కార్యకర్తలు బహూకరించిన నాగలితో రేవంత్‌రెడ్డి, సభకు హాజరైన ప్రజలు, పార్టీ నాయకులు
సాక్షి, వనపర్తి/ పెబ్బేరు (కొత్తకోట): పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణానది పుష్కరాల్లో ఘాట్ల నిర్మాణం మొదలుకుని దేవుడి గుడి వద్ద అమ్మే మొలతాడు వరకు 10 శాతం వరకు కాంట్రాక్టర్ల నుంచి నిరంజన్‌రెడ్డి కమీషన్ రూపంలో వసూలు చేశాడని ఇది అబద్ధం అయితే కృష్ణానది నీటిలో మునిగి బీచుపల్లిలో ఉన్న హనుమంతుడి మీద, లేదా రంగాపురం రంగసముద్రంలో మునిగి రంగనాయకుడి మీద ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పెబ్బేరులోని పీపీఎల్ గ్రౌండ్‌లో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెబ్బేరు పొలికేక, ప్రజాగ్రహ సభకు రేవంత్‌రెడ్డి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కేఎల్‌ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, జూరాల ప్రాజెక్టులతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యా మలం అవుతుందని గుర్తుచేశారు.
35 ఏళ్లుగా వనపర్తి నియోజకవర్గాన్ని పాలించిన చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు ఇద్దరూ జోడెద్దుల వలే అభివృద్ధి చేపట్టారని దాని ఫలితంతగానే నేడు రాష్ట్రంలో వనపర్తికి ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. కొల్లాపూర్‌లో చెల్లని రూపాయి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అని అక్కడి ప్రజలు ఛీకొడితే వనపర్తి కి వచ్చి చిన్నారెడ్డిని ఓడగొడతానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. వనపర్తి నియోజవర్గంలో చిన్నారెడ్డిపై గెలవాలంటే నిరంజన్‌రెడ్డి వల్ల కాదని, తన గురువు కేసీఆర్ వచ్చి పోటీ చేసినా.. తాను ముందుండి చిన్నారెడ్డిని గెలిపిస్తానని స్పష్టం చేశారు. నిరంజన్‌రెడ్డి నీళ్ల నిరంజన్‌రెడ్డి అని ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారని, లా అని అక్షరం ఉండటం వల్లే ఇన్ని రోజుల పాటు జిల్లెల చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ని యోజకవర్గంలో గెలుస్తున్నారని జోతిష్యుడు చెప్పడం వల్ల నీళ్ల నిరంజన్‌రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నాడని, నిజానికి ఆయనకు వసూళ్ల నిరంజన్‌రెడ్డి అని పెడితే బాగుంటుందని హితవు పలికారు.
బలాన్ని నిరూపించుకోవాలి..
మార్చి నెలలో పాలిటెక్నిక్ కళాశాలలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సభ పెడితే పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని, దానికి వచ్చిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలను తీసుకువచ్చి, సభ పెట్టి సత్తా చాటుతానన్న నిరంజన్‌రెడ్డి, విఫలమయ్యారని, సగం మంది కూడా హాజరుకాక, సభ వెలవెలబోయిందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పెబ్బేరులో జరిగిన సభకు వేలాది మంది ప్రజలు హాజరై వర్షం వచ్చినా లెక్కచేయకుండా విజయవంతం చేశారన్నారు. నిరంజన్‌రెడ్డి కేసీఆర్‌ను పిలిపించుకుని ఇక్కడ సభ పెట్టి చూపించి, తన బలమేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 1985లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తే గోడలపై రాతలు రాసి ఆయన కోసం ప్రచారం చేశానని, మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ప్రచారం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
రాజీవ్‌గాంధీ కుటుంబంతో చిన్నారెడ్డికి ఎనలేని సంబంధం ఉందని, ఆయన బతికుంటే ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని గుర్తుచేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీనిచ్చి, ముస్లింలు, గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తామని హామీనిచ్చి నెరవేర్చలేదని, కష్టం తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీని నెరవేర్చేలా చేస్తామన్నారు. కేసీఆర్ జీవితమంతా పొత్తులతోనే సాగిందని, అలాంటి కేసీఆర్ ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీని గద్దె దించడం కోసం కూటమి ఏర్పాటు కాబోతుంటే అదేంటని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. కుటుంబ తెలంగాణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికే ప్రజా తెలంగాణ కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బాధితులను పరామర్శించవా?
కొండగట్టు ప్రమాదంలో ఆర్టీసీ చరిత్రలోనే 59 మంది మృతిచెందారని, కన్నీటి చుక్క కార్చని కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై మమకారం ఉం దా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇంత మంది చనిపోయినా కనీసం బాధితులను పరామర్శించడానికి కూడా రాకపోవడం దారుణమన్నారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ విద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, లక్ష ఉద్యోగాలు భర్తీ వంటి పలురకాల హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్ల పాలనలో ఏమీ నెరవేర్చకుండా పాలన చేతకాక ప్ర భుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నేత జి.మధుసూదన్‌రెడ్డి, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, నాగర్‌కర్నూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ధనలక్ష్మి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, గణేష్‌గౌడ్, రంజిత్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, సుశీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment