాటు నలుగురు అన్నలు కూడా వ్యవసాయమే చేసేవారు. అయితే, ఏడో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చెన్నారెడ్డి కన్నుమూశారు. అప్పటినుంచీ అన్నలే ఆయనకు అన్నీ అయి పెంచి చదివించారు.తండ్రి చనిపోవడంతో ఆయన చదువుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అన్నలు ప్రోత్సహించి చదివించినా, ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసేవారు. పదోతరగతి పూర్తయిన తర్వాత ఇక చదవకూడదని, ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవానుకున్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి ఓ పెట్రోల్ పంపులో పనిచేశారు. అయితే, పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో జూనియర్ కళాశాల యాజమాన్యం ఉచితంగా చదువు చెప్తామనడంతో ఇంటర్‌లో చేరారు. ఇంటర్ తర్వాత కూడా చదువు భారమవుతుందేమోనని భావిం చిన ఆయన అప్పుడు పెయింటర్‌గా పనిచేశారు. మళ్లీ ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో డిగ్రీలో చేరారు. 3వ తరగతి వరకు శ్రీపురంలో, 4నుంచి 7 వరకు పక్కనే ఉన్న కల్వాల్‌లో, 8 నుంచి ఇంటర్‌వరకు మక్తల్‌లో, డిగ్రీ నారాయణఖేడ్‌లో చదివిన నారాయణరెడ్డి బీఈడీ కోర్సును ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు.

 ఆ తర్వాత ఎంఎస్సీ( మ్యాథ్స్) కూడా చేశారు. ఆ తర్వాత డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సంపాదించారు. 2008లో గ్రూప్-1 రాసి మొదటి ప్రయత్నంలోనే స్టేట్ 4వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. బీఈడీలో, డీఎస్సీలో కూడా ఆయన రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. 2011లో గద్వాల ఆర్డీఓగా, ఆ తర్వాత 2011లో పెద్దపల్లి ఆర్డీఓగా, అనంతరం ఈ ఏడాది జూలైలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన ఆయన జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఈనెల 11న బాధ్యతలు స్వీకరించారు.

 జీవిత పాఠాలు ఒంటపట్టించుకుని..
 జేసీ నారాయణరెడ్డికి చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే కోరిక బాగా ఉండేది. అందుకే అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ వచ్చేవారు. అయితే, ఇంటర్ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడే ఆయన ఓ అవగాహనకు వచ్చారు. చదువే ఆయుధమని, ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.వంశవృక్షంలో ఎక్కడో ఓ చోట టర్న్ రావాలని, ఆ టర్న్‌కు కారణం తానే కావాలని కలలు కన్నారు. ఇక, ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లిన తర్వాత జీవితంపై ఆయనకు ఓ స్పష్టత వచ్చింది. ఉస్మానియాలో ఉన్నప్పుడు జేబులో చిల్లిగవ్వ లేకుండా వారాల పాటు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

 ఈ క్రమంలోనే  కష్టపడి చదివి డీఎస్సీ రాసి మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే, 2006 డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టిం గ్‌లు ఇవ్వడం ఆలస్యమైం ది. దీంతో మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. అప్పుడు ఆయన జీతం నెలకు రూ.2,500మాత్రమే. అప్పటికే ఎమ్మెస్సీ, బీఈడీ అయిపోవడంతో అక్కడ పనిచేస్తున్న వారంతా ఆయన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇంత చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో అని హాస్య ధోరణిలో మాట్లాడుకోవడం ఆయనకు ఇబ్బంది అనిపించింది.

రెండు నెలలకే ఆ ఉద్యోగాన్ని మానేసి మేనమామలు ఇచ్చిన ఆర్థిక భరోసా హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో గ్రూప్స్ శిక్షణకు వెళ్లారు. అయితే, 2008లో ఆయనకు డీఎస్సీ పోస్టింగ్ ఇచ్చారు. తాను చదివిన కల్వాల్ పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది. ఉన్న ఊరే అయినా ఓ రూం అద్దెకు తీసుకుని చదువుకున్నారు నారాయణరెడ్డి. బడిలో పాఠాలు చెప్పడం, ఇంట్లో తినడం, రూంకు వెళ్లి చదువుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
 
 సివిల్స్ రాయలేదనే బాధ ఉండేది
 తన జీవిత ప్రస్థానం గురించి చెపుతూ జేసీ నారాయణరెడ్డి ఎంతో ఆర్ద్రతతో చెప్పిన ఓ మాట నిజంగా ఈనాటి యువతకు స్ఫూర్తిదాయకమే. ‘అయ్యో... నేను సివిల్స్ ఎందుకు రాయలేదు.. అని అప్పుడుప్పుడూ బాధపడుతుంటా... నాకు ఎప్పుడూ ఆ బాధ ఉంటుంది.’ అని చెప్పారు. ఆయన ఏ పరీక్ష రాసినా మంచి మార్కులే... ఏ పోటీ పరీక్షలోనయినా టాప్ ర్యాంకులే... అలాంటి సమయంలో సివిల్స్ రాసి ఉంటే మంచి ఫలితమే సాధించేవారు.. కానీ, ఆర్థిక అనివార్యత, జీవితంలో పడ్డ కష్టాలు ఆయనను ఏదో ఉద్యోగంలో చేర్పించాయి. కానీ, తన ఉద్యోగంలో కూడా నిబద్ధత ప్రదర్శిస్తూ సివిల్స్ రాయలేదనే బాధను అధిగమిస్తూ ఆయన ఉన్నతాధికారి స్థానానికి వచ్చారు. అంటే మనకున్న పరిమితుల్లో సర్దుకుపోతూనే ఉన్నత స్థానానికి వెళ్లాలన్న భావన జేసీ నారాయణరెడ్డి జీవితంలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
 అజ్ఞాతమే....
 ఇక, ఆ సమయంలో మరోసారి నారాయణరెడ్డి తన లక్ష్యాన్ని నెమరువేసుకున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేంత శక్తి ఇచ్చిన మెదడు... ఉద్యోగాన్ని కూడా సాధించి పెడుతుందని, అది జరగాల్సిందేనని భీష్మించుకున్నారు. వెంటనే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అంటే... ఎక్కడికో వెళ్లలేదు... చదువే పనిగా పెట్టుకుని కుటుంబానికి, స్నేహితులకు, ఇతర కార్యక్రమాలకు సమయం ఇవ్వలేదు. ఉదయం 5:30 నుంచి రాత్రి 11:30 వరకు ఒకటే పని... చదువుకోవడమే.

కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజన విరామ సమయాల్లో తప్ప ఆయన ఎప్పుడూ పుస్తకాలను అంటిపెట్టుకునే ఉండేవారు. 2007 జనవరి నుంచి 2008 ఆగస్టు వరకు ఆ పద్ధతిలోనే చదువుకుని గ్రూప్-1 ఉద్యోగం రాశారు. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమేంటో తెలుసా... గ్రూప్-1 ద్వారానే తనకు కొత్త జీవితం రావాలి. లేదంటే తన ఆశలు సమాధి అయిపోవాలని నిర్ణయించుకున్నారంటే ఎంత పట్టుదలగా ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడ్డా తానెప్పుడూ ఒత్తిడిని ఎదుర్కోలేదని నారాయణరెడ్డి ‘సాక్షి’తో ధీమాగా చెప్పారంటే ఎంత కష్టమయినా ఎదుర్కోవాలనే ఆయన పట్టుదలతో పాటు ఆయన చేసిన శ్రమ ఆయుధాలయ్యాయి.

 కష్టానికి నిర్వచనంగా ఆయనను విజయతీరాల వైపు తీసుకెళ్లాయి. అందుకే ఆయన కూడా పట్టుదల, శ్రమ అనే ఆయుధాలను ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నేటి యువతకు చెపుతున్నారు. శ్రమయే వజయేత అనే సూక్తికి నిలువుటద్దంగా నిలిచిన మన జేసీ నారాయణరెడ్డి జీవితాన్ని, ఆయన ఎదుర్కొన్న కష్టాలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తి పొంది జిల్లా యువత తమ తమ జీవితాల్లో విజయతీరాలను చేరాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement